|

కందనూల్‌ కేసరి సముద్రం

33 అడుగుల ఏకశిలా బుద్ధుడు

  • వనపట్ల సుబ్బయ్య
ఒక ఆలోచన 
నూరు కాలాలకు వెలుగు
ఒక అడుగు
జన్మజన్మలకు సందేశం
ఒక ఆశయం
యుగ యుగాలకు ధర్మచక్రం
కేసరిసముద్రం కాళ్లపై
స్వర్ణ పర్వత శిఖరంలా 
ముప్పైమూడడుగుల ఏకశిలా బుద్ధుడు
లేలేత కాంతి
సకల సౌందర్యాల  సుగుణ రాశి
అనంత తేజోవంతం
నిండుచెరువులో 
తెల్లని కలువలా తథాగతుడు
ఆజానుబాహువులు
ఎత్తైన వక్షస్థలం 
ఎడమచేతితో దేహాన్ని కప్పిన ఏకవస్త్రం
అమ్మ కడుపులోంచి దుసిపడ్డ  కాయంపై
బంగారువన్నె చాయల మెరుపులు
నిండు ప్రేమాస్పదుడు, శాంతిదూత
మార్గదాత  మొహంలో 
అఖండ చంద్ర ప్రసన్నత
మయూరాలు పొదిగిన రింగురింగుల మువ్వలజుట్టు
వృషభమూపురాల భుజాలు
కమలనేత్రాలతో
కందనూలుకు కాంతినిస్తున్న కరుణామయుడు 
మౌనమునిలా 
నల్లరేగడి మట్టిలో అడుగు పెట్టగానే
మంద్రస్వరం ఉవ్వెత్తున మోగింది
బుద్దం శరణం గచ్చామి, 
సంఘం శరణం గచ్చామి, 
ధర్మం శరణం గచ్ఛామి

మిషన్‌ కాకతీయలో బాగంగా నియోజకవర్గంలోని చెరువులను మినీ  ట్యాంక్‌ బండ్‌గా పునరుద్దరిస్తున్నారు. ఆ సందర్భంగా నాగర్‌ కర్నూల్‌ చెరువు కేసరి సముద్రాన్ని మినీ ట్యాంక్‌ బండ్‌గా సుందర పర్యాటకంగా తీర్చి దిద్దుతున్నారు.

హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ వద్ద 53 అడుగుల ఏకశిలాబుద్ద విగ్రహం తరహాలో నాగర్‌ కర్నూలు జిల్లా కేంద్రం కేసరిసముద్రంలో 33 అడుగుల ఏకశిలా బుద్దుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. యంజెఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ మహాసంకల్పానికి శ్రీకారం చుట్టారు. మహాబూబ్‌ నగర్‌ జిల్లా ధర్మాపూర్‌ గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర శిల్పకళా ఇండస్ట్రీస్‌ లో పదిమంది శిల్పులు ఆరునెలలు శ్రమించి శిల్పాన్ని చెక్కారు. 

ప్రధాన స్థపతి జరిపెటి వడ్డె హనుమంతు చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఈ విగ్రహం జూన్‌ 14.2018 నాడు అత్యంత వైభవంగా మంగళవాయిద్యాలు,  బ్యాండ్‌ మేళాల వాయిద్య చప్పుళ్ల మధ్య దారిపొడవునా మంగళారతులతో పూలుచల్లుతూ పట్టణ పురవీధుల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి అత్యంత వైభవంగా ప్రతిష్ఠింప చేశారు నాగర్‌ కర్నూల్‌ యంయల్‌ఎ మర్రి జనార్ధన్‌ రెడ్డి 65 లక్షల సొంతఖర్చులతో విగ్రహాన్ని తయారు చేయించారు. నాగర్‌ కర్నూల్‌ (కందనూలును)ను ప్రపంచ పటంలో నిలిపిన యంయల్‌ఎ మర్రి జనార్ధన్‌ రెడ్డి అభినందనీయులు.

గౌతమ బుద్దుడి విగ్రహాన్ని నిలబెట్టడమంటే  ధర్మాన్ని, సత్యాన్ని,మానవత్వాన్ని,కరుణను నిలబెట్టడమే. అజ్ఞానం నుండి జ్ఞానంలోనికి, చీకటినుండి వెలుగులోనికి ప్రయాణించటమే.

ఈర్ష్య, ద్వేషం, అసూయ, క్రోధం, విలాస, మోహాల అవలక్షణాలన్నింటిపై తనకుతానే యుద్ధం ప్రకటించుకొని మానవవ్రతుడిగా నడవటమే. బుద్ధభగవానుడు బోధించిన బౌద్ధధర్మమే మనందరి సర్వధర్మమై నిలిస్తే ఎంత అనందం. మానవులపట్ల అపారమైన ప్రేమ,కరుణలు కలిగి జీవకోటి పైన అనంతమైన దయకలిగిన అత్యంత ప్రేమాస్పదుడు బుద్ధుడు. 

తెలుగునేలన బుద్ధుని అడుగుజాడలపై మట్టి దిబ్బలు విరివిగా కప్పబడినవేమో, మేఘాల గర్జనకు మట్టిదిబ్బలు ఒక్కొక్కటిగా కరిగిపోతున్నాయి. ఆ పరంపరలోనే నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని (కందనూల్‌) కేసరి సముద్రంలో ముప్పైమూడడుగుల ఏకశిలాబుద్దుడై నిలిచాడు. నిండునీళ్లలో ప్రకాశిస్తున్న బుద్దునికెదురుగా లుంబినివనంలా విశాలమైన చెరువుకట్ట బుద్ధునికి ఎదురుగా బార్సావుల దర్గా, మతసామరస్యానికి ప్రతీక. జ్ఞానామృతాన్ని పంచి ధర్మాన్ని ప్రబోదించిన చారిత్రక పురుషుడు బోధిసత్వుడు.బుద్ధుడు. ఆ బుద్ధభగవానుని ఏకశిలా విగ్రహం నెలకొల్పిన కాలంలో నేను ఉండటం ,స్వయంగా ఆ దృశ్యాన్ని నా కండ్లారా చూడటం నాకెంతో ఆనందాన్నిచ్చింది. బుద్ధగయలో ప్రత్యక్షంగా బుద్ధుని చూసిన ఆనందం కలిగింది.

చెరువుకట్ట చుట్టంతా వెలుగు కిరణాలు పూస్తున్నాయి పిల్లలంత కేరింతలు

అమావాస్య అందానికి మెరిసే నగలే నక్షత్రాలు

నూతన ఉదయానికి శ్రీకారంచుట్టి

ఈ మహాద్బాగ్యాన్ని కల్పించిన యంయల్‌ఎ మర్రి జనార్ధన్‌ రెడ్డి, యంజేఅర్‌ ట్రస్ట్‌ డైరెక్టర్‌ జక్కారఘునందన్‌ రెడ్డి హృదయ పూర్వక ధన్యవాదాలు.