సిద్ధిపేటకు కెేసీఆర్ వరాల జల్లు
సిద్ధిపేట పేరులోనే బలం ఉంది. ఇది మామూలు పేట కాదు… సిద్ధి పొందిన పేట.. తెలంగాణను సిద్ధింపజేసిన గడ్డ సిద్ధిపేట అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. సిద్ధిపేట లేకపోతే కేసీఆర్ లేడు.. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని ఆయన వ్యాఖ్యానించారు. సిద్ధిపేట నియోజవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.

సిద్ధిపేట ఎమ్మెల్యేగా, కరీంనగర్ ఎంపీగా రెండు చోట్లా తాను విజయం సాధించానని.. తెలంగాణ సాధనలో భాగంగా ఎంపీ పదవిలో కొనసాగి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. సిద్ధిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన సమయంలో ఎంతో దుఃఖించానన్నారు. ఇక్కడి నుంచి వెళ్లేటపుడు ఆణిముత్యంలాంటి నాయకుడిని ఇచ్చి వెళ్లానని మంత్రి హరీశ్ రావును ఉద్దేశించి చెప్పారు. హరీశ్ రావు తన పేరు కాపాడి అద్భుతమైన సిద్ధిపేటను తయారు చేశారనే సంతోషం గుండెలనిండా ఉందని ముఖ్యమంత్రి కొనియాడారు.
తెలంగాణ ఏర్పడ్డాక కరెంట్, త్రాగునీటి కష్టాలు లేవని.. భవిష్యత్‌లోనూ రావన్నారు. పటిష్ఠమైన విధానంతో ముందుకెళ్తున్నామని, అవసరమైతే ఇతరులకు విద్యుత్ ఇచ్చే స్థితికి చేరుతున్నామని చెప్పారు. అభివృద్ధి పరంగా చీకటి ఛాయలు అలు ముకున్న వెనుకబడిన, మూరుమూల ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని కోరుకున్నామని, దానికి అనుగుణంగానే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సందర్భంగా సిద్ధిపేటకు పలువరాలను కేసీఆర్ ప్రకటించారు.
బుస్సాపూర్ – తిమ్మాయ్ పల్లి రహదారి..రింగ్ రోడ్డు, పొన్నాల నుండి దుద్దెడ వరకు 76 కిలోమీటర్ల రింగ్ రోడ్డుకు రూ.160 కోట్లు మంజూరు. పొన్నాల నుండి దుద్దెడ రింగ్ రోడ్డు అనుసంధానం చేసే 21 గ్రామాలు – పొన్నాల రాజీవ్ రహదారి, కిష్టసాగర్, ఎన్సాన్పల్లి, వెంకటాపూర్, బుస్సాపూర్, ఇరుకోడ్, రాంపూర్, రావురూకుల, పుల్లూర్, మల్యాల, గంగాపూర్, మాచపూర్, చిన్నకోడూర్, రామునిపట్ల, గోనెపల్లి, ఓబుళాపూర్, పాలమాకుల, వెంకటాపూర్, తిమ్మాయ్ పల్లి, బంధారం, దుద్దెడ రాజీవ్ రహదారి.
సిద్ధిపేట పట్టణంలో రూ. 50 కోట్లతో మహతి ఆడిటోరియం మంజూరు, రూ. 25 కోట్ల తో ఇంటి గ్రేటెడ్ మార్కెట్ మంజూరు. పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం కేసీఆర్ నగర్లో బస్తీదవాఖాన. మూడవ పట్టణ పోలీసు స్టేషన్ మంజూరు. సిద్ధిపేట పట్టణానికి మరో1000 డబుల్ బెడ్రూం ఇండ్ల మంజూరు, రంగనాయక సాగర్‌కు 100 కోట్లు మంజూరు. ఇర్కోడుకు లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు. ఈ లిఫ్ట్ ఇరిగేషనుతో మూడు నియోజకవర్గాలు సిద్ధిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు సాగునీటి ఫలాలు అందనున్నాయని వివరించారు.
సిద్ధిపేట నియోజకవర్గం సిద్ధిపేట రూరల్ మండలంలోని 4 గ్రామాలైన బుస్సాపూర్, ఇర్కోడు, తోర్నాల, వెంకటాపూర్, గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలంలోని రెండు గ్రామాలు, సిరిసినగండ్ల, మర్పడగతో పాటు దుబ్బాక నియోజకవర్గంలో మూడు మండలాలు 10 గ్రామాలు, దుబ్బాక మండలములోని పెద్దగుండవెళ్లి, తిమ్మాపూర్, తొగుట మండలంలోని బండారుపల్లి, ఎల్లారెడ్డిపేట, పెద్దమాసాన్‌పల్లి, ఘన్పూర్, గుడికందుల, మిరుదొడ్డి మండలంలోని మిరుదొడ్డి, ధర్మారం, కొండాపూర్ తదితర గ్రామాలకు సాగునీరు అందనున్నదని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం మంత్రి హరీశ్ రావు ఆయనకు పాదాభివందనం చేశారు. హరీశ్ రావును పైకి లేపి సీఎం ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి,జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మసీదు నుంచి అజాన్…. ప్రసంగం నిలిపివేసిన సీఎం
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఉత్సాహంగా మాట్లాడుతున్న సమయంలోనే మసీదు నుంచి నమాజ్‌కు రమ్మని పిలిచే అజాన్ వినిపించింది. దీంతో కెేసీఆర్ ఒక్కసారిగా ప్రసంగం నిలిపివేశారు. ప్రార్థన ముగిసేదాకా వేచి చూసి తర్వాత మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రజలందరి మత విశ్వాసాల్ని మనోభావాల్ని గౌరవించడం పట్ల బహిరంగ సభకు విచ్చేసిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కలెక్టర్ కు సీఎం ప్రశంస
సిద్ధిపేట జిల్లాకు గొప్ప కలెక్టర్ ఉన్నాడని, దండివాడు, మొండివాడు, గొప్పవాడు అని ముఖ్యమంత్రి కలెక్టర్ వెంకట్రామా రెడ్డిని ప్రశంసించారు.తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు.. కల్వకుంట్ల కాలనీ ఏర్పాటు చేశామని, అంతకంటే గొప్పగా మంత్రి హరీశ్ రావుతో కలిసి సిద్ధిపేట పట్టణానికి ప్రత్యామ్నాయంగా అద్భుత పట్టణంగా నర్సాపూర్ 2 బి.హెచ్.కెను సృష్టించాడని అన్నారు. గజ్వేల్ ప్రక్కన ఆర్ అండ్ ఆర్ కాలనీ లో ఆరు వేల ఇండ్లను నిర్మిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం సిద్ధిపేటను చూస్తే చాలా ఆనందం కలుగుతోందన్నారు. మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్ కృషి తో ఇండియాకే సిద్ధిపేట రోల్ మోడల్‌గా ఉందన్నారు.
సిద్ధిపేట ఐ.టి టవర్ కు శంకుస్థాపన
సిద్ధిపేట శివారులో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ టవర్‌కు ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సిద్ధిపేట డైనమిక్ ప్రాంతం అని, రాష్ట్ర రాజధానికి సిద్ధిపేట అత్యంత సమీపంలో ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తప్పకుండా ఎక్సలెంట్‌గా అభివృద్ధి చెందుతుందన్నారు.

శంకుస్థాపన జరిగిన వెంటనే కేసీఆర్ సమక్షంలో పలు కంపెనీలతో ఒప్పందాలపై ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ సంతకాలు చేశారు. ఇందులో జోలాన్ టెక్నాలజీ , విసాన్ టెక్, ఎంబ్రోడ్స్ టెక్నాలజీ, సెట్విన్ వంటి కంపెనీలు ఉన్నాయి.1000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ కంపెనీలు ముందుకు వచ్చాయి. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి,జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మురుగు.. కనుమరుగు..!
స్వచ్ఛత అంశంలో ఇప్పటికే జాతీయ స్థాయిలో అనేక అవార్డులు చేజిక్కించుకున్న సిద్ధిపేట మున్సిపాలిటీ…మరో ఘనతను సాధించింది.మురుగు శుద్ధి కేంద్రం ఉన్న రాష్ట్రంలోనే రెండో మున్సిపాలిటీగా సిద్ధిపేట ఖ్యాతికెక్కింది. పరిశుభ్ర సిద్ధిపేటలో భాగంగా పందులు లేని పట్టణంగా స్వచ్ఛత వైపు తొలి అడుగు వేసింది. ఉదయం లేవగానే తడి, పొడి చెత్తను వేరు చేస్తూ మరొక అడుగు ముందుకు వేస్తూ పట్టణము సిద్ధిపేటను శుద్ధిపేటగా మార్చుకుంటూ ముందుకు సాగింది. ఆ క్రమంలోనే.. వర్షాలు పడితే మురికి కాలువలు అన్ని దోమలు, ఈగలు, ఇండ్ల ముందు అన్ని వ్యర్ధాలు ఉండే పరిస్థితినీ మంత్రి హరీశ్‌రావు దృష్టిలో పెట్టుకొని భవిష్య సిద్ధిపేట ఒక సంపూర్ణ ఆరోగ్య పేట గా ఉండాలి అనే సంకల్పంతో సిద్ధిపేట వందేళ్ల పునాది.. ఆరోగ్య సిద్ధిపేటగా అడుగు వేయాలి అని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బృహత్తర కార్యక్రమం తొలి విడత దిగ్విజయంగా అవిష్కృతమైంది.
స్వచ్ఛ, దోమల రహిత పట్టణంగా సిద్దిపేట పట్టణంను తీర్చిది ద్దేందుకు భూగర్భ మురుగునీటి వ్యవస్థ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు.
వివరాలలోకి వెళితే…
‘TUFIDC (Telangana Urban Finance and Infrastructure Development Corporation’), అమృత్, మున్సి పాలిటీలకు చెందిన నిధులు రూ.278 కోట్ల 16 లక్షల రూపాయల వ్యయంతో 328 కి.మీ. మేర భూగర్భ మురుగునీటి కాలువ నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు 302 కి.మీ. మేర పూర్తి చేశారు.ఇందులో భాగంగా చింతల చెరువు వద్ద ‘Moving bed biofilm reactor (MBBR’) సాంకేతికత తో 7.25 ఎంఎల్డీ సామర్థ్యం గల మురుగు నీటి శుద్ధి కేంద్రంను నిర్మించారు.
సిద్ధిపేట మున్సిపాలిటీ లోని 34 వార్డుల పరిధిలో 25,517 ఇండ్లు ఉండగా తొలి దశలో 8 వేల ఇళ్లకు ఈ వ్యవస్థను అనుసంధానం పూర్తి చేశారు.మొదటి దశలో నిర్మించిన భూగర్భ మురుగు నీటి వ్యవస్థ సత్ఫలితాలను ఇవ్వడంతో రెండు, మూడు, నాలుగో దశల్లో నిర్మాణంలో ఉన్న ఎస్టీపీ, సెప్టిక్ ట్యాంకుల నిర్మాణ పనులు 80 శాతం మేర పూర్తయ్యాయి. మిగిలిన పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు.
ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా మంత్రి హరీశ్‌రావు చేపట్టిన భూగర్భ మురుగు నీటి వ్యవస్థ తో ఇప్పటికే క్షేత్ర స్థాయిలో మంచి ఫలితాలు కనబడు తున్నాయి. ప్రస్తుతం ప్రతి రోజూ 7.25 ఎంఎల్డీల మేర మురుగు నీటిని చింతల చెరువు ఎస్టీపీ ద్వారా 6 దశల్లో శుద్ధి చేస్తున్నారు.శుద్ధి చేసిన జలాలను ప్రతి రోజూ చింతల చెరువు సర్ఫ్లస్ కెనాల్ ద్వారా సిద్ధిపేట వాగులోకి వదులుతున్నారు. ఎస్టీపీ ద్వారా శుద్ధి చేసిన జలాలను త్రాగునీటి యేతర అవసరాలకు, అనగా పంట పొలాలకు, మొక్కల నీటి అవసరాలకు ఉపయోగిస్తున్నారు. తద్వారా నీటిని పొదుపు చేయడంతో పాటు మురుగు నీరు రోడ్లపై ప్రవహించే పరిస్థితికి అడ్డుకట్ట పడిరది. దోమలు, దుర్వాసన నుండి పట్టణ ప్రజలకు విముక్తి కలిగింది.
నాలుగు విడతలో చేపట్టిన భూగర్భ మురుగు నీటి వ్యవస్థ వంద శాతం అందుబాటులోకి వస్తే నిత్యం 25 ఎంఎల్డీ మురుగునీటిని శుద్ధి చేయవచ్చు. సంపూర్ణ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణంతో సిద్ధిపేట పట్టణ వాసులకు మరింత మెరుగైన జీవనం లభించనున్నది.
కోమటి చెరువును సందర్శించిన సి.ఎం
కోమటి చెరువు-మినీ ట్యాంకుబండ్ పై సీఏం కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, రాజేందర్, వేముల ప్రశాంత్ రెడ్డిలు తీగల వంతెన- సస్పెన్షన్ బ్రిడ్జిపై కాసేపు కలియ తిరిగారు. నూతనంగా నిర్మిస్తున్న నెక్లెస్ రోడ్డు పనుల పురోగతిని మంత్రి హరీశ్ రావు సీఏం కేసీఆర్ కు వివరించారు.

అంతకు ముందు రూ.135 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మెడికల్ కళాశాల, మెడికల్ కళాశాల ఆవరణలో రూ.225 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మిస్తున్న 960 పడకల ఆసుపత్రి పనులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి సీఏం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అంతకు ముందు రాష్ట్రంలోనే తొలి టీఆర్ఎస్ పార్టీ భవన కార్యాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
కడుపు నిండినంత ఆనందంగా ఉంది: హరీశ్‌రావు
ఈ సభలో స్థానిక శాసన సభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి తన్నీరు హరీశ్ రావు మాట్లాడుతూ, పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ రెండు పడకల గదుల ఇళ్ల పథకానికి తానే స్వయంగా రూప కల్పన చేశారని అన్నారు. కోటి అందాలతో… కోమటి చెరువు ముస్తాబు అవుతుంది…అని సీఎం స్వయంగా పాట రాశారు అని, ఇప్పుడది ముఖ్యమంత్రి ఆశీస్సులతో సాకారం అయిందన్నారు. సిద్ధిపేట జిల్లా ఏర్పాటు అయినప్పటినుంచి ఇప్పటివరకు జిల్లాలో దాదాపు రూ.1000 కోట్ల విలువైన పనులను ప్రారంభించుకున్నామని చెప్పారు.
జిల్లాకు ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాల మంజూరు చేసినందుకు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. మీ ఆశీర్వాదం తో జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని, సిద్ధిపేట ప్రజలు మిమ్మల్ని, మీ సేవలను ఎప్పటికీ మరువరని కే.సీ.ఆర్కు చెప్పారు. ఒకప్పుడు ప్రభుత్వ ఇళ్లు నిర్మించిన ప్రాంతాలు మురికి వాడలుగా ఉండేవని., రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ ఇళ్ల కాలనీలు గేటెడ్ కమ్యూనిటీలకు దీటుగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారు. సొంత ఇల్లును ఎంత శ్రద్ధగా నిర్మించుకుంటామో అంతే చిత్తశుద్ధితో ఇవాళ సకల హంగులు, అన్ని సౌకర్యాలతో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇచ్చామని సంతోషం వ్యక్తం చేశారు. ఇళ్ల ప్రారంభోత్సవంలో తెలంగాణ ఆడబిడ్డలు ఆనందం వ్యక్తంచేస్తుంటే కడుపు నిండినంత ఆనందం కలిగిందన్నారు.