అనంతర దృశ్యం

నిన్నటి కష్టాలను శాశ్వతంగా నివారించడంతోపాటు, రేపటి ఆశలను సజీవంగా అందరికీ కళ్లముందు నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొక్కవోని దీక్షతో కృషి చేస్తున్నది. స్వరాష్ట్రంలో గత ఎనమిదేళ్లలో సాదించిన ప్రగతి ఫలాలను అందరికీ అందించే దిశగా పటిష్ట కార్యాచరణ అమలు జరుగుతున్నది. ప్రభుత్వం సాగిస్తున్న కార్యాచరణ అపూర్వ ఫలితాలను అందిస్తూ ఆరదర్శంగా ముందుకు సాగుతున్నది. మానవీయ కోణంలో అందరి మంచి లక్ష్యంగా ప్రభుత్వం వివిధ పథకాలను చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నది. నిజమైన భారతం పల్లెలోనే ఉందని జాతిపిత నాడు చెప్పిన అంశాన్ని నూరు పైసల నిజం చేస్తూ మారుమూల గ్రామాల్లో పచ్చదనం కనువిందు చేస్తున్నది. జాతీయ స్థాయిలో ఎంపికైన ఇరవై ఆదర్శ గ్రామాల్లో అక్షరాలా పందొమ్మిది మన రాష్ట్రానికే చెందినవి కావడం అన్న ఒకే అంశం చాలు ఇక్కడి అభివృద్ది ఎలా ఉంటుందో ఎత్తి చూపడానికి. అందరి క్షేమం,అన్నిటా ప్రగతి ఏక సూత్ర కార్యక్రమంగా ఇన్నాళ్ళూ కార్యరూపం ధరించిన ప్రగతి, తన రికార్డులు తానే బద్దలు కొట్టి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవడానికి ముందంజ వేస్తున్నది.

ఎనిమిదేళ్ళ క్రితం ఎద్దేవా చేసిన నోళ్ళు మూతపడి, కళ్ళు పెద్దవిగా చేసి ఇక్కడి అభ్యుదయ పాలనను చూసి నోరెళ్ళ బెడుతున్నాయి. ఇంతటి మహత్తర విజయం ఎలా సాధ్యమైంది? ఇన్ని రంగాల్లో అపురూపమైన అపూర్వ ప్రగతి ఎలా సొంతమైంది? అంకితభావం అందరికీ మంచి చేరువకావాలనే సమభావన వీటన్నిటికీ మూలం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

ఎనిమిదేళ్ళక్రితం తొలి అడుగువేసినప్పుడు ఎదురుగా నిలిచి సవాలు చేసిన సమస్యలు ప్రాధాన్యత క్రమంలో ఒక్కటొక్కటిగా దూది పింజల్లా కనుమరుగైపోయిన దృశ్యం కళ్ళెదుట సాక్షాత్కరిస్తున్నది. పాలనలో వెనుతిరుగని పట్టుదల, లక్షాన్ని చేరుకోవడంలో లక్ష్య పెట్టని కఠోర శ్రమ కష్టసాధ్యమైన కార్యాచరణకు పెట్టని కోటలా అంకితభావం ఫలితంగా అన్ని రంగాల్లో అద్భుత ప్రగతిని సొంతం చేసింది. దశాబ్దాల కాలంలో పరిష్కరించలేకపోయిన అనేక చిక్కు ముళ్లను విప్పదీసి సరికొత్త చరిత్ర సృష్టించగలిగింది. మనుషులంతా ఒక్కటే అనే సార్వత్రిక సమభావన అందరికీ మంచిని పంచడంలో ప్రధాన పాత్ర వహించింది. యేటి కాయేడు సాధించిన విజయాలతో ఇకచాలు అనుకోకుండా మరింత పట్టుదలతో ముందుకు సాగుతున్నది. జాతీయ స్థాయిలో అన్నిటా నెంబర్ వన్ గా నిలిచి విజయాలకు చిరునామా తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వ పాలన సాగిపోతున్నది.

ఎదుటివారిలో దైవాన్ని దర్శించే ఉదాత్త సంస్కారం, మానవీయ కోణానికి నిలువెత్తు నిదర్శనం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు. మంచు కొండల్లో దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికులు, పంట పొలాల్లో పరిశ్రమించే కర్షకులూ దురదృష్టవశాత్తు మరణిస్తే అనాధలైన వారి కుటుంబాలను ఓదార్చి ఆదుకోవడం, ఆర్ధిక సహకారంతో వారికి కొంత ఊరట కలిగించడం ఇందుకు రుజువు.

ఆవిర్భావదినం మనకు కొండంత పండగ. ప్రగతిరేఖలను ప్రతియేటా ప్రభుత్వ విజయాల సమూహారంగా వెలువరిస్తున్న క్రమంలో రూపుదిద్దుకున్న ప్రత్యేక సంచిక మీ ముందుంది.