మహా కాళేశ్వర ప్రాజెక్ట్ మానవాద్భుత నిర్మాణం

వి. ప్రకాశ్‌
యాభై ఏళ్ళు విన్నాం… ‘నీళ్ళు దిగువన ఉన్నాయి-
తెలంగాణ ప్రాంతం ఎగువన ఉంది…
‘నీరు పల్ల మెరుగు’.. పైకి ఎలా వస్తాయి?’
‘తెలంగాణ వాళ్ళకు పాలించడం చేతకాదు.. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈ ప్రాంతమంతా ఎడారిగా మారిపోతుంది..’
‘తెలంగాణ రాష్ట్రం ఇస్తే.. అంధకార రాష్ట్రమవుతుంది.. కరెంటు ఉండదు..’
tsmagazine

ఇప్పుడీ మాటలన్నీ… అబద్ధాలని తేలిపోయినయి.. అనుమానాలన్నీ పటా పంచలైనయి.సముద్ర మట్టానికి వంద మీటర్ల దిగువన వున్న గోదావరి నీటిని రోజుకు రెండు టి.ఎం.సి.లు సుమారు ఆరువందల మీటర్ల ఎత్తుకు ఎత్తిపోతల ద్వారా తరలించి తెలంగాణలోని ఏ ప్రాంతానికైనా ప్రవాహ కాల్వల ద్వారా అందించడానికి ‘మహా కాళేశ్వర ప్రాజెక్టు’ రూపుదిద్దుకుంటున్నది.

నాలుగున్నర దశాబ్దాల క్రితం (1971) ఆరుద్ర రాసిన పాట ఒకటి మన చెవుల్లో మార్మోగింది.. ఇప్పటికీ కీ||శే|| ఘంటసాల వెంకటేశ్వరరావు గొంతుతో వింటుంటే గుండె లోతుల్లో ఎవరికైనా బాధ కలుగుతుంది.
‘సస్యశ్యామల దేశం.. అయినా నిత్యం క్షామం
ఉప్పొంగే నదుల జీవజలాలు.. ఉప్పు సముద్రం పాలు..
యువకుల శక్తికి భవితవ్యానికి… ఇక్కడ తిలోదకాలు
ఉన్నది మనకూ ఓటు.. బ్రతుకు తెరువకే లోటు…’

దేశంలోని నదీ జలాలు సగానికి పైగా నేటికీ ఉప్పు సముద్రాల పాలవుతున్నాయి. గోదావరి నుండి ప్రతి సంవత్సరం సుమారు వెయ్యినుండి 2వేల టి.ఎం.సి.ల నీరు సముద్రం పాలవుతున్నది. తెలంగాణ ప్రాంతంలో సుమారు 500 కి.మీ. ప్రవహించిన తర్వాత గోదావరి భద్రాచలం దిగువన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోకి మళ్ళుతున్నది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు దిగువన గోదావరిలో ఒక్క బ్యారేజీని కూడా సమైక్య రాష్ట్రంలో నిర్మించలేదు. కేంద్ర జల సంఘం అనుమతి ఇస్తామన్నా ఇచ్చంపల్లి ప్రాజెక్టును మొదలు పెట్టలేదు.

నిజాం తలపెట్టిన ప్రాజెక్టులు:
గోదావరిపై ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ అనేక ప్రాజెక్టు లను నిర్మించాలని సంక ల్పించినా అర్థాం తరంగా ఆయన పాలనకు భారత ప్రభుత్వం తెరదించడంతో ఆ ప్రాజెక్టుల నిర్మాణం జరుగలేదు. నిజాం పాలనలో నీటిపారుదల శాఖ చీఫ్‌ ఇంజినీరుగా, కార్య దర్శిగా, కన్సల్టెంట్‌ ఇంజినీర్‌ (పదవీ విరమణ తర్వాత)గా బాధ్యతలు నిర్వ హించిన ప్రఖ్యాత ఇంజినీర్‌ నవాబ్‌ అలీ నవాజ్‌ జంగ్‌ గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టును, దాని ఉప నదులైన మంజీరాపై దువేనూరు ప్రాజెక్టు, పెన్‌గంగపై లోయర్‌ పెన్‌గంగ ప్రాజెక్టు, ప్రాణహితపై ప్రాజెక్టు, కడెం, లోయర్‌ మానేరు ప్రాజెక్టులు, పెద్దేరు ఆనకట్ట, ఇచ్చంపల్లి ప్రాజెక్టు (రీ డిజైన్‌ 2000 టి.ఎం. సి.లతో) నిర్మాణాలకు ప్రాజెక్టు నివేదికలను రూపొందించారు. ఇవన్నీ నిర్మించి ఉంటే తెలంగాణ ప్రాంతంలో ఎత్తిపోతల (లిఫ్ట్‌) అవసరం లేకుండానే సుమారు 50 నుండి 60 లక్షల ఎకరాలకు సాగునీరంది ఉండేది. నిజాం పాలన ముగిసిన తర్వాత ముఖ్యమంత్రిగా భారత ప్రధాని నెహ్రూచే నియమించబడ్డ సివిల్‌ సర్వీసెస్‌ అధికారి వెల్లోడి 1951 జూలై 27, 28 తేదీల్లో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాసంఘం నిర్వహించిన కృష్ణా, గోదావరి నదుల పరీవాహక రాష్ట్రాల సమావేశంలో పైన తెలిపిన ప్రాజెక్టులన్నింటికీ నీటి కేటాయింపులు చేయించారు. దీనికి సాక్ష్యం ఆంధ్ర ప్రముఖ ఇంజినీర్‌, మాజీ కేంద్ర విద్యుత్‌, జలవనరుల శాఖామంత్రి కె.ఎల్‌. రావు. అప్పుడాయన ప్రణాళికా సంఘ సభ్యులు.

1952 మార్చి మొదటివారంలో తొలి ఎన్నికల ద్వారా బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పైన పేర్కొన్న ప్రాజెక్టుల నిర్మాణాలకోసం ప్రయత్నించారు. కొన్ని ప్రాజెక్టులను పంచవర్ష ప్రణాళికల్లో (మొదటి, రెండవ) చేర్పించారు.

సమైక్య రాష్ట్రంలో ప్రాజెక్టుల నిలిపివేత:
పూర్వ హైదరాబాద్‌ రాష్ట్రంలో తలపెట్టిన ప్రాజెక్టులేవీ రాష్ట్రాల పునర్విభజన చట్టం-1956 ప్రకారం నిలిపివేయకూడదు. కానీ ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి నవంబర్‌ ఒకటి, 1956న బాధ్యతలు చేపట్టగానే తెలంగాణ ప్రాంతంలో పూర్వ ప్రభుత్వాలు నిర్మించతలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులలో రెండు తప్ప అన్నింటినీ నిలిపివేశారు. చేపట్టిన రెండింటిలో ఒకటి కృష్ణానదిపై నాగార్జునసాగర్‌ కాగా రెండవది పోచంపాడు ప్రాజెక్టు. ప్రతి పాదిత గోదావరి బహుళార్థసాధక ప్రాజెక్టులో అంతర్భాగమైన కుష్టాపురం ప్రాజెక్టుకు బదులు దాని నిర్మాణ స్థలానికి కొంచెం దిగువన చిన్న సైజు పోచంపాడు ప్రాజెక్టు (ప్రస్తుత శ్రీరాం సాగర్‌) నిర్మించారు. తెలంగాణలోని 6 జిల్లాల్లో ప్రతిపాదిత గోదావరి బహుళార్ధసాధక ప్రాజెక్టు ద్వారా 28 లక్షల ఎకరాలకు సాగునీరం దించాల్సి ఉండగా నీలం సంజీవరెడ్డి ప్రారంభించిన పోచంపాడును కేవలం 3 లక్షల 60వేల ఎకరాలకు (కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో) సాగునీరిచ్చే విధంగా నిర్మించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేతలు 1969లో ఈ ప్రాజెక్టుకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడంతో తర్వాత అధికారంలోకి వచ్చిన జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వాలు శ్రీరాంసాగర్‌గా పేరు మార్చి పోచంపాడు ఆయకట్టును మొదటి,, రెండవ దశల్లో సుమారు 14 లక్షల ఆయకట్టుకు పెంచారు. ఈ పెరిగిన ఆయకట్టు గతంలో నిజాం ప్రతిపాదించిన గోదావరి ప్రాజెక్టులో అంతర్భాగమే. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినా ఏనాడూ నాలుగైదు లక్షల ఎకరాలకు మించి సాగునీరందలేదు.

మహారాష్ట్ర ప్రభుత్వం ఎగువన నిర్మించిన పలు ప్రాజెక్టులవల్ల రాబోయే కాలంలో శ్రీరాంసాగర్‌ ద్వారా ఎకరం భూమికి కూడా నీరందే అవకాశమే లేదు. నిర్మాణం పూర్తి కావచ్చిన శ్రీరాంసాగర్‌ వరద కాల్వ క్రింద మరో 2 లక్షల ఎకరాలకు కూడా నీరందే అవకాశం లేదు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీరందించి పునరుజ్జీవింపజేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటే దిక్కు.

దీనితోబాటు సింగూర్‌, ఘణ్‌పూర్‌ ఆనకట్ట, నిజాంసాగర్‌, గుత్ప, అలీసాగర్‌, అప్పర్‌ మానేరు, కడెం, సదర్‌మాట్‌ తదితర ప్రాజెక్టుల స్థిరీకరణకు కూడా కాళేశ్వరమే దిక్కు. సుమారు 18 లక్షల ఎకరాల పూర్వ ఆయకట్టు స్థిరీకరణతో బాటు మరో 18 లక్షల క్రొత్త ఆయకట్టుకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరందించాలని ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. సంకల్పించారు.

ప్రాణహిత-చేవెళ్ళ రీ-డిజైనింగ్‌ నేపథ్యం
ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ డిజైన్‌ చేసిన ప్రాణహిత ప్రాజెక్టు పథకంలో కొన్ని మార్పులు చేసి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి ‘డా|| బి.ఆర్‌. అంబేద్కర్‌ ప్రాణహిత-చేవెళ్ళ సుజల స్రవంతి’ నిర్మాణాన్ని 2008లో చేపట్టారు. ప్రాణహిత నది ప్రారంభంలో లభ్యమయ్యే 160 టి.యం.సి.ల నీటిని తెలంగాణ 7 జిల్లాల్లోని 16 లక్షల 40వేల ఎకరాల ఆయ కట్టుకు అందించాలని పెన్‌గంగ, వార్థా ఉపనదుల సంగమ స్థలమైన తుమ్మిడి హట్టివద్ద (కౌటాల మం||, ఆదిలాబాద్‌ జిల్లా) బ్యారేజీని 152 మీ. ఎత్తున ప్రతిపాదించింది. వైఎస్‌ ప్రభుత్వం ఈ నీటిలో కూడా 30 టి.ఎం.సి.లు జంటనగరాల త్రాగునీటికి, 10 టి.ఎం.సి.లు దారి పొడవునా గ్రామాలకు త్రాగునీటికి, 16 టి.ఎం.సి.లు పారిశ్రామిక అవసరాలకోసం ప్రతిపాదించారు.

తుమ్మిడిహట్టి నుండి ప్రవాహ కాల్వద్వారా వచ్చే నీటిని 30 మీ. ఎత్తుకు లిఫ్ట్‌ చేసి శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌లోకి మళ్ళించాలని ప్రతిపాదించారు. అక్కడినుండి నీటిని ఎత్తిపోతలు-గ్రావిటీద్వారా రంగారెడ్డి జిల్లా తాండూరు దాకా మొత్తం 7 జిల్లాల్లోని 16.40 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశాలను వ్యాప్కోస్‌ సంస్థ పరిశీలించి జూలై 2008లో రూ. 38,500 కోట్లతో సవరించిన నివేదికను వై.ఎస్‌. ప్రభుత్వానికి అందించింది. 17.12. 2008న జీవో 238 ద్వారా ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతినిచ్చింది. ఈ ప్రాజెక్టులోని మొత్తం 28 ప్యాకేజీలకు సెప్టెంబర్‌ 2007 నుండి మే 2009 లోపే టెండర్లు జారీచేసి కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కూడా చేసుకున్నది ప్రభుత్వం. వివిధ ప్యాకేజీల్లో 2009లోనే పనులు ప్రారంభమైనవి.

మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లో ప్రాణ హితపై ప్రాజెక్టు నిర్మాణానికి 1975లో అప్పటి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎస్‌.బి. చవాన్‌, జలగం వెంగళరావు బచావత్‌ ట్రిబ్యునల్‌ కోసం ఒప్పందం చేసుకున్నారు. కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్‌ చౌహాన్‌ 15.10.2013 న అప్పటి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాస్తూ తమ అనుమతి లేకుండానే ఏకపక్షంగా 152 మీ. ఎత్తున తుమ్మిడిహట్టి బ్యారేజీని ప్రతిపాదించి కాల్వల త్రవ్వకం చేపట్టడంపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుపై చేసే ఖర్చంతా వృధా అవుతుందని కూడా హెచ్చరించారు. అయినా అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మాణ పనులు ఆపలేదు. 26.10.2015న రెండు రాష్ట్రాల చీఫ్‌ ఇంజినీర్ల స్థాయి సమావేశం హైదరాబాద్‌లో జరిగినప్పుడు మహారాష్ట్ర అధికారులు 148 మీ. కంటె ఒక్క సెం.మీ.ను కూడా అనుమతించబోమని స్పష్టం చేశారు. అంతకుముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రి, భారీ నీటిపారుదల శాఖామంత్రి జరిపిన చర్చల్లో కూడా 148 మీ. ఎత్తుకుమించి అనుమతించేది లేదని వారు స్పష్టం చేశారు.

మరోప్రక్క కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) లోని హైడ్రాలజీ డైరెక్టరేట్‌ ప్రాణహిత-చేవెళ్ళ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (అప్పటి ఏపీ ప్రభుత్వం రూపొందించిన)ను పరిశీలించి తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై తమ అభ్యంతరాలను పేర్కొంటూ 4.3.2015న తెలంగాణ ప్రభుత్వా నికి లేఖరాసింది. అప్పటి ఏపీ ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి పంపిన నివేదికలో తుమ్మిడిహట్టి వద్ద ‘పైన నిర్మించిన ప్రాజెక్టుల అవసరాలూ పోనూ లభ్యమయ్యే నీరు 273.14 టి.ఎం.సి.లు’ పేర్కొన్నది. కానీ వారి పరిశీల నలో అది 165 టి.ఎం.సి.లుగా మాత్రమే తేలింది. పై రాష్ట్రాలు ఆమోదించిన ప్రాజెక్టులు నిర్మిస్తే దీనిలోనుంచి 63 టి.ఎం.సి.లు ఆయా రాష్ట్రాలకు పోగా తెలంగాణ వినియోగించుకో గలిగేది కేవలం 102 టి.ఎం.సి.లు మాత్రమే. ఇందులో హైదరాబాద్‌, దారిలో గ్రామాలు, పారిశ్రామిక అవసరాలకు ప్రతిపాదించిన 56 టి.ఎం.సి.లు పోగా ఇక సాగుకు మిగిలే నీరు కేవలం 46 టి.ఎం.సి.లు మాత్రమే. ఈ నీరు 16.40 లక్షల ఎకరాలకు సరిపోతుందా? ఇరు రాష్ట్రాలలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వాలే ఉన్నా బ్యారేజీ ఎత్తుపై (+152 మీ.) అవగాహనకు రానప్పుడు అదే వాదన కొనసాగిస్తూ జాప్యం చేయడం సమంజసమా?

ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు నివేదికలో పేర్కొన్న మొత్తం రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం కేవలం 16 టి.యం.సి.లు మాత్రమే. 160 టి.ఎం.సిల నీటిని ఎక్కడ నిల్వ చేస్తారని సీడబ్ల్యూసీ ప్రశ్నించింది.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిణామాలు
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ ప్రాజెక్టు విషయమై ఒక అంగీకారానికి రావడానికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులు సమన్వయ కమిటీగా ఏర్పడి పలు దఫాలు చర్చలు జరిపినారు. ఉమ్మడి సర్వేలు నిర్వహించారు. తెలంగాణ భారీ నీటిపారుదల శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పలుమార్లు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. 17.2.2015న తెలంగాణ- మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశం ముంబై రాజ్‌భవన్‌లో జరిగింది. ఎంత ప్రయత్నించినా మహారాష్ట్ర +152 మీ. ఎత్తులో బ్యారేజీ నిర్మాణాన్ని అనుమతించేది లేదని తేల్చింది. కాలయాపనవల్ల ప్రాజెక్టు వ్యయం భారీగా పెరుగుతున్నందున, సీడబ్ల్యూసీ అభ్యంతరాలు, నీటి లభ్యత, తెలంగాణ సాగునీటి అవసరాలు పెరగడం తదితర కారణాలవల్ల తెలంగాణ ప్రభుత్వం +148 మీ. ఎత్తుకు తగ్గించుకోవ డానికి సుముఖత వ్యక్తం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఇచ్చిపుచ్చుకునే వైఖరే మంచిదని కె.సి.ఆర్‌. భావించారు. పర్యవసానంగానే 102 టి.ఎం.సి.ల స్థానంలో సుమారు 180 టి.ఎం.సి.లు వినియోగించుకునే మహాకాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవకాశం ఏర్పడింది.
tsmagazine
కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాలు
రీ-డిజైన్‌ చేసిన తర్వాత పూర్వపు ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు మారింది. 28 ప్యాకేజీల్లో కూడా పలు మార్పులు చేసింది ప్రభుత్వం. తుమ్మిడిహట్టివద్ద +148 మీ. ఎత్తులో నిర్మించే బ్యారేజీని ఆదిలాబాద్‌ జిల్లా (పూర్వపు) లోని 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలని నిర్ణయించారు. ప్రస్తుత జయశంకర్‌- భూపాల పల్లి జిల్లాలోని పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం వద్ద ప్రాణహిత-గోదావరి సంగమ స్థలానికి దిగువన మేడిగడ్డ వద్ద ప్రధాన నదిపై +100 మీ. ఎత్తులో మొదటి బ్యారేజీ (16.17 టి.ఎం.సి.), నది ఎగువన అన్నారం గ్రామంవద్ద +119 మీ ఎత్తులో రెండో బ్యారేజీ (10.87 టి.ఎం.సి.లు), కొంచెం ఎగువన పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ళ వద్ద +130 మీ. ఎత్తులో మూడో బ్యారేజీ (8.83 టి.ఎం.సి.లు) నిర్మించి మేడిగడ్డ వద్ద గోదావరిలో లభ్యమయ్యే సుమారు 282 టి.ఎం.సి.ల నీటి నుండి 180 టి.ఎం.సి.లను 3 దశల్లో లిఫ్ట్‌ చేసి ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు మళ్ళిస్తారు. అక్కడి నుండి టన్నెల్‌ ద్వారా 3 దశల్లో (6, 7, 8వ ప్యాకేజీలు) మిడ్‌మానేరుకు, అక్కడి నుండి 9వ ప్యాకేజీద్వారా అప్పర్‌ మానేరు రిజర్వాయర్‌కు 10, 11, 12, 13, 14వ ప్యాకేజీలద్వారా కొండపోచమ్మ రిజర్వాయర్‌కు, 17, 18, 19, 23, 24, 25, 26 ప్యాకేజీలద్వారా శ్రీకొమురవెల్లి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌నుండి సింగూరు రిజర్వాయర్‌కు శ్రీరాంసాగర్‌ రిజర్వాయర్‌ శిఖంనుండి కొండెం చెరువు దాకా (20, 22, 22 ప్యాకేజీల ద్వారా) నిజాంసాగర్‌ కాల్వలకు నీరందించడానికి పనులు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. 27, 28వ ప్యాకేజీల ద్వారా నిర్మల్‌, ముథోల్‌ నియోజకవర్గాల పరిధిలోని ఆయకట్టుకు కూడా నీరందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1వ ప్యాకేజీనుండి 4వ ప్యాకేజీ వరకు తుమ్మిడిహట్టి వద్ద నిర్మించే బ్యారేజీ ద్వారా పూర్వపు ఆదిలాబాద్‌ జిల్లాలోని 2లక్షల ఎకరాలకు సాగు నీరందుతుంది. చిట్యాల వరకు 2,43,500 ఎకరాలకు సాగునీరందిస్తారు.

పైప్యాకేజీల ద్వారా పాత ప్రాజెక్టులో 16.40 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాలని భావించగా ప్రస్తుత రీ-డిజైనింగ్‌ తర్వాత 18,25,700 ఎకరాల కొత్త ఆయకుట్టుకు నీరందించాలని ప్యాకేజీల్లో మార్పులు చేశారు.

గతంలో తిప్పారం రిజర్వాయర్‌నుండి 17, 18, 19, 23, 24, 25, 26 ప్యాకేజీల ద్వారా రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ రిజర్వాయర్‌కు నీటిని అందించాలనుకున్నారు. ప్రస్తుతం ఈ ప్యాకేజీల ద్వారా మల్లన్నసాగర్‌ నుండి సింగూరుకు నీటిని మళ్ళిస్తారు.

పలు ప్రాజెక్టుల క్రింది ఆయకట్టు స్థిరీకరణ
గతంలో నిర్మించిన పలు ప్రాజెక్టుల క్రింది లక్షలాది ఎకరాల ఆయకట్టుకు కొన్నేళ్ళుగా సాగునీరందడంలేదు. ఎగువనున్న రాష్ట్రాలు పలు ప్రాజెక్టులు కొత్తగా నిర్మించుకోవడమే దీనికి కారణం.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా స్థిరీకరించే ప్రాజెక్టులు
1. శ్రీరాంసాగర్‌ మొదటి దశ 3,92,008 హెక్టార్లు
2. శ్రీరాంసాగర్‌ రెండవ దశ 1,78,061 హెక్టార్లు
3. శ్రీరాంసాగర్‌ వరద కాల్వ 80,937 హెక్టార్లు
4. నిజాంసాగర్‌ ప్రాజెక్టు 94,830 హెక్టార్లు
5. సింగూరు ప్రాజెక్టు 16,187 హెక్టార్లు
పై ప్రాజెక్టుల ఆయకట్టు మొత్తం 18,82,970 ఎకరాలు.

పెరిగిన నీటి నిల్వ సామర్థ్యం
ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టులో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం కేవలం 16 టి.ఎం.సి.లు కాగా ప్రస్తుత కాళేశ్వరం ప్రాజెక్టులో 141 టి.ఎం.సి.ల నీటిని నిల్వ చేయడానికి 19 రిజర్వాయర్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. వీటిలో పెద్దది మల్లన్నసాగర్‌ (50 టి.ఎం.సి.లు). గోదావరిపై నిర్మించే 3 బ్యారేజీల నీటి నిల్వ సామర్థ్యం 35.87 టి.ఎం.సి.లు, కొండ పోచమ్మ 15 టి.ఎం.సి.లు, బస్వాపురం 11.39 టి.ఎం.సి.లు, గంథమల్ల 9.86 టి.ఎం.సి.లు, మిగిలినవన్నీ 3.50 టి.ఎం.సి.లనుండి 0.50 టి.ఎం.సి.లలోపే ఉన్నాయి.

80,500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు 462.24 మె.వా. విద్యుత్తు అవసరమవుతున్నది. ప్రతిరోజూ గోదావరినుండి 2 టి.ఎం.సి.ల నీటిని ఎత్తిపోయడానికి నీటిపారుదల వ్యవస్థలో భారీ లిఫ్టులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రవాహ కాల్వల పొడవు సుమారు 610 కి.మీ., నీటి సరఫరా వ్యవస్థ పొడవు 924 కి.మీ., సొరంగ ప్రవాహాలు 155 కి.మీ., లిఫ్ట్‌ ద్వారా. లిఫ్ట్‌లు 22 కాగా, గతంలో నిర్మించిన 5 రిజర్వాయర్లను బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లుగా కాళేశ్వరం ప్రాజెక్టులో వినియోగిస్తున్నారు. ఇవికాక మరో 19 రిజర్వాయర్లు (పైన పేర్కొన్నవి) కొత్తగా నిర్మిస్తున్నారు.
tsmagazine

ఆరవ ప్యాకేజీ పనులు
శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌ నుండి (రామగుండం మండలంలోని వేమునూరు గ్రామంవద్ద) మేడారం రిజర్వాయర్‌ (ధర్మారం మండలంలోని నందిమేడారం గ్రామం వద్ద) వరకు 9.5. కి.మీ. పొడవు, 10 మీ. డయాతో రెండు టన్నెళ్ళు (సొరంగాలు) నిర్మిస్తున్నారు. 12.11.2008న నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీకి రూ. 3859.71 కోట్ల విలువైన ఈ ప్యాకేజీ పనులను అప్పగించింది. అప్పటి వై.ఎస్‌. ప్రభుత్వం. రీ-డిజైనింగ్‌ తర్వాత, పదేళ్ళలో పెరిగిన ధరలను అంచనావేసి ఈ ప్యాకేజీని రూ. 4961.31 కోట్లుగా 28.10.2016న నిర్ధారించారు. రికార్డు టైంలో నవయుగ ఈ పనులను పూర్తి చేస్తున్నది. వచ్చే నెలాఖరుకు (సెప్టెంబర్‌ 18) ఈ వ్యవస్థ ద్వారా నీటి సరఫరా జరుపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో కేవలం 488 ఎకరాల భూసేకరణ మాత్రమే అవసరమైంది. నీటిని పంపింగ్‌ చేయడానికి 124.4 మె.వా. సామర్థ్యంగల 7 పంపులను భూగర్భంలో సుమారు 100 మీ. దిగువన ఏర్పాటు చేశారు. వీటిద్వారా 105.45 మీ. ప్యాకేజీ 8లోని సర్జ్‌పూల్‌కు లిఫ్ట్‌ చేస్తారు. ఏడవ ప్యాకేజీ పనుల విలువ 2008లో రూ. 2118.59 కోట్లు కాగా రీ-డిజైనింగ్‌, పెరిగిన ధరలను పరిగణనలోకి తీసుకుని మరో రూ. 1353.31 కోట్లకు పెంచింది ప్రభుత్వం. నందిమేడారం రిజర్వాయర్‌ సామర్థ్యం పెంపు కోసం రూ. 77 కోట్లు ఈ ప్యాకేజీలోనే చేర్చారు.

8వ ప్యాకేజీ
7, 8వ ప్యాకేజీ పనులను మెగా ఇంజినీరింగ్‌ మరికొన్ని సంస్థలతో కలిసి కాంట్రాక్ట్‌ పొందింది. రూ. 3271.09 కోట్లుగా 2008 నవంబర్‌లో ప్యాకేజీ పనుల విలువను నిర్ధారించగా, పెరిగిన అంచనాల ప్రకారం, రీ డిజైనింగ్‌ వలన రూ. 4900.39 కోట్లుగా నిర్ణయించారు. 6, 7వ ప్యాకేజీ జంట టన్నెళ్లనుండి వచ్చే సుమారు 2 టి.ఎం.సి.ల నీరు (ప్రతిరోజూ) 8వ ప్యాకేజీలో నిర్మిస్తున్న జంట టన్నెళ్ల ద్వారా శ్రీరాంసాగర్‌ వరద కాల్వలోకి మళ్ళించి కాల్వ దిగువన గల మిడ్‌మానేరు రిజర్వాయర్‌లో నింపుతారు. 8వ ప్యాకేజీ చొప్పదండి మండలంలోని రాగంపేట గ్రామంవద్ద ప్రారంభమై జంట టన్నెళ్ళ ద్వారా 4.13 కి.మీ. దూరంలోని వరద కాల్వవద్ద ముగుస్తుంది. ఈ ప్యాకేజీలో భూగర్భంలో భారీ సర్జ్‌పూల్‌ నిర్మిస్తున్నారు. అవసరమైన భూమి కేవలం 623 ఎకరాలు ఇప్పటికే సేకరించారు. ఈ ప్యాకేజీలో దేశంలోనే అతి పెద్ద పంపులను 139 మె.వా. సామర్థ్యంగలవి 7 ఏర్పాటు చేసి వీటిద్వారా 115.4 మీ. ఎత్తులోగల వరద కాల్వలోకి లిఫ్ట్‌ చేస్తారు.

కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచంలోనే ఒక ఇంజినీరింగ్‌ అద్భుతంగా నిలుపుతూ నిపుణులచే ప్రశంసలందుకుంటున్న పనులు ఈ 6, 8 ప్యాకేజీలోనే వున్నాయి. ప్రతిరోజూ వందలాదిగా ప్రజలు ఈ ప్యాకేజీలోని టన్నెళ్ళను, సర్జ్‌పూల్‌ లను, భూగర్భ సబ్‌ స్టేషన్‌లను సందర్శిస్తున్నారు.
tsmagazine

ముగింపు వ్యాఖ్య
సమైక్య రాష్ట్రంలో జరిగిన విధ్వంసం నుండి తేరుకోవడానికి బంగారు తెలంగాణ స్వప్నంలో భాగంగా పునర్నిర్మాణం ఏ విధంగా ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. చేస్తున్నారో అర్థం చేసుకోవడానికి ఈ మహాకాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణమే ఒక మంచి ఉదాహరణ. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పాత్ర ఎంతో గొప్పది. కృష్ణార్జునులు మహాభారత యుద్ధాన్ని ఎలా గెలిచారో అలాంటి సమన్వయమే ఉద్యమ స్ఫూర్తితో పనిచేసే కె.సి.ఆర్‌. హరీశ్‌ మధ్యన వున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని వందల ఏళ్ళ తర్వాత భావితరాలు గుర్తుంచు కోకపోవచ్చు. కానీ మహాకాళేశ్వర మానవాద్భుత నిర్మాణాలను వేల తరాలు పునర్నిర్మించు కుంటూనే ఈ నేతల, నేటి ఇంజినీర్ల కృషిని సదా స్మరించుకుంటాయి.

కాళేశ్వరం ప్రాజెక్టులోని మానవాద్భుత నైపుణ్యాలు

 • ఆసియా ఖండంలోనే అతి పెద్ద టన్నెల్‌ 81 కి.మీ. (ఎల్లంపల్లి రిజర్వాయర్‌నుండి మల్లన్నసాగర్‌ వరకు)
 • ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్‌ పంప్‌ 139 మె.వా. సామర్థ్యం గలవి 8వ ప్యాకేజీలో వినియోగిస్తున్నారు.
 • సముద్ర మట్టానికి 100 మీ. ఎత్తునుండి 600 మీ. ఎత్తుకుపైగా సుమారు 2 టి.ఎం.సి.ల నీటిని ప్రతిరోజూ లిఫ్ట్‌ చేయడం. 10 మీ. డయాతో సొరంగాల నిర్మాణం.
 • ఒక్క ప్రాజెక్టులో 4957 మె.వా. విద్యుత్‌ వినియోగం
 • ఒకే ప్రాజెక్టు ద్వారా సుమారు 38 లక్షల ఎకరాలకు సాగునీరందించడం. కొత్త ఆయకట్టు 13 కొత్త జిల్లాల్లో వుండగా స్థిరీకరణ చేసే ఆయకట్టు 20 జిల్లాల్లో వున్నది.
 • అత్యంత తక్కువ సమయంలో 3 షిఫ్టులలో వేలాదిమందికిపైగా కార్మికులు,కూలీల  వినియోగించి ప్రాజెక్టు నిర్మించడం
 • భూగర్భంలో 400 కె.వి. సబ్‌స్టేషన్‌ ఏర్పాటు
 • 6, 8వ ప్యాకేజీల్లో భూగర్భంలో భారీ సర్జ్‌పూల్‌ల నిర్మాణం
 • ఒకే ప్రాజెక్టులో ఏక కాలంలో 3వేలమందికి పైగా ఇంజినీర్లు, టెక్నీషియన్లు పనిచేయడం
 • ఒక్క ప్రాజెక్టుపై 80,500 కోట్ల రూపాయల వ్యయం
 • 86 కేసులను ప్రతిపక్షాలు వివిధ కోర్టుల్లో వేసి ప్రాజెక్టును ఆపడానికి ప్రయత్నించినా అన్ని అడ్డంకులను అధిగమించి అన్ని అనుమతులను రికార్డు సమయంలో సాధించడం
 • ముఖ్యమంత్రి, భారీ నీటిపారుదలశాఖామంత్రి అహర్నిశలూఈ ప్రాజెక్టుపై చూపుతున్న శ్రద్ధ
 • అంకితభావంతో రాత్రింబవళ్ళు పనిచేస్తున్న ఉన్నతాధికారులు, చీఫ్‌ ఇంజినీర్లు
 • రివర్స్‌ పంపింగ్‌తో కాళేశ్వరంనుండి ఎల్లంపల్లి దాకా ఎండిన గోదావరి నదిని జీవనదిగా మార్చడం
 • కాళేశ్వరం ప్రాజెక్టులోని 6,8వ ప్యాకేజీలు నిపుణులను, ప్రజలను ఎంతగానో ఆశ్చర్యపరుస్తున్నాయి.