నిలబడే నిద్ర!

ennela-eluguఅన్నవరం దేవేందర్‌
పండుగలకు పబ్బాలకు దేవునికి చేసుకుంటే పెండ్లిల్లకు యాటపిల్లను కోసుకోని తినుడు రివాజు. చెరువు నిండినంక యాటపిల్లను కులానికొగలు కట్టమైసమ్మకాడ కోసుకుంటరు. అటెన్క పోగులు ఏసుకోని తలో కుప్ప మోత్కు ఆకుల్ల పట్టుకపోతరు.

ఎన్కట పండుగంటే శియ్యకూరనే, దేవుడంటే కూరనే, కూరకు మరోపేరు మాంసం కూర. ఇయ్యాల రేపు ఐతారం తెచ్చుక తిన్నట్టు ఎన్కటలేదు. సుట్టపోల్లు వస్తే కోడితెగుతది. ఇంటింటికీ సాదుకు కోల్లు ఉంటయి, గుడ్లు పెడతయి. పుంజులైతే పెట్టలమీద పారుతై. గుడ్లకచ్చినదాన్ని కొయ్యరు. పుంజు ఎదిగింది అనుకుంటే మ్యానమామనో అమ్మమ్మవాల్లో పెద్దమ్మవాల్లో వస్తే కోడి తెగుడే. కోడికూర తాళ్ళల్లకెంచి తెచ్చిన కల్లు, గుడాలు ఆ రాత్రి కమ్మటి సంబురం. దసర పండుగ, బోనాలు, మైసమ్మ చేసికునుడు అయితే యాట. పెద్ద కుటుంబం అయితె మ్యాక, గొర్రెను కోస్తరు లేకపోతె లేదు. దసర అయినంక కూరను ఇంటింటికి పంపుడు ఆచారం.

ఇట్ల దసరనాడు మస్తు మ్యాకలు తెగుతుండేటివి. ఇప్పటికి సుత మ్యాకలు గొర్లు మనుషులకు ఆహారానికి అక్కెరకు వస్తున్నయి. గొర్లు గాసేటోల్లు అస్సలు రాత్రిపూట నిద్రపోని సందర్భం ఉంటది. ముసురుపడే కాలంల సుతగోల్లాయన రాత్రి మందకాడ కట్టెను గదువకింద పెట్టుకోని గొంగడి కప్పుకొని తెల్లందాక నిలబడే నిద్రపోతడు. ఇదొక చిత్రమైన ముచ్చట. ఎందుకంటే కమ్మగ మటన్‌ బిర్యాని తినేటోల్లకు తెలువాల్సిన ముచ్చట ఇది. గొర్లను తినేతందుకు తోడేల్లు వస్తయి. ఆ తోడేల్ల కావలి మంద దగ్గర గొల్లోల్లు ఉండాలి. మంద సుట్టు వాయిలి కంచె అల్లింది పెట్టినా తొడేలు కంచెదాటి దునుకుతది. అందుకే అక్కడ కుక్కలతోపాటు గొర్లు కాసే పెద్ద మనిషి నిలుచుండే నిద్ర కూర్పాట్ల పడుకుంట నిగ్రాన్‌గ ఉంటడు. అసలు గొర్లను కాయడం అంటే పెద్ద గొప్ప విషయమే. పొద్దుగాల గొర్లను లేపుకోని మేపడానికి అడవిలకు బయిలెల్లుతడు. పొద్దుగూట్లె పడేటాల్లకు మల్ల మంద ఏడ పండాన్నో ఆన్నే పండబెడదతడు. ఆ లెక్కన ఆయన పొద్దుందాక దాదాపు 20 కిలోమీటర్లకంటే పైననే తిరుగుతడు. చేతిల తుమ్మ ఆకులు చెలిగేతందుకు చిన్న గొడ్డలి ఇంకో చేతిల కట్టె రుమాలు, నీళ్ళ సీస, సద్దిగిన్నె ఇవన్ని పట్టుకోని వాటి ఎనకాల పొద్దుందాక పండకుంట కన్నుమూయకుండ నడుసుడే. వానచ్చినా తుఫాను వచ్చినా వాటిని కనిపెట్టుకుంట ఉండాలె.

నిజానికి మందకాసే ఆయనయే ఆ గొర్లుకావు. ఆయనయి కొన్ని ఉంటయి. కొందరి ఆసాములయి సుత ఉంటయి. అన్ని కలిపె కాసినా ఏ మ్యాక ఎవలిది, ఏ గొర్రె ఎవలది అనేది ఆయనకే ఎరుక. గొర్లు మ్యాకలు కాసుడే కాదు, వాటి ఆరోగ్య రహస్యాలు ఆయనకు తెలుసు. పొద్దుగాల లేవంగనే గొర్లను నిగురానుగ సూస్తడు. పిల్లలు పెట్టిన తల్లి గొర్లే పాలు పిండుతడు కొన్ని పాలు ఇంటికి సర్వల పంపుతడు. ఏ గొర్రెనన్న ఈతకు ఉంటె వైద్యుడై డెలివరీ కూడా చేస్తడు. స్వయంగా ఒక గొర్ల కాపరి వైద్యుడు కూడా అయితడు. గొర్లకు నీళ్ళు పెట్టడం పెద్దయాతన ఎక్కడ నీళ్ళుంటే అక్కడికె కొట్టుకపోవాలె.

గొర్లు నేలమీద గడ్డి మేస్తుంటే మ్యాకలు మాత్రం చెట్టుమీద ఆకులు మేస్తయి. అందుకే వీటి మెడ కిందకి ఉంటే వాటి మెడ మీదికి ఉంటది. గొర్లు, మ్యాకలు తిరిగి తిరిగి ఎవలన్న ఆసామి ఎవుసందారుని పొలంల మంద పెడుతరు. అంటే వాల్ల మడిగట్లల్ల ఆ రోజు పంటయి. అప్పుడు అక్కడ మల మూత్రాలతో తడిసిన ఆ భూమిలో జవ తయారు అయితది. అక్కడ వరి వేసినా, మక్కజొన్న వేసిన బలంగ, జబర్‌గా పెరుగుతది. కాబట్టి మంద మాకు పెట్టు అంటే మాకు అనే పోటీ ఉంటది. మంద పెట్టినందుకు, పంటలకెల్లి వడ్లు, జొన్న పెట్టే సంప్రదాయం ఉంటది. గొర్లు కాసేటోల్ల జీవితంలో నడకే ప్రదానం. ప్రపంచానికి బలవర్థకమైన మాంసాహారాన్ని అందిస్తున్న వాల్ల భాగస్వామ్యం ఈ సమాజానికి పెద్దది. ఊర్లల్ల జరిగే పండుగలు పబ్బాలకు గొర్లు మ్యాకలు మందందరికి ఇచ్చుడు మర్యాదనే. ఇచ్చుడంటే పైసలు ఇచ్చినా దాని ఉత్పత్తి గౌరవించేది రైతుల లెక్కనే. దేశానికి వడ్లు పండించే ఎవసాయదారుడే అందుకే జై జవాన్‌ జై కిసాన్‌ నినాదం పుట్టింది.