సాగునీటి శాఖ పునర్వ్యవస్థీకరణ – లక్ష్యాలు 

By: శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే

రాష్ట్రంలో అన్ని సాగునీటి వ్యవస్థలను.. ప్రాజెక్టులు, కాలువలు, చెరువులు, చెక్‌ డ్యాంలు, ఆనకట్టలు, కత్వాలు, చిన్నా పెద్దా లిఫ్ట్‌ స్కీమ్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి, వీటి వలన ఆశించిన ఫలితాలను పొందడానికి, సాగునీటి శాఖలో సమగ్రమైన పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టాలని ముఖ్యమంత్రి తలపెట్టారు. ఒక సంవత్సరం పాటు ముఖ్యమంత్రి స్థాయిలో జరిగిన విస్తృతమైన చర్చల అనంతరం సాగునీటి శాఖను ఒక శక్తివంతమైన శాఖగా మార్చి ప్రజల అవసరాలను తీర్చడానికి సాగునీటి శాఖ పునర్వ్యవస్థీకరణ నిమిత్తం జి.ఒ నంబరు 45, తేదీ 28.12.2020న జారీ చేయడం జరిగింది. అనంతరం మరికొన్ని సంబంధిత జి.ఒలు కూడా జారీ అయినాయి.

జి.ఒ 45లో ప్రభుత్వం ఈ కింది ఆదేశాలు జారీ చేసింది.

1.        పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రాన్ని19 ప్రాదేశిక ప్రాంతాలుగా విభజించి ఒక్కో ప్రాదేశిక ప్రాంతానికి ఒక ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌/చీఫ్‌ ఇంజనీర్‌ ను నియమించాలి. రాష్ట్రంలో ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్‌, రామగుండం, వరంగల్‌, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్‌, సంగారెడ్డి, గజ్వేల్‌, నాగర్‌ కర్నూల్‌, మహబూబ్‌ నగర్‌, వనపర్తి, నల్లగొండ, సూర్యాపేటలో ప్రాదేశిక చీఫ్‌ ఇంజనీర్ల కార్యాలయాలు నెలకొల్పాలని ఆదేశించడమైనది. 19 మంది ప్రాదేశిక చీఫ్‌ ఇంజనీర్‌లలో ముగ్గురికి వారి అర్హతను, సీనియారిటీని బట్టి ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ హోదా కల్పిస్తారు.

2.       వీరికి పై స్థాయిలో ముగ్గురు ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ లు ఉంటారు. గతంలో ఉన్న ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌(ఇరిగేషన్‌) ఇప్పుడు ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌(జనరల్‌) గా మార్చడమైనది. ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (పరిపాలన) యధాతథంగా కొనసాగుతారు. ఇక మూడవది ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఒ&ఎం). ఇది గౌరవ ముఖ్యమంత్రి స్వయంగా ముందు చూపుతో సృష్టించిన పదవి. ఇవి కాక మరో ఆరుగురు చీఫ్‌ ఇంజనీర్లు డిజైన్స్‌, క్వాలిటీ కంట్రోల్‌, వాలంటరీ, ఎంక్వైరీ, సచివాలయంలో సెక్రెటరీ(టెక్నికల్‌), విజిలెన్స్‌ తదితర పనుల కోసం హైదరాబాద్‌లో ఉంటారు.

3.       ఈ పునర్వ్యవస్థీకరణతో సాగునీటి శాఖలో అన్ని స్థాయిల్లో మొత్తం 945 కొత్త పోస్టులకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఈ కొత్త పోస్టుల వలన సంవత్స రానికి సుమారు రు. 60 కోట్లు ఆర్థిక భారం పడనున్నది.

4.       జి.ఒ నంబరు 71 తేదీ 27.03.2019 లో దఖలు పరచిన అధికారాలు సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శికి బదలాయించదానికి అనుమతించడమైనది. 

5.       సాగునీటి వ్యవస్థల సమర్థ నిర్వాహణ, వరద నష్టాలు తదితర అత్యవసర పనులను చేపట్టే నిమిత్తమై సాగు నీటి శాఖలో డిఇఇ స్థాయి నుంచి ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ స్థాయి వరకు ఆర్థిక అధికారాలను దఖలు పరచడం జరిగినది. 

6.       పైన దఖలు పరచిన ఆర్థిక అధికారాల వినియోగం కోసం అవసరమయ్యే నిధులు మొత్తం సంవత్సరానికి రు.280 కోట్లు. ఈ నిధులను ఖర్చుచేయడానికి వీలుగా ఈ మొత్తాన్నిసాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి అధీనంలో ఉంచడానికి అనుమతించడమైనది.

పునర్వ్యవస్థీకరణ ఎందుకు? తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం సాగునీటి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన సంగతి ఎరుకే. ఈ ఆరేండ్లలో సాగునీటి శాఖ గణనీయమైన అభివృద్దిని సాధించింది. వృధాగా సముద్రం పాలవుతున్న గోదావరి, కృష్ణా జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించడానికి చర్యలు తీసుకున్నది. రాష్ట్రం మొత్తంలో సుమారు 125 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని, గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని మార్గాల ద్వారా కనీసం ఒక లక్ష ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలిగించాలని సంకల్పించింది. ఈ ఆరేండ్లలో అనేక భారీ మధ్యతరహా ప్రాజెక్టులను పూర్తి చేసింది. రీ ఇంజనీరింగ్‌ లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు మూడేండ్లలోనే పూర్తి అయి రైతాంగానికి సాగునీరు అందించే స్థితికి చేరుకున్నది. శతాబ్దాలుగా తెలంగాణ గ్రామీణ సామాజిక, ఆర్థిక వ్యవస్థకు అదరువులుగా ఉన్న గొలుసుకట్టు  చెరువుల వ్యవస్థను పునరుద్ధరించింది. మిషన్‌ కాకతీయ నాలుగు దశల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో రూ. 9155.97 కోట్లతో 27,625 చెరువులను పునరుద్ధ రించడం జరిగింది. ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ వ్యవసాయ రంగంలో అసాధారణమైన అభివృద్ధికి దోహదం చేసింది. సాగు విస్తీర్ణం వానాకాలం, యాసంగి మొత్తం 2016-17 లో 47.78 లక్షల ఎకరాల ఉంటే 2020-21 నాటికి అది 89.46 లక్షల ఎకరాలకు పెరిగింది.

సాగునీటి శాఖ పునర్వ్యవస్థీకరణలు జనవరి 2 నుంచి అమల్లోకి వచ్చింది. పునర్వ్యవస్థీకరణ లక్ష్యం సాగునీటి వ్యవస్థల సమర్థ నిర్వాహణ. పెద్ద ఎత్తున ఏర్పాటు కాబోతున్న సాగునీటి వ్యవస్థ నిర్వహణే భవిష్యత్తులో సాగునీటి శాఖకు ప్రధాన బాధ్యతగా ఉండబోతున్నది. 125 లక్షల ఎకరాల లక్షిత ఆయకట్టులో సుమారు 75 లక్షల ఎకరాలు ఎత్తిపోతల  పథకాల కిందనే ఉండబోతున్నది. ఈ విషయాన్ని ముందుగా గుర్తించి సాగునీటి వ్యవస్థలన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకురావడం, అత్యవసర పనులు, మరమ్మతులు చేపట్టడానికి వివిధ స్థాయిల ఇంజనీర్లకు ఆర్థిక అధికారాలను కట్టబెట్టడం ఈ పునర్వ్యవస్థీకరణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న కీలకమైన విప్లవాత్మక నిర్ణయాలు. ఇది సాగునీటి వ్యవస్థకు జవసత్వాలు సమకూర్చి సమర్థ నిర్వహణకు దోహదం చేస్తుందని, ఇంజనీర్లలో జవాబుదారీతనం పెరుగుతుందని భావిస్తున్నారు.

సాగునీటి వ్యవస్థల నిర్వాహణ : సాగునీటి వ్యవస్థల నిర్వాహణ ఒకే స్వభావంతో ఉండ వు. కాలువలు, చెరు వులు, డ్యాంలు, పంప్‌ హౌజ్‌లు, భూములు, భవనాలు.. ఇట్లా దేని నిర్వాహణ పద్దతి దానిదే. ఇది దానికదే ఒక పెద్ద సబ్జెక్ట్‌. అందుకే సాగునీటి వ్యవస్థల నిర్వాహణ బాధ్యతలను ఒక ప్రత్యేక అధికారి ఇఎన్సీ (ఒ&ఎం)కు అప్పగించారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌. వీటి నిర్వ హణకు సమగ్రమైన నియమనిబంధనలు, విధానాల రూపకల్పనలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సాగునీటి శాఖ అధికారులు ఒక సంవత్సరకాలంగా కసరత్తు ప్రారంభించారు. గత ఏడాది మూడు వర్క్‌షాప్‌లు నిర్వహించినారు. సాగునీటి శాఖ త్వరలోనే ఒ&ఎం పాలసీని జారీ చేయనున్నది. 

రాష్ట్రంలో గత 60 ఏండ్లుగా వివిధ అవసరాల కోసం సాగునీటి శాఖ ఇంజనీర్లు సేకరించిన భూములు, ఇతర ఆస్తుల వివరాలను క్రోడీకరించడం జరిగింది. సుమారు 12.80 లక్షల ఎకరాలను రెవెన్యూ శాఖ సాగునీటి శాఖకు బదలాయించింది. రాష్ట్రంలో 125 జలాశయాలు, 866 కి.మీ ప్రధాన కాలువలు, 13,373 కి.మీ. ఉప కాలువలు,  17,721 కి.మీ మైనర్లు, 910 కి.మీ పైపులు, 125 భారీ  ఎత్తిపోతలు, 20 మధ్యతరహా ఎత్తిపోతలు, 13 చిన్న తరహా ఎత్తిపోతలు, 38,510 చెరువులు, కుంటలు, 8021  చెక్‌ డ్యాంలు, ఆనకట్టలు, 175 కి.మీ సొరంగాలు, కాలువల మీద 1,26,477 స్ట్రక్చర్లు, 108 విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు, 64  రెయిన్‌ గేజులు, 21 రివర్‌ గేజులు ఉన్నాయని ఇన్వెంటరీ పేర్కొన్నారు. రానున్న మూడు నాలుగేండ్లలో ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. వీటి సమర్థ నిర్వాహణకు ఈ పునర్వ్యవస్థీకరణ అవసరం అయ్యింది. ఇది సాగునీటి వ్యవస్థల నిర్వాహణకు ప్రాతిపదికగా ఉపయోగపడనున్నది. ఈ నేపథ్యంలో సాగునీటి వ్యవస్థల నిర్వాహణకు సంబంధించి కొన్నికీలక అంశాలను చర్చిద్దాము

కాలువల నిర్వహణ:

ప్రాజెక్టులను నిర్మించిన తర్వాత భూములకు నీటిని సరఫరా చేసే కాలువల నిర్వహణ అత్యంత కీలకమైనది. కాలువల నిర్వహణపై గత ప్రభుత్వాలు అత్యంత నిర్లక్ష్యంతో వ్యవహరించినాయి. కొత్త వ్యవస్థల నిర్మాణంపై పెట్టిన శ్రద్ధ కాలువల నిర్వహణపై చూపెట్టలేదు. అరకొర నిధులు కేటాయించడంతో కాలువలలో పూడిక పేరుకుపోయింది. వృక్షాలు మొలచినాయి. కాలువలపై నిర్మించిన స్ట్రక్చర్లు కొన్ని పూర్తిగా మరికొన్ని పాక్షికంగా కూలిపోయి, తూముల గేట్లు పాడై లీకేజీలతో నీటి వృధాకు కారణమైనాయి. దీని వలన నీటి వినియోగ సామర్థ్యం (Water Use Efficiency) 40 శాతానికి పడిపోయింది.

తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని గుర్తించి అన్ని భారీ మధ్యతరహా ప్రాజెక్టుల కాలువల వ్యవస్థలను ఆధునీకరించడానికి నిధులు మంజూరు చేసింది. శ్రీరాంసాగర్‌, నాగార్జునసాగర్‌, నిజాంసాగర్‌, వనదుర్గా, రాజోలిబండ, సదర్మాట్‌, మూసి, సాత్నాల, చెలిమెలవాగు, స్వర్ణ, నల్లవాగు, శనిగరం ప్రాజెక్టుల కాలువల ఆధునీకీకరణ, పాలేరు పాత కాలువ, బేతుపల్లి వరద కాలువ ఆధునీకీకరణ పనులను ప్రభుత్వం పూర్తి చేసింది. దీనితో ప్రాజెక్టుల కింద ఆయకట్టు విస్తీర్ణం బాగా పెరిగింది. ప్రభుత్వం అమలు చేసిన మెరుగైన విధానాల కారణంగా ఒక టిఎంసికి సాగు అయ్యే భూవిస్తీర్ణం కూడా పెరిగింది. గతంలో ఒక టిఎంసికి 5-6 వేల ఎకరాల్లో తరి పంట 8-10 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు పండేవి.

ప్రాజెక్టుల ఆధునీకీకరణ తర్వాత శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌, నాగార్జున సాగర్‌ కాలువల కింద వారాబంది, టెయిల్‌ టు హెడ్‌ పద్ధతులని సమర్థవంతంగా అమలు చేసినందున వరి సాగులోనే ఒక టిఎంసికి 13 వేల ఎకరాలు సాగుబడి సాధ్యం అయింది, పంట దిగుబడి ఎకరాకు 35 బస్తాల నుంచి 45-50 బస్తాలకు పెరిగింది. టెయిల్‌ టు హెడ్‌ పద్ధతిన నీటి సరఫరా చేసినందువలన ఎన్నడూ నీరు పారని చిట్టచివరి భూములకు నీరు పారించగలిగినారు. మెరుగైన నీటి నిర్వాహణ పద్ధతులు, మైక్రో ఇరిగేషన్‌ అమలు చేస్తే ఒక టిఎంసికి 13 నుంచి 15 వేల ఎకరాలు సాగు చేయడం సాధ్యమేనని దేశంలో జరిగిన అనేక ప్రయోగాలు రుజువు చేసినాయి. 75 లక్షల ఎకరాల భూమికి సాగునీరు ఎత్తి పోతల పథకాల ద్వారా సరఫరా అయ్యే నీరు విలువైన నీరు. సాగునీటి శాఖ నీటి వినియోగ సామర్థ్యాన్ని కనీసం 60శాతం – 70శాతం పెంచుకోవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. కేవలం 100మి.మీ కంటే తక్కువ వర్షపాతం ఉన్న ఇజ్రాయిల్‌లో నీటి వినియోగ సామర్థ్యం 90 శాతం పైగా ఉండడం గమనార్హం.

చెరువుల నిర్వహణ: చెరువులు తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అనాది ఆధారాలుగా ఉన్న చెరువులను ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పేరున నాలుగు దశలలో పునరుద్ధరించింది. చెరువు కట్టలను బలోపేతం చేయడం, తూములు, అలుగులను మరమ్మతు చేయడం, చెరువులకు నీటిని తరలించే ఫీడర్‌ కాలువలను, పంట కాలువలను బాగు చేయడం, రైతుల భాగస్వామ్యంతో చెరువుల్లో పూడికను తొలగించి పొలాల్లో చల్లుకోవడం.. మొదలైన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. మిషన్‌ కాకతీయ అనంతరం తెలంగాణ ప్రభుత్వం మరో రెండు పథకాలను చేపట్టింది. ఒకటి చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేయడం. గతంలో చెరువులను ప్రాజెక్టుల కాలువలతో నింపడాన్ని ప్రభుత్వాలు అనుమతించలేదు.

ఇప్పుడు చెరువులను నింపడం తొలి ప్రాధాన్యతగా ప్రభుత్వం నిర్దేశించింది. అందుకు 4 వేల కొత్త తూములను నిర్మించడానికి అనుమతినిచ్చింది. చెరువులను నింపిన తర్వాతనే ఆయకట్టుకు నీరివ్వడం ఇప్పుడు ప్రభుత్వ విధానం. ఇక రెండోది నదులు, వాగుల పునరుజ్జీవన పథకం. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలో ఉన్న ప్రధాన నదులు, వాగులపై 1250 చెక్‌ డ్యాంలు నిర్మించి ఆయకట్టు నుంచి నదుల్లోకి చేరే పడవాటి నీటిని ఒడిసిపట్టి వాగులను పునరుజ్జీవింపజేయడం ఈ పథకం లక్ష్యం. దీనితో వాగులు ఎల్లకాలం నీటితో కళకళలాడుతూ ఉంటాయి. భూగర్భ జలాలు పెరుగుతాయి. వన్య ప్రాణులకు, పశుపక్ష్యాదులకు నీటి తావులు ఏర్పడుతాయి. పర్యావరణం వృద్ధి అవుతుంది.

చెరువులు, కుంటలు, చెక్‌ డ్యాంలను ఎప్పటికప్పుడు బాగు చేసే పనులను సాగునీటి శాఖ చేపడుతుంది. రైతులు చెరువుల నుంచి పూడిక మట్టిని తమ పొలాల్లో చల్లు కోవడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇది ప్రతీ ఏటా వానాకాలం పంట కాలానికి ముందు విధిగా జరిగే విధంగా వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలి. ఉపాధి హామీ పథకం కింద చెరువులలో, పంట కాలువల్లో పెరిగిన చెట్లను తొలగించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం గత ఏడాది అనుమతించింది. ఇది నిరంతరం జరగాలి. ఇందుకు సాగునీటి శాఖ, పంచాయతీరాజ్‌ శాఖలు సమన్వయంతో పని  చేయాల్సి ఉన్నది.

డ్యాంల నిర్వహణ: రాష్ట్రంలో 125 చిన్నాపెద్దా డ్యాంలు ఉన్నట్టు సాగునీటి శాఖ లెక్కలు గట్టింది. డ్యాంల గేట్లు మొరాయించడం ఒక సమస్యగా ఉంటున్నది. వీటి నిర్వహణకు సాగునీటి శాఖ ఇఎన్సీ(ఒ&ఎం) ఆధ్వర్యంలో గేట్ల మరమ్మతులు, గ్రీజింగ్‌, గేట్లను లేవనెత్తె ఇనుప తాళ్లను, విద్యుత్‌ జెనెరేటర్లను పరీక్షించడం, తుప్పు పట్టకుండా గేట్లకు పెయింటింగ్‌ చేయడం, డ్యాం గ్యాలరీల నుంచి నీటిని తోడడం తదితర పనులకు విధివిధానాలు ఖరారు చేస్తున్నది. నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు, సంవత్సరానికి ఒకసారి చేయవలసిన పనులను సూచిస్తూ మార్గదర్శకాలు రూపొందిస్తున్నది. రెగ్యులేటర్లు, ఇతర గేటెడ్‌ స్ట్రక్చర్లను నిర్వహించడం కూడా ఇందులో భాగంగా ఉంటాయి. ఇటువంటి అత్య వసర పనుల నిర్వహణ కోసం ప్రభుత్వం ఒ&ఎం నిధులను సమకూర్చి నందున వీటి నిర్వాహణ ఇక ముందు సజావుగా సాగుతుందని ఆశించవచ్చు. 

పంప్‌ హౌజ్‌ల నిర్వహణ: భవిష్యత్తులో రాష్ట్రంలో ఎత్తిపోతల ప్రాజెక్టుల కింద సుమారు 75 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. కాబట్టి ఎత్తిపోతల పథకాలలో పంప్‌ హౌజుల నిర్వహణ ఒక ప్రధానమైన కార్యక్రమం. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణతో పోలిస్తే ఇది ప్రత్యేకమైనది, సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్నది. నిపుణులైన మెకానికల్‌, ఎలెక్ట్రికల్‌ ఇంజనీర్ల నేతృత్వంలో పంప్‌ హౌజుల Periodical నిర్వహణకు కూడా సాగునీటి శాఖ సమగ్రమైన విధివిధానాలను రూపొందించే పనిలో ఉన్నది.

పంటల ఉత్పాదకత : అయితే నీటి వినియోగ సామర్థ్యం పెంచుకోవడంతో పాటు పంటల ఉత్పాదకత (Productivity) కూడా పెంచుకోవడంపై దృష్టి సారించడం అవసరం. చైనా, వియత్నాం, ఇండోనేసియా, బంగ్లాదేశ్‌ తదితర ఆసియా దేశాలతో పోలిస్తే వరిధాన్యం ఉత్పాదకత భారతదేశంలో చాలా తక్కువ. 2016 అమెరికా వ్యవసాయ శాఖ  (USDA) గణాంకాల ప్రకారం వరి ఉత్పాదకత ఈ విధంగా ఉన్నది.

భారతదేశంలో వరి పంట సాగు విస్తీర్ణం మిగతా దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నా ఉత్పాదకత చాలా తక్కువ అని పై గణాంకాలు తెలియజేస్తున్నాయి. గోధుమ ఉత్పాదకత కూడా చైనాలో హెక్టారుకు 4.7 టన్నులు ఉంటే భారత్‌లో 2.9 టన్నులే. పంటల ఉత్పాదకత భూముల నాణ్యత, సారం, సాగునీటి లభ్యత, ఎరువుల వినియోగం, పంటల ఉత్పత్తిని పెంచే వంగడాల విని యోగం, వాతావరణ అనుకూలత తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో 130 కోట్ల జనాభా ఆహార భద్రతకు పూచీ పడాలంటే పంటల ఉత్పాదక పెరగాలి. ఉత్పాదకత పెరగాలంటే సాగునీటి లభ్యత ప్రధాన వనరు. దేశంలో సాగునీటి లభ్యత 48 శాతానికి మించి లేదని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇందులో 80 శాతం నీరు సాగు కోసమే వినియోగిస్తున్నాము. గత ఆరేండ్లుగా తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి లభ్యత పెంచడానికి విశేషమైన కృషి జరుగుతున్నది. ఇప్పుడు సాగునీటి వ్యవస్థల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ కృషిలో ప్రధానంగా దృష్టి పెట్టవలసిన అంశాలు 1. సాగునీటి వినియోగ సామర్థ్యం పెంచడం 2. పంటల ఉత్పాదకత పెంచడం. ఉత్పాదకత పెంచే కృషిలో సాగునీటి శాఖ, వ్యవసాయ శాఖ సమన్వయంతో పని చేయవలసి ఉంటుంది. సాగునీటి శాఖలో పని చేస్తున్న వ్యవసాయ ఇంజనీర్లను సేవలను కాలువల నిర్వహణలో వినియోగించుకోవడం అవసరం.

ఇప్పటికే సాగునీటి శాఖ పునర్‌ వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తి అయినందున ఇక ప్రాదేశిక చీఫ్‌ ఇంజనీర్లు ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు సాగునీటి వ్యవస్థల సమర్థ నిర్వాహణకు సిద్ధం అవుతున్నారు.