కూడవెల్లి వాగుతో సాగునీటి సౌకర్యం: సీఎం కేసీఆర్‌

KCRచేబర్తి చెరువు మత్తడి నుంచి ప్రారంభమయ్యే కూడవెల్లి వాగుపై చెక్‌డ్యాంలు నిర్మించి ఎర్రవల్లి, నర్సన్నపేటలతో పాటు ఈ ప్రాంతంలోని పలు గ్రామాలకు సాగునీటి సౌకర్యం కల్పించడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. నవంబరు 12వ తేదీన సీఎం తన ఫాంహౌజ్‌ నుంచి హైదరాబాద్‌ వెళుతూ ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలలో ఆగి అక్కడి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. కూడవెల్లి వాగులో ఎప్పటికీ నీరు నిలువ వుండే విధంగా దాన్ని జీవనదిగా మార్చాలన్నదే తన సంకల్పమన్నారు. అలాగే ప్రాణహిత-చేవెళ్ళ నీటిని 20 టీఎంసీలను ఇక్కడకు తీసుకువచ్చి జలాశయాల్లో నిల్వచేయడం జరుగుతుందని, తద్వారా ఇక్కడ సాగునీటికి కొరత ఉండదని, పుష్కలమైన సాగునీరు లభిస్తుందని సీఎం తెలిపారు.

పాత ఇండ్ల కూల్చివేతలు, కొత్తగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించే విషయాలు, గ్రామంలో అంతర్గత రోడ్లు, పాఠశాల పరిస్థితి, ఫంక్షన్‌హాల్‌ నిర్మాణం ఇతర అభివృద్ధి పనులనుపర్యవేక్షించారు. గ్రామంలో భూముల్లో విత్తనాలు పండించడానికి విత్తన కంపెనీలతో త్వరలో మీటింగ్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

గ్రామమంతా కలయతిరగడంతోపాటు గ్రామం పక్కనుంచే ప్రవహిస్తున్న కూడవెల్లివాగును పరిశీలించారు. ఈ వాగుపై రెండు, మూడు చోట్ల చెక్‌డ్యాంలు నిర్మిస్తే అక్కడ నిలువ వున్న నీటిని తోడి పొలాలకు పారించవచ్చని, అలాగే వాగులో నీరునిలువవుంటే భూగర్భజలాలుపెరుగుతాయని సీఎం అన్నారు. చేబర్తి పెద్ద చెరువును అభివృద్ధి పరచడంతో పాటు చెరువు నుంచి మొదలయ్యే కూడవెల్లి వాగులో 5 కిలోమీటర్ల వరకు చెక్‌డ్యాంలు నిర్మించి పరిసర గ్రామాలకు సాగునీరు అందించే విషయాలను పరిశీలించాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారు.

జగదేవపూర్‌ మండలంలోని పలు గ్రామాలకు ఎంతగానో ఉపయోగపడే ఈ వాగుపై బ్యారేజీలు నిర్మించడానికి నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు సర్వే నిర్వహించి నిధులు అంచనా వేయడంతో పాటు నీటి నిలువ సామర్థ్యాన్ని కూడా నిర్ణయించాలని ఆయన అధికారులను ఆదేశించారు.