మళ్ళీ చదవాలనిపించే ” మా ప్రసిద్ధిపేట

siddipeta కన్నోజు లక్ష్హీకాతం
ఊహించి రాసే కథలకన్నా వున్నదున్నట్టురాసే కలం చాల గొప్పది. చిన్నప్పటి విషయాలను యాది మీరకుండా బాగా గుర్తుంచుకొని తను పుట్టిపెరిగిన ఊరు పరిస్థితిని అప్పుడూ ఇప్పుడూ ఎలా వుందనే సంగతిని ఒక ప్రత్యేక శైలిలో రాసి ” మా ప్రసిద్ధిపేట పుస్తకంలో ” సిద్ధిపేట” గురించి ఎన్నెన్నో విషయాలు తెలియజేశారు మూర్తిగారు. వ్వవసాయ, వ్యాపార, సాహిత్య, సాంస్కృతిక, చరిత్ర వుందంటూ చూపెట్టారు. వీరు అక్కడి స్థానికులే గాకుండా ఉద్యోగరిత్యా సిద్ధిపేటలో కొలువుజేసిన చుక్కా రామయ్యలాంటి ప్రముఖులెెందరి గురించో సవిస్తారంగా తెలుపడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ. చంద్రశేఖర రావు గారితోపాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.వి. రమణాచారి గారు కూడా సిద్ధిపేటకు సంబంధించినవారే అని చెబుతూ నందమూరి రామారావు గారు. ఇందిరాగాంధీ లాంటి ప్రభృతులు గూడా సిద్ధిపేటను సందర్శించిన వారిలో వున్నారని ఒకింత గర్వంగా చెప్పడం జరిగింది. తిరుమల శ్రీనివాసాచార్యులు, కనపర్తి రామ చంద్రమాచారి. పరాశరం గోపాల క్రిష్ణమూర్తి, అష్టకాల రామ్మోహన్‌, వేముగంటి గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ అవధాని గారితో పాటు మరెందరో కవులు, కళాకారులు, రాజకీయ నాయకులకు ఈ సిద్ధిపేటతో ఆత్మీయానుబంధముంది. పాతకాలంలోని పేట రూపురేఖలు, మానవసంబంధాలు, నిర్మాణాలు, విద్యావ్యవస్థ, గుళ్ళు గోపురాలు, రవాణా సౌకర్యాలు వగైరా ఎన్నెన్నో విషయాలు దృశ్య నగరంలో తిరుగుతున్నట్టుగా వుంటుంది.

గత యాబై సంవత్సరాలుగా అనేక నగరాలు అనూహ్యరీతిలో అభివృద్ధి చెందినవి కాబట్టి ఆయా నగరాలకు సంబంధించిన వ్యక్తులు మా ప్రసిద్ధిపేటలాంటి పుస్తకాలు రాయడం ఎంతో అవసరం కాబట్టి యింత మంచి పుస్తకాన్నందించిన డా| గుమ్మన్నగారి బాల శ్రీనివాస మూర్తి మరింత సమాచార సాహిత్యాన్ని పాఠకులకు అందించాలని కోరుతూ. వారిని మనసారా అభినందిస్తున్నాను.