|

తెలంగాణకు కొండంత అండ!

kondaతెలంగాణ రాష్ట్రం ఏర్పడి స్వయం పోషకం కాగానే ఎప్పుడో ఆరేళ్ళకు విశాలాంధ్రను ఎవరు కోరరు. ఆంధ్రతో పోలిస్తే తెలంగాణ ఆదాయం 4 కోట్లు ఎక్కువ. విశాలాంధ్ర ఏర్పడితే అది మనకు దక్కదు. ఈ డబ్బుతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సాధించవచ్చు. కనుక తెలంగాణను విశాలాంధ్ర వచ్చి ఏదో ఉద్ధరిస్తుందనే భ్రమతో ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించడం భావ్యం కాదని కొండా వెంకటరంగారెడ్డి 1955 అక్టోబరు 22న కొత్త ఢిల్లీలో స్పష్టంగా చెప్పాడు.

పూర్వపు హైదరాబాద్‌ సంస్థాన రాజకీయాలలో కొండా వెంకటరంగారెడ్డి కొండంత వ్యక్తి. పూర్వకాలపు పద్ధతులలో పెరిగిన రైతుబిడ్డ. ఏదైన పని తలపెడితే అది అయ్యేవరకు తను నిద్రపోలేదు. సహచరులను నిద్రపోనివ్వలేదు. అందు ఆయనంటే మందమతులకు, కుహన నాయకులకు సింహస్వప్నం. కొత్వాలు వెంకటరామారెడ్డి తరువాత నాయకత్వం వహించడానికి తయారైన వకీలు, ఆంధ్రజన సంఘంలో చేరి 1936లో షాద్‌నగర్‌లో జరిగిన అయిదవ ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించాడు. ప్రజాహిత కార్యాలలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ పక్షానికి ప్రాణదాత. ఆయన సహకారం, నాయకత్వం లేకపోతే ఆ పక్షం నిలిచేదికాదు. ఆ పక్షమే లేకపోతే ఆనాడు స్టేటు కాంగ్రెస్‌ పని చేసేదికాదు.

రంగారెడ్డి నిజాయితీ పరుడని ప్రతీతి. నిష్కల్మషుడని పేరు పొందాడు. మనసులోని మాటపైకి అనేసే స్వభావం కలవాడు. ఈయనది విపరీతమైన ప్రాంతీయాభిమానం. తెలంగాణా భక్తుడు, ఉర్దూ వకీలు, తరువాత నాయకులలో ముఖ్యాతి ముఖ్యుడై స్వరాజ్యానంతరం మంత్రి పదవినీ, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పదవినీ అలంకరించాడు. అనంతరం కాలంలో ఆయన పేరున రంగారెడ్డి జిల్లా ఏర్పడింది.

కొండా వెంకటరంగారెడ్డి 1891 డిసెంబర్‌ 12న ఆనాటి అత్రాఫ్‌ బల్దా (ఈనాటి రంగారెడ్డి జిల్లా) మంగళారం గ్రామంలో జన్మించాడు. ప్లీడరీ చేసే రోజుల్లో రంగారెడ్డి వకీళ్ళను తయారు చేసేలా క్లాసులు నడిపాడు. కోత్వాల్‌ వెంకటరామారెడ్డి అంతటి వ్యక్తికి న్యాయ సలహాదారుగా ఉండేవాడు. ఆంధ్రపితామహా మాడపాటి వారిపై రంగారెడ్డిని గురుభావం ఉండేది. అందుకనే 1946లో ఆంధ్రపితామహుని షష్టిపూర్తిని హైదరాబాద్‌లో ఘనంగా జరిపించి ఆ విధంగా తన గురుదక్షిణ చెల్లించుకున్నాడు. పోలీసు చర్య తరువాత హైదరాబాద్‌ రాష్ట్రానికి ఒక తెలంగాణ నాయకుడు ముఖ్యమంత్రి కావడం, మరో నాయకుడు మునిసిపల్‌ కార్పొరేషన్‌ తొలి మేయర్‌ కావడం ఆయన కృషి ఫలితమే. అనుకున్నది చేయడం, చేయగలిగింది అనడం తప్ప ఆయనకు మరో మార్గంలో వెళ్లలేదు.

వకీళ్ళకు ప్రతినిధిగా మజ్లిస్‌ ఎ.ఎజె ఖవానీన్‌ శాసనసభకు ఎన్నికై రైతాంగానికి నిరుపమానమైన సేవ చేశాడు. 30 బిల్లులు రైతులకు సంబంధించిన సమస్యలపై ఆ సభలో ప్రవేశపెట్టాడు. కులాంతర వివాహాల్లో స్త్రీలకు పౌరసత్వ హక్కులుండాలని ఆనాడే ఆయన ప్రతిపాదించాడు. 1924లో వేమన గ్రంథాలయాన్ని స్థాపించి గ్రంథాలయోద్యమానికి రంగారెడ్డి చాలా సేవ చేశాడు. ఆ గ్రంథాలయ భవన నిర్మాణానికి ఆ¬ రాత్రులు కృషి చేసి ఒక మేటి భవనాన్ని కట్టించాడు. అంతేగాక ఆది నుంచి శ్రీ కృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయంతో సంబంధం పెట్టుకొని తదభ్యున్నతికి తోడ్పడ్డాడు. చాలా కాలం ఆ గ్రంథాలయానికి ఉపాధ్యక్షుడుగా సేవలందించాడు. రెడ్డి జన సంఘానికి ఆయన చేసిన సేవ అమూల్యం తెలంగాణా ఏకైక జాతీయ పత్రిక గోల్కొండ పత్రిక. వృద్ధికి తేవడానికి ఆయన ప్రధాన పాత్ర వహించాడు. 1940లో జాగీరు ప్రజా సంఘాన్ని స్థాపించి దాని కార్యదర్శి గాను, అధ్యక్షుడుగాను పనిచేశాడు. జాగీరు రైతుల సంక్షేమానికి పాటుపడ్డాడు. దాదాపు మూడు దశాబ్దాల కాలం తెలంగాణా రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్న రంగారెడ్డి మితవాదిగానే ఉండి పోయాడు. పదవ ఆంధ్ర మహాసభ రాజధాని నగరమైన హైదరాబాద్‌లో 1943 మే 23, 24, 25 తేదీలలో జరిగింది. కమ్యూనిస్టులు గణనీయమైన సంఖ్యలో ప్రతినిధులుగా వచ్చారు. అయితే కొండా వెంకటరంగారెడ్డ్డిి, బద్దం ఎల్లారెడ్డి మధ్య జరిగింది మితవాది రంగారెడ్డి గెలిచారు. బద్దం ఎల్లారెడ్డి ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి, రావి నారాయణ రెడ్డిలను కార్యవర్గ సభ్యులుగా నియమించారు. వీరికి మంచి కమ్యూనిస్టులని పేరు ఉండేది. వీరిని ప్రత్యేకంగా చూసారు. తెలంగాణ రాజకీయాలలో స్వామీ రామానంద తీర్థ ప్రభావం తటస్థంగా ఉంచటానికి ఈ చర్య తీసుకొని ఉంటారు.

తెలంగాణా రాజకీయాలలో రంగారెడ్డి, రావి నారాయణ రెడ్డి ఉత్తర, దక్షిణ ధృవాల లాంటివారు. ఆ రోజుల్లో తెలంగాణాలో ఆంధ్రులకు ప్రాతినిధ్యం వహించిన పెద్ద సంస్థ ఆంధ్ర మహాసభ ఒక్కటే. అది కమ్యూనిస్టుల హస్తగతం కావడం రంగారెడ్డి సహించలేక పోయాడు. 1946లో స్టేటు కాంగ్రెస్‌పై నిషేధం తొలగిపోగానే ఆంధ్రమహాసభను రద్దు చేసి దాన్ని స్టేటు కాంగ్రెస్‌లో కలిపివేశాడు. స్టేటు కాంగ్రెస్‌లో రెండు వర్గాలేర్పడ్డాయి. ఒక వర్గానికి స్వామీజీ నాయకుడు. స్వామీజీవర్గం అతివాద వర్గంగా చెలామణి అయింది. గాంధీజీ జన్మించిన నేలలో నేను మార్క్స్‌ను చూడలేను అనే సిద్ధాంతం కలిగిన రంగారెడ్డి తన రాజకీయాలు ఆ ధోరణిలోనే నడిపాడు. స్టేటు కాంగ్రెస్‌ మధ్య సయోధ్య ఏర్పడగానే రంగారెడ్డి కొంతకాలం స్టేటు కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి నిర్వహించాడు. పోలీసు చర్య అనంతరం ఆయన రెండు సంవత్సరాలు భారత రాజ్యాంగ సభ సభ్యుడుగా ఉన్నాడు. బూర్గుల మంత్రి వర్గంలో ఆయన రెవిన్యూ, ఎక్సయిజు శాఖలు నిర్వహించాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో ఏ మాత్రం రాజీపడని రంగారెడ్డి చివరకు పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చేయవలసివచ్చింది. సంజీవరెడ్డి అనంతరం ఆయనే ముఖ్యమంత్రి అవుతాడని చాలా మంది అనుకున్నారు. కానీ అది సంజీవయ్యకు వచ్చింది. సంజీవయ్య మంత్రివర్గంలో ఆయన ఉపముఖ్యమంత్రిగా ఉన్నాడు. అవసరమైతే సర్దుకుపోయే తత్వం ఆయనది. రంగారెడ్డి గారికి తన మాతృభాష తెలుగుకన్న, అధికార భాష ఇంగ్లీషుకన్నా నిజాం కోర్టు భాషలైన ఉర్దూ, ఫార్సీలలోనే ఎక్కువ ప్రావీణ్యం ఉండేది. ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌లో ఆయన ఉర్దూలోనే తజివీజులు (పరిష్కారాలు) చేసాడు. ఉమ్మడి ప్రజల గుర్తింపు కోసం వాటిని ఇంగ్లీషులో తర్జుమా చేసుకోవలసివచ్చేది. ఎప్పుడూ రాజకీయాలలో తలమునకలై ఉండే రంగారెడ్డికి జంటనగరాలలో అనేక సాహితీ సాంస్కృత సంస్థలతో సంబంధం ఉండేది. రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ పితగా పేరు తెచ్చుకున్న కొండా వెంకటరంగారెడ్డి 1970 జూలై 24వ తేదీన కన్నుమూసాడు.