|

బడి – తిండికి తోట కూరలు

By: చీల రవి

సిద్ధిపేట జిల్లాలోని సిద్ధిపేట అర్బన్‌ మండలం నాంచార్‌పల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు సంపూర్ణ పౌష్టికాహారం ఇవ్వడానికి ఉపాధ్యాయులు ఓ వినూత్న ఆలోచన చేశారు. పాఠశాల ఆవరణలో ఉన్న కొద్దిపాటి స్థలంలో సుమారు మూడు గుంటలకు పైగా భూమిలో సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగు చేపట్టారు. ఇక్కడ పండిన  కూరగాయలను అప్పుడే తెంపి తాజాగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి అందిస్తూ ఆదర్శంగా నిలిచారు.

కలుషిత వాతావరణంలో పెరిగిన కూరగాయలతో అనారోగ్యం పాలవుతున్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై శ్రద్ధ ఏర్పడుతుంది. కరోనా సమయంలో తాజా భోజనం అందించడం కోసం ఎలాంటి రసాయనిక ఎరువులు లేకుండా సేంద్రియ సాగుతో కూరగాయలను పండించి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. కరోనా కారణంగా సుదీర్ఘ కాలంగా పాఠశాలలు మూతపడడం, పరిస్థితులు అనుకూలించడంతో పాఠశాలలు ప్రారంభించిన అనంతరం పాఠశాల ఆవరణలో గల కొంత భూమిని విద్యార్థుల భాగస్వామ్యంతో గ్రామపంచాయతీ పాలకవర్గం పంచాయతీ కార్యదర్శి సహకారంతో ఉపాధ్యాయులంతా కలిసి చదును చేయించి 19 రకాల కూరగాయల సాగును ప్రారంభించారు. అవి చేతికంది ప్రస్తుతం మధ్యాహ్న భోజనానికి వాడుతున్నారు. ఆకుకూరలతో పాటు కాయగూరలు రోజుకో రకమైన వంటకాలను అందిస్తూ విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారు. వండే సమయంలోనే తోటలో పండిన కాయగూరలను తెచ్చి తాజా వంటకాలను పిల్లలకు అందజేస్తున్నారు. గ్రామంలో పొడి చెత్త తడి చెత్తను సేకరించి తయారుచేసిన వర్మి కంపోస్టును కూరగాయల సాగుకు వినియోగిస్తున్నారు. కొద్దిపాటి పెట్టుబడితో పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం అందించే తాజా కూరగాయలను అందించడం పట్ల పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు చేపట్టిన విధానాన్ని మంత్రి హరీష్‌రావుతో పాటు సిద్ధిపేట జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ ముజమిల్‌ ఖాన్‌  అభినందించారు. అన్ని పాఠశాలలో ఈ విధానంలో కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేయాలని విద్యా శాఖకు సూచించారు.

మా పాఠశాలలో ఏర్పాటు చేసిన బడి తోట నుంచి తెచ్చిన తాజా కూరగాయలతో భోజనం చేస్తున్నాము. రుచిగా ఉంటున్నాయి. ఇది మాకు ఎంతో ఆనందంగా ఉంది. బయట నుంచి వచ్చే కల్తీ ఆకుకూరలతో ఆరోగ్యం పాడవుతుందని తాజా కూరగాయలను మా పాఠశాలలోనే పండిస్తున్నాం. -రంజిత్‌ కుమార్‌

పిల్లల సంపూర్ణ ఆరోగ్యం కోసం…

పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై శ్రద్ధ చూపుతారు.. ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న కూరగాయలన్నీ రసాయనిక ఎరువులతో పండిరచినవే. వాటివల్ల పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. తాజా కూర గాయలు, ఆకుకూరలతో పౌష్టికాహారం అం దిస్తే పిల్లలంతా ఆరోగ్యంగా ఉంటారని వినూ త్నమైన ఆలోచన చేశాము. మూడు నెలల నుంచి విద్యార్థులకు పాఠశాలలో పండిన కాయగూరలు విద్యార్థులకు అందిస్తున్నాం. పిల్లలు ఆరోగ్యంగా ఉంటున్నారు. -సిహెచ్‌ రవి, ఉపాధ్యాయుడు

కమిటీ సభ్యులతో నిర్వహణ

బడి తోట నిర్వహణ కోసం పలువురు విద్యా ర్థులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఒక కమిటీని ఏర్పాటు చేశాము. అంతా కలిసి పాఠశాల సమయా నికి ముందు, పాఠశాల సమయం ముగిసిన అనంతరం అరగంట పాటు, విరామ సమయంలో కూరగాయల తోటకు నీరు పట్టడం, పిచ్చి మొక్కలు తొల గించడం చేస్తాం. పలురకాల ఆకు కూరలు, కాయగూరలను సాగు చేసి వాటిని మధ్యాహ్న భోజనంలో పిల్లలకు అందిస్తున్నాం. పిల్లలతోపాటు విద్యార్థుల తల్లి దండ్రులు సంతోషంగా ఉన్నారు. -మల్లికార్జున్‌ రెడ్డి, ఉపాధ్యాయుడు