|

పుడమి పులకించే నిర్ణయం

‘తెలంగాణ రాష్ట్రం వచ్చిననాడు ఎంత సంతోషించానో, ఈ రోజూ నాకు అంతే సంతోషంగా ఉంది.’ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాష్ట్ర శాసన సభలో చరిత్రాత్మక నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెడుతూ అన్న మాటలివి. ఉభయ సభలు ఆమోదించిన ఈ చట్టం రాష్ట్రంలో అమలులోకి వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలోని రైతాంగంలో, భూ యజమానుల్లో కూడా ఆనందోత్సాహం వ్యక్తమవుతున్నాయి.

ఈ ఆనందానికి కారణం లేకపోలేదు. నైజాం పాలన నుంచి ఈనాటి వరకూ భూ యాజమాన్య హక్కుకు సంబంధించి వచ్చిన వందకుపైగా చట్టాలు లోపభూయిష్టంగా ఉండటంతో రైతు, భూ యజమానులు  పడిన కష్టనష్టాలు  చెప్పనలవికానివి. యాజమాన్యహక్కు వివాదాలు, గట్ల పంచాయితీ, రికార్డుల్లో సమస్య, భూముల అన్యాక్రాంతం, భూ ఆక్రమణ, ఈ విధంగా భూములకు సంబంధించి దాదాపు 60నుంచి 70 సమస్యులు ఉంటాయని ఒక అంచనా. భూమి ఉండి కూడా హక్కుపత్రాలు  లేకనో, రికార్డుల్లో వివరాలు సరిగా నమోదు కాకనో, చాలామంది రైతులు  తమ భూమినుంచి తమకుదక్కాల్సిన ప్రయోజనాలను పూర్తిగా పొందలేకపోతున్నారు. ముఖ్యంగా తెంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రభుత్వం రైతాంగానికి ప్రయోజనం చేకూర్చే రైతుబంధు, పంటరుణం, పంటభీమా, ఇన్‌ పుట్‌ సబ్సిడీవంటి ఎన్నో పథకాలను అమలుపరుస్తోంది. ఈ ప్రయోజనాన్నీ పొందాలంటే భూములకు సంబంధించిన ఖచ్చితసమాచారం అవసరం. తెలంగాణ ప్రాంతంలో 1936 నుంచి రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ (హక్కు రికార్డు) నిర్వహించడం ప్రారంభించారు. నైజాం పరిపాలనలో హక్కు రికార్డు నిర్వహణకోసం ‘భూమి హక్కు రికార్డు చట్టం, 1346 ఫస్లీ’ని రూపొందించారు. అనంతరం హైదరాబాద్‌ రాష్ట్రంలో ‘హైదరాబాద్‌ భూ హక్కు రికార్డు రెగ్యులేషన్‌, 1358 ఫస్లీ’ పేరుతో మరో చట్టాన్ని తెచ్చారు. ఈ చట్టాన్ని రద్దుచేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 1971లో భూమిహక్కు, పట్టాదారు పాస్‌ పుస్తకం చట్టం చేశారు. ఇప్పుడు ఈ చట్టాలలోని లొసుగులు, లోపాలను తొలగించడానికి, భూములకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సులభంగా పొందడానికి, నమోదుకు వీలుగా రాష్ట్రప్రభుత్వం కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చింది.
తెంగాణ ప్రభుత్వం ‘ధరణి’లో నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ రికార్డునే భూ హక్కు రికార్డుగా ప్రకటిస్తూ, తెంగాణ భూమి హక్కు, పట్టాదారు పాసుపుస్తకం చట్టం, 2020ని అమలులోకి తెచ్చింది. దీని వల్ల వ్యవసాయ భూముల బదలాయింపు, రికార్డుల్లో నమోదు సులభతరం అవుతుంది. ఒకే రోజులో దస్తావేజు రిజిస్ట్రేషన్‌, రికార్డుల్లో మార్పు, కొత్తపాసు పుస్తకం జారీ జరిగిపోతుంది. ఈ చట్టాన్ని ఏ అధికారి ఉల్లంఘించినా, రికార్డులో దురుద్దేశపూర్వకంగా మార్పు చేసినా ఉద్యోగం నుంచి తొగించడంతోపాటు, క్రిమినల్‌ చర్యలు కూడా తీసుకుంటారు. ఎక్కడా లంచాలకు, అక్రమాలకు, వివాదాలకు తావులేకుండా, పారదర్శకంగా, సులభంగా భూరికార్డు నిర్వహణతోపాటు, పూర్తి  ప్రయోజనాలను కల్పించే ఈ చట్టం పట్ల ప్రజానీకం ఆనందం వ్యక్తంచేయడం సహజమేకదా!