|

కాలాయ తస్మై నమః

– డా. సాగి కమలాకర శర్మ

‘‘కాల: పచతి భూతాని కాలస్సంహరతి ప్రజాః

కాలస్సుప్తేషు జాగర్తి కాలోహి దురతిక్రమః’’

కాల శబ్దం యమునికి, కాలానికి పేరు. (కలయతి ప్రాణిన ఇతి కాలః). మనస్సును ప్రేరేపించునది (కాలయతి మన ఇతి క్షేపే). దీనిచేత గణన చేయబడునది, ప్రేరేపింపజేయునది, దీని చేత సుఖదు:ఖాదు లీయబడుచున్నవి. దీనియందు జనులు వ్యాపార యుక్తులగుదురు. నశించనిది. చేష్టలేనిది. లెస్సగా ఎరుగబడునది. ధర్మాధర్మములైనను, కాలమునైనను లెక్కించువాడు మొదలైనవి కాలానికి, కాలునికి సంబంధించిన పేర్లు. కాల శబ్దానికి నలుపు అనే అర్థం ఉంది. కాలం శివ స్వరూపం. అందుకే కాలుడు అంటే శివుడే. కాలం బ్రహ్మ స్వరూపం. అందుకే సృష్టి ప్రారంభం చేసే కాలగణన బ్రహ్మాయుర్దాయంగా పరిగణిస్తున్నారు. అద్య బ్రహ్మణః అంటూ నిత్యం సంకల్పంలో కాలాన్ని ప్రార్థించడం, గుర్తించడం భారతీయ సంప్రదాయం. కాలమంటే ప్రకృతి అని అర్థం. ప్రకృతి వికాసాదులన్నీ కాలంలోనే గుర్తించబడతాయి.

కాలం మనిషి వినియోగం కోసం ఏర్పరచుకున్నది. జీవన విధానానికి, జీవన ప్రమాణానికి, ప్రకృతి పరిశీలనకు కాలం ఒక ప్రమాణంగా ఉంది. మనిషి విజ్ఞానిగా మారడానికి కాలం వినియోగపడింది. ఖగోళంలోని గ్రహాలు, నక్షత్రాలను గమనించడానికి కాలం ఒక ప్రమాణం. ఇంతకూ కాలం దేనివల్ల ఏర్పడుతుంది? భూమి తనచుట్టూ తాను తిరగడం వల్ల కాలం ఏర్పడుతుంది. తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడం వల్ల ప్రకృతిలో మార్పులు ఏర్పడుతున్నాయి. ఋతువులు ఏర్పడుతున్నాయి. కాలాన్ని ఏర్పరచేవాడే కాలుడు. అయితే భూమే మనకు కాలుని స్వరూపమవుతుంది.

మానం అంటే కొలత. కాలమానం అంటే కాలాన్ని కొలవడం. ఈ కొలతలన్నీ ప్రకృతిలోని మార్పులను అధ్యయనం చేయడమే. ఎన్నో మానాలన్నీ అందుకే ఏర్పడినాయి. ప్రస్తుతం మనం అనుసరించే ఆంగ్ల కాలమానం తప్ప అన్ని కాలమానాలకు ఖగోళ ప్రాతిపదికలున్నాయి. తెలుగువారు సౌర, చాంద్రమానాల కలయికను అనుసరిస్తారు. సౌరమానమంటే సూర్యుడు ఒకరాశి నుండి ఒక రాశిలోకి మారడాన్ని గణించే విధానం. మేషమాసం, వృషభమాసం… అంటూ సౌరమాన మాసాలుంటాయి. చాంద్రమానం ప్రకారం ఒక మాసానికి పేరు నిర్ణయించడం కూడా ఖగోళ ప్రాతిపదిక వల్ల మాత్రమే జరుగుతుంది. చిత్త నక్షత్రం పౌర్ణమి నాడు స్పర్శ ఉంటే చైత్రమాసం, విశాఖ – వైశాఖం; జ్యేష్ఠం; పూర్వాషాఢ/ఉత్తరాషాఢ – ఆషాఢం; శ్రవణం – శ్రావణమాసం; పూర్వాభాద్ర /ఉత్తరాభాద్ర – భాద్రపదం; అశ్విని – ఆశ్వీజం; కృత్తిక – కార్తీకం; మృగశిర – మార్గశిరం; పుష్యమి – పుష్యం; మఖ – మాఘం; పూర్వఫల్గుణి / ఉత్తరఫల్గుణి – ఫాల్గుణమాసం అవుతాయి. ఈ విధంగా చాంద్రమానంలో పౌర్ణమి నాటి నక్షత్రాన్ని అనుసరించి పేర్లుంటాయి. ఆ మాసంలో ఆ నక్షత్రం లేకుంటే అది అధికమాసం అవుతుంది. కాలగణనలో ఎన్నో మానాలు ఈ విధంగా ఉంటాయి. ఖగోళాన్ని, భూగోళాన్ని, ప్రకృతిని ఒక క్రమపద్ధతిలో గమనించాలంటే ఒక కాలం కావాలి. అందుకే కాలానికి చేసే నమస్కారం అందరు దేవతలకు చేసే నమస్కారమే. కాలాయ తస్మై నమః..

యుగ్మ శబ్దానికి జంట అని అర్థం. కాలక్రమంలో

ఈ శబ్దమే యుగ శబ్దంగా మారింది. ఇదే తర్వాత కాలవాచకమైంది. కాలంలో అన్నీ జంటగానే ఉంటాయి. శరీరంలోనూ జంట తత్త్వమే కనిపిస్తుంది. రాత్రి పగలు, పక్షానికి రెండు వారాలు, మాసానికి రెండు పక్షాలు, ఋతువుకు రెండు మాసాలు, సంవత్సరానికి రెండు అయనాలు… ఇలా ఐదు సంవత్సరాలకు రెండు అధికమాసాలు ఏర్పడుతాయి. అధికమాసాల జంట కలిగిన ఐదు సంవత్సరాలను ‘పంచ వర్షాత్మక యుగం’ అన్నారు. ఈ విధంగా కాలగణన యుగ శబ్దంతో ముడివడిరది. కాలక్రమంలో సంవత్సరం కూడా యుగ శబ్ద సంకేతమైంది. 

వసంత ఋతువులో ప్రకృతి వికసిస్తుంది. చెట్లు చిగురుస్తాయి. ఇది సంవత్సర ప్రారంభానికి సంకేతంగా ఉంటుంది. వసంత ఋతువులోని చైత్ర మాసం మొదటి రోజును ‘యుగ + ఆది’ గా స్వీకరించారు. అదే యుగాదిగా, ఉగాదిగా మారింది. ఈ పండుగ కాల సంబంధమైనది, వైజ్ఞానికమైనది. విషువత్తు మూలాలు ప్రస్తుత కాలంలో చిత్త నక్షత్రంలో ఉండడం వల్ల, చిత్త నక్షత్రం పూర్ణిమ నాడు ఉండే చైత్ర మాసానికి సంబంధించిన మొదటిరోజు యుగాదిగా, ఉగాదిగా ఉండడం ఔచిత్యమే. ప్రకృతికి, కాలానికి సంబంధించిన గొప్ప ప్రారంభం ఇది. ఇంత వైజ్ఞానికమైన రోజును పండుగగా తెలుగువారు సంతోషంగా, సంతృప్తిగా జరుపుకుంటున్నారు.

బ్రహ్మపూజతో కూడుకున్న ఈ ఉగాదిని ఆనందంగా జరుపుకునేందుకు ధర్మశాస్త్రాలు కొన్ని విధులు సూచించాయి. అవి:

  1. ప్రతి గృహ ధ్వజారోహణం
  2. తైలాభ్యంగం
  3. నూతన వస్త్రాభరణ ధారణం, ఛత్ర చామరాది స్వీకారం
  4. దమనేన బ్రహ్మపూజనం
  5. సర్వాకచ్ఛాంతకర మహాశాంతి, పౌరుష ప్రతిపద వ్రతము
  6. నింబకుసుమ భక్షణం
  7. పంచాంగ పూజ, పంచాంగ శ్రవణం
  8. ప్రపాదాన ప్రారంభం
  9. దైవ దర్శనం / రాజ దర్శనం
  10. వాసంత నవరాత్రి ప్రారంభం

బ్రహ్మ ధ్వజాన్ని కాని, ఇంద్ర ధ్వజాన్ని కాని స్థాపించడం, మామిడి ఆకులతో ఇంటిని అలంకరించుకోవడం వంటి వానితో ఉగాది ప్రారంభమవుతుంది. శరీర శుద్ధి కోసం తైలాభ్యంగ స్నానం, మంగళస్నానాదులు నిర్ణయించబడినాయి. సంవత్సరం మొదటి రోజు (యుగాది, ఉగాది) నాడు నూతన వస్త్రాదులు, ఆభరణాదులు ధరించడం వల్ల ఆ రోజున పొందిన ఆనందం ఆ సంవత్సరమంతా ఉంటుందనే భావన లోకంలో ఉంది. అదే విధంగా పూజా కార్యక్రమంలో సంవత్సరాది నుండి పౌర్ణమి వరకు వేరు వేరు దేవతల పూజలు దమనంతో ఉంటాయి. దమనం చల్లదనాన్ని, సువాసనను అందిస్తుంది. దాని వల్ల గృహమంతా ఆనంద దాయకం అవుతుంది. పాడ్యమి నాడు కాలానికి అధిదైవమైన బ్రహ్మతో ప్రారంభమైన ఈ దమన పూజ పౌర్ణమినాడు శచీ, ఇంద్రులకు చేయాలని ధర్మశాస్త్ర నిర్దేశం. అదేవిధంగా సామూహికమైన సర్వాపచ్ఛాంతితో కూడిన మహాశాంతి ఈ రోజున నిర్వహించి లోక క్షేమాన్ని కోరుకోవాలి.

ఉగాది రోజున తెలుగువారు ప్రత్యేకంగా తయారు చేసేది ఉగాది పచ్చడి. దీనికే ‘నింబ కుసుమ భక్షణం’ అని పేరు. అంటే వేప పూవు పచ్చడి తినడం. ఉగాది నాడు ఆ సంవత్సరపు వేపపువ్వు, చక్కెర/బెల్లం, చింతపండు, నెయ్యి కలిపి మొదటి జామునందే తింటే ఆ సంవత్సరమంతా సౌఖ్యంగా గడుస్తుందని ధర్మశాస్త్ర సూచన.

యద్వర్షాదౌ నింబ కుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతం ।

భక్షితం పూర్వయామేస్యాత్తద్వర్షం సౌఖ్యదాయకమ్‌ ॥

ఉగాది నాడు పంచాంగ పూజ చేసి పంచాంగ శ్రవణం చేయడం ఆచారమై ఉంది. తిథి వార నక్షత్ర యోగ కరణాలు అనే ఐదు అంగాలు కలిగినది పంచాంగం. పురోహితుని ద్వారా పంచాంగాన్ని తెలుసుకోవడమంటే ఆ సంవత్సరాన్ని గూర్చి తెలుసుకొని ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడమే. సంవత్సర రాజు, మంత్రి మొదలైన నవనాయకులను తెలుసుకోవడం ద్వారా ఆ సంవత్సరం వర్షం, పంటలు, రస పదార్థాలు, పండే భూములు, రత్నాలు, మేఘవిధానం, పశు సంపద వృద్ధి, పాడి పంటలు మొదలైన వాని వివరాలు ముందుగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. వ్యక్తికి సంబంధించిన గోచారం, శుభాశుభాలు అన్నీ తెలుసుకోవచ్చు. గ్రహణాలు, మూఢాలు, పండుగల రోజుల విషయాలు కూడా పంచాంగ శ్రవణం వల్ల తెలుస్తాయి. ‘నానాకర్మ సుసాధనం…’ అని చెప్పబడిరది కూడా పంచాంగమే.

‘‘తిథేశ్చ శ్రియమాప్నోతి
వారాదాయుష్య వర్ధనం
నక్షత్రాత్‌ హరతేత్‌ పాపం
యోగాత్‌ రోగ నివారణం

కరణం కార్యసిద్ధించ పంచాంగ ఫలముత్తమమ్‌’’ అని చెప్పబడిరది. అటువంటి పంచాంగ పూజ, శ్రవణం ఉగాది నాడు చేయడం వల్ల ఆ సంవత్సరాన్ని ప్లాన్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఉగాది నాటి నుండి చలివేంద్రాలు ప్రారంభించి దాహార్తులకు చల్లని నీరు అందించే విధానమే ప్రపాదానం. పెద్దల ఆశీస్సులు ఈ రోజున తీసుకోవాలి. దైవదర్శనం చేసుకోవాలి. అవకాశం ఉన్నవారు రాజదర్శనం కూడా చేసుకోవచ్చు. ఆనంద ప్రదమైన, ఉపాసనా ప్రధానమైన ‘వసంత నవరాత్రులు’ ఈ రోజునుండే ప్రారంభం అవుతాయి. శ్రీరామ కళ్యాణ, పట్టాభిషేకాలతో ఈ నవరాత్రులు పూర్తి అవుతాయి. ఈవిధంగా ప్రకృతికి సంబంధించిన మొదటి పండుగ ఉగాది. బ్రహ్మ అంటే ప్రకృతి, కాలం. ఆ కాలానికి సంబంధించిన మొదటి రోజును ఆనందంగా, ప్రణాళికా బద్ధంగా, వైజ్ఞానికంగా గడపడం వల్ల మనసు సంతృప్తమౌతుంది. భవిష్యత్తును నిర్మించుకోవడానికి ధారమవుతుంది. ఒక సంవత్సర కాలాన్ని జాగ్రత్తగా గడపడానికి అవసరమైన భూమికను అందించే పండుగ ఉగాది. ఉగాది గూర్చి పరిపూర్ణంగా తెలుసుకుని పాటించడం ఈ కాలంలో అత్యవసరం. వైజ్ఞానికత లేని జనవరి 1ని మొదటి రోజు కన్నా ప్రకృతి సంబంధమైన, కాల సంబంధమైన ప్రత్యేకతలున్న ఉగాదిని ఆనందంగా నిర్వహించుకుందాం.