కే.సీ.ఆర్‌. సంకల్పబలం సంగమేశ్వర – బసవేశ్వర పథకాలు

By: శ్రీ కొండపల్లి వేణుగోపాల రావు

దృఢ సంకల్పం, కార్యదక్షత ఉంటే ఎక్కడి నుండైనా, ఎంత దూరం నుంచైనా, ప్రజల నీటి అవసరాలను గుర్తించే నాయకుడికి అంతా సుసాధ్యమే అని నిరూపించడానికి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేపట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తపోతల పథకాలే నిదర్శనం. ప్రక్కనే మంజీరా నది ప్రవహిస్తున్నా సామాజిక మరియు ఒక రాజకీయ ప్రకియ ద్వారా భౌతికంగా నీటి బదిలీని ప్రభావితం చేసి, సహజ హక్కు ద్వారా ప్రజలకు లభించాల్సిన నీటిని బదిలీచేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఊహించని విధంగా తన జలసంకల్పంతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను చేపట్టడం ద్వారా నిజంగా మన ముఖ్యమంత్రిని అపర భగీరథుడు అని కీర్తించడంలో ఎలాంటి సందేహం లేదు.

హైదరాబాదు నగరానికి త్రాగునీరు తరలించడానికి శ్రీనివాసరావు కమిటీ రిపోర్టును కాదని, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలతో 1975,1978లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల ద్వారా మంజీరా నదిపై 29.91 టిఎంసిల నీరు నిల్వ సామర్థ్యంతో సింగూరు ప్రాజెక్టు నిర్మించడం జరిగినది. దీన్నే అర్బన్‌ వాటర్‌ క్యాప్చర్‌ అంటారు. 1989 మరియు 1990 సంవత్సరంలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఇచ్చిన జివోల ద్వారా హైదరాబాదు త్రాగునీటికే ప్రాధాన్యం సంతరించుకున్నది. హైదరాబాదు నగరం నీటిని ప్రత్యక్షంగా కేటాయించుకోవడమే కాకుండా, నిర్దిష్ట రిజర్వాయర్‌ ఆపరేటింగ్‌ నిబంధనల ద్వారా, నియంత్రణ కోసం సంస్థాగత మార్గాలను సమీకరించడం ద్వారా క్రమంగా సింగూరు నుండి మంజీర నీటిని సంగ్రహించింది. కానీ దాని పరీవాహక ప్రాంతాలైనా సంగారెడ్డి జిల్లా ప్రాంతాలను ఏ మాత్రం పట్టించుకోలేదు. దీని ప్రభావం నిజాంసాగర్‌ ప్రాజెక్టుపైనా భారీగా పడింది. అంతేకాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు మంజీరా దాని ఉపనదులపై ఇష్టానుసారంగా బ్యారేజ్‌లు కట్టడం, గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డులో మంజీరా నీటి లభ్యత లెక్కల్లో అసమాన తేడా హైదరాబాద్‌లో త్రాగునీరు కోసం సింగూరు ద్వారా ప్రాధాన్యత ఇవ్వడం సంగారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల నీటి అవసరాలపై తీవ్రప్రభావం పడింది.

దూరదృష్టి గల నాయకత్వం మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉండడంవల్లనే ఎక్కడో 330 కి.మీ. దూరంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుండి సింగూరు ప్రాజెక్టులోకి తీసికొని సంగమేశ్వర్‌ మరియు బసవేశ్వర్‌ ఎత్తిపోతల పథకాల ద్వారా సాగు, త్రాగునీరు అవసరాలను తీరుస్తున్నారు. అంతేగాక గోదావరి నదిపై మేడిగడ్డపై నిర్మించిన బరాజ్‌ ఎఫ్‌ఆర్‌ఎల్‌ 100.00 మీ. నుండి 523 మీ. ఎఫ్‌ఆర్‌ఎల్‌ ఉన్న సింగూరు ప్రాజెక్టుకు తరలించి, దాని నుండి దాదాపు రాష్ట్రంలోనే అత్యంత ఎత్తయిన జహీరాబాద్‌ 664.500 మీటర్ల కాలువకు తరలించడం హర్షించవలసిన విషయం.

సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా సంగారెడ్డి, జహీరాబాద్‌, ఆందోల్‌ నియోజక వర్గాలలోని 12 మండలాల్లో 2.19 లక్షల ఎకరాలలో, 3 లిఫ్టులు, 3 పంప్‌ హౌజ్‌ల ద్వారా సుమారు 215 కి.మీ. కాల్వలను నిర్మించి సాగునీరు అందించనున్నారు. ఈ పథకానికి సుమారు 6300 ఎకరాల భూసేకరణ అవుతుంది. అలాగే బసవేశ్వర్‌ ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణ ఖేడ్‌, ఆందోల్‌ నియోజక వర్గాలలోని 8 మండలాల్లో 1.71 లక్షల ఎకరాలకు, 2 లిఫ్టులు, 2 పంప్‌ హౌజ్‌ ల ద్వారా సుమారు 160 కి.మీ. మేర కాల్వలను నిర్మించి సాగునీరు అందించనున్నారు. ఈ పథకానికి సుమారు 4100 ఎకరాల భూసేకరణ అవుతుంది.

సంగమేశ్వర ఎత్తిపోతల స్వరూపం
స్కీం పేరు: సంగమేశ్వర లిఫ్ట్‌ ఇరిగేషన్‌
ఖర్చు చేయనున్న నిధులు : రూ.2653 కోట్లు
ఆయకట్టు : 2.19 లక్షల ఎకరాలు
సాగునీరు అందే నియోజకవర్గాలు :
జహీరాబాద్‌ సంగారెడ్డి, ఆందోల్‌
సాగునీరు అందే మండలాలు : 11
సాగునీరు అందే గ్రామాలు : 231
లిఫ్ట్‌ ఎత్తు : 147 మీటర్లు పంపుల సంఖ్య : 3
విద్యుత్తు వినియోగం : 140 మెగావాట్లు
కాల్వల దూరం : 215 కిలోమీటర్లు
కాల్వలు :
రాయికోడ్‌ కెనాల్‌ (56.85 కిలోమీటర్లు),
మునిపల్లి కెనాల్‌ (11.40 కిలోమీటర్లు),
కంది కెనాల్‌ (44.85 కిలోమీటర్లు),
జహీరాబాద్‌ కెనాల్‌ (30.95 కి.మీ)
గోవిందాపూరం కెనాల్‌ (19.15కి.మీ.)
హద్నూర్‌ కెనాల్‌ (51.80 కిలోమీటర్లు)
ఆయకట్టు వివరాలు:
జహీరాబాద్‌ నియోజకవర్గంలోని ఐదు మండలాల
పరిధిలో 115 గ్రామాల్లోని 1,03,259 ఎకరాలు
ఆందోళ్‌ నియోజకవర్గంలోని రెండు మండలాల పరిధిలో
66 గ్రామాలలోని 65,816 ఎకరాలు
సంగారెడ్డి నియోజకవర్గంలోని నాలుగు మండలాల
పరిధిలో 50 గ్రామాల్లోని 49,925 ఎకరాలు

బసవేశ్వర ఎత్తిపోతల స్వరూపం
స్కీం పేరు: బసవేశ్వర ఎత్తిపోతల పథకం
ఖర్చు చేయనున్న నిధులు : రూ.1,774 కోట్లు
ఆయకట్టు : 1.71 లక్షల ఎకరాలు
సాగునీరు అందే నియోజకవర్గాలు :
నారాయణఖేడ్‌, ఆందోల్‌
సాగునీరు అందే మండలాలు : 8
సాగునీరు అందే గ్రామాలు : 166
లిఫ్ట్‌ ఎత్తు : 74.52 మీటర్లు పంపుల సంఖ్య : 2
విద్యుత్తు వినియోగం : 70 మెగావాట్లు
కాల్వల దూరం : 160 కిలోమీటర్లు
కాల్వలు :
కరస్‌ గుత్తి కెనాల్‌ (88.20 కిలోమీటర్లు),
కరస్‌ గుత్తి బ్రాంచి కెనాల్‌ (25.80 కిలోమీటర్లు)
వట్‌ పల్లి కెనాల్‌ (20 కిలోమీటర్లు),
నారాయణఖేడ్‌ కెనాల్‌ (20 కి.మీ),
రేగోడ్‌ కెనాల్‌ (12.90 కి.మీ), కంగ్టి కెనాల్‌ (16.80 కి.మీ)
ఆంతర్‌ గావ్‌ కెనాల్‌ (16.40 కి.మీ)
ఆయకట్టు వివరాలు:
నారాయణఖేడ్‌ నియోజక వర్గంలోని
ఆరు మండలాల పరిధిలో
130 గ్రామాల్లోని 1,37,407 ఎకరాలు
ఆందోల్‌ నియోజకవర్గంలోని రెండు మండలాల
పరిధిలో 36 గ్రామాల్లో 34,000 ఎకరాలు.