|

లైలతుల్‌ ఖద్ర్‌.. శ్రేష్ఠమైన రేయి

By:- ఖైరున్నీసా బేగం

ఖుర్‌ఆన్‌ అవతరణకు కృతజ్ఞతగానే ముస్లిములు రమజాన్‌ నెల ‘రోజా’లు పాటిస్తారు. ఈ నెలలో ఖుర్‌ఆన్‌ అవతరణ ఎప్పుడు జరిగింది? అనే ప్రశ్నకు సమాధానమే ‘లైలతుల్‌ ఖద్ర్‌’. లైలతుల్‌ ఖద్ర్‌ అర్థాన్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే ఖద్ర్‌ అంటే అదృష్టం, భాగ్యం అని అర్థం. సృష్టిలోని సృష్టిరాశుల విధిరాతను ఈ రాత్రి లిఖించడం జరుగుతుంది. అందుకే ఈ రాత్రిని లైలతుల్‌ ఖద్ర్‌ అని అంటారు. ఖద్ర్‌ అంటే మరో అర్థం శ్రేష్ఠమైన. అందుకే దీనికి లైలతుల్‌ ఖద్ర్‌ అనే నామకరణం చేశారు. ఖద్ర్‌ మరో అర్థం ఇరుకు అనే భావం స్ఫురిస్తుంది. ఎందుకంటే ఈ రాత్రిన దైవదూతలతో భూలోకమంతా కిక్కిరిసిపోతుంది. అందుకే ఈ రేయిని లైలతుల్‌ ఖద్ర్‌ అని పిలుస్తారు. సౌభాగ్య, దౌర్భాగ్యాల నిర్ణయం జరిగే రాత్రి అని, మహత్పూర్వకమైన, గౌరవాదరణల రాత్రి అని ఖుర్‌ఆన్‌ విశదపరిచింది.

‘‘మేము దీని (ఖురాన్‌)ని ఘనమైన రాత్రియందు అవతరింపజేశాము. ఆ ఘనమైన రాత్రి ఏమిటో మీకు తెలుసా? ఆ ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా ఎంతో శ్రేష్ఠమైనది. ఆ రాత్రి ఆత్మ, దైవదూతలు తమ ప్రభువు అనుమతితో ప్రతి ఆజ్ఞను తీసుకుని అవతరిస్తారు. ఆ రాత్రి అంతా తెల్లవారే వరకు పూర్తిగా శాంతి శ్రేయాలే అవతరిస్తూ ఉంటాయి’’. (దివ్యఖుర్‌ఆన్‌ 97:1-5)

దైవదూత తొలిసారిగా హిరా గుహలో దైవప్రవక్త ముహమ్మద్‌ (స) వద్దకు దైవవాణి తీసుకువచ్చిన రాత్రి రమజాన్‌ నెలలోని ఒకరేయి అని పై ఖుర్‌ఆన్‌ వాక్యాల వల్ల తెలుస్తోంది. అందుకే ఈ రాత్రిని శుభకరమైన రాత్రి అని కూడా అంటారు. ఈ రేయిలో అల్లాహ్ అదృష్ట, దురదృష్టాల నిర్ణయాల అమలుకు దైవదూతలకు ఫర్మానాలు అందజేసే రాత్రి అని భావం. ఇక రమజాన్‌ లోని ఏ రాత్రిలో ఖుర్‌ఆన్‌ అవతరించింది అనే సందేహమూ కలగకపోవచ్చు. రమజాన్‌ నెల చివరి పది తేదీలలో ఏదో ఒక బేసి రాత్రే ఈ ఘనత గల రాత్రి అని ప్రవక్త ముహమ్మద్‌ చెప్పారు. ప్రవక్త మహనీయుల వారి ఒక ఉల్లేఖనం ప్రకారం 27వ లేదా, 29వ రాత్రి అని తెలిపారు. రమజాన్‌ నెలలోని చివరి పది రోజుల్లోని 21, 23, 25, 27, 29వ రాత్రుల్లోని ఏదైనా ఒక రాత్రి లైలతుల్‌ ఖద్ర్‌ కావొచ్చని ప్రవక్త చెప్పిన మరో బోధన ద్వారా స్పష్టమవుతుంది.

ఈ రాత్రిని అన్వేషించాలి..

ఖుర్‌ఆన్‌ అవతరణ జరిగిన లైలతుల్‌ ఖద్ర్‌ ను అన్వేషించడం ఎంతో పుణ్యప్రదం. లైలతుల్‌ ఖద్ర్‌ లో దైవారాధనలో రాత్రంతా గడిపిన వారు వెయ్యి నెలల కంటే ఎన్నో రెట్లు దైవారాధన చేసినంత పుణ్యం దక్కుతుందన్నది ప్రవక్త ఉవాచ. వెయ్యి నెలలంటే 83 సంవత్సరాల నాలుగు నెలలని కాదు. అరబీలో పెద్ద సంఖ్యను తెలుపడానికి వెయ్యి అన్న పదం వాడేవారు. అందుకే ప్రవక్త మహనీయులు రమజాన్‌ చివరి పది రోజులు లైలతుల్‌ ఖద్ర్‌ ని పొందేందుకు మస్జిదు నాలుగు గోడలకే పరిమితమైపోయేవారు. ఇలా పది రోజులూ మస్జిదులోనే గడపడాన్ని ‘ఏతికాఫ్‌’ అంటారు. ‘‘లైలతుల్‌ ఖద్ర్‌ లో పూర్ణ విశ్వాసంతో, దైవం ప్రసాదించే ప్రతిఫలాన్ని ఆశించి ఆరాధనకై నిలబడే వ్యక్తి, గత అపరాధాలన్నీ క్షమించబడతాయి’’ అని ప్రవక్త ఉపదేశానికి అనుగుణంగా ముస్లిములు రమజాన్‌ చివరి పదిరోజులు మస్జిదులో ఏతికాఫ్‌ పాటిస్తారు. షబేఖద్ర్‌ ను పొందేందుకు రాత్రుళ్లు దైవారాధనలోనే నిల్చుంటారు. ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తారు. మస్జిదులో రాత్రుల్లు దైవారాధనలో గడుపుతారు.

లైలతుల్‌ఖద్ర్‌లో జరిగే కొన్ని సంఘటనలు

ఇదే రాత్రిన దివ్యఖుర్‌ఆన్‌ జిబ్రాయీల్‌ ద్వారా మహాప్రవక్త ముహమ్మద్‌ (స)పై అవతరించింది. ఇదే రాత్రిన దైవదూతలు భూమిపై సంచరిస్తారు. అల్లాహ్ ప్రత్యేక కారుణ్యం వర్షిస్తుంది. దుఆలు విస్తృతంగా స్వీకరించబడతాయి.

షబేఖద్ర్‌లో అల్లాహ్ ను ఏం వేడుకోవాలి

‘అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్‌ తుహిబ్బుల్‌ అఫ్‌వు ఫాఅఫువన్ని’ (దేవా! నీవు అమితంగా క్షమించేవాడివి. క్షమించడమంటే నీకెంతో ఇష్టం. కనుక నన్ను క్షమించు) అని వేడుకోవాలని ప్రవక్త చెప్పారు.

షబేఖద్ర్‌లో ఏం చేస్తారు

ఎంతో గౌరవప్రదమైన, మరెంతో విలువైన ఈ రాత్రి చేసే ఆరాధనకు దైవం ఇచ్చే ప్రతిఫలాన్ని ఒడిసిపట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ రేయిలో వీలైనన్ని ఎక్కువ నమాజులు, ఖుర్‌ఆన్‌ పారాయణం చేస్తారు. ఖుర్‌ఆన్‌ భావాన్ని ఎవరకు వచ్చిన భాషలో వాళ్లు చదువుకుంటారు. మంచి జీవితాన్ని ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకుంటారు.

(రమజాన్‌ నెల సందర్భంగా..)