సమాచార శాఖ అధికారుల కీలక పాత్ర

ప్రభుత్వ పథకాలను ప్రజలవద్దకు తీసుకుపోవడంలో కీలక పాత్ర వహించే సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు ఆధునిక సాంకేతిక పద్ధతులను అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉండాలని రాష్ట్ర ఎన్నికల అధికారి సి. పార్థసారథి అన్నారు.

హైదరాబాద్‌, ఖైరతాబాద్‌లోని పంచాయితీ రాజ్‌ శాఖ ఆడిటోరియంలో జరిగిన సమాచార, పౌర సంబంధాల శాఖ ఉమ్మడి రాష్ట్ర అధికారులు, పదవీ విరమణ పొందిన అధికారుల ఆత్మీయ సమ్మేళనానికి పార్థసారధి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రముఖ మనస్తత్వ విశ్లేషకులు బివి పట్టాభిరామ్‌, సమాచార శాఖ డైరెక్టర్‌ బి. రాజమౌళి, రిటైర్డ్‌ డైరెక్టర్లు ఏ.ఎల్‌. కిస్మత్‌ కుమార్‌, సుభాష్‌ గౌడ్‌, మార్పాక ప్రమోద్‌ రావు, ఏ,సత్యారావు, యశోద ఆసుపత్రి సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డా. బాలరాజు తదితర అధికారులు, పెద్ద సంఖ్యలో హాజరైన ఈ సమావేశంలో పార్థ సారధి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో శాఖలున్నప్పటికీ సమాచార శాఖకు ప్రత్యేక స్థానముందని, ప్రతీ శాఖ అధికారులు ఈ శాఖతో విధిగా సంబంధం కలిగి ఉంటారని అన్నారు.

ఇతర శాఖలతో పోల్చితే, సమాచార శాఖలో పదవీ విరమణ పొందిన అధికారులు తమ రచనల ద్వారా నిత్యం ప్రజలతోనే సంబంధాలు కలిగి ఉంటారని పేర్కొన్నారు. ప్రస్తుత యువ అధికారులకు రిటైర్డ్‌ అధికారులు మార్గదర్శకులుగా ఉండాలని, తమ విశేషానుభవాలను ప్రస్తుత పౌర సంబంధాల అధికారులకు అందచేయాలని సూచించారు.

సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌ బి. రాజమౌళి మాట్లాడుతూ, శాఖలో విశేషానుభవం కలిగిన రిటైర్డ్‌ అధికారులు శాఖకు మార్గ దర్శకులుగా ఉండాలని కోరారు. ప్రముఖ సైకాలజిస్ట్‌ పట్టాభిరామ్‌ మాట్లాడుతూ, పదవీ విరమణ అనేది సహజమని, పదవీ విరమణ చెందిన అధికారులు పాజిటివ్‌ దృక్పథంతో, ఒత్తిడి లేని ప్రశాంత జీవనం గడపాలని తెలిపారు.

యశోదా హాస్పిటల్‌ సీనియర్‌ వైద్యులు డా. బాలరాజు మాట్లాడుతూ, వయస్సుతోపాటు మధుమేహం, రక్తపోటు లాంటి స్వల్ప వ్యాధులు అధికంగా వచ్చే అవకాశముందని, ప్రశాంతమైన జీవితంతోపాటు ప్రణాళికా బద్ధమైన దినచర్యలో వీటిని అధిగమించవచ్చని పేర్కొన్నారు.

కాగా, సుదీర్ఘకాలం తర్వాత సమాచార శాఖ రిటైర్డ్‌ అధికారులు, సర్వీసులో ఉన్న అధికారులు ఆత్మీయ సమావేశం పేరుతో ఒకే వేదికపై కలవడంతో శాఖలో తమ అనుభవాలు, తమ హయాంలో చేపట్టిన వినూత్న పబ్లిసిటీ కార్యక్రమాలు, ప్రస్తుత హయాంలో ప్రచార కార్యక్రమాల్లో రావాల్సిన మార్పులు తదితర అంశాలను విస్తృత స్థాయిలో చర్చించారు.

ఈ కార్యక్రమంలో సమాచార శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ నాగయ్య కాంబ్లే, ఎఫ్‌.డిసి. ఈడీ కిషోర్‌ బాబు, జెడి డీ.ఎస్‌. జగన్‌, ప్రెస్‌ అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర రావు, రిటైర్డ్‌ అధికారులు రామలింగారెడ్డి, ప్రభాకర్‌ రావు, పి. భాస్కర్‌, డి శ్రీనివాస్‌, ఇందిర, ఈ. వెంకటేశం, నబి సాహెబ్‌, రహమాన్‌ తదితరులు హాజరయ్యారు.

ఇటీవలి కాలంలో దివంగతులైన సమాచార శాఖ అధికారులకు గౌరవసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. సమాచార శాఖ అధికారులుగా విశేష అనుభవంతో రిటైర్‌ అయిన సీనియర్‌ అధికారులను రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థ సారధి ఘనంగా సన్మానించారు. మొత్తానికి సీనియర్‌ అధికారుల సమావేశం ప్రస్తుత తరం సమాచార శాఖ అధికారులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.