బీళ్ళభూమి కాదు
By:- కోటం చంద్రశేఖర్
బీళ్ళభూమి కాదు
మొళ్ళభూమి కాదు
రాళ్ళభూమి కాదు
అటు చూడు
అలుగులు ఆడుతున్నాయి
గుంటలు నీటిగంటలు మొగిస్తున్నాయి
పగుళ్ళభూమి కాదు
దిగుళ్ళభూమి కాదు
కన్నీళ్లభూమి కాదు
ఇటు చూడు
కొండల్ని చుట్టుకొని
అడవుల్ని దాటుకొని
వాగులు వయ్యారాలు పోతున్నాయి
సెలయేళ్ళు పరవళ్ళు తీస్తున్నాయి
మాది నీళ్ళభూమి
ఇంకుడు గుంతలు కొట్టాం
చెక్డాములు కట్టాం
ప్రాజెక్టులు చేపట్టాం
నీళ్ళభూమి మాది
కష్టాల కొలిమిలోంచి
దారిద్రపు శృంఖలాల్లోంచి బైటపడ్డాం
కరువు కదలికల్ని కట్టడిచేసే
వాననీళ్ళో వరదనీళ్ళో
చెర్లు బోర్లు నిండి నీళ్ళు
పల్లెలన్నీ పసిడిపంటల లోగిళ్ళు
చిత్రకారుడు నీటికుంచెతో ఎంత
అందమైన చిత్రం గీశాడు
జీవనప్రస్థానం సజావుగా సాగడానికి
నీరెంత అవసరమో చెప్పాడు
చేయూతతో
రైతుహిత సేద్యం
సర్వహిత జనామోదం