జిల్లా, ఏరియా ఆసుపత్రులకు కాయకల్ప అవార్డులు

-By మామిండ్ల దశరథం

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణ, రోగులకు అందుతున్న సేవలకు అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం కాయకల్ప అవార్డుకు ఎంపిక చేసింది. దీంతో ప్రభుత్వ అవార్డ్‌ తో పాటు రూ.10 లక్షలు ఆసుపత్రికి అందించనుంది.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర ఆసుపత్రికి కాయకల్ప అవార్డ్‌ రావడం వరుసగా ఇది మూడో సారి కావడం విశేషం. 2020లో కాయకల్ప అవార్డ్‌ లో మొదటి స్థానం రాగా, 2021లో ద్వితియ స్థానం వచ్చింది. జిల్లా ఆసుపత్రి కేటగిరీలో రాజన్న సిరిసిల్ల తాజాగా రెండో స్థానం చేజిక్కించుకుంది. కాగా ఏరియా ఆసుపత్రి కేటగిరీలో వేములవాడ ఏరియా ఆసుపత్రికి తెలంగాణ రాష్ట్రంలో కాయకల్ప అవార్డ్‌ లలో మొదటి స్థానం లభించింది.

వేములవాడ ఏరియా ఆసుపత్రికి కాయకల్ప అవార్డు…

వేములవాడ ఏరియా ఆసుపత్రి కాయకల్ప అవార్డుకు ఎంపికై, రాష్ట్రంలోనే మొదటి ఆసుపత్రిగా నిలిచింది. వేములవాడ ప్రాంత ప్రజలకు గత ఏడాదిగా సేవలందిస్తున్న తరుణంలో రాష్ట్రంలోనే ప్రతిష్ఠాత్మకమైన కాయకల్ప అవార్డును ఏడాదిలోపే దక్కించుకోవడం విశేషం. రాష్ట్రంలో దాదాపుగా100 ఏరియా ఆసుపత్రులు ఉండగా మూడు అంచల విధానంలో ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. ప్రధానంగా ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలు, పరిశుభ్రత, పరిసరాల నిర్వహణ, సిబ్బంది పనితీరు, వ్యర్ధాల సేకరణ, విద్యుత్‌ వినియోగం, పచ్చదనానికి ప్రాధాన్యత ఇలా దాదాపుగా 10 విభాగాల్లో పరిశీలన చేసి మార్కులు ఇస్తారు. వంద మార్కులకు గాను వేములవాడ ఏరియా ఆసుపత్రి 89.14 మార్కులు సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో నిలిచిన ఏరియా ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వం 7.50 లక్షల నగదు బహుమతిని అందజేస్తుంది. 

ఈ నగదు బహుమతి ఆస్పత్రి అభివృద్ధి నిమిత్తం వాడుకోవాల్సి ఉంటుంది. వేములవాడ ఏరియా ఆసుపత్రికి కాయకల్ప అవార్డు రావడం సంతోషంగా ఉంది. మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు, ఎమ్మెల్యే రమేష్‌ బాబు, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతిల  ప్రోత్సాహంతోనే ఈ అవార్డును అందుకోగలిగాము. సిబ్బంది అందించిన సహకారం కూడా వెన్నంటి ఉంది.  అవార్డుతో మాపై మరింత బాధ్యత పెరిగిందని సూపరిండెంట్‌ డాక్టర్‌ రేగులపాటి మహేశ్‌ రావు అన్నారు.

నాణ్యతా ప్రమాణాలతోనే ఈ గౌరవం

సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ దవాఖానలో వైద్యులు, సిబ్బంది నిబద్ధతతో పని చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కే. తారక రామారావు ఎప్పటికప్పుడు దవాఖాన తీరుతెన్నులను తెలుసుకుంటున్నారు. రోగులను పూర్తి ఆరోగ్యవంతులుగా చేయడమే కాకుండా దవాఖాన వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటాం. పారిశుధ్యం, పచ్చదనాన్ని పటిష్టంగా నిర్వహిస్తున్నాం. దీంతో రోగులకు అహ్లాదకర, ఆరోగ్యకర దవాఖాన పరిసరాలను తీర్చిదిద్దగలిగాం. ఈ అవార్డ్‌ తో దవాఖానను మరింత ఉన్నతంగా నిర్వహించడానికి అవసరమైన నిధులు సమకూరనున్నాయి.

మంత్రి కే. తారక రామారావు సంపూర్ణ సహకారం, మార్గదర్శనం వల్లే జిల్లా ఆసుపత్రి, వేములవాడ ఏరియా ఆసుపత్రికి కాయకల్ప అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులు మా బాధ్యతను మరింతగా పెంచాయి, మరింత ఉత్సాహంతో పని చేసేందుకు ఈ అవార్డులు ప్రేరణగా నిలుస్తాయి. వైద్యులు, సిబ్బంది పనితీరు నిబద్ధతకు ఈ అవార్డ్‌ తో తగిన గుర్తింపు వచ్చింది.

– అనురాగ్‌ జయంతి, జిల్లా కలెక్టర్‌, రాజన్న సిరిసిల్ల