కొత్త బంగారు సాగు… నల్ల బియ్యం రైతమ్మ!

By: శ్రీ శ్యాంమోహన్‌

యాసంగిలో వరి మానేసి ఇతర పంటలను సాగుచేయాలని ప్రభుత్వం చెబుతోంది. ఈ మాటలు రైతుల్లో ఆలోచన రేకెత్తిస్తున్నా ప్రత్యామ్నాయ పంటల విషయంలో వారికి అనేక సందేహాలు ఉన్నాయి. విత్తనాల లభ్యత, మార్కెటింగ్‌.. ఇలా పలు అంశాలపై అవగాహనతో ముందుకు సాగుతూ విజయం సాధించిన మహిళా రైతు జీవన చిత్రం ఇది.

దేశవ్యాప్తంగా 74 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు వ్యవసాయ పనుల్లో ఉన్నారు. సగటున రెండున్నర ఎకరాల పొలంలో స్త్రీలు 557 గంటలు నాట్లు వేస్తారు. 640 గంటలు కలుపు తీస్తారు. 384 గంటలు నీటి పని చూస్తారు. 984 గంటలు కుప్పలేసి నూర్చుతారని ఒక సర్వే అంచనా. వ్యవసాయ పనులలో, ఆహారోత్పత్తిలోని అన్ని దశల్లోనూ నిత్యం చెమట చిందించే వారంతా మహిళా రైతులే. అయినా వీళ్లను రైతులుగా గుర్తించరు.

ఒక రైతు కుటుంబం దగ్గరకు వెళ్లి, ఈ ఇంట్లో రైతు ఎవరని అడిగితే, ఆ ఇంటామె ఎంత శ్రమ చేసినప్పటికీ మగవాళ్లనే రైతులుగా చూపించడం కామన్‌. కానీ, జక్కుల తిరుపతి ఇంటికి వెళ్లి అడిగితే, తన భార్యే రైతు, నేను ఆమె దగ్గర కూలీని అని గర్వంగా చెబుతాడు.

ఏమిటీ ఆమెలో ప్రత్యేకత?
వరి అంటే పచ్చని పైరు, తెల్లని బియ్యమనే అందరికీ తెలుసు. కానీ, నల్లని, ఎర్రని పైరులు కూడా ఉన్నాయి. అరుదుగా పండిస్తున్నారు. ఈ బియ్యం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయట. అందుకే డిగ్రీ వరకు చదివిన జక్కుల రేణుక సిద్ధిపేట జిల్లా, తొగుట మండలం లింగాపూర్‌లో 3 ఎకరాల్లో నల్ల వరిని సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్నారు.

నేల కింద నీటి పొరలు
‘‘పంటలు వేసే ముందు, మా నేలను ప్రకృతి సాగుకు అనువుగా మార్చాం. భూమి లోపలి పొరలలో నివసించే వానపాములు, భూమి నుండి 3 మీటర్ల వరకు తొలచుకుంటూ వెళ్ళి, నేలల్లో బొరియలు చేస్తూ, మట్టిని తిరగతోడి నేలను గుల్ల పరుస్తాయి. దీనివల్ల వర్షం పడినపుడు నీరు పల్లానికి జారిపోకుండా పొలంలోనే ఇంకుతుంది. వానపాములు విసర్జించే వ్యర్థాలతో పంటలకు కావాల్సిన పోషక పదార్థాలు సమకూరుతాయి. అయితే రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడుతుండడంతో ఇవి కనుమరుగవుతున్నాయి. భూమిని సారవంతం చేసే ఇతర సూక్ష్మజీవులు కూడా నశించిపోతున్నాయి.

అందుకే, మేం కెమికల్స్‌ జోలికి పోకుండా, పశువుల పేడ, మూత్రాన్ని సేకరించి అందులో శనగపిండి, బెల్లం కలిపి జీవామృతాన్ని తయారు చేసి, వారానికోకసారి పొలంలో చల్లుతున్నాం. దీని వాసనకు వానపాములు అభివృద్ధి చెందాయి. అవి, 90 శాతం మట్టిని 10 శాతం వ్యవసాయ వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. వర్మీ కంపోస్టు వల్ల మిత్ర సూక్ష్మజీవులు పెరిగి భూమిలో సారం పెరుగుతుంది. దీంతో పంటలకు చీడపీడలను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది.’’ అని భూసారం ప్రాముఖ్యతను వివరించారు రేణుక. కషాయాలు తయారు చేయడంలో ఆమె భర్త తిరుపతి ఆమెకు సహకరిస్తున్నారు. ఆయన కేవలం వరి మీదనే ఆధార పడకుండా, నల్ల వరితో పాటు నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆవాలు, కొర్రలు, సామలు, ఊదలు, అరిగెల వంటి చిరుధాన్యాలు పండిరచాలని తోటి రైతులకు అవగాహన కలిగిస్తున్నారు.

రెండేళ్ల క్రితం ఆమె, ‘భారత్‌ బీజ్‌ స్వరాజ్‌’ సంస్థ నుండి, కాలా బట్టి (నల్లబియ్యం) రప్పించి పండించింది. వాటికి డిమాండ్‌ ఏర్పడటంతో ప్రస్తుతం 3 ఎకరాలలో నల్లవరి విత్తనాలు అభివృద్ధి చేశారు.

ఈ సాగు ఎక్కడ మొదలైంది?
పూర్వం రైతులు, అవసరమైన పోషకాలు, ప్రత్యేక ఔషధ విలువలు కలిగిన ఆహార ధాన్యాలను సంప్రదాయ పద్ధతిలో సంకర పరిచి, తరతరాలుగా కాపాడారు. హరిత విప్లవంతో, అధిక దిగుబడినిచ్చే వంగడాలు అందుబాటులోకి రావడంతో, సంప్రదాయ వంగడాలు కనుమరుగయ్యాయి. అలాంటి వాటిలో ‘నల్లధాన్యం’ ముఖ్యమైనది. కరువు ప్రాంతాల్లో కూడా దిగుబడినివ్వడం దీని ప్రత్యేకత. మొక్కలే కాదు, ధాన్యం కూడా కారు నలుపులో, ఊదా రంగులో ఉంటాయి. వండిన అన్నం కూడా అదే రంగులో రుచిగా ఉంటుంది. గంజి వార్చి తాగితే పోషకాలు అధికంగా అందుతాయి. మణిపూర్‌, బెంగాల్‌, అసోం, ఒడిశా రాష్ట్రాల్లో స్వల్ప విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తున్నారు. తెలంగాణలో సాంప్రదాయ వరి బదులు దీనిని రేణుక పండిస్తున్నారు.

వరి కంటే ఎక్కువ డిమాండ్‌
‘‘2020లో లాక్‌ డౌన్‌ సమయం నుంచి ఈ రైస్‌ను శ్రీవరి విధానంలో సాగు చేస్తున్నారు. సాధారణంగా వరికి ఒక ఎకరానికి 50 నుండి 60కిలోల విత్తనాలు అవసరం. ఈ నల్ల వరికి శ్రీ పద్ధతిలో 2 కిలోల విత్తనం సరిపోతుంది. కలుపు నివారణ సులువు. ఎకరానికి 20 బస్తాల (75 కిలోలు) వరకు దిగుబడి వస్తోంది. పంటకాలం 4 నెలలు. సాధారణ వరి కంటే ఎక్కువ డిమాండ్‌, ఆదాయం కూడా!’’ అంటారు రేణుక.

పొలంలో మొలకెత్తిన అక్షరాలు
ఆకుపచ్చని కాన్వాస్‌ పై నల్లని అక్షరాలు రాసినట్టుగా, వరిసాగులో నల్లవిత్తనాలతో బొమ్మలు వేయడం, పేర్లు రాయడాన్ని టాన్‌బో ఆర్ట్‌ అంటారు. ఈ కళను జపాన్‌ దేశపు రైతులు కనిపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎవరూ ప్రయత్నించని ఈ కళను మొదటిసారిగా తన భర్త తిరుపతి సహకారంతో రేణుక తన వ్యవసాయ క్షేత్రంలో ప్రదర్శించారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌, పేర్లను వరి పంటలో నల్లవరినారు తో రాశారు. త్వరలో సేంద్రియసాగు సూత్రాలను రాసి రైతుల్లో అవేర్‌నెస్‌కు తోడ్పతామని అంటున్నారు.

ఉచితంగా విత్తనాలు
‘‘సాధారణ వరి రకాలను పోల్చితే సగం దిగుబడి మాత్రమే వచ్చే ఈ వంగడాన్ని అరుదుగా పండిస్తున్నారు. కాబట్టి డిమాండ్‌ పెరిగి, కిలో బియ్యం రూ.150 కి పైగా ధర పలుకుతున్నది. ఎక్కువ మంది రైతులు పండిస్తే ధర తగ్గుతుంది. ఆరోగ్యవంతమైన సమాజం కోసం అలాంటి వారిని ప్రొత్సాహించడానికి నల్ల వరితో పాటు 50 రకాల వరి విత్తనాలు ఉచితంగా అందజేస్తాము.’’ అంటారు రేణుక భర్త జక్కుల తిరుపతి.
తమతో పాటు ప్రకృతి సాగు చేస్తున్న రైతులతో త్వరలో నాటు వరివిత్తనాల జాతరను నిర్వహించాలను కుంటున్నామని ఈ రైతు జంట అన్నారు.

అరుదైన ఔషధ గుణాలు
మణిపూర్‌ సంప్రదాయ వైద్యంలో నల్ల బియ్యాన్ని ఔషధంగా వాడతారు. సామూహిక ఉత్సవాల్లో ఈ రైస్‌తో వండిన ‘చాక్‌హావో’ అనే వంటకాన్ని వడ్డిస్తారు. బ్లాక్‌ రైస్‌లో అనేక పోషక విలువలతోపాటు విశిష్ట ఔషధ గుణాలు ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది. రోగనిరోధక శక్తిని పెంచడం, కేన్సర్‌ను నిరోధించడం ఈ బియ్యం ప్రత్యేకత.

‘‘మామూలు బియ్యంతో పోలిస్తే బ్లాక్‌రైస్‌లో కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, విటమిన్‌ బీ, విటమిన్‌ ఈ, కాల్షియం, పీచు పదార్థాలు వంటి పోషకాల మోతాదు అధికంగా ఉంటుంది. నల్లబియ్యం పాలిష్‌ పడితే తెల్ల గానే ఉంటాయి. పైపొర తీయకుండా వండుకొని తింటే, గ్లైసిడిన్‌ తక్కువగా ఉండటం వల్ల షుగర్‌ పేషెంట్లకు కూడా మేలు చేస్తుంది.’’ అంటారు, నల్గొండ జిల్లా, వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, డాక్టర్‌ సీహెచ్‌ దామోదర్‌రాజు.

జీవామృతంతో సాగుచేస్తున్న నల్ల బియ్యం గంజిని ముఖానికి రాసు కుంటే మచ్చలు, మొటిమలు తగ్గుతాయని, తలకు పట్టిస్తే వెంట్రుకలు బలంగా, అందంగా తయారవుతాయని, గుండె సమస్యల పరిష్కారంలో బాగా పనిచేస్తాయని పౌష్టికాహార నిపుణులంటున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఇదే గ్రామానికి చెందిన మరో 50 మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారు. రసాయనాలు లేని పంటలను సాగుచేసి, లింగాపూర్‌ని ప్రకృతి పంటల గ్రామంగా మార్చడమే లక్ష్యంగా, ప్రకృతి నుంచి అడవి… అడవి నుంచి వ్యవసాయం…అక్కడి నుంచి ఆహారం
ఆహారం నుంచి ఆరోగ్యవంతమైన సమాజం కోసం శ్రమిస్తున్న ఈ జంట తెలంగాణ రైతాంగానికి ఆదర్శం.

రేణుక కృషికి అవార్డ్‌
వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయం రెట్టింపు చేసే అరుదైన వరి వంగడాలు సాగుచేస్తున్న రేణుక కృషిని గుర్తించిన సుచిర్‌ ఇండియా ఫౌండేషన్‌ సంస్థ ఉత్తమ మహిళా రైతు అవార్డుతో గత నవంబర్‌ నెలలో సత్కరించారు.