సురవరం సాహిత్య జీవన వర్ణచిత్రం 

సురవరం – తెలంగాణం

ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో కొందరు వాఙ్మయమూర్తుల కృషి తాలూకు విశేషాలు ఏనాటికీ తరగిపోని గనుల వంటివి. ఈ వరుసలో చెప్పదగిన ప్రముఖుల్లో తెలంగాణ వైతాళిక శ్రేణిలో సురవరం ప్రతాపరెడ్డి  ఒకరు. రమారమి అర్థశతాబ్ధి క్రితం ముద్దసాని రామిరెడ్డి, డాక్టర్‌ ఎల్లూరి శివారెడ్డి రచించిన (వేరు వేరు) జీవితచరిత్రలు ప్రతాపరెడ్డి జీవిత విశేషాల్ని సమగ్రరీతిలో పరిచయం చేశాయి. తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు తెలుగు చరిత్ర విభాగాల్లోనూ ప్రతాపరెడ్డి వాఙ్మయ సేవలపై ఎంఫిల్‌, పిహెచ్‌.డి. సిద్ధాంత గ్రంథాలు సమర్పించబడ్డాయి. సురవరం రచించిన సృజన ` పరిశోధనాత్మక రచనలపై లబ్ద ప్రతిష్ఠులు అనేక వ్యాసాలు రచించిన సంగతి తెలిసిందే. అయినా యావజ్జీవితం అక్షర సేద్యంలోనే గడిపిన వైజ్ఞానిక కృషీవలుడు ప్రతాపరెడ్డిపై ఇంకా ఆవిష్కరించవలసిన సత్యాలు వున్నాయనిపిస్తుంది. 

ఇందుకొక మంచి ఋజువు రాష్ట్ర మంత్రివర్యులు ఎన్‌. నిరంజన్‌ రెడ్డి ప్రధాన సంపాదకులుగా వెలువడిన ‘సురవరం – తెలంగాణ’. తెలంగాణ సాహిత్యాభిమానులు, ప్రతాపరెడ్డి సాహిత్య జీనన విశేషాలు తెలుసుకోదగినవారు తప్పక చదవవలసిన గ్రంథం ఇది. వందల పుటలలో ఎంతో శ్రద్ధగా రూపొందిన ఈ గ్రంథం పలు సంవత్సరాలపాటు పరామర్శ గ్రంథంగా నిలుస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. వనపర్తి శాసన సభా నియోజకవర్గం నుండి 1952లో గెలిచిన సురవరం పట్ల మంత్రి నిరంజన్‌ రెడ్డి అభిమానం అభినందనీయం. 1995లో ఇంకా మలిదశ తెలంగాణ ఉద్యమం ఉధృతం  కాని రోజుల్లోనే వనపర్తిలో సురవరం శతజయంతి సభకు ఏర్పాటు చేసిన చైతన్యం దృక్పథం నిరంజన్‌ రెడ్డిది. ఇక, ‘‘సురవరం – తెలంగాణం’’లోని పలు విశేషాల్ని సంక్షిప్తంగా సమీక్షిస్తే…

‘ప్రతాపరెడ్డి కవిత్వం బాగా తక్కువగానే రాసినా ఆయన ఎన్నదగిన కవి’ అన్నారట మహాకవి దాశరథి ` ఒకానొక సందర్భంలో. నిజమే, ప్రతాపరెడ్డి సంప్రదాయాన్ని అభిమానిస్తూనే నిరంతరం నవ్యతను ఆహ్వానించిన సాహితీమూర్తి. ప్రస్తుత గ్రంథంలో చేర్చిన ప్రతాపరెడ్డి కవితలు ఆయన వైవిద్య దృష్టికి, ప్రతిభావ్యుత్పత్తులకూ ప్రతీకలు. సురవరం పీఠికలు ప్రముఖ వ్యాసాలు సంకలనంలో చేర్చారు. ఇవి ఇదివరకు వివిధ గ్రంథాల్లో ప్రచురణ పొందినవే అయినా ఒకేచోట చేర్చడంతో పాఠకులకు సౌలభ్యం ఏర్పడుతుంది. పలు పత్రికల్లో వెలువడిన తెలంగాణ  ప్రముఖుల జీవిత విశేషాల వ్యాసాలు చదివించే రీతిలో ఉన్నాయి. దాశరథి ఆత్మకథ ‘‘యాత్రాస్మృతి’’ పుటల్ని ప్రస్తుత గ్రంథంలో చేర్చారు. 

ప్రతాపరెడ్డి గురించి వానమామలై వరదాచార్యులవారు ‘‘ప్రతాప ప్రశంస’’ పేరుతో 1957లో పద్యరచన చేశారు. ఇవి స్రవంతి పత్రికలో ప్రచురణ పొందాయి. అయితే ఎందుకో ఏమో ఈ గొప్ప పద్యాలకు ప్రచారం రాలేదు! ‘‘ప్రతాప ప్రశంస’’తోపాటు పలువురు ప్రసిద్ధ కవులు సురవరంపై రచించిన పద్యాల్ని ప్రస్తుత గ్రంథలో చేర్చారు. మంత్రివర్యులు నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నట్టు ‘‘సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ  ప్రజ్ఞాశాలి’’. తెలుగు సమాజానికి మార్గ నిర్దేశం చేసిన దార్శనికుడు. కేవలం రచనాపరంగానే కాకుండా సామాజిక కార్యకర్తగా నిరంతరం తపనతో పనిచేసిన కృషీవలుడు. ప్రతాపరెడ్డి మహోదయుల సాహిత్య జీవన వర్ణచిత్రం 

‘‘సురవరం – తెలంగాణం’’.

పుస్తకం పేరు : సురవరం – తెలంగాణ
ప్రధాన సంపాదకులు: సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
పేజీలు:194
ప్రతులకు :
35-6, వల్లభ్‌నగర్‌
వనపర్తి – 509 103