రైతాంగాన్ని కాపాడుకుందాం… కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌

తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర, రైతు వ్యతిరేక విధానాల నుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకునే బాధ్యత కలెక్టర్లకు, అధికారులకు ఉన్నదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు యాసంగి వడ్లను కొనడం లేదనే విషయాన్ని రైతులకు అర్థం చేయించాలన్నారు. యాసంగిలో వరి నాటుకు బదులు ప్రత్యామ్న్యాయ పంటల సాగుకు రైతులను సన్నద్ధం చేయాలని కలెక్టర్లను, వ్యవసాయ అధికారులను సీఎం ఆదేశించారు.

ఆహార భధ్రత కల్పించడం కోసం రాజ్యాంగబద్దంగా ఏర్పాటైన ఎఫ్‌.సి.ఐ, ఉప్పుడు బియ్యం పేరుతో తెలంగాణ యాసంగి వరి ధాన్యం కొనుగోలును నిలిపివేయడం శోచనీయమన్నారు. భారత ఆహార సంస్థ నిర్లక్ష్యం కారణంగా బియ్యం గోదాముల్లో మగ్గిపోతున్న బియ్యం నిల్వలు పేరుకుపోతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెల్లాలని సీఎం అన్నారు. ఇందుకు సంబంధించి కేంద్రానికి లేఖలు రాయాలని అధికారులను ఆదేశించారు.

ప్రగతి భవన్‌లో సీఎం అధ్యక్షతన రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో దళిత బంధు అమలు పురోగతి తీరుతెన్నులు రాష్ట్రవ్యాప్తంగా అమలుకోసం చేపట్టవలసిన చర్యలు, యాసంగి వరి ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ, ఉద్యోగుల జోనల్‌ పంపిణీ, రైతుబంధు నిధులు విడుదల, కరోనా పరిస్థితి ఒమిక్రాన్‌ వ్యాప్తి అంశాలపై విస్తృతస్థాయిలో సమీక్షించారు.

వ్యవసాయ అనుకూల విధానాలు కొనసాగిస్తాం:

తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టంచేసే దిశగా తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న దార్శనిక వ్యవసాయ విధానాలు ఇప్పటివరకు స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదని ముఖ్యమంత్రి అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు కట్టి నీటి వనరులను మెరుగు పరుచుకున్నామని, ఇరవైనాలుగు గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తును రైతాంగానికి అందిస్తున్నామని తెలిపారు. రైతుబంధు పథకంతో పంట పెట్టుబడి సాయాన్ని, బీమాతో రైతులకు భరోసాను కల్పిస్తున్నామన్ని సీఎం వివరించారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ వ్యవసాయ విధానాలను ఎన్ని కష్టాలు వచ్చినా ఇలాగే కొనసాగిస్తామని మరోసారి స్పష్టం చేశారు.

వానాకాలం పంటలకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి:

రాబోయే వానాకాలం పంటల సాగు కోసం ఏ ఏ పంటలు వేయాలో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రికి అధికారులకు సీఎం ఆదేశించారు. వానాకాలంలో ప్రధానంగా మూడు పంటలపై దృష్టిసారించాలన్నారు. పత్తి, కంది, వరి సాగు పై దృష్టి సారించేలా చూడాలని కలెక్టర్లను, వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రైతాంగాన్ని ప్రత్యామ్నాయ లాభసాటి పంటల సాగుదిశగా సమాయత్తం చేయాలన్నారు.

సామాజిక పెట్టుబడిగా దళితబంధు సాయం:

తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ‘దళితబంధు’ పథకం లక్ష్యమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఈ పథకం ద్వారా నూరుశాతం సబ్సిడీ కింద అందించే పది లక్షల రూపాయలు, దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేయడమే కాకుండా సామాజిక పెట్టుబడిగా మారి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతంగా పటిష్టం చేయడంలో దోహద పడుతుందని సీఎం స్పష్టం చేశారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంతో పాటు ఇప్పటికే ప్రకటించిన నాలుగు జిల్లాల నుంచి నాలుగు మండలాల పరిధిలో దళిత బంధును ముందుగా ప్రకటించిన విధంగానే సంతృప్త స్థాయిలో అమలు చేస్తామన్నారు. నిధులను త్వరలోనే విడుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన విధంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో వంది మంది లబ్ధిదారులను ఎంపిక చేసి అమలు చేసే కార్యాచరణను ప్రారంభించాలని కలెక్టర్లను అధికారులను సీఎం అదేశించారు. ఇందుకుగాను స్థానిక ఎమ్మెల్యేల సూచనలు తీసుకోవాలన్నారు.

దళితబంధు అమలులో పాల్గొనండి

దశాబ్దాల గత పాలకుల చేదు అనుభవాలతో, తాము ఎప్పుడూ మోసగించబడుతూనే ఉంటామనే దుఃఖం దళిత వాడల్లో నెలకొని ఉన్నదని, వారి ఆర్తిని అర్థం చేసుకొని దళితులకు భరోసా కల్పించే దిశగా పనిచేయాల్సిన అవసరం వుందని కలెక్టర్లకు సీఎం స్పష్టం చేశారు. ‘‘మీకు ఆకాశమే హద్దు. మీరు ఇప్పటివరకు చేసిన ఏ పనిలోనూ లేని తృప్తి.. దళితబంధు పథకం అమలులో పాల్గొనడంలో దొరుకుతుంది’’ అని కలెక్టర్లకు సీఎం ఉద్భోదించారు. దళిత కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు వున్న అన్ని అవకాశాలను, ప్రభుత్వ ప్రయివేట్‌ రంగాల్లోని అన్ని రకాల వ్యాపార ఉపాధి మార్గాలను శోధించాలని తెలిపారు. ఈ క్రమంలో దళిత సమాజం అభ్యున్నతి కోసం పాటుపడుతున్న దళిత మేధావులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, తదితర దళిత సామాజిక అభివృద్ధి కాముకుల సలహాలు సూచనలు తీసుకోవాలని సీఎం కలెక్టర్లకు సూచించారు.

నూతన జోనల్‌ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన:

నూతన జోనల్‌ వ్యవస్థ నియమ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజనను చేపట్టాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. నూతన జోనల్‌ వ్యవస్థతో స్థానిక యువతకు ఉద్యోగాల కల్పనతోపాటు, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాలన, అమలులోకి వస్తుందని సీఎం తెలిపారు. వెనుకబడిన మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయగలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి అన్నారు. నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదికను అంద జేయాలన్నారు. భార్యాభర్తలైన ఉద్యోగులు (స్పౌస్‌ కేస్‌) ఒకే చోట పనిచేస్తేనే వారు ప్రశాంతంగా పనిచేయ గలుగుతారని, ఉత్పాదకత కూడా పెరుగుతుందని సీఎం తెలిపారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పౌస్‌ కేస్‌ అంశాలను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు.

‘ఒమిక్రాన్‌’ గురించి ఆందోళన వద్దు:

‘ఒమిక్రాన్‌’ వ్యాప్తి వార్తల నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వాక్సినేషన్‌ పురోగతిని కలెక్టర్లు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని వారు సీఎంకు తెలియజేశారు. ఒమిక్రాన్‌ విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ‘ఒమిక్రాన్‌’ విషయంలో ఆందోళన అక్కరలేదని, నిరోధానికి చేపట్టవలసిన ముందస్తు చర్యలపై సమీక్షించి, ముఖ్యమంత్రి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

నాలుగు మండలాలలో దళితబంధుకు 250 కోట్లు

రాష్ట్రంలో దళితబంధు పథకం అమలులో భాగంగా ముందుగానే ప్రకటించినట్టు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశాలమేరకు నాలుగు జిల్లాలలోని నాలుగు మండలాలకు ఎస్సీ కార్పొరేషన్‌ నిధులను విడుదల చేసింది. నిధులను ఆయా జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసింది.

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లోని తిర్మలగిరి మండలంలో దళితబంధును సంతృప్త స్థాయిలో అమలు చేసేందుకు రూ.50 కోట్లు, ఖమ్మంజిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలో దళితబంధు అమలు కోసం రూ.100 కోట్లు, నాగర్‌ కర్నూలు జిల్లా అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని చారగొండ మండలంలో దళితబంధు అమలుకోసం రూ.50 కోట్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలోని నిజాంసాగర్‌ మండలంలో దళితబంధు అమలుకోసం రూ.50 కోట్లు ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో జమచేశారు.