|

ఐటీ రంగ ప్రగతి ప్రస్థానం ప్రతిఫలిస్తున్న డిజిటల్‌ తెలంగాణ స్వప్నం

– By ముడుంబై మాధవ్‌ 

ప్రతిష్ఠాత్మక ఐటీ సంస్థ ‘గూగుల్‌’ అమెరికాలోని తమ మౌంటేన్‌ వ్యూ ప్రధాన కార్యాలయం తర్వాత అత్యంత పెద్దదైన 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం గలిగిన ప్రాంగణానికి హైదరాబాద్‌ లో శంకుస్థాపన చేసింది. అమెరికా బహుళజాతి సంస్థ ‘క్వాల్‌ కాం’ తమ రెండవ అతిపెద్ద ప్రాంగణం హైదరాబాద్‌ లో ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. రూ. 1400 కోట్లతో ప్రఖ్యాత వాహన తయారీ సంస్థ ‘హ్యూండాయ్‌’ తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో కార్యకలాపాలు ప్రారంభించనున్నది. మరో దిగ్గజ వాహన తయారీ సంస్థ ZF తమ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించింది. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం ‘గోల్డ్‌మన్‌ సాక్స్‌’ తమ కార్యకలాపాలు ప్రారంభించింది. కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ పరికరాల తయారీ సంస్థ ‘ఒన్‌ ప్లస్‌’ స్మార్ట్‌ టీవీల తయారీకై హైదరాబాద్‌ ను ఎంచుకున్నది. పేరెన్నికగన్న ఆవిష్కరణల వేదిక Plug and Play హైదరాబాద్‌ లో తమ కార్యాలయాన్ని ఆరంభించింది. బీమా సేవల సంస్థ MassMutual, వాహన తయారీ సంస్థలు Sellantis, BOSCH తమ కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. ఎలెక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ FISKER, క్రీడా పరికరాల తయారీ సంస్థ CallawayGolf సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించాయి.         

ద్వితీయ శ్రేణి  నగరాలకు ఐటీ రంగ విస్తరణ 

రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి కల్పనతోపాటు సమతుల సామాజిక, ఆర్థిక ప్రగతిని సాధించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రూరల్‌ టెక్‌ విధానాన్ని తీసుకువచ్చింది. అనేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. 2021-22 సంవత్సరంలో Softpath, Quadrant వరంగల్‌ ఐటీ భవనం నుండి కార్యకలాపాలను ప్రారంభించాయి. Genpact, MindTree(L&T) ఈ ఏడాది చివరనుండి వరంగల్‌ కేంద్రంగా పనిచేయనున్నాయి. నల్గొండ పట్టణంలో ఐటీ భవన సముదాయానికి మంత్రి కేటీ రామారావు శంకుస్థాపన చేశారు.        

 గ్రిడ్‌ పాలసీ

హైదరాబాద్‌ నగరం అన్ని దిక్కులా ఐటీ పరిశ్రమను విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం Growth in Dispersion(GRID) విధానానికి రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా మేడ్చల్‌ సమీపంలోని కండ్లకోయలో పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ‘గేట్‌ వే ఐటీ పార్క్‌’కు మంత్రి కేటీ రామారావు శంకుస్థాపన చేశారు. 200 కు పైగా సంస్థలు ఈ భవన సముదాయంలో స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. Genpactఉప్పల్‌లో తమ కార్యాలయ భవనాల విస్తరణకు పనులు ప్రారంభించింది.

అంకుర పరిశ్రమలు – ఆవిష్కరణలు  

ఒక ఇంక్యుబేటర్‌గా మొదలై ఆవిష్కరణల సంధానకర్తగా రూపాంతరం చెందిన టీ-హబ్‌ ఆరేళ్ళు పూర్తి చేసుకుంది. రాష్ట్రంలో 2016లో 400 స్టార్ట్‌అప్స్‌ ఉంటే వాటి సంఖ్య 2022 నాటికి 2000కు చేరింది. గత ఏడాది 533 అంకురాలకు టీ-హబ్‌ చేయూతనిచ్చింది. సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ Product Development రంగంలో నమూనా (Prototype) దశలో  ఉన్న అంకురాలకు ఉద్దేశించిన RubriX కార్యక్రమాన్ని టీ-హబ్‌ ప్రారంభించింది. అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ (AIM), టీ-హబ్‌ కలిసి భారతదేశంలో ఆరోగ్య, చలన (Mobility), సుస్థిరత (Sustainability) రంగాలలో సృజనాత్మక ఆవిష్కరణలు, అంకురాలను ప్రోత్సహించడానికి పనిచేస్తున్నాయి. మీడియా, వినోద రంగాలలో నైపుణ్యాలను పెంచడానికి Cinepreneur అనే కార్యక్రమం చేపట్టింది టీ-హబ్‌. అట్లే, 600 కార్పొరేట్‌ సంస్థలకు తమ అంతర్గత ఆవిష్కరణ ప్రయత్నాలలో టీ-హబ్‌ సహకారం అందిస్తున్నది.    

మహిళలకోసం స్థాపించబడ్డ భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ రంగ ఇంక్యుబేటర్‌ వి హబ్‌ (WE Hub) గత సంవత్సరం వివిధ దశలలో ఉన్న 100కు పైగా అంకురాలకు తోడ్పాటునిచ్చింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చెందిన 354 మహిళా పారిశ్రామికవేత్తలకు వివిధ కార్యక్రమాల ద్వారా అండగా నిలబడింది. Girls in STEM (Science, Technology, Engineering, and Mathematics) ద్వారా 13-18 ఏళ్ల అమ్మాయిలకు Data Science నైపుణ్యాలు, WE Alpha ద్వారా 18-24 ఏళ్ళ మహిళలకు పారిశ్రామికతపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ స్టార్ట్‌ అప్‌ ఇండియా సీడ్‌ నిధికి, వి హబ్‌ ఎంపికైంది. ఈ నిధి కింద కేటాయించబడ్డ రూ. 5 కోట్లతో ఇప్పటికే 13 అంకురాలు లబ్ధి పొందినాయి. వి హబ్‌ చేయూతనిచ్చిన అంకురాలు సుమారు రూ. 3 కోట్ల విలువైన ప్రభుత్వ పనులు దక్కించుకున్నాయి. LauncHer పేరిట పారిశ్రామికతపై అవగాహన పెంచడానికై వి హబ్‌ 20 వీడియోలను వి హబ్‌ యూట్యూబ్‌ లో ఉంచింది. వి హబ్‌ అంకురం Sortizy 2021 సంవత్సరానికిగాను Google Play అత్యుత్తమ అంకుర సంస్థగా ఎన్నికైంది.          

ప్రభుత్వ శాఖలలో, సంస్థల్లో ఆవిష్కరణలకు తోడ్పాటు, విద్యార్థి దశ నుండే నూతన ఆవిష్కరణల సంస్కృతిని పాదుకొల్పేందుకు తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణల విభాగం (Telangana State Innovation Cell – TSIC) పనిచేస్తున్నది. 2021-22 సంవత్సరంలో యూనిసెఫ్‌ ఇండియా, YuWaah India భాగస్వామ్యంతో Y Hub పేరిట యువతకు ఒక ప్రత్యేకమైన ఆవిష్కరణల వేదికను ఆరంభించింది. ‘ఇంటింటా ఇన్నోవేటర్‌’ కార్యక్రమం కింద 108 సృజనాత్మక ఆవిష్కరణలను అన్ని జిల్లాల్లో TSIC ప్రదర్శించింది. Telangana State Innovations with Rural Impact (TSIRI) కింద 6 అంకురాలు, 12 మంది ఆవిష్కర్తలకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించింది. UNICEF India, Inqui-Lab Foundation, YuWaah సౌజన్యంతో నిర్వహించిన రెండవ విడత School Innovation Challenge లో 25 వేలకు పైగా విద్యార్థులు పాల్గొనగా, 5 జట్లను ఎంపికచేసి నగదు బహుమతులతో ప్రభుత్వం సత్కరించింది. ఉపాధ్యాయుల కోసం ఆవిష్కరణల కోశాగారాన్ని రూపొందించింది (www.ts-tir.telangana.gov.in). గ్రామాల సమస్యలు స్థానికులే పరిష్కరించుకునే విధంగా Village Innovation Challenge రూపకల్పన చేసింది TSIC.      

ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌

అంతరిక్ష సాంకేతికతలో (Space Technology) తెలంగాణను అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం SpaceTech Framework ను రూపొందించింది. భారతదేశంలో తొలిసారిగా meta-verseలో ఈ కార్యక్రమం జరిగింది. కేంద్ర ఐటీ శాఖ (MeitY) సహకారంతో National Centre for Addictive Manufacturing(NCAM) ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రూపుదిద్దుకుంటున్నది. వైద్య పరికరాలు, ఇంప్లాంట్స్‌ 3డి ప్రింటింగ్‌ పై మొట్టమొదటి జాతీయ సదస్సు హైదరాబాద్‌ లో 13 మే, 2022 నాడు జరిగింది. ఈ సదస్సుకు 500 కు పైగా వైద్యులు, 40 మంది addictive manufacturing నిపుణులు హాజరయ్యారు. ‘ఆకాశ మార్గాన ఔషధాలు’ (Medicines from the Sky) కార్యక్రమం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో లాంఛనంగా సెప్టెంబర్‌, 2022లో ప్రారంభమైంది. డ్రోన్ల ద్వారా విత్తనాలు వెదజల్లే కార్యక్రమం ‘హరా భరా’లో 12,000 వేల హెక్టార్లలో 50 లక్షల విత్తన బంతులను వాడడం జరిగింది. వ్యవసాయ రంగానికి ఉపయుక్తంగా ఉండే ‘సాగు బాగు’, కృత్రిమ మేధ వినియోగంతో పత్తి పంటలో చీడల నివారణ వంటి కార్యక్రమాలు ఆశించిన ఫలితాలు ఇస్తున్నాయి. 

మీసేవ – పౌర సేవలు 

మీ సేవ 100కు పైగా ప్రభుత్వ శాఖలు, సంస్థలకు చెందిన 600 పైచిలుకు పౌర సేవలను తమ 4,500 కేంద్రాలు, వెబ్‌సైట్‌, మొబైల్‌ ఆప్‌ ద్వారా అందిస్తున్నది. 2021-22  సంవత్సరంలో మీసేవ 2.6 కోట్ల మంది పౌరులకు సేవలను అందించింది. ప్రతి వెయ్యి మంది జనాభాకి సగటున అందించే డిజిటల్‌ పౌర సేవల సంఖ్య విషయంలో తెలంగాణ రాష్ట్రం 2014-2022 కాలానికి భారతదేశంలో లక్షద్వీప్‌ తర్వాత రెండవ స్థానంలో నిలిచింది.   

తెలంగాణ ప్రభుత్వ పౌర సేవల సమగ్ర మొబైల్‌ ఆప్‌ – T App Folio 33 శాఖలకు చెందిన 275 సేవలను అందిస్తున్నది. ఈ ఆప్‌ ని ఇప్పటివరకు 12 లక్షల మంది డౌన్లోడ్‌ చేసుకున్నారు. ప్రతి రోజూ 7 వేలకు పైగా లావాదేవీలు ఈ ఆప్‌ ద్వారా జరుగుతున్నాయి.     

భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ వాలెట్‌ (T-Wallet) ద్వారా గడచిన ఆరేళ్లలో 15,719 కోట్ల విలువైన 3 కోట్ల లావాదేవీలు జరిగాయి. సుమారు 13 లక్షల మంది పౌరులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు.   

సెల్ఫీ ద్వారా లైఫ్‌ సర్టిఫికేట్‌ పొందగలిగే PLCS (Pensioners Life Certificate through Selfie) సేవను 40శాతం మంది పెన్షనర్లు (సుమారు 1,20,000) వినియోగించుకున్నారు. PLCS ప్రేరణతో కేంద్ర ప్రభుత్వం ఇదే తరహా కార్యక్రమాన్ని అక్టోబర్‌, 2021 లో ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ పాలనా సంస్కరణలు, సిబ్బంది శాఖ భాగస్వామ్యంతో 24వ జాతీయ  ఈ-పరిపాలనా సదస్సును (NCeG) ఐటీ శాఖ జనవరి 7, 8 తేదీలలో హైదరాబాద్‌ లో నిర్వహించింది.

ఎలక్ట్రానిక్స్‌ 

రేడియంట్‌ అప్లయన్సెస్‌ Ê ఎలక్ట్రానిక్స్‌ ఏడాదికి 25 లక్షల LED TVల ఉత్పత్తి సామర్థ్యంగల పరిశ్రమను హైదరాబాద్‌లో స్థాపించింది. ఇది భారతదేశపు అతిపెద్ద LED TVల ఉత్పత్తి కర్మాగారం. Biliti Electric ఏడాదికి 2,40,000 ఉత్పత్తి సామర్థ్యం గల ప్రపంచంలోనే అతి పెద్ద త్రిచక్ర ఎలెక్ట్రిక్‌ వాహనాల కర్మాగారాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పుతున్నది. భారతదేశపు అతిపెద్ద ఎలెక్ట్రిక్‌ బస్‌ తయారీ సంస్థ Olectra Greentech హైదరాబాద్‌లో తమ కర్మాగారాన్ని స్థాపించనున్నది. ఏటా పదివేల బస్సులు ఇక్కడ తయారు కానున్నాయి. ప్రముఖ సోలార్‌ పీవీ తయారీ సంస్థ, Premier Energies, ప్రపంచ స్థాయి కర్మాగారాన్ని జులై, 2021లో హైదరాబాద్‌లో ప్రారంభించింది.   

నైపుణ్యాభివృద్ధి 

తెలంగాణ అకాడెమీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ స్కిల్స్‌ (TASK) 2021-22 సంవత్సరానికి 1,07,020 మంది విద్యార్థులకు, 2000 ఉపాధ్యాయ సభ్యులకు నైపుణ్యా భివృద్ధి కార్యక్రమాలు నిర్వహించింది. 2021-22 సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్‌, టెలికాం రంగంలో 2,360 మంది, ఐటీ మరియు ఇతర రంగాలలో 3,853 మంది TASK ద్వారా ఉద్యోగాలు సాధించారు. 

విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ సన్నద్ధతకై శిక్షణ ఇచ్చేందుకు జేఎన్టీయూ హైదరాబాద్‌, డా. బీ.ఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం, ఉస్మానియా, కాకతీయ, మహాత్మ గాంధీ, శాతవాహన విశ్వ విద్యాలయాలతో TASK ఒప్పందాలు కుదుర్చుకున్నది. సిరిసిల్లలో టాస్క్‌ ప్రాంతీయ కేంద్రం ప్రారంభమయ్యింది. 

సాటిలైట్‌, డిజిటల్‌ మీడియా  

2021-22 సంవత్సరానికి T-SAT మొబైల్‌ ఆప్‌ మరియు యూట్యూబ్‌ ఛానెల్స్‌ వినియోగదారుల సంఖ్య 23.5 లక్షల నుండి 36 లక్షలకు చేరుకున్నది.T-SAT వీడియోల views 12.11 కోట్ల నుండి 14.95 కోట్లకు పెరిగినాయి.  

‘ప్రతి వెయ్యి మంది జనాభాకు అనుచరుల సంఖ్య’ మితిలో తెలంగాణ సీఎంవో ట్విటర్‌ ఖాతా రాష్ట్రాల సీఎంవోల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ సీఎంవో ఫేస్‌బుక్‌ ఖాతా ఇదే ప్రమాణంలో మూడవ స్థానంలో ఉంది.