భాగ్యనగరి ‘కోహినూర్‌’ కొత్వాల్‌

భాగ్యనగరి-‘కోహినూర్‌’-కొత్వాల్‌నిజాం నవాబు నుంచి ‘రాజా బహద్దూర్‌’ బిరుదు, బ్రిటీష్‌ సర్కారు నుంచి ‘ఓ.టి.ఇ.’ బిరుదు పొంది, తాను పెద్దగా చదువుకోకపోయినా, పధ్నాలుగు సంవత్సరాలు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌గా పనిచేసి, గ్రామీణ విద్యార్థుల చదువు కోసం రెడ్డి హాస్టల్‌ స్థాపించి, ఎందరో తెలుగువారు వెలుగులోకి రావడానికి కారకుడైన మహానుభావుడు కొత్వాల్‌ వెంకటరామారెడ్డి. తెలంగాణ వైతాళికులలో ఆయనది ప్రథమస్థానం. పరిపాలన దక్షతకు ఆంగ్లవిద్యగాని, విదేశీయ శిక్షణగాని అవసరంలేదని వెంకటరామారెడ్డి చరిత్ర తెలుపుతుంది.

నగర కొత్వాల్‌ ఉద్యోగమంటే సామాన్యమైనదికాదు. దాని ప్రాముఖ్యత బట్టి ముఖ్యమంత్రి ఉద్యోగం తరువాత కొత్వాల్‌ ఉద్యోగానికే ఆనాడు ప్రాముఖ్యం. వెంకటరామారెడ్డి 1869వ సంవత్సరం ఆగష్టు 22న మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాలలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి కేశవరెడ్డి. తల్లి భారమ్మ. ఆయన పుట్టగానే కొన్ని మాసాలకు తల్లి మరణించింది. తన బాల్యంలో తొమ్మిది సంవత్సరాలు రాయణిపేటలో అమ్మమ్మ కిష్టమ్మ దగ్గర గడిచింది. చిన్నప్పుడు ఆయన ఖాన్గీ బడిలో భారత, భాగవతాలు చదివారు. తరువాత నాలుగు సంవత్సరాలు వనపర్తి పాఠశాలలో ఉర్దూ, ఫార్సీభాషను అభ్యాసప్రాయంగా అభ్యసించారు.

అనంతరం వెంకటరామారెడ్డి రాయచూరులో మేనమామ విలియమ్‌ వహబు వద్ద నాలుగు సంవత్సరాలుండి అక్కడి బడిలో, ఫారసీ, ఉర్దూతోపాటు కన్నడ, మరాఠీ భాషలు నేర్చుకున్నారు. మేనమామ వాహబు హఠాన్మరణం బాలుడు వెంకటరామారెడ్డికి ఆశనిపాతమైంది. మేనమామ స్థానంలో వచ్చిన నజర్‌మహమ్మద్‌ సహాయంతో 1886లో ముదిగ్లు ఠాణాకు అమీను (సబ్‌ఇన్స్‌పెక్టర్‌)గా నియమితులైనారు. నిజాయితీ, సమర్ధత, విధుల నిర్వహణలో చాకచక్యం కారణంగా అనతికాలంలో పదోన్నతి లభించింది. మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, గుల్బర్గా, అత్రాఫ్‌ బల్దా (రంగారెడ్డి) జిల్లాలో పోలీసు అధికారిగా విధులు నిర్వహించారు. ఆ తరువాత ఆయన రాజధాని నగరం హైదరాబాద్‌లో నాయెబ్‌ కొత్వాల్‌గా నియమితులైనారు. అనంతరం కొత్వాల్‌ (సిటీ పోలీస్‌ కమిషనర్‌) అయ్యారు.

ఏడుగురు ఆసఫ్‌జాహీ ప్రభువుల పాలనలో కొత్వాల్‌ పదవి పొందిన మొట్టమొదటి హిందువు వెంకటరామారెడ్డి. కొత్వాల్‌గా ఆయన ప్రతిరోజు నిజాం ప్రభువు వద్దకు వెళ్లి శాంతిభద్రతల పరిస్థితి వివరించేవారు. తన వద్దకు ఏ సమయంలోనైనా కొత్వాల్‌ వెంకటరామారెడ్డి రావటానికి నిజాం అనుమతి ఇచ్చారు. దాదాపు నలభై ఎనిమిది సంవత్సరాలు ఉద్యోగ జీవితం అనంతరం 1933 ఏప్రిల్‌లో ఆయన పదవీ విరమణ చేశారు. అనంతర కాలంలో నిజాం ప్రభువు ఎస్టేటు సర్ఫెఖాస్‌కు ప్రత్యేక అధికారిగా వ్యవహరించారు. ఆయనకు అనేక సన్మానాలు, సత్కారాలు జరిగాయి. 1921లో నిజాం రాజు తన జన్మదినోత్సవ సందర్భాన వెంకటరామారెడ్డిని రాజ్‌ బహద్దూర్‌ బిరుదుతో సత్కరించారు. 1931లో బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనకు ఓ.టి.ఇ (ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటీష్‌ ఎంపైర్‌) బిరుదుతో సన్మానించింది. వేల్స్‌ యువరాజు (ఎనిమిదవ ఎడ్వర్ట్‌), వైస్రాయ్‌ హైదరాబాద్‌ నగరం వచ్చినప్పుడు ఆయన కావించిన భద్రతా ఏర్పాట్లు అందరి మన్ననలు పొందాయి. వేల్స్‌ యువరాజు ఆయనకు వెండి సిగరేటు కేసు బహూకరించారు. రాజాబహద్దూర్‌ దర్పం ఏమిటో ఎవరికీ తెలియదు. కానీ, గ్రామీణ ప్రజలనుంచి అత్యున్నత స్థానంలో ఉన్నవారు మాత్రం ఆయన పనులను గౌరవించేవారు. ఆయన ఉత్తర్వులను కాదన్నవారు లేరు.

రాజ్‌బహద్దూర్‌ ఒక మహా సంస్థ వంటి వ్యక్తి. ఆయన నిజాం ప్రభువుకు ఎంత విధేయుడుగా ఉన్నా, ప్రజా సంస్థలకు, రాజకీయ పార్టీలకు, యువజన సంస్థలకు, విద్యార్థులకు సన్నిహితులుగా ఉండేవారు. రాజ్‌ బహదుర్‌ పరిష్కారం వల్లనే తమకు న్యాయం జరుగుతుందని రాజకీయ పక్షాలు భావించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సామరస్యం, సహనంతో ఎంతటి జటిలమైన కేసునైనా ఆయన న్యాయబద్ధంగా పరిశీలించేవారు. ఆయన ఎన్నో సంస్థలను పోషించారు. శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్రభాషా నిలయం వేమనాంధ్ర భాషా నిలయం, బాల సరస్వతి గ్రంథాలయం, పురోభివృద్ధికి ఆయన సహాయమందించారు. నారాయణగూడలోని బాలికల ఉన్నత పాఠశాలకు ఆయన పెన్నిధిలాంటివారు. ఎవరు ఆయన దగ్గరికి వెళ్లినా మొదటి ప్రశ్న బాలికల పాఠశాలకు విరాళం ఎంత ఇస్తారని. రాజా బహద్దూర్‌తో ఆ రోజుల్లో పనిలేని జాగీర్దార్లు, సంస్థానాధీశులు లేరు. గోల్కొండ పత్రిక, రెడ్డి హాస్టల్‌ ఆయన కృషి ఫలితంగా ఏర్పడ్డవే. 1945లో ఓరుగల్లులో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్‌ ద్వితీయ వార్షికోత్సవాన్ని ఆయన ప్రారంభించారు.

వెంకటరామారెడ్డి సంస్కరణాభిలాషి. ఆయన బాల్య వివాహాలను వ్యతిరేకించారు. అస్పృశ్యతా దురాచారాన్ని ఖండించారు. హరిజనోద్ధరణ సంఘాలకు సహాయపడ్డారు. అనాధబాలల ఆశ్రమాలకు, కుష్ఠు నివారణ కార్యక్రమాలకు, జంతు హింసా నివారణ సంస్థలకు ఆయన తన సహాయమందించారు. ఆ రోజుల్లో హైదరాబాద్‌ రాష్ట్రంలో పెంపుడు పిల్లలను నవాబు , ధనవంతులు తమ సేవలో ఉంచుకొని శాశ్వతంగా తమ బానిసలుగా చేసుకునేవారు. ఈ విధానానికి స్వస్తి చెప్పడానికి రాజా బహద్దూర్‌ శాసన సభలో ఒక శాసనం తెప్పించారు. హైదరాబాద్‌లో ఆయన పేరుతో ఒక మహిళా కళాశాల స్థాపితమైనది. తేజోమూర్తి, జాతి వైతాళికుడు వెంకటరామిరెడ్డి 1953 జనవరి 25న హైదరాబాద్‌లో మరణించారు.