సాగునీటి పథకాలు దగ్గరుండి పూర్తి చేయిస్తా..

నిజామాబాద్ పూర్వపు జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు మాత్రమే ఎత్తిపోతల ద్వారా సాగునీరు రావాల్సి ఉందని, ఈ పథకాలు పూర్తి కావడానికి తాను స్వయంగా ఇక్కడికి దగ్గరలో ఉన్న గుల్దస్తా గెస్ట్‌హౌజ్‌లో ఉండి, ఇంజనీరింగ్ అధికారులను పరుగులు పెట్టించి పూర్తి చేయిస్తానని, కాళేశ్వరం ఫలాలు మీకు కూడా దక్కాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కామారెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ భవన సముదాయం, పోలీస్ ఎస్పి కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ ఎత్తిపోతల పథకాలకు దేవుళ్ళ పేర్లు పెట్టాలని, అలా అయితే దేవుడి దయతో త్వరగా పూర్తవుతాయని ఎమ్మెల్యేలకు సూచించారు. ఇక్కడి రైతులు వ్యవసాయం కూడా బాగా చేస్తారని, వారికి సాగునీరు అందిస్తే బంగారు పంటలు పడిస్తారని అన్నారు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని, ఆకుపచ్చ కామారెడ్డిగా మారుస్తానని అన్నారు.

తెలంగాణ కొరకు కొట్లాడిరదే సాగునీటి కోసమని, అవి రాకుంటే అర్దం లేదన్నారు. తాను చిన్నపుడు చుట్టాల ఇంటికి ఇక్కడకు వచ్చేవాడినని అప్పుడు ఇక్కడ బెల్లం వ్యాపారం బాగా జరిగేదన్నారు. ఇప్పుడు కామారెడ్డి బాగా మారిపోయిందని, అభివృద్ధిలో దూసుకుపోతున్నదని అన్నారు. ఎన్నికల సమయంలో ఇక్కడకు ప్రచారానికి వచ్చినపుడు కామారెడ్డిని జిల్లా చేస్తానని హామీ ఇచ్చానని, అందుకు అనుగుణంగా కామారెడ్డిని జిల్లా చేయడంతో పాటు బ్రహ్మాండమైన కలెక్టరేట్, ఎస్పీ భవనాలను నిర్మించుకున్నా మన్నారు. వీటితో పాటు వచ్చే సంవత్సరం కామారెడ్డికి మెడికల్ కళాశాల మంజూరీ చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే కామారెడ్డి మున్సి పాలిటీకి రూ. 50 కోట్లు, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సి పాలిటీ లకు రూ. 25 కోట్ల చొప్పున అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే జిల్లాలోని 526 గ్రామ పంచాయ తీలకు ప్రతి గ్రామపంచాయతీకి రూ. 10 లక్షల చొప్పున మం జూరు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రెండు గ్రామాలకు 33/11 కేవీ సబ్ స్టేషన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఎస్హెచ్ఓగా మార్చాడం కూడా ఇప్పుడు మంజూరు చేస్తున్నట్లు అక్కడే ఉన్న డీజీపీ మహేందర్‌రెడ్డికి చెప్పి ప్రకటించారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్ ఇక్కడి అభివృద్ధి పనులు కావాలని అడిగాడని, అన్ని న్యాయమైనవే ఉన్నాయన్నారు. తెలంగాణ తెచ్చుకున్నది మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించ డానికని, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోనని, నిబద్ధతతో ముందుకు సాగుతానని అన్నారు. తాను ఎన్నికల్లో హామీలు ఇవ్వకున్నా ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టానని అన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్ళు, కళ్యాణలక్ష్మీ, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ తదితర పథకాలు తాను హామీ ఇచ్చినవి కావని, కావాలని ప్రజలు తనను అడగలేదని అన్నారు. తానే ప్రజల క్షేమాన్ని, సంక్షేమాన్ని ఆశించి ప్రవేశపెట్టానని అన్నారు. కాకతీయుల కాలంలో ఉన్న 76వేల గొలుసుకట్టు చెరువుల్లో ఉమ్మడి రాష్ట్రంలో 30 చెరువులను మాయం చేశారని అన్నారు. 46వేల చెరువులు మాత్రమే ఉం డగా, వాటిని మిషన్ కాకతీయ కింద పునరుద్దరించడం జరిగిందన్నారు.

వీటిని కాళేశ్వరం జలాలతో నింపడం వల్ల నిండు వేసవిలోను చెరువులు తలుకులీనుతున్నాయన్నారు. చెరువులు, కాలువల్లో నీరు ఉండడం వల్ల భూగర్భ జలాలు పెరిగి, బోర్ల కింద కూడా వ్యవసాయం బాగా జరిగిందన్నారు. అందుకే దేశంలోనే ఎక్కువ వరి పంట పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. 3కోట్ల టన్నుల వరిధాన్యం ఈసారి పండిందని అన్నారు. రెండు సంవత్సరాల లోనే కరెంట్ ఇబ్బందులు తొలగి పోయాయని, ఇప్పుడు 24 గంటలు కరంట్ వస్తోందన్నారు. త్వరలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ ప్రారంభమైతే విద్యుత్ మిగులు రాష్ట్రంగా తయారవుతుందన్నారు. ధరణి పోర్టల్ వల్ల రైతులు భూములకు భద్రత కలిగిందన్నారు. అరగంటలో రిజిస్ట్రేషన్, పట్టా పూర్తయి, పట్టేదారు పాసుపుస్తకం రైతు చేతికి వస్తుందన్నారు.

మన పక్కనున్న నాందేడ్‌లోని 40 గ్రామాల ప్రజలు తెలంగాణలో కలుస్తా మని డిమాండ్ చేస్తున్నారని చెబుతూ.. మన పాలన బాగుండడం వల్లనే కదా వారు మన రాష్ట్రంలో కలుస్తామని అంటున్నారని వ్యాఖ్యానించారు. పాలనా సంస్కరణల్లో భాగంగా సర్పంచ్‌లకు వారి నిధులపై పూర్తి అధికారాన్ని కల్పించి నట్లు తెలిపారు. ప్రతిగ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి పచ్చదనాన్ని పెంపొం దించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పచ్చదనం ఉంటేనే వానలు బాగా పడుతాయన్నారు. కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలని చెబుతూ, ఇప్పటికీ దళితులు ఆర్థికంగా స్థితిమంతులు కాలేదని అన్నారు. వారిని అభివృద్ధిలోకి తీసుకురావడానికి సీఎం దళిత ఎంవర్మెంట్ ప్రోగ్రాం తీసుకొస్తున్నట్లు తెలి పారు. ఇందుకై ప్రస్థుతం వెయ్యి కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా స్కీముల అమలు చూసిన తరువాత మరిన్ని నిధులు మంజూరు చేసుకోవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎంతో అభివృద్ధి చెందామని, ఇంకా అభివృద్ధి చెందాల్సింది ఉందని సీఎం అన్నారు. తాను బతికి ఉన్నంత వరకు సంక్షేమ పథకాలు ఆగవని అన్నారు.
గంప గోవర్ధన్ వినతి
సమావేశం ప్రారంభం కాగానే స్థానిక ఎమ్మెల్యే, విప్ గంప గోవర్దన్ మాట్లాడుతూ తమ కామారెడ్డికి మెడికల్ కళాశాల, కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులు పూర్తి చేయ డం, ఇంజనీరింగ్ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 100 కోట్ల నిధులు, ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 25 లక్షలు, ప్రతి మండల కేంద్రానికి రూ. 50 లక్షలు నిధులు మంజూరు చేయాలని సీఎంకు విన్నవించుకున్నారు. 2వ రైల్వే ఓవర్ బ్రిడ్జి, దొమ కొండలో డిగ్రీ కళాశాల, డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద వసతులకు 4.5 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలని కోరారు. పాల్వంచ నూతన మండలం కావాలని కోరారు.
స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, ఒక్క రక్తం చుక్క కిందపడకుండా తెలంగాణ తెచ్చిన ధీరుడు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ వచ్చిన తరువాత ఆదర్శ పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. ఇది దేశానికే ఆదర్శంగా ఉందన్నారు. ప్రజల సంక్షేమానికై ఎంతో ధైర్యంగా ముందడుగు వేస్తున్నారని అన్నారు.
కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేష్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, కలెక్టర్ శరత్, ఎంపి శిండే, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.