జయహో తెలంగాణా

పలికెద నే జయమ్మును సభాస్థలి గొంతుక మారు మ్రోగగా

కళలకు పుట్టినిల్లగుచు గ్రాలిన మా తెలగాణ సీమకున్‌

వెలుగది వచ్చె సుమ్ము మహనీయుల త్యాగ ఫలమ్ము మించ, సం

చలనము సృష్టిచేసి తమ సర్వము ప్రీతిగ ధారవోసి ఉ

జ్జ్వలముగ నవ్య రాష్ట్రమును వర్ధిల జేసిరి. నాటి ధీధితుల్‌

వెలయగ జేసిరెందరొ ప్రవీణులు, మాధవ మౌనివర్యుడున్‌

తెలుగున తేనె శర్కరల తీపును నింపిన పాలకుర్కియున్‌

హలగళధారి సద్వరమునందిన భీమన పోతనాఖ్యులున్‌

జలజ దళాక్షి శారదకు సాటిగ నిల్చిరి. వారినెప్డు ని

ర్మల హృదయమ్మునన్‌ దలతు రాణ్మణి పీ.వి. నృసింహరావు తా

నలయక రాజకీయపు మహారథియౌచు ప్రధానమంత్రియై

యిలను యశమ్ము గాంచెను. కవీశ్వరులై వెలుగొంది నట్టి ధీ

కులజులు వానమామల, యకుంఠ యశోనిధి కృష్ణమూర్తి య

న్ముల కుల శేఖరుండు, కవి ముఖ్యులు నిల్చిరి యోరుగంటిలో,

కలము త్రిశూలమై నిలువగా కవితోద్యమ మార్గదర్శియై

చలనమునిచ్చి మేల్కొలిపె జాతిని కాళొజి రుద్రమూర్తియై

అలుగుల వంటి పద్యముల నాటి నిజాముల దౌష్ట్య కృత్యముల్‌

నిలిపిన ధన్యజీవి మహనీయుడు దాశరథిన్‌ మదిన్‌ సదా

తలచుట ధర్మమౌను కవితారవి ఆదిలబాదు వాసి సా

మల కులజున్‌ సదాశివ సమంచిత రమ్య వచో విలాసముల్‌

విలసిత కీర్తి గాంచె, కనువిందొనరించుచు రమ్యమొంద ని

ర్మలున సృజించు బొమ్మల సమమ్ములు లేవు జగమ్మునందు, ది

క్కులను మ¬ద్యమమ్ము నెలకొల్పుచు గద్దరు వంటి వారు పా

టలనెడు బాటలన్‌ నిలిపి డాబుల నాపిరి. మిన్నలై శతా

బ్దుల ఘన సంస్కృతీ ప్రగతితో విహరించిరి. దివ్యమౌచు ని

స్తులయగు జ్ఞాన పీఠమును శోభిల దాల్చె సి.నా.రె. తెల్పగా

పులకితమౌను మేను పరిపూత మనస్కులు జ్ఞాన భాస్కరుల్‌

సలలిత లీల త్యాగమును సల్పి గడించిన భాగ్యమిద్ది. సం

కుల సమరమ్మునన్‌ ప్రజలు కూలిరి ప్రాణములన్‌ త్యజించి యా

కల నిజమయ్యె నేడు తెలగాణ మ¬న్నత రాష్ట్రమయ్యె. మం

జులమగు రాష్ట్రగానము మనోహరమందగ నాలపించ మీ

రలు కదలండి రండి మన రమ్య పతాకము దీప్తి గాంచుడీ !

-మద్దూరి రామమూర్తి