|

పారిశ్రామిక దిగ్గజాల చూపు తెలంగాణ వైపు

tsmagazineకాజీపేట సత్యనారాయణ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాలుగు సంవత్సరాలలో పారిశ్రామిక రంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధించింది. పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విషయంలో సరళీకరణ విధానాలను అవలంబించి టిఎస్‌ ఐపాస్‌ను ఏర్పాటు చేయడంతో ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాల చూపు తెలంగాణపై పడింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేతృత్వంలో ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పారిశ్రామిక వేత్తలకు అన్ని సౌకర్యాలను కల్పించడంలో పారిశ్రామిక అభివృద్ధి, మౌళిక సదుపాయాల కల్పనా సంస్థ (టిఎస్‌ఐఐసి) ముందున్నది.

రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖా మంత్రి కె. తారక రామారావు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామిక దిగ్గజ సంస్థలకు సంబంధించిన యజమానులను కలుసుకొని తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. దీనితో ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సౌకర్యాలు శీఘ్రగతి అనుమతులతో పారిశ్రామిక వేత్తలు పలు పరిశ్రమలను స్థాపించడంతో పాటు, కొన్ని పరిశ్రమలు ఉత్పత్తులను కూడా ప్రారంభించాయి. దీనితో తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరిగి నిరుద్యోగ సమస్యకూడా కొంతవరకు పరిష్కరించబడింది.

రాష్ట్రంలో మార్చి 2018 వరకు 53 పారిశ్రామిక పార్కులు ఏర్పాటయ్యాయి. దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో 19వేల ఎకరాలలో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే 8వేల ఎకరాల భూ సేకరణ కూడా పూర్తయింది. దేశంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా ఫార్మాసిటీ రూపుదిద్దుకోనుంది. ఇవే కాకుండా శామీర్‌పేట, లాల్‌గడి మలక్‌పేటలో ఫెర్రింగ్‌ ల్యాబ్‌, బయోటెక్నాలజీ పార్క్‌, మహేశ్వరం వద్ద మైక్రోమాక్స్‌ సెల్‌ ఫోన్‌ కంపెనీ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలైన అమెజాన్‌, గూగుల్‌ కంపెనీలు ఏర్పాటయ్యాయి. వీటి ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్‌లోనే నెలకొల్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో పరిశ్రమల ఏర్పాటుకు మొత్తం 580 ఎకరాలలో 1132 సంస్థలను స్థాపించడం జరిగింది. వీటికి 3,815.78 కోట్లు వెచ్చించడం జరిగింది. 32,726 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,45,683 ఎకరాల ప్రభుత్వ భూమి వ్యవసాయానికి పనికి రాకుండా పరిశ్రమలకు ఉపయుక్తమైన భూమిగా టిఎస్‌ఐఐసి, బిఐసిలు గుర్తించాయి. ఈ భూమిని పరిశ్రమలకు రిజర్వు చేసి టిస్‌ఐఐసి, పరిశ్రమల శాఖకు నూతన పారిశ్రామిక విధానం ప్రకారం బదలాయించాలని నిర్ణయించారు.

నెలకొల్పబోతున్న పారిశ్రామిక పార్కులు :
రాష్ట్రంలో వివిధ జిల్లాలో పలు ఉత్పత్తులకు సంబంధించి పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది. టిఎస్‌ఐఐసి ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు ఈ పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తున్న అందరు పారిశ్రామిక వేత్తలకు మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నారు.

నిజామాబాద్‌లో స్పైస్‌ పార్క్‌, రంగారెడ్డి జిల్లాలో ప్లాస్టిక్‌ పార్క్‌, ఆదిభట్లలో ఏరో స్పేస్‌ తదితర పరిశ్రమల ఏర్పాటుకు కృషి జరుగుతున్నది. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ వద్ద ఆటోమోటివ్‌, ఇంజనీరింగ్‌ క్లస్టర్‌, ఇబ్రహింపట్నం వద్ద ఫైబర్‌ గ్లాస్‌ కంపోస్ట్‌ పార్క్‌, దండు మల్కాపూర్‌ వద్ద హరిత పారిశ్రామిక పార్కు, మెదక్‌, సిరిసిల్ల జిల్లాల్లో సీడ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్స్‌, స్టేషన్‌ ఘణపూర్‌, జనగామల వద్ద మెగా లెదర్‌ క్లస్టర్‌లు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఫార్మాసిటీలో ఇండియన్‌ ఇన్ట్సిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌) స్థాపించడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు ప్రతిపాదనలు పంపించారు.

జహీరాబాద్‌లో జాతీయ పెట్టుబడి తయారీ ప్రాంతం (నీమ్జ్‌)
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌ పట్టణంవద్ద ప్రతిష్ఠాత్మకమైన నీమ్జ్‌ ఏర్పాటు చేయబడుతుంది. సుమారు 60వేల కోట్ల అంచనా వ్యయంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని 14 గ్రామాలలో 12,635.14 ఎకరాల భూమిని గుర్తించారు. 3,500 ఎకరాలలో మొదటి దశను ప్రతిపాదించడం జరిగింది. దీనికి గాను 2,877.33 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా 2లక్షల 77వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. 2017-18 బడ్జెట్‌లో నీమ్జ్‌ భూ సేకరణ కోసం 200 కోట్లు కేటాయించడం జరిగింది. ఇదివరకటి మెదక్‌ నీమ్జ్‌ స్థానంలో స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ గా మెస్సర్స్‌ జహీరాబాద్‌ నీమ్జ్‌ను కంపెనీస్‌ యాక్ట్‌ కింద ఇన్‌ కార్పోరేట్‌ చేయడమైనది. దీనికి మాస్టర్‌ ప్లానింగ్‌ మరియు ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ సోషల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ (ఈఎస్‌ఐఏ) అధ్యయనానికి మెస్సర్స్‌ ఎల్‌ & టి ఇన్‌ఫ్రా కన్సల్టెంట్‌గా నియమించారు.

కాకతీయ టెక్స్‌టైల్‌ పార్క్‌ వరంగల్‌ :
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పారిశ్రామిక పార్కుల్లో వరంగల్‌లో స్థాపిస్తున్న కాకతీయ టెక్స్‌టైల్‌ పార్క్‌ ఒకటి. ఈ ప్రాజెక్టును జిల్లాలోని చింతపల్లి, సంగెంలలో రెండువేల ఎకరాలలో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించి ఇప్పటికే 1190 ఎకరాలు సేకరించడం జరిగింది. ఈ ప్రాజెక్టు విలువ 1150.47 కోట్లుగా అంచనాలు రూపొందించారు. ఈ ప్రాజెక్టు వల్ల 1లక్షా 13వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించవచ్చని టిఎస్‌ఐఐసి పేర్కొంది.

కాకతీయ టెక్స్‌టైల్స్‌ పార్కులో టెక్స్‌టైల్‌ పరిశ్రమలు స్థాపించడానికి ప్రపంచవ్యాప్తంగా ఎందరో పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం జరిగింది. ఆసక్తి చూపించిన వారితో ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. మెస్సర్స్‌ యంగ్వన్‌ అనే కొరియా దేశ సంస్థ టెక్స్‌టైల్‌ పార్కులో 700కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. పదివేల మందికి ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రం నుంచి ఉపాధిని వెతుక్కుంటూ సూరత్‌, పూనే, షోలాపూర్‌ తదితర ప్రాంతాలకు వలసలు వెల్లినవారు స్వరాష్ట్రానికి రావడానికి మార్గం సుగమమవుతున్నది.

ఇవే కాకుండా సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌ గ్రామంలో మెడికల్‌ డివైసెస్‌ పార్క్‌, స్పెషల్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ పార్క్‌, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గిపాడు గ్రామం వద్ద మెగాఫుడ్‌ పార్క్‌ ఏర్పాటు చేయడానికి కృషి జరుగుతుంది. కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాలో నాలుగు ప్రైమరీ ప్రాసెసింగ్‌ సెంటర్లను నెలకొల్పడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనితో పాటు మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, జహీరాబాద్‌ జిల్లాలలో ఉన్న ఇతర ప్రైవేట్‌ మెగా ఫుడ్‌ పార్క్‌లకు తెలంగాణ రాష్ట్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ మోడల్‌ ఏజన్సీగా వ్యవహరిస్తున్నది.

ఇలా రాష్ట్రాన్ని పారిశ్రామిక ప్రగతి పథంలో పయనింపచేయడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, పరిశ్రమల మంత్రి కెటిఆర్‌, టిఎస్‌ఐఐసి ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే టిఎస్‌ఐపాస్‌ విధానం ప్రపంచ పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడమే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ప్రపంచ పారిశ్రామిక వేత్తలు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు టిఎస్‌ఐపాస్‌ విధానాన్ని అభినందించడమే కాకుండా, అధ్యయనం చేసి వారి రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రగతి పథంలో పయనిస్తూ బంగారు తెలంగాణను ఆవిష్కృతం చేయడంలో పారిశ్రామిక ప్రగతి ముందుంటుంది.