కడుపునిండా మాట్లాడుకొందాం

palukubadiతెలుగు భాషలోని ”కడుపు” అనే పదానికి జఠరము, ఉదరము, పొట్ట, కుక్షి మొదలైన మాటలు పర్యాయంగా వచ్చే పదాలు. అయితే తెలంగాణ ప్రాంతంలో మాత్రం కడుపు అనే మాటకు నానార్థాలు కూడా ఉన్నాయి. అవి: గుండె, మనస్సు, పొట్ట, గర్భం అనేవి. ఎదుటివాళ్ళ బాధల్ని చూసి తెలంగాణలో కొందరికి ”కడుపు పగిలిపోతుంది”. ఇక్కడ కడుపు పగలడం అంటే గుండె వ్రయ్యలు కావడం. ఇంకా బాధని ప్రకటించడానికి ”కడుపు అవిశిపోయింది”, ”కడుపు చెరువయ్యింది” అంటుంటారు. ఈ రెండు సందర్భాల్లోనూ ”డుపు” అంటే గుండె అని అర్థం. అంతేకాకుండా ”డుపు” అంటే మనస్సు, హృదయం అనే అర్థాలూ ఉన్నాయి. గుండె శరీరావయవం, మనస్సు ఆలోచనల సరస్సు. అది శిరస్సులో ఉంటుంది. ఈ మనస్సు అనే అర్థంలో తెలంగాణలో బాగా ప్రచురితమైన పలుకుబడి ”కడుపు నిండ మాట్లాడుకొందాం” అనేది. ఇదేమిటి? సాధారణంగా కడుపు నిండ తింటారుగానీ మాట్లాడుకోవడం ఏమిటీ అనుకుంటాం. తింటే ఎంత తృప్తిగా ఉంటుందో అంత సంతృప్తికరంగానూ, మనస్ఫూర్తిగానూ, తనివితీరా మాట్లాడుకోవడం అన్నమాట. ఇవాళ ఎవరికీ కడుపునిండా మాట్లాడుకునే తీరికలేదు. ఒకవేళ మాట్లాడుకుంటే ఎట్లా వుంటుంది? తలంటుస్నానం చేసినట్లు హాయిగా వుంటుంది. ఒత్తిడి దూరమై పోతుంది. ఇంకా ముఖ్యంగా చదువుకున్న భాషలో కాకుండా సహజసిద్ధమైన తెలంగాణ భాషలో కడుపునిండా మాట్లాడుకుని చూడండి. తల్లితో సంభాషిస్తున్నంత సహజంగా ఉంటుంది.

”కడుపుల లేనిది కావలిచ్చుకుంటే వస్తదా?” అనేది ఒక సామెత. దు:ఖం, శోకం, ఏడుపు, సానుభూతి, పరా మర్శ మొదలైనవి. ”కడుపులో” (మనస్సులో) లేన ప్పుడు ఎదుటివ్యక్తిని ఎంత కౌగిలించుకొని ఏడ్చినా దు:ఖం కట్టలు తెంచుకుంటుందా? కన్నీళ్ళు జాలువారుతాయా? మనస్సులో గూడుకట్టుకొన్న విషాదం కరిగితేనేకదా కళ్ళనుండి అశ్రువులు జారేది! మనసులోపల దు:ఖం లేకుంటే కౌగిలించుకున్నా ఫలితం శూన్యం అని చెప్పడం సందర్భంగా. ”కడుపుల కాలుడు”, ”కడుపుల గోకుడు”, ”కడుపుల సురసుర అనుడు” మొదలైన పలుకుబళ్ళకు అర్థం ఆకలికావడం అని, కడుపుల ఎందుకు కాలుతుంది? సమయానికి తిండి పడకపోతే ఊరిన జఠరరసం జీర్ణాశయాన్ని కాల్చుతుంది. ”కడుపుల గోకుడు” కూడా ఇటువంటి పరిణామమే! అందుకే ”కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి” అంటున్నారు. తెలుగుభాషలో ఎలుకలైనా, జఠరరసమైనా పొట్టనూ, పేగుల్నీ గోకడమేకదా చేయడం? జఠరరసంలోని హైడ్రోక్లోరికామ్లం అట్లా పేగుల్ని కొరకడంవల్ల కడుపులో చురచుర కాలుతుంది. ఇదే తెలంగాణలో ”కడుపులో సురసుర అనుడు”. ఈ జాతీయం తెలుగుభాషలో ”ఆకలితో నకనకలాడడం” అనే రూపంలో ఉంది. మరి ”నకనకలాడడం” ఏమిటి? అది నకనకకాదు, కనకనలాడటం. కణకణ మండటం. జఠరాగ్నితో కడుపు లేదా ఆకలి కణకణమండదా మరి! ఆ కణకణే వర్ణమత్యుయంతో నకనక అయ్యింది.

తెలంగాణలో ఈ ‘కడుపు’ పదం ప్రధానంగా ఉన్న పలుకుబళ్ళు అనేకం ఉన్నాయి. ”కడుపు నొచ్చువాడు ఓమ బుక్కుతడు” ఇదొక సామెత. నెసెసిటీ ఈజ్‌ ద మదర్‌ ఆఫ్‌ ఇన్వెన్షన్‌ అనేది ఆంగ్లంలో సమానార్థం, దప్పి అయినవాడు బావి తవ్వినట్లు. పేదలు, నిరుపేదలు అనే అర్థంతో ”కడుపుల పేగులు లేనోళ్లు, కడుపు చేతుల పట్టుకున్నోల్లు” అనే మాటలున్నాయి. తిండిపోతుల్ని చూసి సాధారణంగా ‘కడుపా కయ్యా!’ అని ప్రశ్నిస్తుంటారు. కుక్షింభరులు మితిమీరి తింటుంటారు. అట్లా పీకల్దాక తిన్నవాణ్ణి పట్టుకుని ‘నీది కడుపా కయ్యా! అని అడుగుతారు. ‘కయ్య’ వాగులో ఉంటుంది. మడుగులాంటిది. ప్రవాహ ఉధృతివల్ల వాగులాగా ఏర్పడిన లోతైన నీటి మడుగు. దీనికి సమానార్థంగా తెలుగులో ‘కడుపా కొల్లేరా’, కడుపా చెరువా?, కడుపా ఖండవల్లి మడుగా?, ‘కడుపా కల్లేపల్లి చెరువా?’ వంటి అభివ్యక్తులు ఉన్నాయి. అయితే.. తెలంగాణలో ‘కడుపా కయ్యా’ అనడంలో అక్షరాల పొదుపు ఉంది. అంతేగాక ‘కడుపా’అనే పదంలోనూ ‘కయ్యా’ అనే మాటలోనూ సమాన మాత్రలున్నాయి. ఇది ‘లయ’ను అసా మాన్యంగా సాధించే క్రమం. తెలంగాణ ప్రజలకు అది ప్రాణం.

ఇక… ‘పొట్ట చెక్కలయ్యేట్లు నవ్వడం” అనే వాక్యం చూడండి. అంటే బాగా నవ్వడం అని అర్థం. ఎంత బాగా అంటే పడీపడీ నవ్వగా నవ్వగా పొట్టచెక్కలు, వక్కలు, ముక్కలు, భాగాలు అయ్యే టట్లుగా నవ్వడం. దీన్ని తెలంగాణలో ఏమంటారు మరి? ‘కడుపు పగిలిపొయ్యేటట్లు నవ్వుడు’. ఎంత సులభంగా, సుబోధకంగా వుంది ఈ మాటలతీరు.

‘కడుపు అవుడు’, ‘కడుపు పోవుడు’, ‘కడుపు కడుగుడు’ మొదలైన వాటికి వరుసగా ‘గర్భం దాల్చడం’, ‘గర్భస్రావం కావడం’, ‘అబార్షన్‌’ చేయడం అనేవి అర్థాలు. ‘మల బద్ధకం’ అనే అర్థంలో ‘కడుపు మందమైంది’ అంటున్నారు తెలంగాణలో. ‘తప్పు కాయడం’ అంటే ‘కడుపులో దాసుకొనుడు/ పెట్టుకునుడు’ అనేది పర్యాయంగా వచ్చే పలుకుబడి. ఏది ఏమైనా ‘కడుపు’అనే మాట గురించి ‘కడుపునిండా మాట్లాడుకున్నాం కదా!”. ఇక ఆపుదాం.