కేసీఆర్‌ కలవైకుంఠపురమే.. ఇల!

By: శ్రీ అల్లాణి శ్రీధర్‌

యాదేశైలే మహాపుణ్యం
విష్ణు పాదావసేచనమ్‌
విష్ణుకుండ మతిఖ్యాతిమ్‌
తీర్థమైశ్వర్య దాయకమ్‌.

అంటుంది స్కాందపురాణం. పురాణ గాథల నుండి చారిత్రక ఇతిహాసాల నుండి స్ఫూర్తిని అందుకొనివర్తమానంలో అత్యద్భుత పుణ్యక్షేత్రాన్ని యావత్‌ భారతదేశం యాదాద్రి శిఖరంకేసి చూసే విధంగా రూపొందించారు. తెలంగాణ స్వాప్నికుడు సాధకుడు కేసీఆర్‌. అలనాడు కొండపైన తపస్సు చేసిన యాదర్షి ఒకటే కోరుకున్నాడు. సామాన్యుడు కాదు యాదర్షి – చిన్ననాటి నుండే నారసింహుని దర్శనం కోసం నదీ నదాలు, పర్వతాలు, అరణ్యాలు ఎన్నెన్నో దర్శించాడు. అన్వేషించాడు. ఆఖరికి గుహలో కొలువైన నారసింహుని కనుగొని ఆయన దర్శనం కోరి తీవ్రమైన తపస్సు చేశాడు. స్వామివారు ప్రత్యక్షమైనారు.

‘‘స్వామీ! నువు నా ఒక్కడికే దర్శనం ఇవ్వడం కాదు ఈ కొండపైనే అందరికీ దర్శన భాగ్యం కలిగించి భక్తులను అనుగ్రహించాలి’’ అని ప్రార్థించాడు. మేఘం లాంటి నీలమైన దేహం, అందమైన రంగుల పీతాంబరం, కంఠంలో మాలలు, స్వచ్ఛమైన బంగారం లాంటి తీక్షణమైన కనులు, చంద్రుని కిరణాల్లో మెరిసిపోతున్న శిరోజాలు అంతటా తానై కనిపిస్తూ కనులముందు నిలచిన శ్రీ నరసింహస్వామి వారిని ఆనందాశ్రువులతో అర్థించాడు. ఉగ్రనరసింహుడు ప్రసన్న నారసింహుడైనాడు. తన ప్రియ భక్తుణ్ణి దీవించాడు.

యాదర్షే శృణు మద్వాక్యం
యత్త్వయా ప్రార్ధితం వరం
తదహాం నివసిష్యామి
భక్త కామ్యార్ధ సిద్ధయే

భక్తుల కోరికలు తీర్చడానికి, విఘ్నాలు తొలగించి, అపమృత్యుభయాన్ని నిర్మూలించి, నేను ఈ కొండపైనే వుంటాను. నాడు ప్రహ్లాదుని కోసం స్తంభం పగలగొట్టుకొని వచ్చాను, రాక్షస సంహారం చేశాను. అందరి ప్రార్థన ఆలకించి, ఉగ్రరూపాన్ని విడిచిపెట్టి ప్రసన్న రూపుడనై ఈ కొండమీద అడుగుపెట్టాను. ఇప్పుడు నిజాయితీతో కూడిన నీ ప్రార్థన మన్నిస్తాను, ఇక్కడే వుంటాను. ఓషదీ వనాలతో, పవిత్ర వాయు సంచారంతో శుభకరమైన ఈ ‘అద్రి’ నాయనా యాదర్షీ నీ పేరుమీదనే యదాద్రిగా పిలువబడుతుంది శుభమస్తు’’.

యాదర్షి తపస్సు ఫలితంగా స్వామివారు యాదగిరీశుని కొండమీద వేదమూర్తిగా వెలిసి, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిగా పూజలందు కుంటున్నాడు. దాదాపు వెయ్యేళ్ల కిందట పశ్చిమ చాళుక్య ప్రభువైన త్రిభువనమల్లుడు ఈ ప్రాంతంలో కోటను నిర్మించడం త్రిభువన మల్లుడు నిర్మించిన కోట భువనగిరిగా ప్రసిద్ధం. తన కుమారుడైన సోమేశ్వరునికి వచ్చిన ప్రాణాంతమైన వ్యాధిని యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహుని అనుగ్రహంతో నయం చేయించుకున్నాడు. అంతే కాదు, స్వామివారిని పూజించి, సేవించుకొని స్వామి దయతో ధైర్య స్థైర్యాలను పెంపొందించుకొని తన శతృవులను ప్రజాకంటకులైన దేశ ద్రోహులను తరిమికొట్టాడు. పర పీడన నుండి తన ప్రజలను రక్షించుకున్నాడు. అయితే అనేక యుద్ధాలలో మునిగి తేలిన త్రిభువన మల్లుడు స్వామి వారికి ఒక చిన్న ఆలయం మాత్రమే నిర్మించ గలిగాడు. ఆ తర్వాత వచ్చిన విశ్వాసం లేని పాలకుల నిర్లక్ష్య వైఖరి నుండి అప్రకటిత దాడుల నుండి ఆలయాన్ని, ఆలయ సంప్రదాయాన్ని భక్తులు, ధర్మ కర్తలు, ఆచార్యులే కాపాడుకున్నారు. ‘‘ధర్మో రక్షతి రక్షితః’’ ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. అందుకే యాదగిరీశుని, గుడి, అనేక అవాంతరాల మధ్య మనుగడ సాగించింది. పెరుగుతున్న భక్తుల తాకిడిని తట్టుకొని తగిన సౌకర్యాల కల్పన కోసం భక్తులు ఎదురుచూడవలసి వచ్చింది. సరిగ్గా వెయ్యేళ్ల తరువాత వచ్చాడు. ప్రజల మనసెరిగిన పాలకుడు మనసంతా భక్త సంకల్పం నెరవేర్చుకునే శక్తి వున్న ఆ భక్తి పరుడు, శక్తిశాలీ కల్వకుంట్ల చంద్రశేఖరుడు.

ఆయన దేవుడు. తండ్రికిచ్చిన మాట కోసం పధ్నాలుగేళ్లు వనవాసం చేసి అనుకున్నది సాధించి, పట్టాభిషేకం చేసుకొని రామరాజ్యాన్ని నెలకొల్పాడు శ్రీరామ చంద్రుడు. ఈయన భక్తుడు. తాను ప్రజలకిచ్చిన మాటకోసం పధ్నాలుగేళ్లు జనవాసంలో పోరాటం చేసి ప్రజల ఆశీర్వాదంతో, పరిపాలకుడై రామరాజ్యం లాంటి సంక్షేమ పాలన కోసం కృషి చేస్తున్నాడు చంద్రశేఖరుడు. కలలో చూశాడు, జనంకోసం సంకల్పించాడు ఒక కలకన్నాడు కేసీఆర్‌.

నరసింహదేవుని ఆలయాన్ని అభివృద్ధి చేసి అశేష భక్తులకు విశేష సౌకర్యాలతో అద్భుత కళాకృతులతో అధునాతన ఆధ్యాత్మిక బంగారు క్షేత్రాన్ని ఈ పుణ్య భూమిలో అనితర సాధ్యమైన రీతిలో రూపొందించా లనుకున్నాడు. సంకల్పం మంచిదైతే, సంకల్పించిన వాడి ఆశయం శిలాసదృశమై దానికి ప్రజాబలం తోడైతే ఎలాంటి ఫలితం వస్తుందో తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారా ప్రపంచం చూసింది.

అందుకే యాదాద్రి విషయంలో కోటానుకోట్ల నారసింహుని భక్తుల కోరిక కూడా అదే. కేసీఆర్‌ అనుకున్నది, అనుకున్నదానికన్నా మిన్నగా చేస్తాడని ప్రజల నమ్మకం. అది ఇప్పుడు నిజమైంది.

నిజమే ! యాదాద్రి భారత దేశంలో ముఖ్యంగా దక్షిణాదిలో ఒక అరుదైన మహాపుణ్యక్షేత్రంగా స్థానం సంపాదించుకుంటున్నది.

స్వయంభూగా వెలసిన స్వామివారి మహిమ, క్షేత్రపాలకుడైన హనుమంతుల వారి శక్తి, స్వామివారి అంశగా ఆవిర్భవించిన సుదర్శన చక్రం యొక్క నిరంతర అనుగ్రహ ప్రభావం అచంచలమైన భక్తజనుల విశ్వాసం ఈ పుణ్యస్థలికి అపూర్వమైన పవిత్రతనూ ఆధ్యాత్మికతనూ ఏర్పరచింది.

ఇప్పుడు శాస్త్రప్రకారం నిర్మితమైన కట్టడాలు, ప్రామాణికంగా రూపుదిద్దుకుని శిల్పసౌందర్యమూ నాటి త్రిభువనమల్లుడు నేడు వుండి చూసుంటే ‘ఆహా, ఇది కదావైభవోపేతమైన నారసింహక్షేత్రం’’ అని పరమానంద భరితుడయ్యేవాడే. క్రీ.శ. 16వ శతాబ్దంలో తెలుగువారి చారిత్రక పురుషుడు శ్రీకృష్ణ దేవరాయలు తన జైత్రయాత్రలో భాగంగా యాదగిరీశుని క్షేత్రాన్ని సందర్శించాడు. అంతేకాదు సతీసమేతంగా కొండఎక్కి పంచనారసింహ మూర్తుల మనసారా సేవించుకున్నాడు.

జ్వాలా నారసింహుడు, యోగానంద నారసింహుడు, శ్రీ లక్ష్మీనారసింహుడు, గండభేరుండ నారసింహుడు, సుదర్శన నారసింహుడు. ఈ పంచనారసింహులలో ప్రధాన దైవం శ్రీ లక్ష్మీనారసింహుడు యాదరుషికి తపోమార్గం చూపిన శ్రీరామ భక్తుడు క్షేత్రపాలకుడై స్వామి ఆదేశానుసారం దుష్టగ్రహాలను, క్షుద్ర శక్తులను, విఘ్నాలను కలిగించే వ్యతిరేక శక్తుల సమూహాలను పారదోలుతున్నాడు.

తననెవరూ ఏమి చేయలేరని తనకు చావే లేదని విర్రవీగి ఎందరినో హింసించిన రాక్షసరాజు హిరణ్యకశిపుని వజ్రంలాంటి గోళ్ళతో ప్రేవులను పెళ్ళగించిన నారసింహుడు తనను సేవించుకునే భక్తులను ఏ దుష్టశక్తి అయినా బాధిస్తే ఊరికే వదిలిపెడతాడా?

ఈ క్షేత్రానికి వచ్చే భక్తులకు మనోవ్యాధి వుండదు. దేహబాధలు, అంతుచిక్కని వ్యాధులూ మటుమాయమైపోతాయని, బాధలనుండి విముక్తులైన భక్తుల గురించి వింటుంటే, చూస్తుంటే స్వామి తప్ప వేరే శరణం వున్నదా అనిపిస్తుంది.

స్వామి శరణం ఆపదల నుండి రక్షించే సుదర్శనం ! ఆలయంలోని మూల విరాట్టుకు అలంకరణ చేస్తే, ఎంత శోభాయమానంగా వుంటుందో ఆ విధంగా యాదగిరి ఆలయం శాస్త్ర ప్రామాణికమైన విస్తరణతో ‘యాదాద్రి వైభవ క్షేత్రం’ గా రూపుదిద్దుకుంది. యాదాద్రి ఆలయం నూతన నిర్మాణాలు, విశేషాలు వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారమై ప్రపంచ వ్యాప్తంగా వివిధ నారసింహుని భక్తులను ఎప్పుడెప్పుడూ ఆలయాన్ని సందర్శిద్దామా, స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందుదామా అని ఎదురుచూచేలా చేస్తున్నాయి.

ప్రధాన ఆలయం మూలాల్ని మరింత విస్తరిస్తూ, రోజురోజుకీ పెరుగుతున్న అసంఖ్యాక భక్తజనుల సౌకర్యాలను దృష్టిలోపెట్టుకొని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. నారసింహుని భక్తుడైన ముఖ్యమంత్రి ఆలయ నిర్మాణ ప్రధాన కర్తయై క్రియా పూర్వకంగా చేపట్టిన ఈ మహా యజ్ఞంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కిషన్‌రావు నిర్మాణ సమన్వయంలో ఎందరో శిల్పులూ, నిపుణులూ, శ్రామికులూ, అధికారులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులూ పాలుపంచుకున్నారు.

చాళుక్య, చోళ, పల్లవ, హోయసల విజయ నగర కాలాలకు చెందిన శిల్పరీతులను అధ్యయనం చేసి, కాకతీయ కళా శైలి ప్రతిబింబించేలా రూపుదిద్దుకున్నాయి నవీన నిర్మాణాలు.

శ్రీరంగం ఆలయ నిర్మాణ పద్ధతిలో నల్లరాతిశిలతో యాదాద్రి ఆలయం నిర్మితమైంది. కృష్ణ శిలగా పిలువబడే ఈ నల్లరాయి ఎండకాలం చల్లదనాన్ని, చలికాలంలో వెచ్చదన్నాన్ని యిస్తుంది. అత్యంత కఠినంగా వుండే ఈ శిల ఆలయాన్ని పటిష్టంగా వుంచుతుంది.

అష్ఠభుజి ప్రాకార మండపం, బ్రహ్మోత్సవమండపం, వేంచేపు మండపం, సాలహారాలను సాలహార విగ్రహాలను అమర్చిన ప్రథమ ప్రాకారం, దివ్యవిమానం, వీటిని ప్రత్యేక నిర్మాణాలుగా చెప్పుకోవాలి.

అలాగే ప్రధానాలయ అంతర్‌ ప్రాకారంలో నాలుగు దిక్కులా నాలుగు మండపాలు వుంటాయి. ఈశాన్యంలో కళ్యాణ మండపం, వాయువ్యంలో అద్దాల మండపం, నైరుతిలో యాగశాలాప్రాంగణం, ఆగ్నేయంలో దీపాలంకరణ మండపం, నిత్యకళ్యాణం, పచ్చతోరణంలా వెలుగొందుతాయి. ఎక్కడ చూసినా భక్తి ప్రపత్తులను కలిగించే దేవతా మూర్తులూ, ప్రకృతి ఛాయలు, సనాతన శిల్పకళా ఖండాలూ దర్శనమిస్తుంటాయి. గాలిగోపురం, ప్రధాన ద్వారం, ధ్వజస్తంభం, ఇవన్నీ కూడా పురాతన ఆలయశైలిని మార్చకుండా, విస్తరణ చేసినవే కావడం వల్ల పండితులూ, సామాన్య భక్తజనులూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రెండో ప్రాకార మండపంలో భక్తుల కోసం నిత్య కళ్యాణ ప్రాంగణం, యాగశాల, అద్దాల మండపం, స్వామివారి ప్రసాదం తయారీ కోసం రామానుజ కూటమి ఏర్పాటయ్యాయి. అలాగే అళ్వార్‌ మండపం ఒకటేమిటి పునర్మిర్మాణం జరుపుకున్న యాదాద్రి మహా పుణ్యక్షేత్రం ఎవరికీ ఎటువంటి తారతమ్యం అందరినీ అక్కున చేర్చుకుంటున్నది.

భక్తజనులు సంతోషంగా పలికే ‘నమో నారసింహ’ నామాలతో యాదాద్రి కొండ మారుమోగుతున్నది. ప్రజల మనసుల్లో ‘మహారాజుగా’ వారి ఆదరాభిమానాలు అందుకుంటున్న చారిత్రక పాలకుడు కేసీఆర్‌ రూపుదిద్దిన ఈ మహా ఆలయం భక్తజనుల హర్షధ్వానాలను అందుకుంటున్నది.

అర్చక స్వాముల స్త్రోత్ర పాఠాలతో సేవలందు కుంటున్న నారసింహుని ప్రసన్న వదనంలో తళుకులీనుతున్న నిత్య హారతి వెలుగులు యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహుని అనుగ్రహం మనల్ని పునీతుల్ని చేయడం తథ్యం అనే సత్యాన్ని చాటిచెప్తున్నది.

ఓమ్‌ నమో నారసింహాయ