వెల్లివిరిసిన వజ్రోత్సవ దీప్తి

అలనాడు స్వాతంత్య్రం సిద్ధించినప్పటి ఉత్సాహం, ఉద్వేగం ఈ ‘వజ్రోత్సవ ద్విసప్తాహ’ వేడుకలలో రాష్ట్ర ప్రజలందరి హృదయాలలో మరోసారి వెల్లువలా ఎగసిపడింది. పదిహేను రోజులపాటు ధనిక,పేదా, చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి హృదయం పరవశించగా రాష్ట్రమంతా పండగ వాతావరణం నెలకొన్నది. స్వతంత్ర పోరాట స్ఫూర్తిని రాష్ట్ర ప్రజలలో  కలుగజేసేందుకు, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా మనసు పెట్టి రూపొందించినవే ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ ఉత్సవాలు’  ఈ వేడుకలలో  రాష్ట్రంలోని ప్రతీ విద్యార్థి, ఉద్యోగి, యువకులతోపాటు అన్ని వర్గాలకు చెందిన ప్రతి కుటుంబం కూడా పాల్గొనాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు వివిధ విభాగాలుగా రూపొందించిన కార్యక్రమాలన్నింటిలో ప్రజలందరూ పాల్గొని వాటిని విజయవంతం చేశారు.

యావత్‌ భారతదేశ వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, రిచర్డ్‌ అటెన్‌ బరో దర్శకత్వం వహించి రూపొందించగా, నటుడు బెన్‌ కింగ్స్‌ లే గాంధీగా నటించిన, ‘గాంధీ’ సినిమాను 13 రోజులపాటు రాష్ట్రమంతటా మొత్తం 546 సినిమా హాళ్లలో ప్రతి రోజూ ఉదయం ఉచితంగా ఒక ప్రదర్శనను ప్రదర్శించడం ఒక చరిత్రాత్మక ఘట్టం. ఈ సినిమాను దాదాపు 22.37 లక్షల మంది విద్యార్థులు   తిలకించడం అమోఘం అని చెప్పాలి. ఈ ఆంశం ఇతర రాష్ట్రాల వారిలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది.

ఇది కాకుండా రాష్ట్రంలోని మండల, జిల్లాకేంద్రాలతోపాటు నగరంలో నిర్వహించిన 1462 ఫ్రీడమ్‌ రన్‌లలో దాదాపు 5 లక్షల మంది పాల్గొనడం ఒక విశేషం. అలాగే రాష్ట్ర ఉద్యోగులతో నిర్వహించిన మొత్తం 13,605 ఫ్రీడమ్‌ ర్యాలీలలో 8 లక్షల మంది పాల్గొనడం అభినందనీయం. ఇక ఇంటింటికి జాతీయ జెండా నినాదం పేరిట దాదాపు 1.20 కోట్ల జాతీయ పతాకాలను మన రాష్ట్ర నేతన్నలతోనే తయారు చేయించి రాష్ట్ర ప్రజానీకానికి  ఉచితంగా అందజేయగా ప్రతి గడప త్రివర్ణ పతాక శోభితమై వజ్రోత్సవ దీప్తిని చాటి చెప్పింది. మరోవైపు  18,963 ప్రదేశాలలో హరిత హార కార్యక్రమం నిర్వహించగా, ఆయా ప్రాంతాల్లో 37,66,963 మొక్కలు నాటడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తయితే, స్వాతంత్య్ర బలిదానాలకు ప్రతీకగా రాష్ట్ర ఆరోగ్య శాఖ వారి సహకారంతో నిర్వహించిన రక్తదానం కార్యక్రమంలో సేకరించిన రక్తం మొత్తం  18,300 యూనిట్లు, ఇది ఒక రికార్డు.

ఈ వజ్రోత్సవ కార్యక్రమాలను నగరంలోని HICCలో ప్రారంభించిన ముఖ్యమంత్రి వజ్రోత్సవ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చారు. ఆగస్టు 16 నాడు నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో భాగంగా అబిడ్స్‌లోని నెహ్రూ చౌరస్తాలో ముఖ్యమంత్రి  స్వయంగా పాల్గొన్నారు. అదే సమయానికి మొత్తం రాష్ట్రంలో 95.23 లక్షలమంది సామూహిక గీతాలాపన చేశారని ఒక అంచనా. రాష్ట్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక  పుస్తక ప్రదర్శన, సాంస్కృతిక శాఖ ద్వారా రవీంద్రభారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఇక వజ్రోత్సవాల సమాపనోత్సవాన్ని ముఖ్యమంత్రి పాల్గొనగా ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటి వల్ల రాష్ట్ర ప్రజల్లో ముఖ్యంగా యువత, విద్యార్థుల్లో భారత స్వతంత్ర పోరాట స్ఫూర్తి వెల్లివిరిసింది.