భూ వివరాలన్నీ ‘ధరణి’లోనే

tsmagazineదేశంలో మరెక్కడా లేని విధంగా స్వతంత్ర భారతదేశ చరిత్రలో కేవలం తెలంగాణలో మాత్రమే సమగ్ర భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టామని సిఎం వెల్లడించారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఈ కార్యక్రమం తర్వాత భూమి వివరాలు ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని, ఈ వివరాలతో కూడిన పాస్‌ పుస్తకాలు కొత్తగా ప్రింట్‌ చేస్తున్నట్లు సిఎం వెల్లడించారు. ఇవే వివరాలను ప్రభుత్వ వెబ్‌ సైట్‌ లో పెడతామన్నారు. కోర్‌ బ్యాంకింగ్‌ తరహాలో ల్యాండ్‌ వెబ్‌సైట్‌ నిర్వహిస్తామని, దీనికి ‘ధరణి’ అనే పేరును ఖరారు చేసినట్టు సిఎం వెల్లడించారు. మార్చి 11న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒకే రోజు కొత్త పాస్‌ పుస్తకాలను రైతులకు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. కొత్త పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి దేశ రాష్ట్రపతి లేదా ప్రధాన మంత్రిని ఆహ్వానించనున్నట్లు సిఎం వెల్లడించారు. అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేని పారదర్శకమైన కొత్త రిజిస్ట్రేషన్‌ విధానాన్ని తీసుకొస్తున్నామని, పూర్తి స్థాయి సంస్కరణలతో వస్తున్న కొత్త రిజిస్ట్రేషన్‌ విధానాన్ని మార్చి 11 నుంచే అమలు చేస్తామని సిఎం ప్రకటించారు. అదే రోజు మండల రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. రెవెన్యూ శాఖ పరిధిలోనే ఇకపై భూముల నిర్వహణ, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతుందని కాబట్టి రెండు శాఖల మధ్య మరింత సమన్వయం సాధించడానికి ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ గా కొనసాగుతున్న వాకాటి కరుణకే రిజిస్ట్రేషన్‌ల శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సిఎం చెప్పారు.

కొత్త పాస్‌ పుస్తకాల జారీ, రిజిస్ట్రేషన్‌ విధానంలో సంస్కరణలపై ప్రగతి భవన్‌ లో దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘ సమీక్ష జరిగింది. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సిఎం ముఖ్య కార్యదర్శులు ఎస్‌. నర్సింగ్‌ రావు, శాంత కుమారి, కార్యదర్శి స్మితా సభర్వాల్‌, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌ తివారి, మీ సేవా కమిషనర్‌ జిటి వెంకటేశ్వరరావు, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్మార్ట్‌ గవర్నమెంట్‌ జిఎం డి.శ్రీధర్‌, సీనియర్‌ మేనేజర్‌ సుధీర్‌ గోలి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్వహించిన సమగ్ర భూ ప్రక్షాళన ద్వారా వచ్చిన ఫలితాలను ఈ సమావేశంలో విశ్లేషించారు.

‘పార్ట్‌ ఎ’ విజయవంతం, త్వరలో ‘పార్ట్‌ బి’:
తెలంగాణ వ్యాప్తంగా వందరోజుల పాటు నిర్వహించిన భూ రికార్డుల ప్రక్షాళన పార్ట్‌ ఎ విజయవంతమైందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 90 శాతానికి పైగా భూముల విషయంలో స్పష్టత వచ్చిందని, ఏ భూమికి ఎవరు యజమానో తేలిందని సిఎం చెప్పారు. ఈ వివరాల ఆధారంగానే కొత్త పాస్‌ పుస్తకాల జారీ, పంట పెట్టుబడి మద్దతు పథకం అమలు చేస్తామని సిఎం చెప్పారు. కోర్టు కేసులు, ఇతర వివాదాలు, అభ్యంతరాలు కలిగిన భూములను పార్ట్‌ బిలో పరిష్కరిస్తామన్నారు. పార్ట్‌ బి చేపట్టడానికి వీలుగా ప్రభుత్వం కొన్ని విధాన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని, త్వరలోనే కేబినెట్‌ సమావేశం నిర్వహించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం పార్ట్‌ బి ప్రక్షాళన కూడా నిర్వహిస్తామన్నారు. పార్ట్ట్‌ ఎ ద్వారా లెక్క తేలిన భూములకు సంబంధించిన వ్యవసాయ ఖాతాలు దాదాపు 71 లక్షలున్నాయని, వారందరికీ కొత్త పాస్‌ పుస్తకాలు ఇస్తామన్నారు.

కోర్‌ బ్యాంకింగ్‌ తరహాలో ‘ధరణి’ నిర్వహణ:
రాష్ట్రంలోని ప్రతీ ఎకరం భూభాగం వివరాలు పొందుపరుస్తూ, ఎప్పటి కప్పుడు చోటు చేసుకునే మార్పులను కూడా నమోదు చేసుకుంటూ రాష్ట్ర ప్రభు త్వం భూ రికార్డుల వెబ్‌సైట్‌ ‘ధరణి’ని కోర్‌ బ్యాంకింగ్‌ తరహాలో నిర్వహించ నున్నట్లు సివెం వెల్లడించారు. దీనికోసం ప్రత్యేకంగా ఐటి విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రిజిస్ట్రేషన్‌ వివరాలు, పేరు మార్పిడి వివరాలు అదే రోజు ఈ ధరణిలో నమోదు అవుతాయని, మండల కార్యాలయం నుంచి మొదలుకుని రాష్ట్ర స్థాయిలో అన్ని చోట్ల ఈ వెబ్‌సైట్‌ నుంచి వివరాలు తీసుకోవచ్చన్నారు. విదేశాల్లో ఉన్న వారు కూడా ధరణి ద్వారా అందే సమాచారంతో క్రయ, విక్రయాలు జరుపుకోవచ్చని వెల్లడించారు.

1,12,077 చదరపు కిలోమీటర్లు
తెలంగాణ రాష్ట్ర మొత్తం భూభాగం

2.80 కోట్ల ఎకరాలు
తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం భూభాగం

1.42 కోట్ల ఎకరాలు
ఎలాంటి వివాదాలు లేని వ్యవసాయ భూమి

17.89 లక్షల ఎకరాలు
కోర్టు కేసులు, వివాదాలు,
చిక్కులు కలిగిన భూములు

11.95 లక్షల ఎకరాలు
రైతుల వద్ద ఉన్న వ్యవసాయేతర భూములు

84.00 లక్షల ఎకరాలు
చెరువులు, కుంటలు, కాలువలు, రైల్వే లైన్లు,
సబ్‌ స్టేషన్లు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు,
ఇతర ప్రభుత్వ ఆస్తుల కింద భూములు,
కోర్టు కేసుల్లోని అటవీభూములు.

24 లక్షల ఎకరాలు
నగరాలు, పట్టణాలు, గ్రామాల నివాస ప్రాంతాలు, వివాదాలు లేని అటవీభూమి

ఎమ్మార్వోలకు సబ్‌ రిజిస్ట్రార్‌ బాధ్యతలు:
రైతులు, ఇతర ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా ప్రతీ మండల రెవెన్యూ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తం 584 మండలాలున్నాయి. ప్రస్తుతం 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. వాటిని యధావిధిగా కొనసాగిస్తారు. ఈ 141 సబ్‌ రిజిస్ట్రార్ల పరిధి వారి కార్యాలయమున్న మండలానికే పరిమితం అవుతుంది. మిగతా 443 చోట్ల ఎమ్మార్వోలకు సబ్‌ రిజిస్ట్రార్‌ బాధ్యతలు అప్పగిస్తారు. ఎమ్మార్వోలు తామిచ్చిన అపాయింట్మెంట్‌ తేదీలకు అనుగుణంగా శని, ఆదివారాలు, ఇతర సెలవులు మినహాయించి వారానికి ఐదు రోజులు ఉదయం పూట రిజిస్ట్రేషన్‌ బాధ్యతలు నిర్వర్తిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఎమ్మార్వోలు హాజరుకాలేకపోతే, ఆ బాధ్యతలను డిప్యూటీ తహసిల్దార్లకు అప్పగిస్తారు.

అవినీతి, నకిలీల, ఇబ్బంది తొలగించడమే లక్ష్యం:
భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, భూ రికార్డుల నిర్వహణలో వందకు వంద శాతం పారదర్శకత సాధించడం, అవినీతి నిరోధించడం, నకిలీ పాస్‌ పుస్తకాలను అరికట్టడం లాంటి లక్ష్యాలతో సంస్కరణలు తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు.

”రైతులు, ఇతర ప్రజలు తరచూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పాలి. కేవలం ఒకేసారి రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లి రావాలి. పాస్‌ పుస్తకం వారి ఇంటికే కొరియర్‌ ద్వారా చేరాలి. ఎవరి వద్దకూ వెళ్లకుండానే తమ పని ఒక్క రోజులో పూర్తికావాలి. అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేని విధంగా రిజిస్ట్రేషన్ల విధానం ఉండాలి. నూటికి నూరుశాతం పారదర్శకంగా పనులు జరగాలి. నకిలీ పాసుపుస్తకాలు, ఇతర డాక్యుమెంట్లు సష్టించడం పరిపాటి అయింది. నకిలీ పాసుపుస్తకాల ద్వారా రుణాలు పొంది ప్రభుత్వాన్ని కూడా మోసం చేసిన దాఖలాలున్నాయి. ఇకపై అలా సాధ్యం కాదు. భూ రికార్డుల నిర్వహణను ప్రభుత్వం కట్టుదిట్టంగా చేస్తుంది. అందుకోసమే సంస్కరణలు తీసుకొస్తున్నాం. ప్రతీ విషయం ‘ధరణి’లో నమోదవుతుంద

ప్రతిపాదిత నూతన రిజిస్ట్రేషన్‌ విధానం :

 • అమ్మే వారు, కొనేవారు పరస్పర అంగీకారానికి వచ్చిన తర్వాత సబ్‌ రిజిస్ట్రార్‌ ను అపాయింట్మెంట్‌ టైమ్‌ అడగాలి. (పాస్‌ పోర్టులు, వాహన రిజిస్ట్రేషన్ల మాదిరిగా)
 • భూమి అమ్మకానికి సంబంధించిన డాక్యుమెంటు తయారు చేయడానికి లైసెన్సుడు డాక్యుమెంటు రైటర్లు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద ఉంచుతారు. వారు ఫీజు తీసుకుని రాసిన కాగితాలను అనుమతిస్తారు.
 • అమ్మేవారు/కొనేవారు తామే స్వయంగా డాక్యుమెంటు రాసుకున్నా అనుమతిస్తారు. దీనికోసం వారికి సంబంధిత ఫారాలు/టెంప్లేట్స్‌ అందుబాటులో ఉంచుతారు.
 • అపాయింట్మెంట్‌ ఇచ్చిన తేదీ/సమయానికి అమ్మేవారు, కొనేవారు ఇద్దరూ తమ పాసుపుస్తకాలతో సబ్‌ రిజిస్ట్రార్‌ ముందు హాజరు కావాలి.
 • బయోమెట్రిక్‌ విధానం ద్వారా ఇద్దరి వేలిముద్రలు, ఫోటోలు, సంతకాలు తీసుకుంటారు.
 • ఎంత భూమి అమ్ముతున్నారో అంత భూమిని అమ్మేవారి పాస్‌ పుస్తకం నుంచి సబ్‌ రిజిస్ట్రార్‌ తొలగిస్తారు. అదే సమయంలో కొన్న వారి పాస్‌ పుస్తకంలో నమోదు చేస్తారు. సబ్‌ రిజిస్ట్రార్‌ ముద్ర వేసి, సంతకం చేస్తారు.
 • భూమిని కొత్తగా కొంటున్న వారయితే, కొత్త పాస్‌ పుస్తకం ఇస్తారు. అందులో కొన్న భూమి వివరాలు నమోదు చేస్తారు.
 • ఇద్దరి పాస్‌ పుస్తకాలను అదే రోజు అదే సమయంలో ఎమ్మార్వోకు పంపుతారు.
 • సదరు భూమి యజమానిగా అమ్మిన వారి పేరు తొలగించి, కొన్న వారి పేరుపై మార్పిడి(మ్యుటేషన్‌) చేస్తారు.
 • ఈ వివరాలను ఎమ్మార్వో కార్యాలయంలోని భూమి రికార్డుల్లో నమోదు చేస్తారు.
 • ఎమ్మార్వో కార్యాలయంలోని ఐటి అధికారికి ఈ వివరాలు పంపాలి. ఐటి అధికారి ఆ వివరాలను వెబ్‌ సైట్‌ లో ఎంటర్‌ చేస్తారు.
 • వెబ్‌ సైటులో నమోదైన వివరాలు కొన్న వారికి, అమ్మిన వారికి వెంటనే ఎస్‌.ఎం.ఎస్‌. పోతుంది. (బ్యాంకు లావాదేవీల మాదిరిగా)
 • పాస్‌ పుస్తకాలను ఇప్పటి మాదిరిగా ఆర్డీవోకు పంపాల్సిన అవసరం లేదు. పేరు మార్పిడి (మ్యుటేషన్‌) బాధ్యత, అధికారి పూర్తిగా ఎమ్మార్వోదే.
 • పేరు మార్పిడి(మ్యుటేషన్‌) జరిగిన తర్వాత ఎమ్మార్వో కార్యాలయం ముద్రవేసి, ఎమ్మార్వో సంతకం చేస్తారు. ఆ పాస్‌ పుస్తకాలను అదే రోజు తిరిగి సబ్‌ రిజిస్ట్రార్‌ కు పంపుతారు.
 • ఎమ్మార్వో నుంచి తనకు అందిన పాస్‌ పుస్తకాలను సబ్‌ రిజిస్ట్రార్‌ కొరియర్‌ ద్వారా అమ్మిన వారికి, కొన్న వారికి పంపుతారు. కొన్న వారికి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంటు పంపుతారు. (పాస్‌ పోర్టుల మాదిరిగా)
 • సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాయంలో డిస్పాచ్‌ అయిన వెంటనే ఇద్దరికీ ఎస్‌.ఎం.ఎస్‌. వెళ్తుంది.
 • రైతులకిచ్చే పాసుపుస్తకంలో ఖాతా నంబరుతో పాటు పాసు పాసుపుస్తకం యూనిక్‌ కోడు, గ్రామం కోడు,మండలం కోడు, యజమాని ఆధార్‌ నంబరు ఉంటాయి.