న్యాయ వ్యవస్థ బలోపేతానికి కేసీఆర్ కృషి ప్రశంసనీయం
చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ

న్యాయవ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కొనియాడారు. భవన నిర్మాణాలు, మౌలిక వసతులు, సిబ్బంది నియామకంతో సహా తాము అడిగిన వసతులన్నీ తక్షణమే సమకూర్చుతున్న సీఎం కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లోని అన్వయ కన్వెన్షన్ లో రెండు రోజులపాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర న్యాయాధికారుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. న్యాయ వ్యవస్థలో ఇప్పటికే 4,320 ఉద్యోగాలను కల్పించడం గొప్ప విషయం అంటూ ‘చేతికి ఎముకలేదు’ అనే తెలుగు సామెతకు సీఎం కేసీఆర్ ట్రేడ్ మార్క్‌గా నిలిచారని ప్రశంసల జల్లు కురిపించారు. తాను కలలుకన్న అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి అడగ్గానే ఒప్పుకుని, అన్ని వసతులతో ఏర్పాటు చేసినందుకు జస్టిస్ ఎన్ వి రమణ సీఎంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ చేయి మంచిది కాబట్టి ఈ సెంటర్ ఇంత త్వరగా అభివృద్ధి చెందిందన్నారు. ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’’ అని దాశరథి గారు చెప్పినట్టు అందరికీ వీణలు బహుకరించిన సీఎం నాకు మాత్రం నెమలిని బహుకరించారు. బహుశా అది జాతీయ పక్షి కావడం చేతకావచ్చు..’’ అంటూ చమత్కరించడంతో సమావేశమందిరంలో నవ్వులు విరిశాయి.

సమావేశానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖరరావు ప్రసంగిస్తూ, చీఫ్‌జస్టిస్ రమణ చొరవతో ఆల్టర్నేట్ డిస్ప్యూట్ మెకానిజం కోసం భారతదేశంలోనే ప్రప్రథమంగా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ప్రారంభించుకున్నామని, కార్యకలాపాలు ప్రారంభమైనవని, వారి ఆశీస్సులతో బ్రహ్మాండంగా నడుస్తున్నదని సంతృప్తి వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ వర్తక, వ్యాపార, వాణిజ్య ‘డిస్పోజల్’ లో స్పీడు పెరిగినట్లయితే మనం ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందని, న్యాయమూర్తులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి ఈ ‘జ్యుడీషియల్ ఆఫీసర్స్ కన్వెన్షన్’ లో న్యాయవ్యవస్థకు సంబంధించిన 400 మంది అధికారులు కొలువుదీరిన ఈ కార్యక్రమంలో ఫలవంతమైన చర్చలు జరగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

ఎనిమిదేండ్ల క్రితం రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం అందరి సహకారంతో, సమన్వయంతో చక్కగా పురోగమిస్తూ, ఉన్నత శిఖరాలను చేరుకుంటున్నదన్నారు. కఠిన క్రమశిక్షణ, ఆర్థిక జాగరూకతతోనే ఈ అభివృద్ధి సాధ్యమైందని సీఎం పేర్కొన్నారు.
భారతీయ రిజర్వు బ్యాంక్, కేంద్ర ఆర్థిక శాఖ వారు వెలువరించిన లెక్కల ప్రకారం 2014-15 లో 1.24 లక్షలున్న రాష్ట్ర తలసరి ఆదాయం, 2021`22 వరకు 2.78 లక్షలకు చేరుకుందని తెలిపారు. విద్యుచ్ఛక్తి రంగంలో సాధించిన పురోగతితో ఉమ్మడి రాష్ట్రంలో మనం పడ్డ కరెంటు కష్టాలు ఇప్పుడు మచ్చుకైనా కానరావని తెలిపారు. వ్యవసాయరంగం, పారిశ్రామిక రంగం, సమాచార సాంకేతిక రంగాల్లో అద్భుతంగా ముందుకు పురోగమిస్తున్నామని పేర్కొన్నారు. పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇంటిగ్రేటెడ్ డిస్టిక్ట్ కలెక్టరేట్ నిర్మాణం చేసుకుంటూ ఉన్నామని పేర్కొన్నారు.

అన్ని రంగాల్లో లాగానే న్యాయవ్యవస్థలో కూడా గతంలో కంటే న్యాయవ్యవస్థ, న్యాయ పరిపాలనా విభాగం ఇంకాచాలా గొప్పగా ముందుకు పోవాలని ఆకాంక్షించారు. ఈ దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి న్యాయ వ్యవస్థగా తెలంగాణ రాష్ట్ర న్యాయ వ్యవస్థ పేరు గడిరచాలని తాను ప్రబలంగా ఆకాంక్షిస్తున్నట్లు సీఎం తెలిపారు. హైకోర్టు విడిపోయిన తర్వాత హై కోర్టు బెంచ్‌ల సంఖ్య పెంచాలని నేను స్వయానా ప్రధానికి లెటర్ రాసిన.. కానీ దాన్ని పెండిరగ్లో పెట్టారన్నారు. మన తెలుగువారి ముద్దు బిడ్డ, జస్టిస్ ఎన్. వి. రమణ భారత న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్నత పదవిని అధిరోహించిన తర్వాత వారు చొరవ తీసుకొని ప్రధానమంత్రితో, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మన హైకోర్టులో 24 నుండి 42కు మన బెంచ్‌ల సంఖ్యను పెంపొందింపచేశారని ప్రశంసించారు.
రాష్ట్ర ప్రజల పక్షాన, నా పక్షాన, ప్రభుత్వం పక్షాన వారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నా నన్నారు. రాష్ట్ర న్యాయశాఖకు గతంలో 780 పై చిలుకు పోస్టులను మంజూరు చేయడం జరిగింది. ఈ మధ్య హైకోర్టు కోసం బెంచ్‌ల సంఖ్య పెరిగింది అందుకు అనుగుణంగా కరస్పాండిరగ్ సిబ్బంది, స్టాఫ్ అందరు ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి, అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ కోరారు.

ఆయన కోరిక మేరకు మరో 885 అదనపు పోస్టులను హైకోర్టుకు మంజూరు చేసి, జీవో కూడా విడుదల చేసి చీఫ్ జస్టిస్‌కు పంపించడం జరిగిందని పేర్కొన్నారు. హైకోర్టు తర్వాత ఉండేటువంటి జిల్లా కోర్టుల్లో పనిభారం బాగా ఉందని నాకు సమాచారం అందింది. తదనుగుణంగా జడ్జి పోస్టులను, మెజిస్ట్రేట్ పోస్టుల సంఖ్యను పెంచాలని చీఫ్ జస్టిస్నుకోరుతున్నానన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో జిల్లా కోర్టులు ప్రారంభించాలని సిజెఐని కోరిన, దానికి సంబంధించి జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలివ్వడం జరిగిందన్నారు.
జిల్లా కోర్టుల నిర్మాణం కోసం స్థలాలు ఎంపిక చేసి అన్ని వసతులతో కూడిన భవనాల నిర్మాణం చేపడుతామన్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లా కోర్టుల్లో కూడా సిబ్బంది కావాలనే కోరిక మేరకు 1730 అదనపు పోస్టులను కూడా మంజూరు చేస్తున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నానన్నారు. హైకోర్టుల, డిస్ట్రిక్ట్ కోర్టు, మెజిస్ట్రేట్ కోర్టుల్లో తగిన సిబ్బందిని సమకూర్చుతామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన న్యాయపరిపాలన విభాగం కోసం రాష్ట్ర ప్రభుత్వం 4348 పోస్టులు మంజూరు చేసినట్లు తెలిపారు. న్యాయశాఖకు మరింతగా సంపూర్ణ సహకారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉందన్నారు. డిజిటలైజేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్ లో భాగంగా..1 కోటి 52 లక్షల ఎకరాల భూముల రికార్డులు డిజిటలైజ్ చేయడం జరిగిందని తెలిపారు. కోర్టుల పై ఉన్నటువంటి అపారమైన విశ్వాసంతోని, నమ్మకం తోని రెవెన్యూ కోర్టులను రద్దు చేసి, లిటిగేషన్లను తెలంగాణ జస్టిస్ డిపార్ట్మెంట్కు బదిలీ చేయడం జరిగిందని తెలిపారు.
30 – 40 ఎకరాల స్థలంలో 42 మంది హైకోర్టు న్యాయమూర్తులకు ఒకే చోట క్వార్టర్స్ నిర్మించబోతున్నామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణకు తెలియజేశారు. ఈ క్వార్టర్స్‌కు శంకుస్థాపన చేయడానికి చీఫ్ జస్టిస్ రమణను త్వరలో సాదరంగా ఆహ్వానిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ న్యాయమూర్తుల సంఘం’ వారి వెబ్ సైట్‌ను సీఎం ప్రారంభించారు.
కాగా తెలంగాణ స్వరాష్ట్రంలో దాదాపు 400 మంది వివిధ విభాగాలకు చెందిన న్యాయాధికారులతో ఈ సదస్సు మొదటిసారి రెండు రోజులపాటు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర న్యాయ వ్యవస్థను మరింతగా బలోపేతం చేయడం, కోర్టు భవనాల నిర్మాణం, న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న సాంకేతికతను వినియోగించుకునే దిశగా అప్డేట్ కావడం, తదితర మౌలిక వసతులను మెరుగుపరచడం, తగినంతగా న్యాయమూర్తులు, అధికారులు, సిబ్బంది నియామకం, ప్రజలకు సత్వర న్యాయం అందించే చర్యలతో పాటు న్యాయ వ్యవస్థలో పని చేస్తున్న వారి సంక్షేమానికి తగు చర్యలు చేపట్టడం అనే అంశాల పై చర్చించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సుప్రీం కోర్టు జడ్జ్ జస్టిస్ రామసుబ్రహ్మణ్యం, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భూయాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిజెఐ ఎన్ వి రమణ సహా పలువురు న్యాయమూర్తులు సీఎం కేసీఆర్ ను ఘనంగా సత్కరించారు.