జగిత్యాల కోట
By:- నాగబాల సురేష్ కుమార్.
తెలంగాణ చారిత్రక వైభవం కాకతీయుల కాలం నుండి వెలుగులోకి వచ్చినా క్రీస్తు పూర్వం శాతవాహనుల కాలం నుండే ఇక్కడి చరిత్ర సంస్కృతికి మూలాలు కన్పిస్తున్నాయి. తెలంగాణ చరిత్రకు సంబంధించిన విశేషాలను తెలియజేసే అంశాల్లో తెలంగాణలోని ప్రసిద్ధి చెందిన, చెందని అనేక కోటలు వస్తాయి. అంతగా చారిత్రకాధారాలు లేకున్నా మిగతా కోటలతో పోలిస్తే శిధిలం కాకుండా దాదాపు మూడున్నర శతాబ్దాలుగా చెక్కు చెదరని స్థలదుర్గం జగిత్యాల ఖిల్లా.
తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరానికి 220 కి.మీ. దూరంలో ఉన్న పట్టణమే జగిత్యాల. ప్రముఖ వాణిజ్య కేంద్రంగా, రెవెన్యూ డివిజన్ కేంద్రంగా, పెద్ద పురపాలక సంఘంగా వెలుగొందుతున్న జగిత్యాల పట్టణం పడమటి వైపు చెక్కు చెదరని నేలకోట పర్యాటకులకు కనువిందు కలిగిస్తుంది.
ఫ్రెంచి ఇంజనీర్ల సాంకేతిక సహకారంతో 1747లో ఎల్గంద సర్కార్ అధిపతియైన ముబారిజుల్ ముల్క్ జఫరుద్దౌలా మిర్జా ఇబ్రహీం ఖాన్ ధంసా ఈ ఖిల్లా నిర్మాణం గావించాడు. జగిత్యాలకు 6 కి.మీ. దూరంలోనే కాకతీయుల కాలం నాడే రాజకీయ ప్రాధాన్యత కలిగిన పొలవాస గ్రామం ఉంది. ఈ గ్రామంలోని క్రీ.శ. 1108 నాటి కన్నడ శాసనం మొదటి మేడరాజు పొలాస రాజధానిగా పాలించాడని తొస్తున్నది. ఇతని కుమారుడు జగ్గదేవుడు మహా యోధుడు. రెండు యుద్ధాలు చేసి విజయాలు సాధించి నూతన గ్రామాల్ని స్థాపించాడు. పొలాస దక్షిణాన జగ్గదేవుడు తన పేరిట జగ్గదేవాలయం నిర్మించి ఉంటాడు. ఇది క్రమంగా జగదాలయం, జగతిఆలయంగా మారి ప్రస్తుతం జగిత్యాల అయి వుంటుందని పరిశోధకుల అభిప్రాయం.
కోట నిర్మాణ పద్ధతిని పరిశీలనగా చూస్తే శత్రుసైనికుల నుండి సురక్షితంగా ఉండటానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఇబ్రహీంఖాన్ ధంసా ఈ కోటను సైనిక స్థావరంగా ఉపయోగించుకున్నట్లు తెలుస్తున్నది. కోటకు ఉత్తర దిశలో ఎత్తైన బలమైన ప్రవేశ ద్వారం, దానిగుండా లోనికి వెళ్ళగానే తూర్పు దిశగా రెండవ ప్రవేశ ద్వారం కనిపిస్తాయి. ఈ ద్వారంలో నుండి లోనికి వెళ్లగానే చుట్టూ ఎత్తైన రాతి గోడతో సువిశాలమైన మైదానం వుంటుంది. నక్షత్రాకారంలో నిర్మించబడిన ఈ కోట గోడు, రాయి, ఇటుక, సున్నంతో కట్టబడ్డాయి. దాదాపు నాలుగడుగుల మందం గల గోడు శత్రుదుర్భేద్యంగా కన్పిస్తాయి. కోట చుట్టూ రాతి గోడతో కట్టబడిన లోతైన కందకం ఉంది. కందకంలో ఎ్లప్పుడూ నీళ్ళుంటాయి. అంతేగాక ఏ వైపు నుండి శత్రువు దాడి చేసినా ఎదుర్కోవడానికి అన్ని వైపులా పేల్చే విధంగా అనేక తోపు (ఫిరంగు) అమర్చబడినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆ తోపును మైదానంలో ఒక వైపు ప్రదర్శన యోగ్యంగా ఉంచారు.
ఈ కోటలో అత్యంత ఆకర్షణీయమైనది వెనుక వైపున (పడమటి దిశలో) ఉన్న దర్వాజా, దీని తలుపు పైకి లేచి కందకము దాటడానికి క్రిందికి వాలే పద్ధతిలో ఏర్పాటు చేయబడింది. దీనికి అమర్చిన కప్పీలు ఇప్పటికీ ఇరువైపుల గోడలపై భాగంలో అలాగే ఉన్నాయి. వెనుక వైపుననే మందుగుండు సామగ్రికై నిర్మించిన బారూద్ ఖానాలున్నాయి. కోట లోపల నైరుతి దిశలో దిగుడుమెట్ల బావి వుంది. ఇది ముఖ్యంగా సైనిక స్థావరంగా నిర్మించబడిన సురక్షితమైన ఖిల్లాగా చెప్పవచ్చు.
ఈ కోటను నిర్మించిన ఇబ్రహీం ఖాన్ ధంసా మరణించగానే అతని కుమారుడు ఫారూక్ మిర్జా ఎహెతెషామ్ జంగ్ ఎల్గంద ఖిలేదారు అయినాడు. అతను దుష్పరిపాలనగావిస్తూ 2వ ఆసఫ్‌జా నిజామలీఖాన్ తాఖీదును కూడా లెక్కజేయక పోవటంతో, వెంటనే పద్మాసింగ్, కన్వర్ బోదాసింగ్ నాయకత్వంలో సేనలను పంపాడు. 1791లో ఎహెతెషామ్ జంగ్ యుద్ధంలో ఓడిపోయి ఎల్గంద నుండి పారిపోయి మొదట జగిత్యాల ఖిల్లాలో ఆ తరువాత నిర్మల్ కోటలో తలదాచుకున్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. 1791లోనే నిజాం సేనలు జగిత్యాల కోటను కూడా ముట్టడించి ఖిలేదార్ అయిన జాఫర్ ఆలంను ఓడించి కోటను స్వాధీనం చేసుకున్నారు. ఇవి మనకు జగిత్యాల గురించి తొస్తున్న చారిత్రక విషయాలు.
ప్రముఖ చరిత్ర పరిశోధకు డా॥ జైశెట్టి రమణయ్యగారి స్వస్థలం జగిత్యాలనే. కరీంనగర్ జిల్లాలో చారిత్రక ప్రదేశాలన్నీ పర్యటించి పరిశోధించి అత్యంత విలువైన సమాచారం కలిగిన ‘కరీంనగర్ జిల్లా చరిత్ర – సంస్కృతి’ అనే ఉద్గ్రంధాన్ని రచించారు. ఇదేగాక తెలంగాణ కోటలు, తెలంగాణ దేవాలయాలు, పర్యాటక కేంద్రం ఎలగందల వంటి పుస్తకాలు ఎన్నో రచించి పరిశోధకులకు ఎంతో ప్రయోజనం చేకూర్చారు. ఇప్పటికీ 70వ దశకం దాటిన వీరు పలు చరిత్రకాంశాలను అనర్ఘళంగా వివరిస్తారు.
దాదాపుగా తెలంగాణలోని ఏ ఖిల్లాను, కోటను సందర్శించినా దారులు సక్రమంగా లేక, ఉన్నా సరియైన రక్షణ లేక, శిథిలావస్థలో దర్శనమిస్తాయి. కానీ నిర్మాణ నైపుణ్యమో, గ్రామ ప్రజల సహకారమో 250 సంవత్సరాల క్రితం నిర్మించిన ఖిల్లా ఇప్పటికీ ఎక్కడా చెక్కు చెదరక పర్యాటకులకు, పరిశోధకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తోందనటం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఆధునిక సాంకేతిక జ్ఞానం అబ్బురపడేట్లున్న ఈ ఖిల్లా నాటి పరిపాలకుల కార్యశీలతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇక్కడికి చేరుకోవడానికి ఏ విధంగానూ ఇబ్బంది లేదు కనుక సందర్శకులు సెలవు దినాల్లో ఈ కోటను సందర్శించవచ్చు. నగరం నడిబొడ్డున 1937లో నిజాంమీర్ ఉస్మాన్ అలీఖాన్ పరిపాలనా రజతోత్సవాల సందర్భంగా జువ్వాడి ధర్మజలపతిరావు నిర్మించిన క్లాక్ టవర్ శోభాయమానంగా వుంది. పటిష్టమైన స్థలదుర్గంగా ముందుగా చెప్పదగిన ఖిల్లా జగిత్యాల ఖిల్లా.