కోటిలింగాలలో తవ్వినకొద్దీ నాణేలు !
By: డా॥ సంగనభట్ల నరసయ్య
(గతసంచిక తరువాయి)

చరిత్రకందినంత వరకు కోటిలింగాల శాతవాహనుల తొలిరాజధాని నగరం. కేవలం శాసనాల్లో నామమాత్రంగా లభించిన రాజు శ్రీముఖుని నాణెములు ఇక్కడ పదులకొద్ది లభించాయి. సిరి సతవహన, సతకణి, సతసిరి, వాసిట్ఠిపుత పులోమావి, వాసిట్ఠి పుత సతకణి నాణెములు, గోబదవి (915) నాణెములు, నరనవి (3) నాణెములు, కంవాయ (4), సమగోప (39) నాణెములు దొరికినవి. నాణెములు అధికంగా లభించిన ఈ ప్రాంతంలో పురావస్తు శాఖ 1979-84 మధ్య జరిపిన తవ్వకాలవల్ల ప్రాచీన నగరం బయలుపడింది.
గోదావరి తీరస్థమైన ధర్మపురి (నియోజకవర్గంలో) ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి వాలుగా 10 కి.మీ. కింద ఉన్న ఈ కోటిలింగాల గ్రామంలో పురావస్తుశాఖ తవ్వ కాలు చేపట్టింది. దాంతో 2500 సంవత్సరాల కిందటి ప్రాచీన (గర్భ) నగరం తవ్వకాలలో 2.5 మీ. లోతులో ఆవాస తలములు బయట పడటమేకాక, అమూల్య మైన నాణెములు లభించాయి. ఇక్కడ లభించినన్ని నాణెములు, వైవిధ్యం, విశిష్టతలు భారతదేశంలో ఏ ప్రాంతంలో లభించలేదంటే అతిశయోక్తి కాదు. పొలాల్లో కుప్పలు తెప్పలుగా వర్షం పడ్డాక దొరికేవి. 2.5 మీటర్ల లోతులో రాజ్ఞోగోబద పేరుతో నాణెములు, 1.78 మీటర్ల లోతులో రాజ్జో సామగోప నాణెములు, 1.90 మీటర్ల లోతులో శ్రీ సాతవాహ నాణెములు, 1.22 మీటర్ల లోతులో శ్రీ సాతకర్ణి నాణెములు, 0.38 మీటర్ల లోతులో చిముకుని (శ్రీముఖుని) నాణెములు లభించినాయి. ఒకటవ పులోమావి, మహాసేనాపతి సగమన, కంవాయ సిరి నాణెములు, మహాతలవర, సిరినారన నాణెములు ఉపరితలంలో లభించాయి. ఇవికాక పంచ్ మార్క్, నాణెములు (విద్ధాంక నాణెములు), రాతలేని పక్కలు గల నాణెములు, మహారథి, మహాగ్రామిక, శివ సేబక, సాధకస పేర్లుగల నాణెములు కూడా దొరికాయి. తయారు స్థితిలోనివి, పునర్ముద్రితాలు, సగం తయారైన నాణెములు, లభించడంవల్ల ఇక్కడ కోశాగారం నాణెముల ముద్ర ణాలయం (Mint) ఉండేదన్నది స్పష్టం. ప్రభుత్వానికి లభించినవే గాక గ్రామ ప్రజల చేతిలో ఇంకా ఉన్నవి, కరగవేసినవి, వెండి, రాగి, సీసము పొటీను, ఇత్తడితో చేసినవి కలిపి వెయ్యికి పైగా నాణెములు లభించాయి. రాగితో చేసినవే అధికం. వెండినాణేలు నొక్కుడు గుర్తు గలవి. ఒక నాణెంపై మరొక రాజు నాణెం గుర్తించడం కూడా జరిగింది. కేవలం ఆనంతరికులైన తన వంశస్థులచేత నానేఘాటు శాసనంలో పేర్కొనబడ్డ శ్రీముఖుడు ఇక్కడ రాజ్యస్థాపనచేసి పరిపాలించినట్టు ఆయన నాణెముల వల్ల బయటపడింది. నిజానికి ఇక్కడ లభించిన నాణెములలో శ్రీముఖుడే అర్వాచీనుడు. అతనికి ముందు రాజన్యుల నామములతో నాణెములు లభించడం చేత, అవికూడ భూమి లోతులో కింది పొరలలో లభించడంతో వీటి మీద విశేష పరిశోధన సాగి తొలి శాతవాహన రాజ్యం రాజధాని నగరం ఇక్కడేనని నిర్ధారించవచ్చు.
నాణెములపై రాజుల పేర్లు లభించిన వారిలో గోభద్రుడు (గోబద) ప్రాచీనతముడు. అతని నాణెములు ఇక్కడ మాత్రమే లభించుట విశేషం. శాతవాహనులు ఆంధ్రభృత్యులమని చెప్పుకొనుటచే ఇతనికి పూర్వపు కోటిలింగాల రాజన్యుల చేతిలోనుండిన ఆంధ్రరాజ్యము, ఆ పిదప శ్రీముఖుని వశమై నదని, అతడే ఈ కోటి లింగాలలో శాతవాహన సామ్రాజ్య మును స్థాపించినట్లు తెలుస్తోంది. అంతేగాక మత్స్య పురాణ ములో పేర్కొన్నట్లు సుమారు 30 మంది రాజులు 470 సంవత్సరాల పాటు ఆంధ్రదేశము నేలినారన్న విషయం స్థిరపడుతున్నది. 17 గురు రాజులతో 272 సంవత్సరాల పాటు శాతవాహనులు ఏలినారని చెప్పిన వాయుపురాణం మత్స్యపురాణంకన్న ప్రాచీనమైనది కావచ్చును. కాని ఈ రెండు పురాణాలలో శ్రీముఖ శాతవాహనుడే రాజ్యస్థాపకునిగా తెల్పిన సంగతిని కోటిలింగాల నాణెములు ధృవీకరిస్తున్నాయి.
ఈ కోటిలింగాల పరిసర గోదావరీ తీరములు ప్రాచీనాంధ్ర దేశముగా, అంధకరాజ్యముగా భావించ వచ్చును. నాణెములు లభించిన శ్రీముఖుని పూర్వపు శాతవాహన వంశ రాజన్యులు సిరిసాతవాహన, సిరిశాతకర్ణి-1 రాజులు తత్పూర్వ రాజన్యులకు (ఆంధ్రరాజులకు) సైనికాధి కారులుగా లేదా కీలకోద్యోగులుగుండి ఉండడంతో ‘ఆంధ్ర భృత్యుల’మని చెప్పికొని ఉంటారు. కోటిలింగాల ఆంధ్రుల తొలిరాజధాని అనుటకు పురావస్తు శాఖవారి తవ్వకాలలో బయల్పడిన గర్భ నగరము, విదేశీ వ్యాపారసంబంధ సూచక ముగా, సమీప పెద బంకూర్, నుస్తు లాపూర్‌లో దొరికిన రోమన్ నాణెములు, శాతవాహనులకు పూర్వ రాజ వంశ ముల నాణెములు, కోట ఆనవాళ్లు, కోశాగా రము, గోదావరి తీరనికటస్థలం, జలదుర్గలక్షణం ప్రబల సాక్ష్యములు. మహాతలవర, మహాసేనాపతి, మహారథి, మహాగ్రామిక నాణెములు, ఉన్నతాధి కారుల నాణెములుగా భావించాలి. అధికారులకు కూడా నాణెములు వేసుకునే అధికారంగా భావించక, ప్రత్యేకమైన చెల్లిం పుల కోసం వారికి అధికారం ఇచ్చినట్లు భావించాలి.
నెరవనిజ (శ్రీవనిజ) జాతక కథలో ‘‘తెలివాహ నామనదీం ఉత్తీర్య ఆంధ్రపురం నామనగరం ప్రవి శంతు’’ (సంస్కృతీకరణం) అని అన్న విషయంలోని ఔత్తరాహిక వ్యాపారి తెలివాహనదిని దాటి, ప్రవేశించాడని చెప్పిన ఆంధ్రనగరము కోటి లింగాలగా భావించవచ్చు. ఈ తెలివాహ నది గోదావరి నదే. ఆంధ్రనగరము ధాన్య కటకమని బి.ఎస్.ఎల్. హనుమంతరావు వంటి పూర్వ చారిత్రకులు భావించుట సరికాదు ‘‘ధాన్యకటకం కృష్ణానది తీరభూమి. కృష్ణా నదికానాడు కణ్ణబెణ్ణ అని పేరు. అది నల్లని నది అన్న అర్థంలో ఉన్న పేరు. తెలివాహ అంటే తెల్లనిది.
తెలివాహ పేరు గోదావరినదికి ప్రాచీన నామంగా భావించాలి. ‘గోదా’ పేరు పురాణ నిర్మాణకాలం నాటిది. తెలివాహ, కణ్ణబెణ్ణలు బౌద్ధ వాఙ్మయంలో పేర్కొన బడ్డ ప్రాచీన నామాలు. కోటిలింగాల తొలిరాజధాని, కాగా పైఠాను శాతవాహనుల ద్వితీయ రాజధాని. ధాన్యకటకము తృతీయ రాజధాని. అర్వాచీన శాతవాహనుల నాణెములు కోటిలింగాలలో లభించలేదు. ఉత్తర శాతవాహన రాజన్యుల శాసనాదికము పైఠాను (గోదావరి నదీ తీరస్థ ప్రతి ష్ఠాన నగరము) తదితర పరిసర మహారాష్ట్ర ప్రాంతము లైన నాసిక, కన్హేరి, నానేఘాట్లలో లభించినవి. సాతవాహన, శాతకర్ణి, శ్రీముఖ సాతవాహన నాణెములు మాత్రమే తొలి రాజన్యులవి కోటిలింగాలలో దొరుకుట గమనించవలెను. ఈ ప్రాంతము పురాణ రచనా కాలము నాటికి పూర్వముండినది. మహాభారతకాలమునాటికి ‘‘ఆంధ్రకః కృష్ణాగోదా వర్యోః మధ్యే విద్యమానే దేశః’’ అని రాయబడి ఉండుటను బట్టి గోదావరి తీరము నుండి కృష్ణా తీరమునకు ఆంధ్రరాజ్యము తరువాత విస్తరించినట్టు భావించ వచ్చును. క్రీ.శ. 3వ శతాబ్ది కాంచీ పుర రాజు శివస్కంధవర్మ (పల్లవరాజు) ధాన్యకటకం-ఆంధ్ర పథంలోనిదని పేర్కొన్నా డంటే ధాన్యకటకం శాతవాహనుల తృతీయ (అంతిమ) రాజధానిగా భావించ వచ్చును.
రెండో శాతకర్ణి రాజు ‘‘త్రయిణ కరో’’ అనే మహారథి (మహారాష్ట్ర) రాజుకుమార్తెను పెళ్ళాడింది మహారాష్ట్ర రాజ్య హద్దులను బలపరచుకునేందుకే. ఇది శాతవాహన రాజ్యపు మలిదశ, తొలిరాజ్యం తెలంగాణ (అస్సక, మూలక గణ రాజ్యాలు) మలి విస్తరణ మహారాష్ట్రంగా నిరూపిస్తోంది. ధూళికట్ట, కోటిలింగాల, మల్లాపూర్, రణంకోట (కరీంనగర్ లోనివి), పోదన (నేటి బోధన్-నిజామాబాద్ జిల్లా) వంటి చోట్ల కోటలు, ప్రాచీన జనజీవన సంబంధిత పాత్రలు, ఆభర ణములు లభించుటచే, ప్రాచీన బౌద్ధ స్థూపములుండుటచే క్రీ.పూ. 3వ శతాబ్ది నాటి మెగస్తనీసు, 2వ శతాబ్ది నాటి ప్లినీ రాసిన ముప్పది దుర్గములు, లక్ష కాల్బములు వంటివి ఈ ప్రాంతము గురించేనని భావించ వచ్చును. సంస్కృత మహా భారతంలో భీష్మపర్వంలో ‘‘ఆంధ్రాశ్చ బహవోరాజన్’’ అని చెప్పినది, బహుళ సంఖ్యలో కోటలు గల వారాంధ్రులన్నది, క్రీ.పూ. 6వ శతాబ్ది నాటి ఆశ్మక, ‘ముల్లక జన పదములకు భిన్న మైన తెలంగాణ కోటలని, ఇదే ఆంధ్రరాజ్య మనుట నిస్సంశయ మైనది. ఈ ప్రాంతమునేలిన కోటి లింగాల రాజులు గోభద్ర, సామగోపాదులు ఆంధ్రరాజులని, అనంతర శాతవాహనులు ఆంధ్రభృత్యులని భావించుట సబబైనది. పై సెరవ నిజ్జ జాతక కథనుబట్టి ఇది తొలి నాటి వ్యాపార కేంద్రమని, బౌద్ధ బిక్షువులు వచ్చే ఆరాధ్యస్థలమని, ఆంధ్రా పథానికి విచ్చేసే ఉత్తర భారతదేశ వ్యాపారులకు, తైర్థికు లకు వాకిలి ద్వారమని తెలుస్తోంది.
కోటిలింగాలలోనేగాక ఆ తీరమునకు సుమారు 15 కి.మీ. లోగల రాయపట్నం, ధర్మపురి గ్రామములలో శాత వాహనుల నాణెములు లభించాయి. రాయపట్నం ఒకనాటి రాజపట్టణము. ‘‘డెబ్బై రూపాయల చెల్క’’లో అనేకంగా శాత వాహనుల కాలపు జనావాసపు ఆనవాళ్ళు లభించాయి. దీంట్లో ఆర్కియాలజీ శాఖవారు తవ్వకాలు జరపాలి. ధర్మపురి నేడు ప్రసిద్ధ నరసింహ క్షేత్రమైనా, నాడు ధమ్మపురంగా బౌద్ధక్షేత్రం. దీనిని బట్టి విదర్భ ఆంధ్రదేశములను కలిపే మహాపథము గోదావరిని ఇక్కడ దాటి ఆంధ్రరాజ్యములో ప్రవేశించెడిదని తెలియుచున్నది.
(మిగతా వచ్చే సంచికలో)