ఇక ‘రాజీ’ ఇక్కడే…
- హైదరాబాద్ లో కొలువు దీరిన అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం

భారత దేశంలోనే తొలి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం (ఐ.ఏ.ఎం.సి) మన భాగ్యనగరంలో కొలువు దీరింది. హైదరాబాద్ మహా నగరంలోని నానక్‌రాం గూడాలో గల పీనిక్స్ వీకే టవర్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ డిసెంబర్ 18న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుతో కలసి ప్రారంభించారు. ఇప్పటి వరకూ ఆర్బిట్రేషన్ కేంద్రాలు అంతర్జాతీయ వాణిజ్య నగరాలైన పారిస్, సింగపూర్, హాంగ్ కాంగ్, లండన్, న్యూయార్క్, స్టాక్ హోంలలో ఉన్నాయి.

ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, దేశ, విదేశాలకు చెందిన వారు ఆర్బిట్రేషన్ కోసం ఇకపై హైదరాబాద్ ఐ.ఏ.ఎం.సి వైపు చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాల (ఏ.డి.ఆర్) ధోరణి పెరగడానికి ఈ కేంద్రం ముందడుగు వేస్తుందని చెప్పారు. ఐ.ఏ.ఎం.సికి హైదరాబాద్ సరైన వేదిక అని ఆయన కొనియాడారు. ‘‘ఇది నా నగరం. దీనిపట్ల పక్షపాతం చూపుతున్నానని నిందించవచ్చు. నిజాయితీగా చెప్పాలంటే, హైదరాబాద్‌కు ఒకరు అనుకూలంగా వ్యవహరించవలసిన అవసరం లేదు. దేశంలోని గొప్ప నగరాలలో ఇదొకటి. ఈ నగరం శోభకు నావంతు సాయం చేసినందుకు గర్వపడుతున్నా. ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు వారధిగా ఉన్న హైదరాబాద్‌కు అన్ని అర్హతలూ ఉన్నాయి. ఇక్కడ భిన్న సంస్కృతులు, భాషల వారున్నారు. ముఖ్యంగా ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తారు. ఐ.ఏ.ఎం.సీని ఏర్పాటు చేయడానికి ఇంతకంటే గొప్ప ప్రాంతం లేదు’’ అని జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు.
26సంవత్సరాల క్రితం ఆనాటి ప్రధాని పి.వి. నరసింహా రావు ఢల్లీిలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కార అంతర్జాతీయ కేంద్రాన్ని (ఐసీఏడిఆర్) ప్రారంభిస్తూ, ప్రజాస్వామ్యంలో తక్కువ ఖర్చుతో ప్రభావవంతంగా వివాదం పరిష్కారం కావాలని అన్నారు. లేకుంటే ప్రజలు చట్టాలను చేతుల్లోకి తీసుకొనే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అదే విధంగా వ్యాపార, వాణిజ్య రంగాలు సజావుగా సాగడానికి సమర్ధవంతమైన వివాద పరిష్కార మార్గం అవసరమని అప్పట్లోనే ఆయన నొక్కిచెప్పారు. ఆర్థిక సరళీకరణలో భాగంగా దేశ, అంతర్జాతీయ స్థాయిలో సాధ్యమైనంత అనుకూలంగా ప్రత్యామ్నాయ పద్ధతుల్లో వివాదాలను పరిష్కరించాల్సిన అవసరం వచ్చింది. ఆర్బిట్రేషన్, కన్సిలియేషన్ చట్టం – 1996 ఇలాంటి ప్రత్యామ్నాయ పద్ధతిని అందిస్తోందని ఆశిస్తున్నా. అయినా, ఆర్బిట్రేషన్, మధ్యవర్తిత్వం కొత్తవేమీ కావు. నచ్చిన వ్యక్తుల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకొనే విధానం గతంలోనూ ఉన్నదని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.
ముఖ్యమంత్రి కె.సి.ఆర్ చొరవతోనే..
సీఎం కేసీఆర్ చొరవ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అనతి కాలంలోనే కల సాకారమైందని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాక జూన్ 12న హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ముఖ్యమంత్రితో చర్చించా. ఆగస్టు నాటికి ఎం.ఓ.యు, ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ పూర్తికావడం, నాలుగు నెలల్లోనే ప్రయత్నాలన్నీ వాస్తవ రూపందాల్చడం మన కళ్ళతో చూస్తున్నాం. ఇక్కడ తక్కువ ఖర్చు, ఎక్కువ సౌకర్యాలు, సానుకూలమైన వాతావరణం ఉంది. వ్యాపార, వాణిజ్య వివాదాలతోపాటు కుటుంబ వివాదాలకు కూడా ఈ కేంద్రంలో పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పారు. అంతకు ముందు సిజెఐ జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్‌లు ఈ కేంద్రాన్ని గుమ్మడికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలలో పాల్గొని, కేంద్ర మంతా కలియ తిరుగుతూ వసతులను పరిశీలించారు. ఐ.ఏ.ఎం.సి కార్యాలయానికి సంబంధించిన పత్రాలను సీఎం కేసీఆర్ ఈ సందర్భగా జస్టిస్ ఎన్వీ రమణకు అందజేశారు. కేంద్రం వెబ్ సైట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ హిమా క్లోహ్లీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, రాష్ట్ర మంత్రులు కె.టి.రామారావు, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, సీ.ఎస్. సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి. ఐ.ఏ.ఎం.సి సి.ఇ.ఓ సితేష్ ముఖర్జీ, న్యాయశాఖ కార్యదర్శి ఎ.సంతోష్ రెడ్డి, ఏజీ బి.ఎస్.ప్రసాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హైకోర్టులకు చెందిన పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.
మధ్యవర్తిత్వానికి చట్టసవరణ- కే.సీ.ఆర్
హైదరాబాద్ నగరంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ (ఐ.ఏ.ఎం.సి)కి అన్ని విధాలా అండగా ఉంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు హామీ ఇచ్చారు. ఐ.ఏ.ఎం.సి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మన రాష్ట్రంలో జరిగే ప్రభుత్వ, ప్రైవేటు కాంట్రాక్టులు, పెద్దపెద్ద పరిశ్రమలతో జరిగే ఒప్పందాలకు సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం ఈ కేంద్రానికి వచ్చే విధంగా రాష్ట్ర చట్టాలకు తగిన సవరణలు చేస్తామని ప్రకటించారు. అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకు వస్తామన్నారు.
హైదరాబాద్‌లో ఐ.ఏ.ఎం.సి ఏర్పాటు విషయంలో మనమంతా గర్వించదగ్గ వ్యక్తి, నాయ్యవ్యవస్థ ఉన్నత శిఖరంగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ ప్రధాన భూమిక పోషించారని ముఖ్యమంత్రి కే.సీ.ఆర్. తెలిపారు. సింగపూర్ కంటే మెరుగ్గా హైదరాబాద్ లో అన్నీ చేస్తున్నా సరైన ప్రచారం చేసుకోవడం లేదని విదేశాల్లోని తన స్నేహితులు చెపుతున్నారని ముఖ్యమంత్రి వెల్లడిరచారు. జస్టిస్ ఎన్వీ రమణ దీవెనల ఫలితంగా నగరంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రగతిశీల భావాలున్న జస్టిస్ రమణ పెరిగి, న్యాయవాద వృత్తిని చేపట్టి, న్యాయమూర్తిగా ఉన్నత శిఖర అధిరోహణ ప్రారంభించింది హైదరాబాద్ లోనే. అందుకే నగరానికి ఏదైనా మంచి పని చేయాలని తలంచి దీవించిన ఫలితమే ఐ.ఏ.ఎం.సి. మనమంతా గర్వంగా చెప్పుకొనేలా భారత న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానానికి చేరిన ఆయన హైదరాబాద్‌ను మరచిపోకుండా అక్కున చేర్చుకోవడం అభినందనీయం అని ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కె.సి.ఆర్ ధన్యవాదాలు తెలిపారు.
భవిష్యత్తులో అనేక విషయాలలో హైదరాబాద్ నగరం ప్రపంచానికి కేంద్ర బిందువు కాబోతున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. అనేక కారణాలవల్ల కోర్టుల్లో కేసుల పరిష్కారం చాలా ఆలస్యమవుతోంది. కాని, ప్రపంచ వ్యాప్తంగా ఆర్బిట్రేషన్ సెంటర్లలో వివాదాలు త్వరగా పరిష్కారమవుతున్నాయి. ఈ విధానంపై అనేక దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. అలాంటి మధ్యవర్తిత్వ కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటు కావడం మనందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు. ఇది హైదరాబాద్ కే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి, మొత్తం వ్యవస్థకు పేరు ప్రతిష్టలు తెస్తుందని ఆయన అన్నారు. ఐ.ఏ.ఎం.సి ప్రారంభోత్సవానికి ముందే చాలా పెద్ద కేసు రావడం శుభ సూచక మన్నారు. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ కుటుంబ వివాదం తొలికేసుగా ఐ.ఏ.ఎం.సిలో విచారణకు రానుంది. ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలని సూచించినట్టు సిజేఐ ఎన్వీరమణ అంతకుముందు చెప్పారు.