|

పెద్దాయన

By: శ్రీమాశర్మ

కొణిజేటి రోశయ్య వెళ్లిపోయారు. పంచెకట్టుతో నిలువెత్తు తెలుగుదనం మూటగట్టుకున్న పెద్దమనిషి. ఆహారంలో, ఆహార్యంలో, వ్యవహారంలో పల్లెదనం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉండేది. ఆయన మాటలు వింటూ వుంటే ఒకప్పటి మన ఊరు శెట్టిగారితో మాట్లాడుతున్నట్లు పాతరోజులు చాలామందికి గుర్తుకు వస్తాయి. పల్లెల్లో పుట్టిపెరిగినవారికి ఇది అనుభవంలోకి వస్తుంది.

సామాన్యుడుగా కనిపించే రోశయ్య సామాన్యుడు కాడు. అసామాన్యుడు. రాజకీయాల్లో ఆరితేరిన అఖండుడు. సంపూర్ణ జీవితాన్ని పరిపూర్ణంగా పండిరచుకున్న అదృష్టవంతుడు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్‌గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, రాష్ట్ర మంత్రిగా సుదీర్ఘమైన విజయ ప్రస్థానం ఆయనది. అన్నేళ్లు రాజకీయాల్లో ఉన్నా, అందరు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినా, అజాతశత్రువుగానే పేరు తెచ్చుకున్నారు. అలాఅనిచెప్పి, పూర్తిగా శాంతస్వభావుడు కూడా కాదు. ఆవేశకావేశాలు, రాగద్వేషాలు ఆన్నీ ఉన్నవాడే. కాకపోతే, వాటన్నింటినీ అదుపులో ఉంచుకోగలిగిన శక్తియుక్తులు, వివేకం పుష్కలంగా ఉన్నాయి.

జవహర్‌ లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ, పీవీ నరసింహారావు వంటి పెద్దలను దగ్గర నుంచి చూచినవాడు. టంగుటూరి ప్రకాశంపంతులు, ఆచార్య ఎన్‌.జి రంగా వంటి అఖండులతో దగ్గరగా మెలిగినవాడు. ఎన్‌.జి రంగాకు ప్రియశిష్యుడుగా ప్రస్థానం ప్రారంభించి, అందరి ఊహలకు మించి ఎదిగాడు.అన్ని పదవులు వరించినా, పైరవీలు చేసి సంపాయించుకున్నవి కావు. ప్రతిభావంతుడు, సమర్థుడు, విశ్వాస పాత్రుడు, వినయశీలి అనే మంచిపేరు ఇన్ని పదవులను తెచ్చిపెట్టాయి. ఆయన అజాతశత్రువే కాదు, అపర కౌటిల్యుడు, చాణక్యుడు కూడా. ఆ మాటలు రోశయ్య విషయంలో పడికట్టు పదాలు కావు.తూకం వేసినట్లు సరిపోతాయి.

కౌటిల్యుడు ‘అర్ధశాస్త్రం’ రాశాడని మనం పుస్తకాల్లో చదువుకున్నాం. దానిని అక్షరాలా, అంకెల్లో ఆచరించడానికి ప్రయత్నం చేసిన మంత్రివర్యుల్లో రోశయ్యది తొలి వరుస. గంభీరమైన వాతావారణాన్ని కూడా క్షణాల్లో నవ్వులమయం చేసే హాస్యచతుర సంభాషణ, ఎంతటి ప్రత్యర్థినైనా ఉన్నపళంగా నవ్వులపాలు చేయగలిగిన వాగ్ధాటి, ఎక్కడెక్కడి అంకెలనో అలవోకగా చెప్పగలిగిన జ్ఞాపకశక్తి, వివాదాలకు దూరంగా ఉండాలనే విజ్ఞత, అధినాయకుల పట్ల విధేయత, పదవుల యెడల భయభక్తులు మొదలైన సుగుణాలన్నీ మూర్తీభవించిన కోవిదుడు రోశయ్య. ఎందరు ముఖ్యమంత్రులు మారినా, ద్వితీయ స్థానం ఆయనదే. ద్వితీయ స్థానమైనా, దానిని అద్వితీయంగా మలుచుకున్న చతురుడు. మాటలతూటాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడినా, వారిపై రవ్వంత ద్వేషభావం ఉండేది కాదు. సహజంగానే ఆయనకు ఎవరిపైనా శత్రుత్వం ఉండదు.ఈ భూమిపై శత్రువులు లేకుండా ఎవ్వరూ ఉండరు. ‘అజాతశత్రువు’ అంటే శత్రువులు లేకుండా ఉండడం కాదు, ‘శత్రుత్వం’ అనే భావన పుట్టుకతో లేకపోవడమే అజాత శత్రుత్వం. ఆ సుగుణాన్ని పుణికి పుచ్చుకున్నవాడే ‘అజాత శత్రువు’. రోశయ్య ఆ కోవకు చెందినవాడు. సందర్భం వచ్చినప్పుడు ఎన్టీఆర్‌, చంద్రబాబునాయుడు వంటివారిని కూడా లెక్క చెయ్యలేదు. రోశయ్య మాటలదాడికి తట్టుకోలేకనే అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ శాసన మండలిని రద్దు చేయాల్సి వచ్చింది. అది రోశయ్య వాగ్ధాటికి పతాక !

ఒక సందర్భంలో, అసెంబ్లీలో చంద్రబాబునాయుడుపై మాటల యుద్ధం చేసిన వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యింది. మీకు తెలివితేటలు, కోపం ఈ మధ్య బాగా ఎక్కువైపోయాయాని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు రోశయ్య అంతకంటే దీటుగా సమాధానం చెప్పి, అందరినీ అవాక్కయ్యేలా చేశారు. ‘‘అవును, నాకు కోపం బాగా ఎక్కువైంది. సభలో కొందరి ప్రవర్తన ఆ పరిస్థితి తెచ్చింది. నాకే తెలివితేటలు ఉంటే? వై.ఎస్‌ రాజశేఖరరెడ్డిని, చెన్నారెడ్డిని, విజయభాస్కరరెడ్డిని ఎప్పుడో వెన్నుపోటు పొడిచి, ముఖ్యమంత్రి పదవిని లాక్కొని ఉండేవాడిని’’ అంటూ రోశయ్య చేసిన ఎదురుదాడిని చూస్తే, రోశయ్య ఎంతటి ఘటికుడో తెలుస్తుంది.’’ ‘‘ఎన్టీఆర్‌ను మీరు ఎంత గౌరవంగా చూచారో! లోకానికి తెలుసు.కొంతకాలం గౌరవించారు, మధ్యలో పోయింది,మళ్ళీ వచ్చింది’’ అంటూ చంద్రబాబుపై రోశయ్య మాటలను తూటాలుగా చేసుకుంటూ పడిపోయిన తీరు ఎవ్వరినైనా విస్మయ పరవక మానదు. ఓవర్‌ డ్రాఫ్ట్‌లను వాడుకొనే విషయంలో ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటుపై ఆయన వేసిన వ్యంగ్యాస్త్రాలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. వై.ఎస్‌ రాజశేఖరరెడ్డి ఆ మాటలను పదే పదే గుర్తుచేసుకొని పడిపడి నవ్వుకునేవారు.’’ ప్రతి గ్రామంలో స్మశానం ఉంటుంది. అట్లే, అధికారంలో ఎవరున్నా ఓవర్‌ డ్రాఫ్ట్‌ వాడుకొనే సౌకర్యం ఉంటుంది. సౌకర్యం ఉందికదా అని స్మశానాలను వాడుకుంటామా?’’ అంటూ రోశయ్య పేల్చిన హాస్యతునక హాస్యానికి పరాకాష్టగా నిలుస్తుంది. ‘‘మారడం అంటే, నేను ప్యాంటు వేసుకోవడం, చంద్రబాబు పంచె కట్టుకోవడం కాదు’’ అని రోశయ్య చెప్పిన మాటలు రాజకీయ వర్గాల్లో బాగా పేలిపోయాయి. ‘‘గల్లాపెట్టెలో డబ్బులైనా ఉండాలి, లేదా బయట సరుకులైనా కనిపించాలి. లేకపోతే, ప్రభుత్వం దివాలా తీసినట్లే’’ అని రోశయ్య చెప్పిన మాటలు కౌటిల్యుడి అర్థశాస్త్ర సూత్రాలను గుర్తుకు తెస్తాయి. ఇటువంటి రసగుళికలు రోశయ్య అంబులపొదిలో చాలా ఉండేవి.

ఆర్థిక మంత్రిగా పనిచేసినంత కాలం, రాష్ట్ర బడ్జెట్‌ను అదుపులో పెట్టడానికి అహరహం తపించేవారు. ముఖ్యమంత్రుల మనసెరిగి నడుచుకుంటూనే, వారిని కట్టడి చేసే ప్రయత్నం చేసేవారు. సంక్షేమం – అభివృద్ధి రెండిరటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడంలో అంజయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి వంటి హేమాహెమీలైన ముఖ్యమంత్రులకు అండగా నిలిచిన ఘన చరిత్ర కేవలం రోశయ్య సొంతం. వారంతా విభిన్నమైన మనో ప్రవృత్తి కలిగినవారు. వారందరినీ తట్టుకొని నిలబడ గలగడం, మెప్పించడం సామాన్యమైన విషయాలు కావు. ఏకస్వామ్యంగా వ్యవహరించే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కూడా ఎంతగానో మెప్పించారు. నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరిగి ధన్యుడయ్యారు. రెండవసారి కూడా గవర్నర్‌గా పదవీ కాలాన్ని పెంచాలని జయలలిత వంటి నేత అనుకున్నదంటే? అది రోశయ్యకే సాధ్యమైంది. బిజెపి ప్రభుత్వం రావడం వల్ల అది జరగలేదు కానీ, లేకుంటే తప్పకుండా రెండు పర్యాయాలు వరుసగా తమిళనాడు గవర్నర్‌గా చరిత్ర సృష్టించి ఉండేవారు.

అంతమంది ముఖ్యమంత్రులు, అటువంటి నేతలతో శభాష్‌ అనిపించు కోవడం వెనకాల కేవలం లౌక్యం మాత్రమే పనిచేసిందనుకోరాదు. కేవలం ‘ఎస్‌ బాస్‌’ ధోరణి కూడా కానే కాదు. అందరికీ తలలో నాలుకలా మెసలు తూనే, ఎప్పుడు ఏమి చెప్పాలో అది చెబుతూ, అనవసరమైన వాటిని నిర్ద్వం ద్వంగా ఖండిస్తూ ముందుకు సాగేవారు. పదహారు విడతల ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ బడ్జెట్‌ ప్రతిపాదనలు చేసిన సుదీర్ఘ అనుభవం కేవలం ఆయన సొత్తు.

2009 సెప్టెంబర్‌ 2వ తేదీ నాడు వై.ఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలీకాప్టర్‌ ఆచూకి తెలియక యంత్రాంగం కొట్టుమిట్టాడుతునప్పుడు ఆన్నీ తానై ప్రభుత్వ వ్యవస్థను నడిపిన ధీశాలి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమీర్‌ పేటలోని భూమి వ్యవహారంలో ఆరోపణలు వచ్చినా, తర్వాత కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చి, ఆయన పరువును నిలబెట్టింది. ఆర్థిక మంత్రిగా ప్రసిద్ధికెక్కినా, అనేక శాఖలు నిర్వహించారు. అన్ని శాఖలనూ అంతే సమర్థ వంతంగా నిర్వహించారు. ఆయన జీవితంలో కష్టమైన రోజుల గురించి చెప్పాలంటే అది ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలమే. రెండవ స్థానంలో ఎంతో విజయవంతమైన ఆయన ప్రథమ స్థానంలో రాణించలేక పోయారు. మారిన రాజకీయ సంస్కృతి నేపథ్యంలో, ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం మనలేక పొయ్యారు. ముఖ్యమంత్రి పదవిని ముళ్లకిరీటంగానే భావించుకుంటూ వచ్చారు. ఆ పదవి నుంచి దిగిపోయి గవర్నర్‌గా పనిచేసినంతకాలం ఎంతో హాయిగా ఉన్నారు.

కష్టాన్ని, తెలివిని నమ్ముకొని, ఓర్పు, సహనం పాటిస్తూ పైకొచ్చారు. ఎదగడం, ఒదగడం రెండూ తెలిసిన ప్రాజ్ఞుడు. బలహీనతల మధ్య నడుస్తూ బలాన్ని పెంచుకున్న సాహసి. సంఖ్యాబలం లేని సామాజిక వర్గం నుంచి వచ్చి, రాజకీయాల్లో రాణించిన ఘనత ఆయనది.పెద్దసంపన్న కుటుంబ నేపథ్యం కూడా ఉన్న వాడు కాదు.అంతా రెక్కల కష్టం, లెక్కల కష్టం. 90ఏళ్ళ వయస్సుకు చేరువవుతున్న తరుణంలో తనువు చాలించారు. సహస్రచంద్ర దర్శనం చేసుకున్న జాతకుడు. కరుడుగట్టిన రాజకీయాల్లో కాకలు తీరిన నాయకుడుగా పేరు తెచ్చుకున్నా, మానవీయ స్పర్శను ఎన్నడూ వీడలేదు.

రోశయ్య నిష్క్రమణతో తెలుగు రాజకీయల్లో పాతతరం కనుమరుగై పోయింది. రోశయ్య మృతికి తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నివాళి సమర్పించింది. మూడు రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించింది. పార్థివ దేహానికి ముఖ్యమంత్రి కెసీఆర్‌ అంజలి ఘటించారు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేటీఆర్‌ మొదలైన మంత్రులు కూడా నివాళి సమర్పించి తమ గౌరవాన్ని, అభిమానాన్ని చాటి చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో విడదీయలేని అనుబంధం పెనవేసుకున్న అగ్రశ్రేణి నాయకుడు రోశయ్య. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన స్మృత్యర్ధం ఏదైనా విశేష కార్యక్రమాన్ని తలపెట్టడం సముచితం.