నీలో దీపం వెలిగించు … నీవే వెలుగై వ్యాపించు
By: డా. సాగి కమలాకరశర్మ
దీప: పాపహరో నృాణాం దీప ఆపన్నివారక: ।
దీపో విధత్తే సుకృతిం దీప: సంపత్ ప్రదాయక: ॥
భారతీయ విజ్ఞానం అంతా ప్రకృతి ధర్మంతో ముడిపడి ఉంటుంది. ప్రకృతి యొక్క మార్పులకు అనుగుణంగా మన శరీర మానసిక వ్యవహారాలను మార్చుకుంటూ ఉండాలి. వానికి సరియైన విధి విధానాలను మన సంస్కృతి సంప్రదాయాలు సూచిస్తుంటాయి. వానిలో భాగమైనవే మనం నిర్వహించే అనేక వ్రతాలు, దీక్షలు, పండుగలు. ఇటువంటి శ్రేష్టమైన పండుగలలో దీపావళి ఒకటి. ఐదు రోజుల పండుగగా నిర్వహించే ఈ పండుగ వెనుక ఎన్నో వైజ్ఞానికాంశాలు కనిపిస్తున్నాయి.
వెలుగు, కాంతి, ప్రకాశం, జ్ఞానాదులకు దీపం సంకేతం. ఆధ్యాత్మికమైన లోతుల్లోకి వెళ్తే మనలోని జీవ చైతన్యానికి కూడా దీపమే సంకేతం. ఈ చైతన్యమనే దీపానికి మన మనస్సును జోడిస్తే మనస్సు కూడా కాంతివంత మవుతుంది. లోకాన్ని ప్రత్యేకమైన దృష్టితో జ్ఞానమయంగా చూస్తుంది. జీవితం ఆనందమయమవుతుంది. అందుకే దీపాన్ని ఉపాసించడం, దీప భావాన్ని మనస్సులో నింపుకోవడం, దీపకాంతికి నమస్కరించడం భారతీయమైన సంప్ర దాయంగా మారింది. అటువంటి దీపాలను వరుసలో పేర్చుకొని జీవ చైతన్యంతో మమేకమయ్యే పండుగ దీపావళి. మనలో కాంతిని పెంచుకోవాలి. మనమే కాంతిగా మారి లక్షలాదులకు వెలుగును ఇవ్వాలనే సందేశాన్నిచ్చేది దీపావళి.
ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి కేదార గౌరీ వ్రతం, బలిపాడ్యమి, యమద్వితీయ అనే వేరు వేరు కార్యక్రమాల సమన్వయం ఈ దీపావళి ముందువెనుకల్లో జరిగే కార్యక్రమం. లక్ష్మీదేవి ఆరాధన ధన రూపంలో చేసే విధానం ధన త్రయోదశి నాడు జరుగుతుంది. అష్టలక్ష్మి రూపాల్లో ధనలక్ష్మీరూపం ప్రత్యేకమైనది, అందరికీ అవసరమైనది. లక్ష్మీదేవి సంపదకు సంకేతం. సంపదలు జీవితానికి ఆనందాన్నిచ్చేవి. మనకున్న ఆరోగ్యం, ధైర్యం, ఆనందం, సంతృప్తి, ప్రశాంతత అన్నీ కూడా సంపదలు. వీటికి లెక్కలు కట్టడం, రూపాన్నివ్వడం సాధ్యం కాదు. వీటన్నింటి సమాహార రూపమే లక్ష్మీదేవి. వీటినే ధనాలుగా భావించే సంప్రదాయం భారతీయులది. వైదిక సంప్రదాయంలోనూ మనకు వినియోగపడే ప్రకృతి సముదాయాన్ని ధనంగా భావించినారు.
‘‘ధనమగ్ని ర్ధనం వాయుః ధనం సూర్యో ధనం వసుః । ధనమింద్రో బృహస్పతిం వరుణం ధనమశ్నుతే॥’’ అనే శ్రీసూక్త ఫలాన్ని మనమందరం పఠిస్తున్నదే. అగ్ని, వాయువు, సూర్యుడు, వసువులు, ఇంద్రుడు, బృహస్పతి, వరుణుడు అందరూ ధనానికి ప్రతీకలుగా భావించే సంప్రదాయం మనది. అటువంటి ధనాన్ని గుర్తు చేసుకుని ఆరాధించాల్సిన అవసరం ఉంది. అయితే ఆరాధించడానికి వాటికి రూపాలు లేనందున రూప సంపద అయిన రూపాయలతో కూడిన ధనలక్ష్మీపూజలు నిర్వహించడం సంప్రదాయంగా మారింది. అయితే ఆ రోజున రూప సంపద అయినా ధనాన్ని అత్యధికంగా దానం చేసినవారికి రూపరహితమైన ఆరోగ్య, సంతాన, సంతృప్తులన్నీ పరిపూర్ణంగా లభిస్తుంటాయి. ఈ లక్ష్యంతోనే ధనత్రయోదశి ఉత్సవాన్ని నిర్వహించాలి.
ప్రాగ్జ్యోతిష పురాధీశుడైన నరకుడు భూమికి కుమారుడు. తాను పరిపాలకుడుగా ఉంటూ పదహారు వేలమంది కన్యలను చెరపట్టడం, అదితి కుండలాలను అపహరించడం, వరుణుని ఛత్రాన్ని దొంగిలించడం వంటి పనుల వల్ల లోకం అస్తవ్యస్తంగా మారింది. తల్లి భూదేవి విష్ణువును ఆశ్రయించి కుమారునికి శిక్ష విధించాలని కోరుకుంది. కాలక్రమంలో అది జరుగుతుందని పంపించిన మహా విష్ణువు, శ్రీకృష్ణావతారంలో సత్యభామా సహితంగా నరకాసురుణ్ణి వధించి, అందరినీ బంధవిముక్తులను చేసి లోకానికి వెలుగును ఇవ్వడమే నరక చతుర్దశి. ఇది పురాణ గాథ.
ఆకాశంలోని ధ్రువ నక్షత్రానికి సంబంధించిన కథ ఇది. ప్రస్తుత ధ్రువుడు భూమి ఉత్తర ధ్రువానికి ఎదురుగా కనిపిస్తున్న నక్షత్రం. పూర్వపు ధ్రువ నక్షత్రమే నరకుడు. ఇది ప్రస్తుతం పరిధ్రువ తారలలో ఉన్న ‘తోబా’ అనే నక్షత్రం. ప్రస్తుత జ్యోతిషపురం ధ్రువునిదైతే, పూర్వపు జ్యోతిషపురం (ప్రాగ్జ్యోతిషపురం) నరకునిది. కొన్ని వేల సంవత్సరాల పూర్వం భూమి ఉత్తర ధ్రువం ఈ నరకాసుర నక్షత్రాన్ని అనుసరించినట్లుగా ఉండేది. భూమికున్న విషు చలనం వల్ల వేల సంవత్సరాల్లో వచ్చే మార్పుల వల్ల ఈ ధ్రువతారలు మారుతుంటాయి. అటువంటి మారే సమయాల్లో అయనాలు మారిపోతాయి. అదితి సూర్యుని తల్లి. ఆదిత్యునికి ఉన్నవి రెండే అయనాలు (కుండలాలు). అవి అపహరించడమంటే ఉత్తర దక్షిణ అయనాలు మారిపోవడమే. వరుణుని ఛత్రాన్ని దొంగిలించడమంటే ఋతువులు మనం నిర్దేశించుకున్న సమయంలో కాకుండా వేరే సమయాల్లో రావడం. నరకుడిని భూదేవీ స్వరూపమైన సత్యభామ వధించడమంటే భూమి తన ధ్రువ మార్గాన్ని మార్చుకోవడమే. ఇట్లా ఖగోళ ప్రాతినిధ్యం ఉన్న రోజు నరక చతుర్దశి. వాతావరణంలో వచ్చే మార్పులను అనుసరించి తెల్లవారు జామున లేచి మంగళహారతులు స్వీకరించి వెలుగులకు నమస్కరించి ఉపాసించడం, ఖగోళ ప్రాధాన్యతలకు అనుగుణంగా శరీరాన్ని, మనస్సును మార్చుకోవడం కోసం శుద్ధి చేసుకోవడం ఈ పండుగ ప్రాధాన్యం.
దీపావళి అమావాస్య నాడు దీప స్వరూపమైన వేడిమిని, వెలుగును ఉపాసించడమే లక్ష్యం. తమసోమా జ్యోతిర్గమయ అన్నట్లుగా చీకటిని వెలుగుల మయం చేసే విధానమే ఈ దీపావళి. మనలోని అజ్ఞాన తిమిరాన్ని విజ్ఞానపు కిరణాలతో మార్చుకునే ప్రయత్నమే దీపాలతో చేసే పూజ. అందుకే దీపాన్ని కూడా లక్ష్మీదేవితో పోల్చడం. లక్ష్మీదేవి ప్రార్థన అంటే కేవలం ధనాన్ని గూర్చి చేసే ప్రార్థన మాత్రమే కాదు. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఓజోన్ పొరలోపలి ప్రకృతి అంతా మహాలక్ష్మీ స్వరూపంగా పోల్చబడిరది. ఈ ప్రకృతిలో సరియైన వెలుగులు ఉంటేనే మనకు సరియైన జీవనం ఉంటుంది. లేకుంటే వేరు వేరు సూక్ష్మజీవులు విజృంభించి అంటువ్యాధులు ప్రబలుతుంటాయి. ఆ వెలుగులు తగ్గిపోతున్న సమయం కాబట్టి వాటిని ఉపాసించే ప్రయత్నమే దీపలక్ష్మీ పూజ. శరీరాన్ని అభ్యంగన స్నానాదుల ద్వారా శుద్ధి చేసుకోవడం, మనస్సును పూజ, ఉపాసనల ద్వారా శుద్ధి చేయడం, గృహాన్ని శుద్ధి చేసి దీపకాంతులతో నింపి అలక్ష్మిని పారద్రోలి ఆరోగ్యాదులు కాపాడుకోవడం, ప్రకృతిని శుద్ధం చేయడానికి కొన్ని శబ్దాలతో కూడుకున్న రసాయనాలతో పటాసులు పేల్చడం వంటివన్నీ దీపావళి అమావాస్యనాడు చేసే వైజ్ఞానికమైన కృత్యాలే. మన పంటలు బావుండి, లక్ష్మీదేవి ఆగమనం కోసం చేసే వ్రతమే కేదార గౌరీ వ్రతం.
భూమి మీద తగ్గిపోతున్న ఓజోన్ రక్షణ కవచాన్ని సరిచేసిన రోజులకు గుర్తుగా చేసే పూజ బలిపాడ్యమి. బలి చక్రవర్తి సూక్ష్మజీవులతో కూడుకున్న ప్రకృతికి, రాక్షస ప్రవృత్తికి సంకేతమైనవాడు. అంతకు ముందు రోజుల్లో మనకు భూమి చుట్టూ ఉన్న రక్షణ కవచమైన ఓజోన్ పొర వామన స్థితిలో ఉండేది. అది విస్తరిస్తే తప్ప మనిషికి పూర్తిస్థాయి జీవనం లేదు. అందుకే ఓజోన్ పొర విస్తరించే విధానమే వామనుడు బలిని పాతాళానికి పంపి తాను త్రివిక్రముడుగా మారడం. దానిని గుర్తు చేసుకుంటూ ఈ ప్రకృతిని ఆరాధించడం, బలికి తర్పణాలు ఇవ్వడం బలిపాడ్యమిలోని అంతర రహస్యం.
నియమ బద్ధమైన జీవనానికి యముడు సంకేతం. ఒక పద్ధతి ప్రకారం రాబోయే చలికాలంలోనూ వెలుగులను ఆహ్వానిస్తూ, భూమికి వెలుగును, వేడిమిని అందిస్తూ భూమి కుంచించుకు పోకుండా ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలనే భావాన్ని తెలియజేసేదే యమ ద్వితీయ. మొత్తం మీద అజ్ఞానపు చీకటులను శరీరం, మనస్సు, గృహం, ప్రకృతులలో నుండి పంపించి విజ్ఞానపు వెలుగులను ఆహ్వానించి జీవన విధానం ఆనందమయం చేసుకోవాలని సూచించే పండుగ దీపావళి. మనమే వెలుగుగా మారితే, మన వెలుగును అందరిమీద ప్రసరింపజేయవచ్చు. అందుకు మనం వెలుగులను నిరంతరం ఉపాసించి తీరాలని సూచన చేసే ఉత్సవమే దీపావళి.