|

ధార్మిక, రాజకీయ రాజధాని కొలనుపాక

By:- డా. సంగనభట్ల నరసయ్య

తెలంగాణలో రాజధాని నగరంగా, పవిత్ర క్షేత్రంగా వెలసిన ప్రాచీన మహానగరాల్లో కొలనుపాక ఒకటి. ఇది 400 సంవత్సరాలు (క్రీ.శ. 11వ శతాబ్దం నుండి 14వ శతాబ్ది వరకు) సువ్యవస్థిత రాచవైభవంతో, సుప్రతిష్ఠిత ఆలయాలతో విరాజిల్లింది. కొళ్లిపాక, కొల్లిపాక, కొట్టియపాక, కొళ్లియపాక, కొల్లిహాకె, కొలనుపాక, కుల్యపాక వంటి వివిధ నామాలతో, సంస్కృత, కన్నడాంధ్ర శాసనాలలో వివరించబడ్డది.

శైవం, జైనం, వైష్ణవం ఇక్కడ ఆచరణలో ఉండి ప్రధానమైన ఆలయాలతో పన్నెండువందల సంవత్సరాల నుండి శోభిస్తున్న ప్రాచీన మహానగరం. స్వయంభూ సోమేశ్వరాలయం, జైనాలయాలు, వీరనారాయణా (వైష్ణవా)లయం, విశ్వేశ్వరాలయం ఇక్కడ ప్రధాన ఆలయాలు. సుందర మందిరాలు, శిల్పకళా శోభితాలైన దేవతామూర్తులు, బహుభాషా శాసనాలు అడుగడుగునా కన్పిస్తాయి. భారతదేశాన ప్రసిద్ధిపొందిన వీరశైవ పంచపీఠాల్లో కొలనుపాక ఒకటి. పంచ మహారాధ్యుల్లో ఒకడైన రేవణ సిద్ధుడు ఈ కొలనుపాక గ్రామంలో పుట్టినవాడే.

రాష్ట్ర కూటులు, కందూరు చోళులు, పశ్చిమ చాళుక్యులు ప్రధానంగా ఏలిన రాజధాని లేక ఉపరాజధాని నగరమిది. ఆ తరువాత కాకతీయుల ఏలుబడిలోకి వచ్చింది. ఈ రాజవంశాలకు చెందిన అనేక రాజశాసనాలు (సుమారు 50 వరకు) ఈ నగరంలోనూ, ఈ ప్రాంతాల్లోనూ లభించాయి. ఒక్క ఆరవ విక్రమాదిత్యునివే ఆరు శాసనాలు ఉన్నాయి. రాష్ట్ర కూటుల కాలంలో ఈ రాజధానికింద 21వేల రూపాయల గ్రామాదాయం ఉండేది. దీనిని కొలనుపాక 21000 అని పిలిచారు. కొలనుపాక గ్రామాన్ని ఆనుకొన్న ఉపనదిలో కందప్ప నాయకుని పేరిట రెండు లోహపు గంటలు లభించాయి. పశ్చిమ చాళుక్య ప్రథమ సోమేశ్వరుని దండనాయకుడు ఐన ఈతడు 11వ శతాబ్దివాడు. 

కందూరు తాండయ్య, వ్యాళమహారాజు, బిత్తర పారుడు, అనంతపాలయ్య, సోమేశ్వర దేవ భూతి (ఆరవ విక్రమాదిత్యుని రెండో కుమారుడు, యువరాజుగా) కేశిమయ్య, తొండ యరుసు, త్రిభువన మల్ల బేతరాజు (రెండో కాకతి బేతరాజు) మనెవర్గడె నన్నపయ్య మొదలగు సామంతులు కొలనుపాక నేలినట్లు శాసనాధారాలు ఉన్నాయి. ఈ ఉపరాజధాని నగరం ఐదు కోసుల విస్తీర్ణంతో ఉండేది.

కళ్యాణీ చాళుక్య త్రిభువన (ఆరవ) విక్రమాదిత్యునికి యుద్ధాల్లో సహకరించిన సామంతుడు కందూరు చోళ రాజొకడున్నాడు. అతని పేరు తొండయ లేదా తొండరసు. ఇతడు విక్రమాదిత్యుని సామంతుడుగా కొలనుపాక నేలినాడు. విక్రమాదిత్యుని పాదపద్మోపజీవిగా శాసనాల్లో ఉంది. ఈతని పరాక్రమం నాటి శాసనాల్లో బాగా పేర్కొబడింది. తొండయ చోళ మహారాజు రాజ్యంలో నాటి ప్రసిద్ధమైన 17 గిరి దుర్గములు, 12 స్థలదుర్గములు, 2 జల, వన దుర్గములు ఉండేవి. వీటినేలే సామంతులు మండలాధీశ్వరులు. వీరు ఈతని ఏలుబడిలో ఉన్నారు. ఈతనిని రాజాధిరాజ బిరుదంతో కొలనుపాక శాసనం పేర్కొంది. నాటి కాకతీయ రాజులైన ప్రోల, బేత (తొలిరాజులు) మండలేశ్వరులే. ఈతని రాజ్యం, నాటి కాకతీయ రాజ్యం కంటే పెద్దది. భువనగిరి, ఇంద్రపాల నగరం, రాచకొండ, దేవరకొండ, కొండపల్లి, ఉర్లుగొండ, ఉండ్రుగొండ, పానుగల్లు, కందూరు, ఘనపురం, మన్ననూరు, వర్ధమానపురం, అమ్రాబాద్‌, ఆమనగల్లు, నేలకొండపల్లి, అనుముల, రాచూరు, కోడూరు, కొలుపాక, వంగూరు, వాడపల్లి అనేవి ఈతని ఏలుబడిలో ఉండేవి. ఈతని పట్ట మహిషి మేలాంబిక దాక్షారామంలో శాసనం వేయించింది. ఇతని శాసనములు కొలనుపాకలో అనగా రాజధానిలో వేయించుకొన్నవి నాలుగు లభించినవి. కందూరు చోళులలో రెండవ భీమదేవచోడుని కుమారుడైన ఈతడు క్రీశ. 1077లో సింహాసనం ఎక్కినాడు. పానుగల్లులో ఈతనివి రెండు శాసనములు లభించినవి.

కొలనుపాక నేలిన ప్రభువులలో కందూరిచోళులు కూడా ఉన్నారు. వీరు పశ్చిమ చాళుక్య సామంతులుగా కొలనుపాక నేలినారు. తొండరస చోళుని నాలుగు శాసనములు కొలనుపాకలో క్రీ.శ. 1077 నాటివి లభించినవి. క్రీ.శ 1077 నాటిదే కుమార కొండయ చోళుని దొకశాసనము ఇక్కడ లభించినది.

కొలనుపాక పరిపాలనా దేశ భాగానికి కొలనుపాక 7000 అనిపేరు. అనగా 7000 గ్రామాల పరిధిగల నేల అని అర్థం. సబ్బి మండలమని సపాదలక్ష గ్రామ పరిమితిగలదని పేరువచ్చినట్లే. ఇది ఒక రాజ్యపరిధి (సపా = సబ్బి – ఇది కరీంనగర్‌ జిల్లా) అలాగే కందూరు 1100 ఒకటి. ఇవన్నీ పశ్చిమ చాళుక్యుల కాలంనాటి రాజ్యనామాలు. ఏఱువ రెండో భీమరాజు కొలనుపాక, కందూరులను ఏలుటకు, తనకు యుద్ధములలో సహకరించినందుకు, త్రిభువనమల్ల ఆరవ విక్రమాదిత్యుడు అధికారమిచ్చినాడు.

తొండరస చొళుని కాలమున కొలనుపాక బాగా అభివృద్ధి చెందింది. ఇతని పట్ట మహిషి మేలాంబిక దాక్షారామంలో కూడా శాసనం వేయించింది. వీరు వీరశైవమతాన్ని పోషించారు. ఇతడు త్రిభువన మల్ల (ఆరవ) విక్రమాదిత్యుని పాద పద్మోపజీవిగా (ఇష్టుడైన సామంతునిగా) పేర్కొనబడినాడు. ఈతని పరిపాలనలో కొలనుపాక విషయం నాటి కాకతీయుల రాజ్యంకంటే పెద్దది. ఇతడు రాజాధిరాజ బిరుదముతో కొలనుపాక నేలినాడు. 17 గిరిదుర్గములను, 12 స్థల దుర్గములను రెండు జల, వన దుర్గములను తన ఏలుబడిలో ఉంచుకొని కొలనుపాక రాజ్యమును సుస్థిర పరచుకొన్నాడు. 

కోటె భీమరుసు పై ప్రభువు సామంతుడుగా శ.సం. 989 ప్లవంగ, వైశాఖ శు॥ పంచమి (30 ఏప్రిల్‌ క్రీ.శ. 1067) నాడు స్వయంభూ సోమేశ్వరునికి గాడి చెరువుల గ్రామాన్ని ధారాదత్తం చేసిన శాసనం లభించింది. ఆరవ విక్రమాదిత్యుని మాండలికుడు ఎరువతొండయ సేవకుడు ఈపసర్బయ కామన ఇదే దేవుని కిచ్చిన శాసనం (8 మే 1077 క్రీ.శ.) దొరికింది. ఈతడు సోమేశ్వరునికి నందాదీ పాలు దానం చేశాడు. కందూరు తొండయ చోళ మహారాజు 21మే 1091 నాడు దుద్దండి గ్రామం దానం చేశాడు. ఈతనిదే 25 డిశంబర్‌ క్రీ.శ. 1087నాటి మరొక శాసనం లభించింది. ఆరవ విక్రముని సామంతుడు మరొకడు ‘చిద్దరసర్‌’ దాన శాసనం, ఈతని మరొక దండనాయకుడు అనంతపాలయ్య జూన్‌11, క్రీ.శ. 1108 నాటి శాసనం, తిక్కపయ్య దండనాయకుని (క్రీశ. 1109) శాసనం లభించాయి. కొలనుపాక 7000 కింద చిన్న కంపణాలు (50/60 గ్రామాల చిన్న మండలాలు) అనేకంగా ఉండేవనిపై శాసనాలు ధృవీకరిస్తున్నాయి.

కాకతి గణపతిదేవుని సామంతుడు, పానుగంటి ప్రభువు బొల్లిరెడ్డి సోమేశ్వరస్వామి ఆలయానికి చేసిన భూదాన శాసనం (10 మార్చి క్రీ.శ 1202) లభించింది. కాకతి మైలాంబ ఇనుగుర్తి రాణి కొలనుపాకలో 2 జూన్‌ క్రీశ. 1220లో సహస్రలింగ ప్రతిష్ఠాపన చేసింది.

చాళుక్య ఇందుశేఖరుని సేవకుడు నిశ్శంక పోతినాయకుడు (క్రీ.శ. 1279) చేసిన సోమేశ్వర స్వామి దానశాసనం ఆనాటి నీటి సౌకర్యాలకు సంబంధించినది లభించింది. కాకతి ప్రతాప రుద్రుని సేనాని రుద్రయ్య కూరెళ్లలో చేసిన కొలనుపాక సోమేశ్వర దేవర శాసనం, రెండవ జగదేక మల్లుని శాసనం, వీరశైవ శాంతిభిక్షావర్తికిచ్చిన శాసనం ఆధారంగా క్రీశ. 13వ శతాబ్ది వరకు ఇక్కడ సోమేశ్వరస్వామి ఆలయ ప్రభ, శైవమతం మహోజ్జ్వలంగా వెలిగిందని చెప్పవచ్చు.

తొలుత ఇది రాష్ట్ర కూటుల ఆధీనంలో ఉండేది. అకాల వర్షుని (రెండో కృష్ణుని క్రీశ. 907) ఆధీనంలో కొలనుపాకను సంకర గండరసు అనే సామంతుడు ఏలినాడు. ఈ కాలంలోనే వీరి అభిమతం మేరకు జైనమతం ఆచరణలో ఉండి, జైనాలయాల నిర్మాణం జరిగింది. కళ్యాణి చాళుక్య రెండవ తైలపుడు (క్రీశ. 973)లో స్వతంత్రుడైనాడు. ఈతడు జైనమతాభిమాని. దక్షిణాత్యులైన చోళులు పశ్చిమ చాళుక్యులపై దండెత్తినపుడు రాజేంద్ర చోళుడు మాన్యఖేటకం గెలిచి కొల్లిపాకను గెలుచుకున్నాడు. నాటికి ఇది ఒక వనదుర్గం. అయ్యన సోదరుడు జయసింహుడు కొలనుపాక నుండి చోళులను తరిమివేసినాడు. జయసింహుడు ఇక్కడ జైన దేవాలయం కట్టించాడు. ఐతే ఈ మత ప్రాభవం ఇక్కడితో అంతమైంది. ఈ రాజు శైవంలోకి మారినాడు. రాజరాజ చోళుడు పశ్చిమ చాళుక్యులపై ముట్టడించి, కొలనుపాక గెల్చి, కాల్చివేసినాడు. కొమ్మనయ్య మహామండలేశ్వరుడుగా కొలనుపాకను పునర్నిర్మించినాడు. 1067లో కోటి భీమరసు త్రైలోక్య మొదటి భీమేశ్వరుని ఆజ్ఞతో ఈగ్రామాన్ని ఏలినాడు. తరువాత ఇతని వంశీకులకు కొల్లిపాక పురవరాధీశ్వర బిరుదు వచ్చింది. ఈ ప్రభువు కొల్లిపాక స్వయం భూదేవునికి, నన్నినారాయణ దేవునకు చెరుముల గ్రామం దానం చేసినాడు. క్రీశ. 1050`1125 ప్రాంతాల్లో ఇది పశ్చిమ చాళుక్యుల పాలనలో ఉంది. ఈ కాలంలో శైవ మతం ఇక్కడ బాగా పుంజుకుంది. గోమరసు, చిద్దరసు, తొండయమాన్‌ ప్రభువుల ఏలుబడిలో ఇది కొనసాగింది. ఈ కాలంలోనే ఇది జగద్దేవుని పాలనలో ఉన్నట్లు శాసనాలు చెప్తున్నాయి. కుమార సోమేశ్వరుడు (క్రీశ. 1107) పార్శ్వనాథ జినాలయానికి దానాలు చేసినట్లు కనబడుతుంది. ఇక్కడితో జైనం ప్రాభవం తొలగింది. క్రీశ. 1220 ప్రాంతంలో ఇది కాకతీయుల వశమైంది. రుద్రమదేవి, మైలాంబల కాలాన వారి శాసనాల్లో కొలనుపాక ప్రస్తావించబడిరది. వీరి రాజ్య పాలనాంతంలో కొలనుపాక చరిత్ర చీకటిలో కలిసిపోయింది. రెండవ కృష్ణుని కాలంలోని రావి చంద్రయ్య (క్రీశ 907) మొదటి జగదేక మల్లుడు (క్రీశ. 1018), త్రిభువనమల్ల విక్రమాదిత్యుని సామంతుడు శంకర గండరసు, కుమార సోమేశ్వరుడు మొదలగువారి కాలాలలో జైనం బాగా ప్రాచుర్యాన ఉండేది. ఆయుర్వేద వైద్యుడు, జైనుడైన, అగ్గలయ్య, కాణూరు గణ సిద్ధాంతి, చంద్ర సేనాచార్యులు నాటి ప్రసిద్ధ జైన గురువులు. కొలనుపాకలోని పార్శ్వ నాథుని ఆలయం, చుట్టుపక్కల ఇనుగుర్తి, బైరాన్‌పల్లి, పెంబర్తి, మొదలగు ప్రాంతాల్లో ఆలయాలు నిర్మాణం అయినాయి. కాకతీయుల కాలంలో శైవం, వీరశైవం, ప్రబలి జైనమతం, బసదులు, ఆలయాలు ధ్వంసమైనాయి.

కొలనుపాకలో రాష్ట్ర కూటుల కాలపు మానస్తంభం ఉంది. ఇది 15-20 అడుగుల ఎత్తు రాతిస్తంభం. దీని తలపై చిన్న మంటపం నిర్మించి అందులో జినదేవతలనుంచుతారు. తరువాత ఇవి గరుడుని ప్రతిష్ఠతో గరుడస్తంభాలు, లేదా నందిని పెట్టి నంది స్తంభాలని పిలువబడ్డాయి. ఆరవ విక్రమాదిత్యుని కాలపు ధర్మపురి రామలింగేశ్వరాలయం మానస్తంభం ఇలాంటిదే.

స్వయంభూ సోమేశ్వరాలయం కొలనుపాకలో మరో ప్రసిద్ధాలయం. సుప్రసిద్ధ రేవణ సిద్ధుడు ఈ ఆలయానికి చెందినవాడు. ఈ ఆలయ నిర్మాణంకు సంబంధించిన శాసనం లేకున్నా చాలా మంది రాజులు ఆలయానికి చేసిన దాన శాసనాలు అనేకంగా లభించాయి. ఈ ఆలయ ప్రభ పశ్చిమ చాళుక్య, కాకతీయరాజ వంశాల కాలాన వెలిగింది. ఇక్కడ సుమారు 15 శాసనాలు దొరికినాయి. ఈ గుడిలోని మహిషాసురమర్దనిని కుందమాంబ అని పిలుస్తారు. కాకతి రుద్రుని సామంతుని దాన శాసనం ఇక్కడ లభించింది. కొలనుపాక వీరశైవమఠాలకు ప్రసిద్ధి. అనేక కులాల వారికి గురువులు, గురుస్థానాలు ఉన్నాయి. ఇవి క్రీ.శ. 1221 నుండి నేటి వరకు పని చేస్తున్నాయి. వీరికి స్థల పురాణాలు, కుల పురాణాలు ఉన్నాయి. శాసనాలు ఉన్నాయి. షడానుని ‘రాజశేఖర విలాసం’ ద్వారా ఇక్కడ వీరశైవవ మతస్థాపన, ప్రచారాలు, వివరాలు తెలుస్తున్నాయి. లింగోదర్భవుడై ప్రసిద్ధికెక్కిన రేవణ (రేణుకా) చార్యుని విగ్రహం ఇక్కడ శివలింగం వెనుక ఉంది.

పశ్చిమ చాళుక్య ప్రభువగు త్రిభువన మల్ల సోమేశ్వరుని కాలాన ఆయన చేత సోమేశ్వరాలయం నిర్మితమైనట్లు భావించవచ్చు. అక్కడి అంబికా దేవికి పానుపుర గ్రామం ఈ ప్రభువు దానం చేసినట్లు శాసనాధారం ఉంది. దీని ముందరి నడబావి (దిగుడు బావి)కి కాశిబుగ్గ అని పేరు.

పశ్చిమ చాళుక్యుల కాలంలోనే వైష్ణవ మతం కూడా కొలనుపాకలో ప్రాచుర్యం పొందింది. శ్రీ మహాలక్ష్మీవీర నారాయణ స్వామి ఆలయాన్ని క్రీ.శ. 1107లో ఆరవ విక్రమాదిత్యుని కాలాన నిర్మితమైనట్లు కుడ్య శాసనం సాక్ష్యమిస్తోంది. ద్వార బంధంపై గజలక్ష్మీ శిల్పముంది. ఇది పశ్చిమ చాళుక్య శైలి. వీరనారాయణ విగ్రహం చాలా ఎత్తైనది. ప్రక్కనే లక్ష్మీదేవి మందిరం ఉంది. రంగ మంటపం, మహామంటపం ఈ ఆలయంలో సువిశాలమైనవి. మహా మంటపం అనంతరకాల నిర్మాణం. దీని సింహ ద్వారం పడమటికి ముఖం చేసి ఉంది.

మరొక శిధిలాలయ ద్వారం ఇరవై అడుగుల ఎత్తులో ఉంది. ఆ ద్వారం అవతల ఎంతో పెద్ద దేవాలయం ఉండి ఉంటుంది. ఇపుడు ఆనవాళ్లు లేవు. కాని ఆరు అడుగుల వైశాల్యం గల పాదములు కన్పట్టుచున్నవి. ఏదైనా విగ్రహము విరుగుట (విరుగ గొట్టుబడుట)చే మిగిలి పోయినట్లున్నవని భావించవచ్చు.

ఈ కొలనుపాక గ్రామానికి చెందిన సుప్రసిద్ధ పండితులు, గురువులు, మఠాధిపతులెందరో శాసన బద్ధులై అజరామరులైనారు. వారిలో రామేశ్వర పండితుడు, స్వామిపయ్య, అల్లాడి మల్లయ్య, రేవణయ్య (రేణుకా చార్యులు) మేఘ చంద్రుడు, నాటి కొలనుపాక ప్రసిద్ధ వైద్యుడు అగ్గలయ్య మొదలగు వారున్నారు. వీరంతా రాజాశ్రితులు.

సోమేశ్వరాలయానికి ఉత్తరాన ప్రతాప రుద్రుని కాలపు నిర్మాణం ఐన శివాలయం ఉంది. ఇది కాకతీయ శైలి నిర్మాణం అని చెప్పనక్కరలేదు.

ఈ కొలనుపాకలో పుట్టి, లేదా రాజాస్థానానికి తరలి వచ్చిన కవులెందరో! చిత్తూరు గంగాధరకవి (కొలనుపాక మహాత్మ్య కర్త), మల్లికార్జున యోగి, (గౌడ పురాణ కర్త) విశ్వనాథయ్య (సిద్ధేశ్వర పురాణకర్త), కానూరి వీరభద్ర కవి (బసవ విలాస కర్త) గొల్లమఠం అడివయ్య, సంజీవ కవి వంటి కవులు వివిధ కాలాల్లో కొలనుపాకలో ఉన్నారు. షడానన కవి మరొక ప్రసిద్ధకవి. అతని రాజశేఖర విలాసం కొలనుపాక విశేషాలు తెలిపే గ్రంథం.

పరమార జగద్దేవుడు తారణ సంవత్సరంలో (మార్చి 13, 1104 క్రీశ.) వీర నారాయణ స్వామి ఆలయం నిర్మించి శాసనం వేసినాడు. కొలనుపాకలో ప్రాచీనాలయాల్లో ఒకటిది. దీనికి గల నాలుగు దాన శాసనాలను బట్టి వేయి సంవత్సరాల క్రితం మహర్దశలో ఉండేదని తెలుస్తుంది.

కొలనుపాక చుట్టూ కూడా ఆలయాలున్నాయి. కాశీబుగ్గ వంటి గ్రామాలు ప్రసిద్ధమైనవి. జైనమత వ్యాప్తి, కేంద్రం ఐన ఈ కొలనుపాకలో జైన బసదులు ఎక్కువే. ఇవి విద్యా కేంద్రాలు. ఇక్కుర్తి, మంత్రపురి, ముచ్చెనపల్లి, వెలవజాల, రఘునాథపురం మొదలగునవి రాజులచే పోషింపబడిన విద్యా కేంద్రాలు.

నల్గొండ జిల్లాలోని ఆలేరు గ్రామానికి దగ్గరలోని ఈ కొలనుపాక నేటికీ జైనుల యాత్రాస్థలం. అక్కడ జైనమతానికి చెందిన ఆచార్యుల విగ్రహాలతో పార్శ్వనాథుని పెద్ద విగ్రహంతో, జైనుల ట్రస్టు నిర్వహిస్తోంది. ప్రభుత్వం అక్కడ లభించిన శాసనాలు, విగ్రహాలతో సోమేశ్వరాలయ ప్రాంగణంలో మ్యూజియం నిర్వహిస్తోంది. తెలుగు వారంతా తప్పక చూడవలసిన క్షేత్రం. నేడొక మండలస్థాయి గ్రామం నాడు ప్రసిద్ధ రాజవంశాల రాజధాని లేదా ఉపరాజధాని నగరంగా విలసిల్లింది.

సుప్రసిద్ధి జైన క్షేత్రాల్లో కొలనుపాక ఒకటి. దీన్ని భారతీయ జైనులంతా ‘కులపాక్‌ జీ’ అని గౌరవంగా పిలుచుకుంటారు. ఇక్కడి జైన ఆలయం 2వేల సంవత్సరాల క్రితందని సామాన్య జనుల విశ్వాసమైనా, ఆధారాలులేవు. ఐతే జైనం కారణంగానే ఇది రాజులనాకర్షించి రాజధానిగా మారిఉండవచ్చు ఋషభనాథ, నేమినాథ, మహావీరుల పెద్ద విగ్రహాలు దీనిలో ఉన్నాయి. ఋషభనాథుడు ‘పచ్చ’ని ఏకశిలపై చెక్కిన అద్భుత శిల్పం. ఈ దేవుణ్ణి ఈ నవరత్నం కారణంగా ‘మాణిక్య స్వామి’ అని పిలుస్తారు. ఈ మతాన్ని ఆరాధించే జైనులకోసం ఆకునూరులో జైనబసది 9వ శతాబ్దంలో ఏర్పాటు చేయబడింది. ఈ దేవాలయంలోని 12వ శతాబ్ది శాసనంలో ఈ ఆలయం సంరక్షకుడైన ‘మేఘ చంద్ర సిద్ధాంత దేవ’ గురుని ప్రసక్తి ఉంది. పశ్చిమ చాళుక్య మూడవ సోమేశ్వరుని క్రీ.శ. 1125 నాటి కన్నడ శాసనం ఈ దేవాలయ  ప్రాంతంలో లభించింది. ఆ విగ్రహం శ్రీలంకాధిపతి రావణుని భార్య మండోదరి చేత పూజించబడిందని ఒక ఐతిహ్యం. ఈ ఆలయంలో ఇరువైపుల ఎనిమిది మంది తీర్థంకరుల విగ్రహాలు ఉన్నాయి. ఐదు అడుగుల ఎత్తుగల మహావీరుని విగ్రహం మరకత మణి నిర్మితం. సిమందర స్వామి, పద్మావతి అమ్మవారు, శాంతినాథ, చంద్రప్రభా, అభినందన నాథ విగ్రహాలున్నాయి. ఇవి పునర్నిర్మాణంలో కొలనుపాకలోని వివిధ శిథిల ఆలయాల్లోనివి ఒకే మందిరంలో ప్రతిష్ఠాపించబడి, పాలరాయి, ఎర్రరాయిలతో నిర్మాణమై, చుట్టూరా ధర్మశాలతో నయనమనోహరంగా ఉన్నాయి. భక్తుల వసతి గృహాలతో ఉన్న, ఈ ఆలయ దర్శనానికి భారతదేశం నలుమూలల నుండి జైనులు వస్తారు. హైదరాబాద్‌ నుండి 80 కి.మీ. దూరంలో వరంగల్‌ రాజమార్గంలో యాదగిరి భువనగిరి జిల్లాలో స్థితమై ఉన్న ఈప్రాచీన మహానగరం. గొప్ప చారిత్రక నగరం.