నదుల అనుసంధానం అసాధ్యం
By: సల్లా విజయ కుమార్,
– వి. ప్రకాశ్
మన దేశంలో వర్షపాతము, నదుల ప్రవాహాలలో స్థానపరమైన, కాలపరమైన అసమానతలు చాలా ఎక్కువ అందుకే నీటి లభ్యత ఎక్కువగా గల నదీ బేసిన్ల నుండి నీటి లభ్యత తక్కువగా గల నదీ బేసిన్లకు నీటిని తరలించడానికి ఆలోచన మొదలైంది. డాక్టర్ కె.ఎల్.రావు ప్రతిపాదించిన ‘నేషనల్ వాటర్ గ్రిడ్’ (1972) ఎక్కువగా జనామోదం పొందింది. దానిలో ముఖ్యాంశం ‘గంగా-కావేరి లింక్’ దాని ద్వారా గంగా నదీ జలాలను 450 మీటర్ల లిఫ్ట్ ద్వారా వింధ్య పర్వతాలను దాటించి కావేరీ నది బేసిన్ వరకు తరలించాలి. అది తరువాతి కాలంలో NWDA (జాతీయ జలవనరుల అభివృద్ది సంస్థ) 1980 ఆధ్వర్యంలో మార్పు చెంది, వింధ్య పర్వతాలకు మధ్యన కాకుండా తూర్పు చివరన దామోదర్ నది – సుబర్ణరేఖ నది ద్వారా తరలించాలని నిర్ణయించారు. హిమాలయన్ కాంపోనెంట్ అని ద్వీపకల్ప (పెనిన్సులార్) కాంపోనెంట్ అని రెండు విభాగాలుగా చేసి మొదట పెనిన్సులార్ కాంపోనెంట్ చేపట్టాలని నిర్ణయించారు. పెనిన్సులార్ కాంపోనెంట్ అంటే ‘మహానది-గోదావరి-క్రిష్ణా- కావేరీ-వైగెయి’ నదుల అనుసంధానం.

NWA ప్రస్తుతం ‘గంగా-మహానది’, ‘మహానది-గోదావరి’ లింక్‌లను అమలు చేయడానికంటే ముందుగా ‘గోదావరి-కావేరీ’ లింక్ కొనసాగించాలని అశిస్తున్నది. అంటే ప్రధానమైన హిమాలయన్ నదులైన గంగా-బ్రహ్మపుత్రల మిగులు జలాలను ద్వీపకల్ప నదులకు మరలించాలనే అంశం మరుగునపడిపోయింది. ఇక తరువాత కాలం లో ఒడిషా రాష్ట్రం మహానది పై అభ్యంతరం వ్యక్తం చేసినందున, నేడు ద్వీపకల్ప కాంపోనెంట్‌లోని గోదావరి నదిపై ఇచ్చంపల్లి బ్యారేజీ నుండి కావేరి నదిపై గ్రాండ్ ఆనికట్ వరకు గల లింక్‌ను మొదటగా చేపట్టాలని ప్రతిపాదించారు.
ఇచ్చంపల్లి వద్ద NWDA అంచనా వేసిన మిగులు జలాల్లో ఛత్తీస్‌ఘఢ్‌కు చెందిన 147టిఎంసిలు ఉపయోగించని వాటా ఉంది. అయితే, గతంలో తాను ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టే వరకు ఆ 147టిఎంసిల నీటిని వాడుకోవచ్చని అని, నాడు ఒప్పుకొన్న ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రం నేడు తన మొత్తం నీటి వాటాను వినియోగించుకోవడానికి పథకాలను చేపట్టానని పేర్కొంది. అంటే NWDA లెక్కించిన 247టిఎంసిల మిగులు జలాల్లో 147టిఎంసిలు తగ్గిపోయాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో గోదావరి నది (ఇచ్చంపల్లి బ్యారేజీ) – కావేరి నది (గ్రాండ్ ఆనికట్) లింక్ ఏ విధంగా సాధ్యమవుతుంది అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.
NWA తన ప్రతిపాదనలో ఇచ్చంపల్లి వద్ద 247టిఎంసిలను మరల్చి, నాగార్జునసాగర్‌లో 176.4టిఎంసిలు, పెన్నా నది పైనున్న సోమశిల ప్రాజెక్టులో 103.4టిఎంసిలు, కావేరి నదిపైనున్న గ్రాండ్ ఆనకట్టలో 89.4టిఎంసిలు తరలించాలని చెప్పింది. రాష్ట్రాల పరంగా తెలంగాణలో 3,67,305 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ లో 2,94,017 ఎకరాలు, తమిళనాడు – ఆంధ్రప్రదేశ్ కలిపి 2,05,000 ఎకరాలు, తమిళనాడు లో 78,250 ఎకరాలు ఆయకట్టు సాగుచేయాలని ప్రతిపాదించింది. ఇక నీటిని తెలంగాణ 65.8 టిఎంసి ఆంధ్ర ప్రదేశ్ 80.66టిఎంసి, తమిళనాడు 83.27 టిఎంసి వినియోగించాలని ప్రతిపాదించింది.
గోదావరి నదిపై గల తన ప్రాజెక్టుల అవసరాలు పోను మిగిలిన నీటిని మాత్రమే తరలించవచ్చని తెలంగాణ కోరింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం నీటి లభ్యత పై స్పష్టత మొదట ఇవ్వాలని కోరింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మిగులు జలాలున్నాయి వాటిని నదుల అనుసంధానం ద్వారా ఇతర బేసిన్లకు మరల్చుతానని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం గోదావరి ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం 75శాతం డిపెండబుల్ జలాల ఆధారంగా చేపట్టిన తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలలుగా తెలంగాణ ప్రాజెక్టు రిపోర్టులు కేంద్రం వద్ద అనుమతుల కోసం పెండింగ్‌లో ఉన్నాయి.
నాగార్జునసాగర్ రిజర్వాయర్‌ను కూడా గోదావరి-కావేరి లింక్‌లో భాగం చేసిన NWDA, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద గల తెలంగాణ కరువు ప్రాంతాలకు నీరిచ్చే ప్రాజెక్టుల అవసరాలను పరిగణలోకి తీసుకోలేదు. పంప్డ్ స్టొరేజీ ద్వారా నాగార్జునసాగర్ నుండి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని మళ్ళించే సదుపాయం శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు పంపు హౌజ్‌లకు ఉంది.
తెలంగాణ అవసరాలన్నీ తీరాకనే మిగులు జలాలను నదుల అనుసంధానం ద్వారా మరల్చాలని, దానికి మొదట నీటి లభ్యత పై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ కోరుతున్నది. రాజ్యాంగ పరంగా నీరు రాష్ట్రాల పరిధిలోని అంశం. ఇప్పటికే ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నింటినీ ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్తిగా తన ఆధీనము లోనికి తీసుకు వచ్చే గెజిట్ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం, మరొకవైపు అపెక్స్ కౌన్సిల్ లో ఒప్పుకొన్నా నేటివరకు సెక్షన్ -3 కింద తెలంగాణ చేసిన ఫిర్యాదును, ఒక నదీ జల వివాదాల ట్రిబ్యునల్ కు నివేదించక పోవడం పై తెలంగాణ ప్రభుత్వం, పౌర సమాజం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక పర్యావరణవేత్తలు, ముఖ్యంగా వాటర్ మాన్ ఆఫ్ ఇండియా గా ప్రఖ్యాతి గాంచిన డా.రాజేంద్ర సింగ్ కూడా ఇటీవల హైదరాబాద్‌లో నదులపై నిర్వహించిన జాతీయ సదస్సులో నదుల అనుసంధానం సరైన విధానం కాదని ప్రకటించారు. గత 30 సంవత్సరాల నుండి ఆయన నదుల అనుసంధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయీ నదుల అనుసంధానం పై రాజేంద్ర సింగ్ అభిప్రాయం అడిగినారు. ‘‘ఒక బ్లడ్ గ్రూపు కలిగిన వ్యక్తికి మరో బ్లడ్ గ్రూపు రక్తం ఎక్కించడం వంటిదే ఈ నదుల అనుసంధానం అని రాజేంద్ర సింగ్ అనగానే వాజ్ పేయీ ఆశ్చర్యపొయారు.
ఏ నది అవసరాలు ఆ నదికి ఉంటాయి. ఏ నదీ పరీవాహక రాష్ట్రం కూడా తమ ప్రాంతంలో ప్రవహించే నదీజలాలను మరో రాష్ట్రానికి తరలించడానికి ఒప్పుకోదు. భవిష్యత్తులో ఏ రాష్ట్రానికైనా నీటి అవసరాలు పెరుగుతాయి. ప్రస్తుతం మిగులు జలాలున్నాయని తరలిస్తే అది తాత్కాలిక చర్య అవుతుందే తప్ప శాశ్వతంగా ఈ ఏర్పాటు మనజాలదు. నదీ పరీవాహక ప్రాంతాల్లో అడవులను పెంచడం, నదులను, వాగుల పరిరక్షణకు ప్రణాళికలను తయారు చేసి కట్టుదిట్టంగా అమలుచేయడం, ప్రతి వర్షపు చినుకును ఒడిసి పట్టుకొని నిల్వ చెయ్యడం, పరిగెత్తే నీటిని (Runoff) నెమ్మదిగా వెళ్ళేలా నదుల్లో, వాగుల్లో ఇసుకను కాపాడటం, భూగర్భ జలాలు పెంచడానికి అన్ని రకాల చర్యలను చేపట్టడం, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ సాగు నీరు అవసరమైన చెరుకు, వరి, గోధుమ పంటలను నిషేధించడం ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్స హించడం, అవసరమైతే క్రాప్ హాలిడే ప్రకటించడం, తక్కువ నీటితో ఎక్కువ పంటలను పండించే విధంగా నీటి వినియోగాన్ని నియంత్రించడం (తెలంగాణలోని నాగార్జున సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టుల క్రింది ఆయకట్టులో ఒక టీఎంసీ నీటితో 12 వేల ఎకరాలలో వరి సాగు చేస్తున్నారు) వంటి విధానాలు అనుసరించడం మంచిది.