గర్భిణీలకు మరో వరం కేసీఆర్ పౌష్టికాహార కిట్లు

రాష్ట్రంలోని మహిళల్లో రక్తహీనత అధికంగా ఉన్నందున దీని నివారణకు ప్రభుత్వం న్యూట్రీషియన్ కిట్ల పంపిణీని చేపట్టిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆయన కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ పథకాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ప్రొటీన్స్ , మినరల్స్ , విటమిన్లు అధికంగా ఉండే పోషకాహారం ద్వారా రక్తహీనతను తగ్గించడం, హిమోగ్లోబిన్ శాతం పెంచడం ఈ కిట్ల లక్ష్యమని పేర్కొన్నారు. మొదటి కిట్‌ను 13-27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్‌సీ చెకప్ సమయంలో, రెండోకిట్‌ను 28-34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్‌సీ చెకప్ సమయంలో ఇస్తారని తెలిపారు. దాదాపు 1.25 లక్షల మంది గర్భిణులకు ఈ పథకం ఉపయోగపడనున్నదని తెలిపారు. తొలివిడుతలో 9 జిల్లాల్లోని 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కిట్లు పంపిణీ చేయనున్నారని పేర్కొన్నారు.
గర్భిణులు రక్తహీనతతో బాధపడకూడదనే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేస్తున్నామన్నారు. గర్భిణులకు పౌష్టికాహారం ఇవ్వాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఈ కిట్‌ను కాబోయే తల్లులు మాత్రమే వినియోగించాలని సూచించారు. పేద మహిళల గురించి ఆలోచించి సీఎం కేసీఆర్ ఈ కిట్ రూపొందించారని వెల్లడిరచారు. తల్లీ, బిడ్డ బాగుండాలని న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నామని చెప్పారు. ఇందులో ప్రొటీన్ డైట్ ఉంటుందన్నారు. ప్రతి కిట్ విలువ రూ.2 వేలు ఉంటుందని వెల్లడించారు. ప్రతి గర్భిణికి రెండుసార్లు న్యూట్రిషన్ కిట్ అందిస్తామన్నారు. తల్లీబిడ్డల క్షేమం కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. పౌష్టికాహార కిట్‌తో తల్లిబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. రాష్ట్రంలో మాతాశిశు మరణాలు బాగా తగ్గాయని చెప్పారు. సీఎం కేసీఆర్ బృహత్తర ప్రణాళికతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఏం కావాలో ఆలోచించే నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. ప్రతి ఇంటికి నల్లా పెట్టి తాగునీరు అందిస్తున్నామని, రాష్ట్రంలో బాలికల కోసం 551 గురుకులాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజల కనీస అవసరాలు గుర్తించి వాటిని తీరుస్తున్న ప్రభుత్వంగా ప్రజల మన్ననలు అందుకుంటున్నామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.
ఆయా జిల్లాల్లో ప్రారంభించిన మంత్రులు

ఆయా జిల్లాలలో మంత్రులు ఈ న్యూట్రీషియన్ కిట్ పథకాన్ని ప్రారంభించారు. జయశంకర్ భూపాలపల్లిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ములుగు జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్, ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాలో శాసనసభ్యులు బాల్క సుమన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, జోగుళాంబ గద్వాల జిల్లాలో మంత్రి నిరంజన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, వికారాబాద్ జిల్లాలో మంత్రి సబితా రెడ్డిలు ఈ పథకాన్ని ప్రారంభించారు.
కిట్ల పంపిణీ ఎందుకు..?
ఈ న్యూట్రీషియన్ కిట్ల పంపిణీ ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందంటే, ఏజెన్సీ ప్రాంతాల్లో మహిళలు తీవ్రమైన రక్తహీనతను ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ సమస్యను అధిగమించేందుకు దేశంలో అత్యుత్తమ విధానాన్ని అనుసరిస్తున్న రాష్ట్రాల్లో అధ్యయనానికి మహిళా ఐఏఎస్ అధికారుల బృందాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు పంపించారు. సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్, ప్రస్తుత విద్యాశాఖ కార్యదర్శి, పూర్వ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ సహా 8 మంది మహిళా ఐఏఎస్ అధికారులు తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో పర్యటించారు. వారి సిఫారసు మేరకు దేశంలో ఎక్కడాలేనివిధంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌ను రూపొందించారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ గర్భిణులకు వరంగా మారనున్నది.