|

5 కోట్లతో లింగాయత్‌ భవన్‌

templateబసవేశ్వరుని జయంతి ఉత్సవాలను ఇకమీదట రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నది. నగరంలోని ఒక ముఖ్య ప్రదేశంలో బసవేశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. వీరశైవ లింగాయత్‌, లింగ బలిజల కోసం ఒక ఎకరం స్థలం కేటాయించి అందులో భవన నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ 21వ తేదీన రవీంద్రభారతిలో జరిగిన మహాత్మ బసవేశ్వరుని 882వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు.

ముఖ్యమంత్రి చేసిన ప్రసంగంలో వీరశైవలింగాయత్‌, లింగబలిజలకోసం వరాలను ప్రకటించడం జరిగింది. మహాత్మ బసవేశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేసే క్రమంలో అవసరమయితే ప్రభుత్వం కోటి రూపాయలను సమకూరుస్తుందని అన్నారు.విద్యార్థులలో నైతిక విలువలను మెరుగుపరిచేందుకుగాను పాఠ్యాంశాలలో, పాల్కురికి సోమనాథుడు రచన చేసిన బసవ పురాణాన్ని చేర్చాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించారు. నన్నయ ఆదికవి కాదు, తెలుగులో బసవ పురాణం రాసిన పాల్కురికి సోమనాథుడే తెలుగు ఆదికవి అని ముఖ్యమంత్రి మరోసారి పేర్కొన్నారు.

బసవ పురాణంలో బసవేశ్వర గొప్పతనం వివరంగా పొందుపరచడం జరిగిందని ముఖ్యమంత్రి అన్నారు. బసవేశ్వరుడే సంఘ సంస్కర్తలలో అగ్రగణ్యుడన్నారు. అక్షయ తృతీయ రోజు మహత్తరమైన నక్షత్రంలో జన్మించిన బసవేశ్వరుడు, శివుని ఆదేశంతో ప్రజలలో చైతన్యం కలుగజేసి మార్పు తేవడంకోసం వచ్చిన మహనీయుడు అని అన్నారు. అక్షయ తృతీయనాడు బంగారం కొంటే భాగ్యం అని అందరూ నమ్ముతారు కానీ బసవేశ్వరుడిని మొక్కితేనే నిజమైన భాగ్యం కలుగుతుందని పేర్కొన్నారు కేసీఆర్‌. ప్రస్తుతం మనం నిర్వహించుకుంటున్న పార్లమెంట్‌, శాసనసభలకు మూలాలు బసవేశ్వరుడి కాలంలో వున్నాయన్నారు. బసవేశ్వరుడు అనుభవ మంటపం పేరుతో సమావేశాలు నిర్వహించేవారని పేర్కొన్నారు. హిందూమతంలో లింగాయత్‌ జీవన విధానాన్ని సమాజానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి బసవేశ్వరుడని చెప్తూ, ఈ విషయాన్ని సోమనాథుడు తాను వ్రాసిన ద్విపద కావ్యంలో చెప్పాడని పేర్కొన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. కాకతీయుల కాలంలోనే బసవేశ్వరుడి ఆదర్శాలు అమలయ్యాయని తెలియజేశారు. తెలంగాణలోని ఎన్నెన్నో శివాలయాలను కాకతీయులు అభివృద్ధి చేశారని, ఇందులో బసవేశ్వరుడి ఆలోచనా విధానమే దాగివుందని పేర్కొన్నారు. కులాంతర వివాహాలు జరిగినపుడు సమాజం హర్షించకపోవడంతో మనస్తాపం చెందిన బసవేశ్వరుడు శివైక్యం పొందారని అన్నారు. మనిషిని మనిషిగా చూడలేని సమాజంపట్ల దు:ఖ పడి తన జీవితాన్ని త్యాగంచేసి, తన ఆదర్శాలను సభ్య సమాజానికి చాటిచెప్పిన గొప్ప వ్యక్తి బసవేశ్వరుడు అని తమ ప్రసంగంలో పేర్కొన్నారు కేసీఆర్‌.

లింగాయత్‌లలో కొందరు టైగర్లు వున్నారని వారికి రాజకీయంగా గౌరవప్రదమైన స్థానాన్ని కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. లింగాయత్‌లు గొప్ప మేధావులని కొనియాడారు. ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం తనకు తృప్తి కలిగించిందన్నారు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు.

ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర కార్మిక శాఖామంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ బసవేశ్వర గొప్పవాడని, ఆ రోజుల్లోనే కుల రహిత సమాజంకోసం కృషి చేశారని అన్నారు. బసవేశ్వర చేసిన సూచనలు ఎంతో గొప్పవని అందులో ఎవరూ యాచించొద్దని, సొంతంగా ఆర్జించి సంపాదించిన దాంట్లోనే కొంత భాగాన్ని సమాజానికి ఖర్చు చేయాలని బసవేశ్వరుడు బోధించినట్లు తెలిపారు. లింగాయత్‌లను ఓబీసీ జాబితాలో కలిపేవిధంగా తనవంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రి హరీష్‌రావు, ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్‌, రాములునాయక్‌, లింగాయత్‌ సంఘం కేంద్ర కమిటీ గౌరవాధ్యక్షుడు అశోక్‌ ముస్తాపురే పాల్గొన్నారు.