రైతు సమస్యలపై సుదీర్ఘచర్చ

రైతు సమస్యలపై సుదీర్ఘచర్చతెలంగాణ రాష్ట్ర శాసన సభ, శాసన మండలి వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్‌ 23 నుండి ప్రారంభమై అక్టోబర్‌ 7వ తేదీ వరకు జరిగాయి. సెప్టెంబర్‌ 23న మొదటి రోజు ఉభయ సభలు మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె అబ్దుల్‌ కలాం, నారాయణఖేడ్‌ శాసనసభ్యులు పి. కిష్టారెడ్డిల మృతికి సంతాపం తెలిపి వాయిదాపడ్డాయి. అబ్దుల్‌ కలాం సేవలను ముఖ్యమంత్రి కొనియాడారు. శాసన మండలిలో సబ్దుల్‌ కలాం సేవలను సభ్యులు ప్రస్తుతించారు. అనంతరం సెప్టెంబర్‌ 29న తిరిగి శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.

శాసన సభలో సెప్టెంబర్‌ 29వ తేదీన ‘రుతుపవనాల వైఫల్యం-రైతుల సంక్షేమం’ అనే అంశంపై చర్చ ప్రారంభమైంది. ఈ చర్చలో ప్రతిపక్ష, అధికార పక్ష సభ్యులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. మొదట ప్రతిపక్షనాయకుడు జానారెడ్డి మాట్లాడుతూ, రైతుల ఆవేదనను ప్రభుత్వం అర్ధం చేసుకోవాలన్నారు. అసెంబ్లీ వేదికగా అధికార విపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కాదని సమస్యకు పరిష్కారం కనుక్కోవాలన్నారు. కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ, విత్తనాలు మొలకెత్తక, మొలకెత్తిన విత్తనాలు వర్షాభావంతో ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీ చేయాలని కోరారు.

టిడిపి శాసన సభా పక్ష నాయకుడు దయాకర్‌ రావు మాట్లాడుతూ, కరువు మండలాలు ప్రకటించాలన్నారు. 248మండలాలలో వర్షాభావ పరిస్థితులున్నాయని, 50శాతం నాట్లు పడలేదని ఈ విషయంలో ప్రభుత్వం సరైన చర్యలుతీసుకోవాలని సూచించారు.

బిజెపి శాసన సభా పక్షనాయకులు డా. లక్ష్మణ్‌ మాట్లాడుతూ, రుతుపవనాల వైఫల్యం జరిగితే ప్రభుత్వం తీసుకోవల్సిన జాగ్రత్తలేవీ తీసుకోలేదని, వెంటనే రైతుల కష్టాలు తీర్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు.

వైసిపి సభ్యుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రభుత్వం రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేయాలన్నారు. ఎంఐఎం శాసన సభా పక్షనాయకుడు అక్బరుద్దీన్‌ ఓవైసీ మాట్లాడుతూ రైతుల ఆత్మ హత్యలు ఆగేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

సీపిఎం సభ్యుడు సున్నం రాజయ్య, సీపిఐ సభ్యుడు రవీంద్ర కుమార్‌లు మాట్లాడుతూ రైతులకు అనుకూల వ్యవసాయ విధానాలు రావాలన్నారు. పంటల బీమా పథకం సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.

అనంతరం సభ 30వ తేదీకి వాయిదా పడింది. తిరిగి 30న సభ ప్రారంభం కాగా సభ్యులు రామలింగారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, రసమయి బాలకిషన్‌లు వ్యవసాయ సంక్షోభంపై మాట్లాడారు. అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం రైతులకోసం చేపడుతున్న కార్యక్రమాలు, ముందు ముందు చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం సభ వాయిదా పడింది.

అక్టోబర్‌ 1వ తేదీన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, టిడిపి, బిజెపి, సిపిఐ, సిపిఎంలు ఏక కాలంలో రైతుల రుణమాఫీ పై ప్రభుత్వ ప్రకటన చేయాలని అనంతరమే సభ నిర్వహించాలని పట్టుబట్టి సభా నిర్వహణకు ఆటంకం కలిగించడంతో కాంగ్రెస్‌కు సంబంధించి జానారెడ్డి, గీతారెడ్డి, టిడిపికి చెందిన కృష్ణయ్యలు మినహా మిగతా ప్రతిపక్ష సభ్యులందరిని శాసన సభ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు స్పీకర్‌ బహిష్కరించారు.

5వ తేదీన జరిగిన సమావేశంలో విద్యుత్‌ అంశంపై పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు, సంశయాలకు విద్యుత్‌ శాఖామంత్రి జగదీశ్‌ రెడ్డి సమాధానం ఇచ్చారు. 6వ తేదీన వాటర్‌ గ్రిడ్‌పై చర్చ జరిగింది.

7వ తేదీన శాసస సభ్యులు నర్రా రాఘవ రెడ్డి, పర్సా సత్యనారాయణ, ఇబ్రహింబిన్‌ అబ్దుల్లా మస్కతి, జువ్వాడి నరసింగరావుల మృతిపట్ల శాసస సభ సంతాపం తెలిపింది. అనంతరం మిషన్‌ కాకతీయపై లఘు చర్చ జరిగింది. దీనికి మంత్రి హరీష్‌ రావు సమాధానం ఇచ్చారు.

రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సభకు వివరంచారు. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది.

శాసస మండలి :

సెప్టెంబర్‌ 29వ తేదీ నుంచి 7వ తేదీ వరకు శాసస మండలి వర్షాకాల సమావేశాలు జరిగాయి. 29న ‘రుతుపవనాల వైఫల్యం-రైతుల సంక్షేమం’ అనే అంశంపై చర్చ ప్రారంభమైంది. ఈ చర్చలో ప్రతిపక్ష, అధికార పక్ష సభ్యులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. మొదట ప్రతిపక్షనాయకుడు షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేయాలని, దీనిపై ముఖ్యమంత్రి సభలో వివరణ ఇవ్వాలని కోరారు. బ్యాంకర్లు రైతులను సతాయిస్తున్నారన్నారు. గల్ఫ్‌ బాదితులను ఆదుకోవాలని, నల్లబెల్లంను మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

బిజెపి సభ్యుడు రాంచంద్రరెడ్డి మాట్లాడుతూ, రైతుల ఆత్మహత్యలను రాజకీయం చేయవద్దన్నారు. ప్రభుత్వం జూన్‌ 2, 2014 తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతులకు నష్టపరిహారం అందజేయడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. కరువు మండలాలను వెంటనే ప్రకటించాలని కోరారు.

పలువురు టిఆర్‌ఎస్‌ సభ్యులు రైతు ఆత్మహత్యలపై మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాల వల్లే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని విమర్శించారు.

సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు నాయిని, ఇంద్రకరన్‌రెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమాధామిస్తూ రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసిఆర్‌ చర్యలు తీసుకుంటున్నారన్నారు.

30వ తేదీన రైతు సమస్యలపై మండలిలో చర్చ జరిగింది. ఈ చర్చలో కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, ఎంఐఎం సభ్యులు పాల్గొన్నారు. రైతుల రుణాలను వెంటనే మాఫీ చేయాలని, కరువు మండలాలను ప్రకటించాలని కోరారు.

ఐదవ రోజు శాసన మండలి ప్రారంభమైన తర్వాత ఏకకాలంలో రుణమాఫీ చేయాలని కాంగ్రెస్‌ సభ్యులు సభలో ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రశ్నోత్తరాలను అడ్డుకుంటూ, స్పీకర్‌ పోడియంను ముట్టడించి నినాదాలు చేశారు. దీంతో సభను పది నిమిషాలు మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ వాయిదా వేశారు. వాయిదా అనతంతరం సమావేశమైనా సభ నిర్వాహణను కాంగ్రెస్‌ సభ్యులు అడ్డుకోవడంతో వారిని సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి.

నేతి విద్యాసాగర్‌ పదవీ స్వీకారం

ఆరవరోజున శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా నేతి విద్యాసాగర్‌ పదవీ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయకు అభినందనలు తెలిపారు. కౌన్సిల్‌కు గౌరవం తీసుకురావాలని, భవిష్యత్తులో మరిని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ ముఖ్యమంత్రికి, సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. సభ ఔన్నత్యాన్ని, శాసన మండలికి మంచిపేరు తీసుకువస్తానన్నారు. ఆ తర్వాత విద్యుత్‌ సరఫరాపై లఘు చర్చను ప్రారంభించారు.

విద్యుత్‌ పై లఘు చర్చను విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి ప్రారంభించారు. 2018 సంవత్సరానికల్లా తెలంగాణను మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. రైతులకు పగటిపూటే విద్యుత్‌ సరఫరా చేస్తామన్నారు. విద్యుత్‌ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి సభకు వివరించారు.

ఏడవ రోజున శాసన మండలి మాజీ సభ్యుడు ఇబ్రహిం మస్కతి మృతికి సంతాపం ప్రకటించింది. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ సభ్యుడు సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ కల్తీ విత్తనాలు సరఫరా చేస్తున్నారని, విత్తన కంపెనీలకు సబ్సీడి ఇస్తున్నా అధిక ధరలకు అమ్ముతున్నారన్నారు. దీనికి సమాధానంగా మంత్రి పోచారం సమాధానమిస్తూ విత్తనాల విషయంలో రాజీ పడేదిలేదని, నాసిరకం, కల్తీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాతీయ రహదారుల అభివృద్దికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

ఆతర్వాత వాటర్‌ గ్రిడ్‌పై లఘు చర్చ ప్రారంభించారు. ఈ చర్చకు మంత్రి కేటిఆర్‌ సమాధానమిచ్చారు. చర్చ తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్న చైర్మన్‌ స్వామిగౌడ్‌ ప్రకటించారు.