మత్స్యకారులకు బీమా

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుల వృత్తులపై ఆధారపడిన వారిని ఆర్థికంగా, సామాజికంగా వృద్ధిలోకి తీసుకురావాలన్న గట్టి సంకల్పంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉన్నారని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో  బేగంపేట హరిత ప్లాజాలో నిర్వహించిన జాతీయ మత్స్యకారుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వివిధ కారణాలతో మరణించిన 105 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఇన్సూరెన్స్‌ క్రింద ఒక్కొక్క కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున చెక్కులను మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌, రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్‌, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్‌ లచ్చిరాం భూక్యాలు అందజేశారు.

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మత్స్యరంగ అభివృద్ధి కోసం గతంలో ఎన్నడూ లేనంతగా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. మత్స్యకారుల సంక్షేమం కోసం సామూహిక ప్రమాద బీమా పథకం క్రింద ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం అమలు చేయడం జరుగుతోందని చెప్పారు. మత్స్య సహకార సంఘాలలో నమోదు చేయబడిన సభ్యులందరికి బీమా పథకం వర్తింప చేయనున్నట్లు తెలిపారు. ప్రతి మత్స్యకారునికి 12 రూపాయల ప్రీమియంలో 6 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 6 రూపాయల ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని వివరించారు. 2021-22 నుండి మత్స్యకారుల బీమా పథకం అమలు కోసం జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థను నోడల్‌ ఏజెన్సీగా ఎంపిక చేసిందని చెప్పారు.

మత్స్యరంగ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ ఎవరూ అడగకుండానే ఉచితంగా చేప పిల్లలు ఇస్తున్నారని, మత్స్యకారులకు సబ్సిడీ పై వాహనాలను ఇచ్చిన గొప్ప నాయకుడు అని మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. రాష్ట్రంలో నీరున్న ప్రతిచోట చేప పిల్లలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఆదేశించారని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమంతో రాష్ట్రంలో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని అన్నారు.

చేపల సైజు పెరిగిన తర్వాత, మద్దతు ధర ఉన్నప్పుడే అమ్ముకోవాలని, తక్కువ ధరకు విక్రయించి నష్టపోవద్దని కోరారు. చేపల మార్కెటింగ్‌లో మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మత్స్య సహకార సంఘాల నుండి నేరుగా మత్స్య ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో కొనుగోలు చేయడం ద్వారా మత్స్యకారులను ఆదుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.

 రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్‌ మాట్లాడుతూ,  గతంలో మత్స్యకారులు అంటే కేవలం ఆంధ్రలోనే వున్నారు అనే వారు. తెలంగాణలో మత్స్యకారులు ఉన్నారని చెప్పే ప్రయత్నం అనేకసార్లు చేశామని అన్నారు. అయినా అప్పట్లో గుర్తింపు రాలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారం ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌  కృషితో  చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో ఉందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో మత్స్యకారులు ఆర్థికంగా మరింత ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన మత్స్యశాఖ అధికారులు, వివిధ మత్స్య సహకార సంఘాల సభ్యులు, మత్స్యకారులు పాల్గొన్నారు.