కష్టకాలంలోనూ పెట్టుబడుల వెల్లువ!
By: కొణతం దిలీప్
కోవిడ్ మహమ్మారి వల్ల 2020 సంవత్సరం మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. మన దేశ ఆర్థిక రంగం కూడా ఒడిదొడుకులకు లోనవుతోంది. అనేక కంపెనీలు దివాళా తీసే పరిస్థితికి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా కోట్లాది ఉద్యోగాలు పోయాయి. కానీ ఇంత కష్టకాలంలో కూడా తెలంగాణ మాత్రం పారిశ్రామిక అభివృద్ధిలో ముందంజ వేస్తోంది. దీనికి ప్రధాన కారణం గత ఆరేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సాగుతున్న సుస్థిర పాలన, పారదర్శకమైన విధానాలు ఒకవైపు, మరోవైపు ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ కార్యాచరణ.

గత మార్చి నెలలో కోవిడ్ విజృంభనకు అడ్డుకట్ట వేసేందుకు లాక్ డౌన్ విధించిన దరిమిలా పారిశ్రామిక రంగం ఒక డోలాయమాన స్థితిలోకి నెట్టబడిరది. మంత్రి కేటీఆర్ ఈ పరిస్థితిలో గొప్ప ముందుచూపుతో అనేక దఫాలుగా పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో ఉన్న ఫార్మా కంపెనీలతో జరిగిన సమావేశంలో సదరు కంపెనీలు తమ ఫ్యాక్టరీల్లోని తయారీ విధానాల్లో కొద్దిపాటి మార్పులు చేసి ఆనాడు డిమాండ్ ఉన్న హ్యాండ్ శానిటైజర్ వంటి ఉత్పత్తులు చేయాలని ఆయన సూచించారు. అదేవిధంగా తొలినాళ్లలో డిమాండ్ ఎక్కువ ఉన్న హైడ్రాక్సీ క్లోరోక్విన్, రెమిడెస్విర్ వంటి ఔషధాల తయారీని పెంచేలా చర్యలు తీసుకున్నారు. అంతే కాదు, మలిదశలో వ్యాక్సిన్ తయారీకి హైదరాబాద్ కేంద్రంగా మారినప్పుడు మంత్రి కేటీఆర్ జీనోం వ్యాలీలో ఆయా సంస్థల అధిపతులతో ప్రత్యేకంగా సమావేశమై వారికి వెన్నుదన్నుగా నిలబడ్డారు. కోవిడ్‌ను ఎదుర్కోవడానికి అనేక నూతన ఆవిష్కరణలు తెలంగాణలో ఉన్న అంకుర పరిశ్రమలు తీసుకొచ్చాయి. వీటికి ప్రభుత్వంలో, బయట మార్కెట్లో తగు ప్రోత్సాహం దొరికేలా మంత్రి కేటీఆర్ చర్యలు తీసుకున్నారు.
కోవిడ్ వ్యాప్తి తీవ్రమై ఆర్థిక సంక్షోభానికి దారితీసిన దశలో ఐటీ, పారిశ్రామిక సంఘాలతో అనేక వర్చువల్ సమావేశాల్లో పాల్గొన్న కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి అన్ని విధాలా సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. అంతే కాదు దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి ఏమేం చర్యలు తీసుకోవాలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు కేంద్ర ప్రభుత్వానికి అనేక ఆచరణయోగ్యమైన సిఫారసులు చేశారు.
ఇక్కడ ఇప్పటికే ఉన్న పరిశ్రమలను కాపాడు కోవ డంతో పాటు నూతనంగా వచ్చే పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా తెలంగాణ మారింది. గత ఆరేళ్లుగా రాష్ట్రానికి క్రమంగా పెట్టుబడుల వరద కొనసాగుతోంది. కోవిడ్ వల్ల దేశంలోకి వచ్చే పెట్టుబడుల సంఖ్య గణనీయంగా తగ్గినా తెలంగాణ మాత్రం అప్రతిహతంగా దూసుకుపోతోంది.
2020 ఏడాది పొడవునా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక దిగ్గజ కంపెనీలు క్యూ కట్టాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది అమెజాన్ వెబ్ సర్వీసెస్ వారి రు.20,761 కోట్ల భారీ పెట్టుబడి. ఇంత పెద్ద మొత్తంలో ఒక సంస్థ పెట్టుబడి పెట్టడం రాష్ట్ర చరిత్రలోనే కాదు, బహుశా దేశ చరిత్రలో కూడా ఎన్నడూ జరగలేదు.
హైదరాబాద్ శివార్లలో ఏర్పాటవుతున్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ వారి డాటా సెంటర్ల ద్వారా తెలంగాణ డిజిటల్ ఎకానమీ, ఐటీ రంగం మరింత వృద్ధి చెందుతాయి. దీనివల్ల సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, అంకుర కంపెనీలకు మరింత ఊతం అందుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల సంఖ్యలో స్థానిక యువతకు ఉపాధి లభించనుంది.
సర్వతోముఖాభివృద్ధి!
తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు పరిశ్రమలకు సులభ అనుమతుల కోసం టీఎస్-ఐపాస్ సింగిల్ విండో విధానం ఏర్పాటు చేసింది రాష్ట్ర పరిశ్రమల శాఖ. ఇది సత్ఫలితాలు ఇచ్చి, గత ఆరేళ్లలో సుమారు రెండు లక్షల కోట్ల రూపాయల పైచిలుకు పెట్టుబడులు మన రాష్ట్రంలోకి వచ్చాయి. సుమారు 14,000 నూతన పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. దీనిలో ప్రధానంగా గమనించవలసిన అంశం ఏమిటంటే ఇదివరకులా కేవలం కొన్ని రంగాలు, కొన్ని దేశాల నుండే కాకుండా అనేక రంగాలు, అనేక దేశాల నుండి ఈ పెట్టుబడులు వస్తున్నై. ఏరోస్పేస్ మొదలుకొని రైల్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం వరకు, ఫుడ్ ప్రాసెసింగ్ మొదలుకొని టెక్స్‌టైల్స్ వరకు అన్ని రంగాల్లో మన రాష్ట్రానికి పెట్టుబడులు రావడం శుభ పరిణామం.
స్థానిక యువతకు ఉపాధి
రాష్ట్రంలోకి వెల్లువలా వస్తున్న పెట్టుబడుల వల్ల లక్షల సంఖ్యలో ఉద్యోగాల సృష్టి జరుగుతోంది. అయితే ఈ ఉద్యోగాల్లో తెలంగాణ యువతకు వీలైనన్ని దక్కాలనే సదుద్దేశంతో ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. స్థానిక యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమలకు మరిన్ని రాయితీలు అందించే ఈ నిర్ణయం ఉభయకుశలోపరిగా ఉన్నది. దీనివల్ల అటు పరిశ్రమలకు, ఇటు తెలంగాణ యువతకు లాభం చేకూరనున్నది.