కోమటి చెరువు… సంగీత జల దృశ్యం!
By: యం. రామాచారి, సిద్ధిపేట
నీటి పై తేలియాడే మ్యూజికల్ ఫౌంటెయిన్, జల దృశ్యం, మ్యూజిక్‌తో పాటు.. విద్యుత్ కాంతులతో సిద్ధిపేటలోని, కోమటి చెరువు సరికొత్త సొబగులు అద్దుకుంటూ వీక్షకులను మంత్రముగ్దులను చేస్తుంది. ఈ సంగీత జల దృశ్య ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఆక్వా స్క్రీన్ మ్యూజికల్ ఫౌంటెయిన్ ప్రదర్శన ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు ఉంటుంది. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా రూపొందించిన కంటెంట్‌తో ప్రతి రోజు రెండు నుంచి మూడు షోలు ప్రదర్శించేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. గుజరాత్‌లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద ఉన్న ఇలాంటి ఆక్వా స్క్రీన్ ను తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా సిద్ధిపేట కోమటి చెరువులో ప్రారంభించి ప్రజలకు అంకితం చేశామని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా అత్యద్భుతంగా పర్యాటక క్షేత్రంగా కోమటి చెరువును అభివృద్ధి చేసుకున్నామని మంత్రి చెప్పారు. సిద్ధిపేట ప్రజల కలలకు అనుగుణంగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా.. సిద్ధిపేట మినీ ట్యాంకు బండ్ పై రూబీ నెక్లెస్ రోడ్, ఆక్వా స్క్రీన్ మ్యూజికల్ ఫౌంటెయిన్, గ్లో గార్డెన్‌ను ప్రారంభం చేసి ప్రజలకు అంకితం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సద్దుల బతుకమ్మ పండుగ రోజున మంత్రి దీనిని ప్రారంభించారు.

తేలియాడే ఫౌంటెయిన్ సంగీత జల తెర ప్రత్యేకతలు :
దేశంలోని గుజరాత్ రాష్ట్రం వడోదరా నర్మదా నది పై ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేటలో మొట్టమొదటి తేలియాడే మ్యూజికల్ ఫౌంటెయిన్ సంగీత జల దృశ్యం ఉన్నది.

– దీంట్లో రెండు లేజర్స్, 320 నాజిల్స్ దీనిలో అతర్భాగంగా ఉంటాయి.
– నీటి నుంచి 4 నాజిల్స్ ద్వారా ఫ్లేమ్ (మంట) బయటకు వచ్చేలా ఏర్పాట్లు దీని ప్రత్యేకత.
– ప్రతి రోజూ సాయంత్రం 6.30 గంటల నుంచి నీటి పై తేలియాడే ఫౌంటెయిన్ సంగీత జలదృశ్య ప్రదర్శన ఉంటుంది.
– తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా రూపొందించిన కంటెంట్‌ను రోజుకు 2 నుంచి 3 షోల ద్వారా ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు.
– ఒక్కో షో సమయం 20 నిముషాలు కాగా 9 నిముషాలు వీడియో, 9 నిముషాలు సాంగ్ ప్రదర్శన ఉంటుంది. – తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేకంగా వీడియోలు రూపొందించే బాధ్యతలను టూరిజం నిర్వహిస్తున్నది.