సంక్షేమ నిధి – జర్నలిస్టుల పెన్నిధి

జర్నలిస్టుల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ధ్యేయమని మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. ఆపత్కాలంలో జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ముందుండి పనిచేసి కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించింది జర్నలిస్టులేనని ఆయన కొనియాడారు. తమ విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్క చేయక ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ కొందరు కరోనాకు బలికావడం దురదృష్టకరమని అల్లం నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉంటూ మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలుస్తూ, ఆర్థిక భరోసాను కల్పిస్తున్న సంస్థ దేశంలోనే తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి మాత్రమే అని ఆయన అన్నారు.

హైదరాబాద్‌, మాసబ్‌ ట్యాంక్‌లోని సమాచార భవన్‌లోని మీడియా అకాడమీ కార్యాలయంలో తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి 65 మంది కోవిడ్‌-19తో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, 40 మంది సాధారణ మరణం చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఒక లక్ష రూపాయల చొప్పున, ప్రమాదాలు, తీవ్ర అనారోగ్యం బారిన పడిన 8 మంది వర్కింగ్‌ జర్నలిస్టులకు యాభై వేల రూపాయల చొప్పున మొత్తం ఒక కోటి 74 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ, శాసనమండలి సభ్యులు గోరటి వెంకన్న, జర్నలిస్టు, ఆందోల్‌ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్‌లతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారని, ఇప్పుడు ఈ నిధి జర్నలిస్టుల పెన్నిధిగా మారిందని తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కొరకు జర్నలిస్టుల సంక్షేమ నిధిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఇందులో భాగంగా జర్నలిస్టుల సంక్షేమ నిధికి మొత్తం 42 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఇప్పటి వరకు 353 కుటుంబాలకు లక్ష రూపాయల వంతున, 116 మందికి 50 వేల చొప్పున ఆర్థిక సహాయం చేశామన్నారు. అంతేగాక కరోనా వైరస్‌ బారిన పడిన 3915 మంది జర్నలిస్టులకు తక్షణ సహాయంగా మొదటి విడత కరోనా వైరస్‌ బారిన పడిన వారికి 20 వేల చొప్పున, రెండవ విడత కరోనా వైరస్‌ బారిన పడిన వారికి 10 వేల చొప్పున 5.70 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని ఆయన తెలిపారు.

ఇప్పుడు ఆర్థిక సహాయం అందించిన జర్నలిస్టు కుటుంబాలకు నెలకు మూడు వేల రూపాయల పెన్షన్‌ను అయిదేళ్లపాటు అందిస్తామని, ఆయా కుటుంబాలలోని ఒకటి నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ట్యూషన్‌ ఫీజును చెల్లిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

జర్నలిస్టులకు ఒక వైపు సంక్షేమంతోపాటు శిక్షణా కార్యక్రమాలు, జర్నలిస్టుల కోసం 12 పుస్తకాలు, మీడియాలో పని చేసే జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డులు, హెల్త్‌ కార్డులు అందించామని, కొన్ని జిల్లా కేంద్రాలలో ఇండ్ల స్థలాలు అందించడానికి కృషి చేస్తున్నట్లు, ఇంకా కొన్ని ప్రాంతాలలో ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందు చూపు, ప్రత్యేక చొరవ ద్వారా ఏర్పాటైన జర్నలిస్టుల సంక్షేమ నిధి ద్వారానే జర్నలిస్టులకు ఆర్థిక భరోసా కల్పించిన ఈ ఘనత మొత్తం తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్‌ దే అని మీడియా అకాడమి ఛైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు.

జర్నలిస్టు, ఆందోల్‌ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్‌ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఉద్యమకారులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ మొట్టమొదటగా తెలంగాణ ప్రెస్‌ అకాడమిని ఏర్పాటు చేసి జర్నలిస్టు నాయకుడు అల్లం నారాయణని ఛైైర్మన్‌గా నియామకం చేశారని అన్నారు. తెలంగాణలోని జర్నలిస్టులకు అండగా నిలుస్తూ అక్రిడిటేషన్‌ కార్డులు, హెల్త్‌ కార్డులు మంజూరు చేయడమే గాక ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద సుమారు 5 కోట్ల రూపాయలు జర్నలిస్టుల ఆరోగ్యం, ఆపరేషన్‌ ఖర్చుల కొరకు మంజూరు చేయించడం జరిగిందన్నారు. జర్నలిస్టులకు ప్రత్యేక నిధి కల్పించి, 100 కోట్లు కేటాయించి ఇప్పటికే 500 మందికి సహాయం చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని క్రాంతి అన్నారు. జర్నలిస్టులకు ఇలా సంక్షేమం కల్పించిన మరో రాష్ట్రం లేదన్నారు. రిటైర్డు జర్నలిస్టులకు పెన్షన్‌ ఇచ్చే ఆలోచన కూడా ఉందని క్రాంతి కిరణ్‌ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, సమాచార శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డి.ఎస్‌. జగన్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌ పూర్ణచందర్‌రావు, మేనేజర్‌ వనజ, టీయూడబ్ల్యూజె కోశాధికారి మారుతి సాగర్‌, టెంజూ రాష్ట్ర అధ్యక్షులు ఇస్మాయిల్‌, టీయూడబ్ల్యూజె నాయకులు యోగానంద్‌, నవీన్‌, ఆదినారాయణ, విష్ణు, అవ్వారి భాస్కర్‌, టీపిజెఎ అధ్యక్షులు భాస్కర్‌, వీడియో గ్రాఫర్ల సంఘం నాయకులు నాగరాజు పాల్గొన్నారు.