పారిశ్రామిక వేత్తలు ఫిదా
By: బియ్యని సురేష్
ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతంగా ముందుకు తీసుకుపోవడంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్-ఐఐసీ) విజయవంతంగా దూసుకువెళుతోంది. పరిశ్రమల ఏర్పాటుకు భూముల గుర్తింపు, భూసేకరణ, కేటాయింపులతో పాటుగా కొత్త పారిశ్రామికవాడల ఏర్పాటు, అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ఐఐసీ హయాంలో తెలంగాణ పారిశ్రామిక రంగం ఎదుర్కొన్న వివక్షతను రూపుమాపేలా అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ టీఎస్ ఐఐసీ అమలు చేస్తున్న ప్రత్యేక కార్యాచరణ ఆశించిన లక్ష్యాలను చేరుకుంటోంది. దీంతో సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశనంలో టీఎస్-ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు నాయకత్వంలో కేవలం ఏడేండ్లలోనే తెలంగాణ పారిశ్రామికాభివృద్ధి టీఎస్ ఐఐసీ అధ్వర్యంలో రెట్టింపు వేగంతో పరుగులు పెడుతోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతలు, పారిశ్రామిక విధానానికి అనుగుణంగా గుర్తించిన 14 రంగాలలో సెక్టార్ల వారీగా పరిశ్రమలను ప్రాధాన్యత క్రమంలో నెలకొల్పేలా టీఎస్ ఐఐసీ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. మరోవైపు రాష్ట్రంలో రెండు ప్రధానమైన ప్రాంతాలను కలుపుతూ పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేసి వివిధ కేటగిరిల్లో పెద్ద ఎత్తున పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. హైదరాబాద్- వరంగల్ పారిశ్రామిక కారిడార్, హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుతో రాష్ట్రానికి రూ.80 వేల కోట్ల పెట్టుబడులను, పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలను రాబట్టాలన్నది ప్రధాన లక్ష్యం. ఈమేరకు ప్రభుత్వ పారిశ్రామిక లక్ష్యాలను సాధించేందుకు టీఎస్-ఐఐసీ అధికార యంత్రాంగం సమర్థవంతమైన పాత్రను పోషిస్తూ పరిశ్రమిస్తోంది.
టీఎస్‌ఐపాస్‌కు పారిశ్రామికవేత్తల ఫిదా
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం (టీఎస్-ఐపాస్)తో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు తరలివస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిశ్రమల శాఖ, టీఎస్-ఐఐసీ ద్వారా వివిధ కేటగిరిల్లో ఆన్‌లైన్ విధానం ద్వారా 17,797 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం ద్వారా 2.21 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఇంత భారీ స్థాయిలో పారిశ్రామిక పెట్టుబడులతో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పిన ఫలితంగా రాష్ట్రంలో 16.06 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున పారిశ్రామిక ప్రగతిని సాధించడమే కాకుండా పరిశ్రమల సులభతర వాణిజ్యం(ఈవోడీబీ)లోనూ దేశంలో ముందంజలో నిలిచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన విప్లవాత్మక నూతన పారిశ్రామిక విధానం (టీఎస్-ఐపాస్) సత్ఫలితాలివ్వడమే ఇందుకు కారణం. మరోవైపు తెలంగాణకు అంచనాలకు మించి దేశ, విదేశీ పారిశ్రామికవేత్తల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తడానికి పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ చేసిన కృషి ఎంతగానో దోహదపడ్డది.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ఉద్యోగ, ఉపాధి కల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించి నూతన పారిశ్రామిక విధానం ద్వారానే సదరు లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమని నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అనేక రాయితీలు, ప్రొత్సాహాకాలను ఇచ్చేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. టీఎస్-ఐపాస్ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు కేవలం 15 రోజుల్లోనే 57 రకాల అనుమతులు ఇవ్వడం దేశ చరిత్రలోనే విప్లవాత్మకమైన విధానంగా పారిశ్రామికవర్గాల నుంచీ కేసీఆర్ ప్రభుత్వం ప్రశంసలు పొందుతోంది. పరిశ్రమలకు అనుమతుల జారీపై సీఎం కార్యాలయంలోనే స్పెషల్ ఛేజింగ్ సెల్ ఏర్పాటు చేయడంతో పారిశ్రామికవేత్తలకు నమ్మకం ఏర్పడిన ఫలితంగా టీఎస్-ఐపాస్ ద్వారా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే దేశ, విదేశ కంపెనీలను, బడా పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి రప్పించి భారీగా పెట్టుబడులు పెట్టించడంలో తెలంగాణ ప్రభుత్వం విజయవంతంమైంది. దీంతో ప్రస్తుత, భవిష్యత్తు పారిశ్రామిక అవసరాల మేరకు కొత్త పారిశ్రామికవాడలను నెలకొల్పి అభివృద్ధి చేయడంలో టీఎస్-ఐఐసీ కీలకపాత్ర పోషిస్తోంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న పెద్ద పరిశ్రమలకు, అంతర్జాతీయ, జాతీయంగా పేరున్న ఐటీ, ఇతరత్రా సంస్థలకు, సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల యూనిట్లకు అవసరమైన మేరకు భూములను కేటాయిస్తోంది. అలాగే కొత్తగా ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవాడలలో అప్రోచ్, ఇంటర్నల్ రోడ్లు, విద్యుత్, నీరు, డ్రేనేజీ కాలువలు, కామన్ ఇఫ్లుయేషన్ సెంటర్లు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించి పరిశ్రమల ఏర్పాటుకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడంలోనూ టీఎస్-ఐఐసీ ముందు భాగానా ఉంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక గత ఏడేళ్లలో 2,980 పరిశ్రమలకు భూములను టీఎస్-ఐఐసీ కేటాయించింది. వీటి ద్వారా రూ.53,447 కోట్ల పెట్టుబడులు రాగా, 3,79,624 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.
ఉమ్మడి రాష్ట్రంలో 1973 నుండి 2014 వరకు ఏపీ -ఐఐసీ ద్వారా 28,000 ఎకరాల విస్తీర్ణంలో 147 పారిశ్రామిక వాడలను మాత్రమే ఏర్పాటు చేసింది. 2005 సంవత్సరం తర్వాత తెలంగాణ ప్రాంతంలో కనీసం ఒక కొత్త ఇండస్ట్రియల్‌పార్కును కూడా నెలకొల్పడం జరుగలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాల డిమాండ్‌కు తగినట్టుగా భూ సేకరణ, ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధి, పారిశ్రామికవేత్తలకు భూ కేటాయింపు ప్రక్రియలో టీఎస్-ఐఐసీ నిర్ధేశిత లక్ష్యసాధనలో ముందంజలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత ఏడున్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు 41,554 ఎకరాల వరకు అనువైన భూములను గుర్తించి ల్యాండ్ బ్యాంకు కింద పెట్టుకుంది. టీఎస్-ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు 2016 అక్టోబర్‌లో పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భూసేకరణ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది. టీఎస్-ఐఐసీ, రెవెన్యూ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ పరిశ్రమల ఏర్పాటు కోసం గత ఏడేళ్లలో35 వేల ఎకరాలకు పైగా భూములను సేకరించారు. తెలంగాణ ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానం అన్నివిధాలా సానుకూలంగా ఉండడంతో అంతర్జాతీయ, జాతీయ గుర్తింపు పొందిన కంపెనీలు, పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా పారిశ్రామిక భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిరది. ఇందులో భాగంగానే తెలంగాణలో ఇప్పటివరకు 19,961 ఎకరాలలో 56 ఇండస్ట్రియల్ పార్కులను టీఎస్ ఐఐసీ అభివృద్ధి చేసింది. మరో 15,620 ఎకరాలలో కొత్తగా పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.15.13 కోట్ల రాయితీలు
ఎస్సీలు, ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే సీఎం కేసీఆర్ సంకల్ఫంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలను, ప్రోత్సహకాలను అందజేస్తోంది. టీఎస్ ఐఐసీ అధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్రంలో 1973 నుండి 2014 జూన్ వరకు 210 మంది ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 93.52 ఎకరాల భూమిని మాత్రమే కేటాయించారు. తద్వారా వీరికి భూమి ఖరీదులో రూ.6.91 కోట్ల మేర మాత్రమే రాయితీలు పొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 సంవత్సరం జూన్ నుండి 2022 వరకు టీఎస్-ఐఐసీ పారిశ్రామికవాడలలో 1595 మందికి 1852 ఎకరాల భూములను కేటాయించడం జరిగింది. ఇందులో 221 మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 66.65 ఎకరాల భూములను కేటాయించారు. తద్వారా వీరు టీ-ఫ్రైడ్ పథకం కింద భూ ఖరీదులో రూ.15.13 కోట్ల మేరకు రాయితీని పొందారు.
కొత్త ఇండస్ట్రియల్ పార్కులు

ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉండే ముడిసరుకులు, పారిశ్రామికవేత్తల ఆసక్తికి అనుగుణంగా రాష్ట్రంలో 35 వేల ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్కులను టీఎస్-ఐఐసీ అభివృద్ధి చేస్తోంది. ఇందులో భారీ పెట్టుబడులు, లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న మెగా ఇండస్ట్రియల్ పార్కులు కూడా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెగా పారిశ్రామిక ప్రాజెక్టుల విషయానికొస్తే.. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల కేంద్రంగా 19,333 ఎకరాలలో ఫార్మాసిటీని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పుతోంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నెలకొల్పుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే రూ.64 వేల కోట్ల పెట్టుబడులతో 4.25 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతానికి మొదటి దశ పనులకు సంబంధించిన 12 వేల ఎకరాల భూ సేకరణ ప్రక్రియ పూర్తి కావడంతో ఫార్మాసిటీ అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

మరో మెగా ఇండస్ట్రియల్ పార్కు అయిన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కును వరంగల్ నగరానికి సమీపంలో 1200 ఎకరాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్నారు. ఈ పార్కు ఏర్పాటుతో దేశ, విదేశ కంపెనీల నుంచి రూ.11,546 కోట్ల పెట్టుబడులు, 1.13 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఈ మెగా టెక్స్ టైల్ పార్కు నందు కిటెక్స్ రేడీమేడ్ వస్త్రాల కంపెనీ యూనిట్ రూ.2100 కోట్లతో రెండు యూనిట్లను ఏర్పాటు చేయనుంది. కొరియాకు చెందిన యంగ్వాన్ అనే ప్రముఖ కంపెనీ సైతం ఇక్కడ రూ.780 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ రెండు యూనిట్ల అభివృద్ధి పనులకు ఇటీవల మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
దేశంలోనే మొదటి సారిగా వైద్యపరికరాల తయారీకై సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు దగ్గర సుల్తాన్‌పూర్‌లో తొలిదశలో 250 ఎకరాలలో ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేశారు. ఈ పార్కులో రూ.1000 కోట్ల పెట్టుబడులతో 2000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.
వైద్య పరిశోధనలకు సంబంధించిన బయోటెక్ పార్కును జీనోమ్ వ్యాలీ పేరిట మేడ్చల్ జిల్లా లాల్‌గడి మలక్‌పేట్‌లో, సిద్ధిపేట జిల్లా కర్కపట్లలో ఇప్పటికే మూడు దశలలో 1203 ఎకరాలలో నెలకొల్పడం జరిగింది. మరో 200 ఎకరాలలో ఈ పార్కును విస్తరించేందుకు భూసేకరణ జరుగుతోంది. జీనోమ్ వ్యాలీ దేశంలోనే అతిపెద్ద ఆర్ అండ్ డీ క్లస్టర్‌గా, ప్రపంచ వ్యాక్సిన్ కేంద్రంగా ఎదిగింది. ఇప్పటివరకు ఇక్కడ 311 సంస్థలు ఏర్పాటు కాగా, వీటి ద్వారా రూ.6,734 కోట్ల పెట్టుబడులతో పాటుగా 34,000 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.
జహీరాబాద్‌లో రూ.13,300 కోట్ల పెట్టుడులు లక్ష్యంగా.. 12,635 ఎకరాలలో నిమ్జ్(ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫాక్చరింగ్ పార్కు) ఏర్పాటు చేస్తున్నారు. ఈ మెగా ఇండస్ట్రియల్ ప్రాజెక్టు పూర్తయితే 2.77 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి.
అధిక ఉపాధి అవకాశాలు గల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్ ఎంఈ) రంగం ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటి మోడల్ ఇండస్ట్రియల్ పార్కును యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్‌లో 371 ఎకరాలలో టీఎస్-ఐఐసీ-టీఐఎఫ్-ఎంఎస్‌ఎంఈ గ్రీన్ పార్కును ఏర్పాటు చేశారు. ఇక్కడ 363 మంది పారిశ్రామికవేత్తలకు భూ కేటాయింపులు పూర్తయి, పరిశ్రమల ఏర్పాటు పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. పలు కంపెనీలు ఉత్పత్తులు మొదలు పెట్టాయి. దండుమల్కాపూర్ ఎంఎస్‌ఎంఈ గ్రీన్ పార్కులో అన్ని పరిశ్రమలు ఉత్పత్తలు ప్రారంభిస్తే రూ.1550 కోట్ల పెట్టుబడులతో సుమారు 12 వేల మందికి ఉపాధి లభించనుంది.

హైదరాబాద్‌లో విస్తరించి ఉన్న ఐటీ రంగానికి అనుబంధంగా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌ను కూడా అభివృద్ధి చేసి తద్వారా బ్లూ కాలర్ ఉద్యోగాలను కల్పించడానికి రంగారెడ్డి జిల్లా రావిరాలలో 603 ఎకరాలలో, మహేశ్వరంలో 310 ఎకరాలలో రూ.431 కోట్ల పెట్టుబడుల అంచనాలతో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లను టీఎస్-ఐఐసీ నెలకొల్పింది. ఈ రెండు ఈఎంసీలలో సుమారు రూ.2,600 కోట్ల పెట్టుబడులు, సుమారుగా 3 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది.
రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లిలో 1000 ఎకరాలలో 3485 కోట్ల పెట్టుబడులు, 7500 మందికి ఉపాధికల్పన లక్ష్యంతో టెక్స్ టైల్ హబ్- జనరల్ ఇండస్ట్రియల్ పార్కును నెలకొల్పడం జరిగింది. ఇందులో ఇప్పటికే వెల్‌స్పన్ కంపెనీ 575 ఎకరాలలో తమ పరిశ్రమను నెలకొల్పడంతో ఇక్కడ కార్పెట్ టైల్స్, గ్రీన్ కార్పెట్స్, ఫ్లోరింగ్, పైపులు, ప్లేట్ల ఉత్పత్తి జరుగుతోంది. తద్వారా 930మందికి ఉపాధి లభిస్తుంది. కుందనా టెక్నో టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, కటెరా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఒలెక్ట్రా గ్రీన్ టెక్, బీకే బిల్డర్స్ యూనిట్లకు ఇక్కడ 380 ఎకరాలు కేటాయించారు. రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో 179 ఎకరాలలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను నెలకొల్పడం జరుగుతోంది.

వైమానిక, రక్షణ రంగంలో ఉపయోగించే కంపోజిట్ గ్లాస్ ఫైబర్‌ను ఉత్పత్తి చేసే ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల కొరకు ప్రత్యేకంగా 120 ఎకరాలలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం దగ్గర ఫైబర్ గ్లాస్ క్లస్టర్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 70 పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా 1500 మందికి ఉపాధి కలుగుతుంది.
రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో 100 ఎకరాలలో రూ.123 కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా ప్లాస్టిక్ పార్కును, మహేశ్వరంలో సైన్స్ పార్కును అభివృద్ధి చేయడం జరిగింది.
గ్రామీణ జిల్లాలకు పరిశ్రమల విస్తరణ
సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ నగరం, దాని చుట్టూ ఉన్న రంగారెడ్డి, మెదక్ జిల్లాలకే పరిమితమైన పారిశ్రామికాభివృద్ధిని తెలంగాణ అంతటా, అన్ని గ్రామీణ జిల్లాలకు విస్తరింపజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రొత్సహించడం, స్థానిక నిరుద్యోగ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం సంకల్ఫించింది. అలాగే చిన్న,మధ్యతరహా పరిశ్రమలను ప్రొత్సహించే క్రమంలో పలు జిల్లాలలో కొత్త పారిశ్రామిక వాడలను ఇప్పటికే ఏర్పాటు చేసింది.
వికారాబాద్ జిల్లా రాకంచర్లలో 150 ఎకరాలలో ఐరన్ ఓర్ ఇండస్ట్రియల్ పార్కును, సంగారెడ్డి జిల్లా బూచనెల్లిలో 373 ఎకరాలలో ఈ డబుల్ ఆయిల్ ఇండస్ట్రియల్ పార్కును, సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివనగర్‌లో ఎల్ ఈడీ పార్కును, పటాన్‌చెరు ఇంద్రకరణ్‌లో, సిద్ధిపేట జిల్లా తూప్రాన్‌లో మరో జనరల్ ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో123 ఎకరాలలో ఫైబర్ గ్లాస్ కంపోసైట్ పార్కును, వరంగల్ మడికొండలో 50 ఎకరాలలో టెక్స్‌టైల్ పార్కును, రాయరావు పేటలో 40 ఎకరాలలో మైక్రో ఇండస్ట్రీస్ పార్కును ఏర్పాటు చేశారు. సిరిసిల్ల జిల్లా నర్మాల, పెద్దూరు, జిల్లెల్ల వద్ద, నల్గొండ జిల్లా చిట్యాల్ వద్ద, వనపర్తి జిల్లా వెలిగొండ, కామారెడ్డి జిల్లా జంగమ్‌పల్లి, సిద్ధిపేట జిల్లా బెజ్జంకి, దుద్దెడ, నర్మెట, మందపల్లి, తునికి బొల్లారం వద్ద, రంగారెడ్డి జిల్లా మొండి గౌరెల్లి, కొత్తపల్లి, నాగిరెడ్డి పల్లి వద్ద, మేడ్చెల్ జిల్లా మాదారం, బౌరంపేట్, దుండిగల్ వద్ద, ఆదిలాబాద్ జిల్లా నాన్నల్, జగిత్యాల జిల్లా స్తంబంపల్లి, జోగులాంబ గద్వాల జిల్లాలలో గద్వాల్, సూర్యాపేటలో, మెదక్ జిల్లా వడియారం, మనోహరాబాద్ వద్ద, మంచిర్యాల జిల్లా రామగుండం మండలం అంతర్గాంలో కొత్తగా ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయడానికి టీఎస్-ఐఐసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
బెంగళూరు, ముంబాయి, నాగపూర్ హైవేలపై, రామగుండం, మిర్యాల గూడ, బాన్సువాడ, తాండూరు శివార్లలో కొత్తగా ఆటోనగర్ పార్కులను నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందించింది. స్టేషన్ ఘన్‌పూర్‌లో మల్టీ ప్రొడక్ట్ పార్కు, రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ఏరో స్పేస్ యూనిట్‌ను విస్తరించేందుకు ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలో 1129 ఎకరాల భూములను టీఎస్-ఐఐసీ ఇప్పటికే గుర్తించడం జరిగింది.
అన్ని జిల్లాల్లో అగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు..
రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తులను దృష్టిలో ఉంచుకొని ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఇందులో భాగంగా రైతులు పండిరచే పంట ఉత్పత్తులకు మద్దతు ధర లభించేలా అన్ని జిల్లాలలో అగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పాలని టీఎస్ ఐఐసీ నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గంలో దశల వారీగా ఆగ్రో, ఫుడ్ పార్కుల ఏర్పాటుతో రూ.1500 కోట్ల పెట్టుబడులు, వేల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను కల్పించి తద్వారా బ్లూ, పింక్, వైట్ రెవెల్యూషన్‌ను సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
గ్రామీణ జిల్లాలలో అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా ఆయా కేటగిరిల్లో ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసి టీఎస్-ఐఐసీ వేగంగా అభివృద్ధి చేస్తోంది. దీంట్లో భాగంగా సత్తుపల్లి దగ్గర బుగ్గపాడులో రూ.109 కోట్ల పెట్టుడులతో 60 ఎకరాలలో మెగా ఫుడ్ పార్కును టీఎస్-ఐఐసీ నెలకొల్పడం జరిగింది. 2511 మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్ష ఉపాధి కల్పన, 5000 మంది రైతులకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ఈ మెగా ఫుడ్ పార్కును నెలకొల్పడం జరిగింది. ఈ పార్కులో.. 1) ఫ్రుషన్ ఇండియా (మ్యాంగో పల్ప్ ప్రాసెసింగ్), వర్థిని ఆగ్రో (ఫామాయిల్ ప్రాసెసింగ్) మరియు కియాన్ ఎంటర్ ప్రైజేస్ (క్యాషోనట్ ప్రాసెసింగ్), మరిన్ని సంస్థలు కూడా ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పుటకు మందుకు వచ్చాయి. బుగ్గపాడు మెగా ఫుడ్ పార్కుకు అనుబంధంగా (4) ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్ల(పీపీసీ)ను సిరిసిల్ల, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో నెలకొల్పనున్నారు.
సిద్ధిపేట జిల్లాలోని బండతిమ్మాపూర్‌లో 150 ఎకరాలలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కును ఏర్పాటు చేయగా, ఇక్కడ 20 ఎకరాలలో ఆర్‌పీజీ గోయంకా గ్రూపు ఇండస్ట్రీ రూ.200 కోట్లతో ఎఫ్‌ఎంసీజీ స్నాక్స్ పరిశ్రమలను నెలకొల్పుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కాంపల్లి గ్రామంలో మెసర్స్ ప్లాంట్ లిపిడ్ అనే సంస్థ 80 ఎకరాలలో రూ.56 కోట్ల పెట్టుబడితో మిర్చి శుద్ధి పరిశ్రమను నెలకొల్పుతుండగా, ఇక్కడ 300 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి లభించనుంది. స్వీడన్ దేశానికి చెందిన మోమిన్ సిరఫ్ అనే సంస్థ సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండలంలో మెడిసిన్ పరిశ్రమను, నిజామాబాద్ జిల్లా వేల్పూరులో 40 ఎకరాలలో స్పైస్ పార్కును నెలకొల్పడం జరుగుతుంది.
కరీంనగర్ జిల్లా కళ్లెంలో ఆగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు, మక్కరాజ్‌పేట్‌లో ఫుడ్ పార్కు, మాసాయిపేట్‌లో మాంసం, గుడ్ల ప్రాసెసింగ్ పార్కు, మిట్టపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజనీరింగ్ ప్రాసెసింగ్ పార్కు, తునికి బొల్లారంలో ఆగ్రి ప్రాసెసింగ్ పార్కు, లక్కంపల్లిలో మెగా ఫుడ్ పార్కు ఏర్పాటుకు టీఎస్-ఐఐసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. సిద్ధిపేట జిల్లా బండ తిమ్మాపూర్ గ్రామంలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు ఏర్పాటుకు సంబంధించి 125 ఎకరాలు భూసేకరణ జరిగింది. ఇందులో 20 ఎకరాలు మెసర్స్ ఆర్‌పీ గోయెంకా గ్రూప్‌కు పరిశ్రమ నెలకొల్పడానికి గాను కేటాయించడం జరిగింది.
ఏరో స్పేస్, డిఫెన్స్ పార్కు..
ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాపార అనుకూల విధానాలు, తెలంగాణలో కల్పిస్తున్న ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలకు మెచ్చి గత ఏడేండ్లలో పలు ఏరో స్పేస్ దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టాయి. ఈ జాబితాలో బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్, జీఈ ఏవియేషన్, పఫ్రాన్, రఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఎల్బిట్ సిస్టమ్స్ తదితర అంతర్జాతీయ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ (ఓఈఎం) సంస్థలు ఉన్నాయి. ఇవి కాకుండా టాటా, అదానీ గ్రూప్, కళ్యాణి గ్రూపు లాంటి దేశీయ సంస్థలు తెలంగాణలో ఏరో స్పేస్, డిఫెన్స్ పరిశ్రమలను ఏర్పాటు చేశాయి. వీటికి అనుబంధ పరికరాల తయారీ కోసం పలు చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. టీఎస్ ఐఐసీ అధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఏరో స్పేస్, డిఫెన్స్ పార్కును ఏర్పాటు చేసింది. ఇక్కడే ఏరో స్పేస్, డిఫెన్స్ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పేందుకు చర్యలు చేపడుతున్నది.
20 ఎంఎస్‌ఈ పారిశ్రామికవాడల అభివృద్ధి

ఉద్యోగాల కల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తున్న చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. దీంట్లో భాగంగా 20 చిన్న,మధ్యతరహా (ఎంఎంఈ)పారిశ్రామికవాడల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టీఎస్ ఐఐసీ అధ్వర్యంలో ఒక్కో పార్కును 60-80 ఎకరాలలో ఏర్పాటు చేస్తోంది. వీటిలో బుగ్గపాడు, కళ్లెం, నర్మాల, కుందన్‌పల్లి పార్కులు త్వరలో ప్రారంభం కానున్నాయి. మరో నాలుగు పార్కుల పనులు సుల్తాన్‌పూర్, వరంగల్, శాయంపేట, మందపల్లిలో తుది దశకు చేరాయి. ఇవి కాకుండా ఇప్పటికే కొనసాగుతున్న 12 పార్కుల అప్‌గ్రేడ్ కు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ జాబితాలో హయత్‌నగర్, భువనగిరి, జీడిమెట్ల, గద్వాల, జడ్చర్ల, మంచిర్యాల, పాల్వంచ, పాలెం, చిట్యాల, నల్లగొండ, బోధన్, కోదాడ, ఒక్కో పార్కుకు రూ.10 కోట్లు ఖర్చుచేసి ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ కేంద్రం, అదనపు మౌలిక సదుపాయాలను కల్పించాలని నిర్ణయించింది.
మౌలిక సదుపాయాల కల్పన
గత 7 ఏళ్లలో ప్రాధాన్యత క్రమంలో ఇండస్ట్రియల్ పార్కులను నెలకొల్పిన టీఎస్-ఐఐసీ అందులో పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు గాను ఇప్పటివరకు రూ.2,209 కోట్లను మంజూరు చేయడం జరిగింది. ఈ నిధులతో రాష్ట్రంలోని 9 జోన్ల పరిధిలోని పారిశ్రామికవాడలలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రస్తుతం వివిధ దశలలో కొనసాగుతున్నాయి.
టీఎస్-ఐఐసీ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధిపనులలో ప్రధానంగా స్టార్టఫ్ కంపెనీలకు కొత్త ఆలోచనలను అందించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.458.85 కోట్లతో నాలేడ్జ్ సిటి, రాయదుర్గంలో చేపట్టిన టీ హబ్-ఫేజ్-2 బహుళ అంతస్తుల భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. రూ.72 కోట్లతో నాలేడ్జ్ సిటీ, రాయదుర్గంలో చేపట్టిన టీ- వర్క్ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
మరోవైపు రెండో శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించే క్రమంలో వరంగల్‌లో రూ.7 కోట్లతో ఐటీ ఇంక్యూబేషన్ సెంటర్, కరీంనగర్‌లో రూ.33.40 కోట్లతో ఐటీ టవర్, నిజామాబాద్‌లో రూ.33.40 కోట్లతో ఐటీ హబ్‌ను, ఖమ్మంలో రూ.27.62 కోట్లతో ఐటీ ఇంక్యూబేషన్ సెంటర్, మహబూబ్‌నగర్‌లో రూ.25 కోట్లతో ఐటీ ఇంక్యూబేషన్ సెంటర్‌ను టీఎస్-ఐఐసీ నిర్మిస్తోంది. గేమింగ్, అనిమేషన్, మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రొత్సహించేందుకు ప్రభుత్వం రాయ దుర్గంలో 6.33 ఎకరాలలో ఇమేజ్ టవర్ పేరుతో రూ.946 కోట్ల వ్యయంతో 17 అంతస్తుల భారీ భవనాన్ని నిర్మిం చేందుకు ప్రతిపాదనలతో టెండర్లు ఖరారు కాగా, త్వరలో పనులను ప్రారంభించేందుకు టీఎస్-ఐఐసీ ఏర్పాట్లు చేస్తోంది.
ఐటీ పరిశ్రమకు పెద్దపీట
ఐటీ పరిశ్రమకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా ఉంది. హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున ఐటీ, సాఫ్ట్‌వేర్ కంపెనీలు పనిచేస్తున్నాయి. వేలకోట్ల పెట్టుబడులతో ఐటీ పరిశ్రమ లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. భవిష్యత్తులో ఐటీ పరిశ్రమను రాష్ట్రంలో విస్తరించే అవకాశాలు ఉన్నందున ఆమేరకు నగర శివార్లలో అన్ని వైపులా, రెండో శ్రేణి నగరాల్లోనూ ఐటీ పార్కులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు నగరానికి ఉత్తరాన కొంపల్లి కేంద్రంగా హైటెక్ సిటీకి ధీటుగా మరో ఐటీ పార్కును సెంటర్‌ను అభివృద్ధి చేసేందుకు టీఎస్ ఐఐసీ పనులు ప్రారంభించింది. కొత్త ఐటీ పార్కుల ఏర్పాటు కోసం మేడ్చెల్ జిల్లా బుద్వేల్‌లో 327 ఎకరాలను, దుండిగల్‌లో 320ఎకరాలు, బౌరంపేటలో 140 ఎకరాలు, ఉస్మాన్‌నగర్ (కొల్లూరు)లో 66 ఎకరాలను టీఎస్-ఐఐసీ ఎంపిక చేసింది. రెండో శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించే క్రమంలో వరంగల్‌లో ఐటీ ఇంక్యూబేషన్ సెంటర్, కరీంనగర్‌లో ఐటీ టవర్, నిజామాబాద్‌లో ఐటీ హబ్‌ను, ఖమ్మంలో ఐటీ ఇంక్యూబేషన్ సెంటర్, మహబూబ్‌నగర్‌లో ఐటీ ఇంక్యూబేషన్ సెంటర్‌ను టీఎస్-ఐఐసీ నిర్మిస్తోంది.
కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో ఐటీ ఇంక్యూబెటర్ సెంటర్లను ఐటీ పరిశ్రమలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గేమింగ్, అనిమేషన్, మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రొత్సహించేందుకు ప్రభుత్వం రాయదుర్గంలో 6.33 ఎకరాలలో ఇమేజ్ టవర్ పేరుతో 17 అంతస్తుల భారీ భవనాన్ని నిర్మిస్తోంది.
మహిళల కోసం 3 ప్రత్యేక పారిశ్రామిక వాడలు

తెలంగాణలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో 50 ఎకరాలలో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ద్వారా, రంగారెడ్డి జిల్లా నందిగామలో ఎలిప్ ద్వారా, మెదక్ జిల్లా తూఫ్రాన్‌లో కోవా ఆధ్వర్యంలో 50 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్కులను నెలకొల్పడం జరిగింది.