|

మడిపల్లి భద్రయ్య -రచనా దృక్పథం 

By: ఎం. వి. పట్వర్ధన్‌

తనదైన అస్తిత్వం కోసం తెలంగాణ సమాజం అలు పెరుగక చేసిన మహోద్యమం ఫలితంగా, చిరకాల స్వప్నం  సాకారమై తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. మూగబోయిన కోటి రతనాల వీణ మళ్ళీ మృదు మధురంగా స్వనించడం మొదలైంది. ఇంతవరకూ ప్రతిభ ఉండికూడా అనేక ఇతర కారణాలవలన రావాల్సినంత వెలుగులోకి రాని తెలంగాణ ప్రాంత సాహితీ మూర్తుల్ని ప్రపంచానికి తెలియ జెప్పడం ఒక అనివార్యమైన అవసరమైన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా నిర్మల్‌ పట్టణానికి చెంది, ఇటీవలే శివైక్యం పొందిన మడిపల్లి భద్రయ్య (18/09/2021) జీవితాన్నీ, సాహిత్య కృషినీ రేఖామాత్రంగా పరిచయం చేయడం ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశ్యం.

మడిపల్లి భద్రయ్య -ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాకు చేసిన సేవలు

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతగా, కవిగా, గాయకుడిగా, నటుడిగా, సమాజ సేవకుడిగా, ఆధ్యాత్మిక వేత్తగా, పురాణ ప్రవచనకర్తగా, మలి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక కార్యకర్తగా, అన్నిటికీ మించి ఒక కళాజీవికి ఉండాల్సిన సున్నితమైన హృదయ స్పందనల్ని చివరిదాకా సజీవంగా నిలుపుకొని, ఒక నిజమైన మనిషిగా, మనీషిగా, మహోన్నతమైన మానవతావాదిగా కొనసాగిన బహుముఖీనమైన వారి జీవిత ప్రస్థానం ఈనాటి కవులూ, కళాకారులు ఎందరికో ఆదర్శప్రాయం.

భద్రయ్యని గూర్చి ఒక్క మాటలో చెప్పాలంటే వారు ఉమ్మడి ఆదిలాబాదు హృదయ స్పందన అంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా సాహితీ సాంస్కృతిక సారథిగా, ఈ జిల్లాలోని కొత్త పాత తరాల రచయితలకు మేలు వారథిగా వారు వ్యవహరించారు. వారు తమ ఆదిలాబాద్‌ జిల్లాను అత్యమితంగా ప్రేమించారు కాబట్టే ‘‘ఆదిలాబాదు జిల్లా.. జిల్లా అడవుల తల్లి జిల్లా..జిల్లా జిల్లా ఆదిలాబాదు జిల్లా .. జిల్లా  – అందమైన జిల్లా జిల్లా…’’ అంటూ జిల్లా ప్రశస్తి గీతాన్ని అందించగలిగారు. ఈ గీతం  అత్యంతప్రాచుర్యం పొందిన ఆదిలాబాద్‌ జిల్లా గీతాల్లో మొదటిది. ఈ గీతాన్ని వారు సభల్లో ఉత్సాహంగా పాడుతూ  నర్తిస్తుంటే సభాసదులందరూ ఉత్తేజంతో చప్పట్లు కొడుతూ గొంతుకలపడం ఒక అనిర్వచనీయమైన అనుభవం. భద్రయ్య ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేశాక తమ ద్విచక్రవాహనం మీద విశాలమైన ఆదిలాబాదు జిల్లాలోని 52 మండలాలను 41 రోజుల్లో పర్యటించి, తమ అనుభవాలను అన్నిటినీ క్రొడీకరించి ‘‘మన అదిలాబాదు’’ అనే అద్భుతమైన గ్రంథాన్ని అందించారు. ఇందులో ఆయా మండలాలకు సంబంధించి భౌగోళిక, రాజకీయ, సాహితీ, సాంస్కృతిక విశేషాలన్నీ పొందుపరిచారు. దీన్ని ఆదిలాబాదు విజ్ఞాన సర్వస్వంగా, ఆధునిక యాత్రా చరిత్రగా కూడా భావించవచ్చు.

భద్రయ్య ఒక పుష్కర కాలంపాటు దీక్షగా శ్రమించి, ఆదిలాబాదు జిల్లా విభిన్న ప్రాంతాలకు చెందిన పదజాలాన్ని సేకరించి 10,000 పదాలతో ‘మన భాష – మన యాస’ పేరుతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మొట్టమొదటి పదకోశంగా ఆదిలాబాదు జిల్లా వ్యావహారిక భాషాపద కోశాన్ని నిర్మించారు. ఇందులో పదాలకు అర్థాలతోపాటు వాక్యప్రయోగాలను కూడా ఉదాహరించారు. ఉదాహరణకు ఆదిలాబాదు వైపు ఎక్కువగా మాట్లాడే ధింగాన అనే పదాన్ని వివరిస్తూ ‘‘అల్లరి’’ అనే అర్థాన్నివ్వడమే కాకుండా ‘‘బాపూ! నీవావల్కి వోంగనే పొల్లగాల్లంత ఇంతాంత ధింగాన చెయ్యలేదే? ఈ తాతీల్లెప్పుడైపోతయోగని ఏం సుద్రియ్య కచ్చింది.’’ అన్న వాక్యాన్ని చూపారు. ఇలాగే దీనిలో ప్రసక్తానుసారంగా ఎన్నో తెలంగాణ పలుకుబళ్ళూ, సామెతలూ, ఆదిలాబాదు జిల్లాలోని ఊళ్ళ పేళ్ళూ, మనుషుల పేళ్ళూ, వ్యావహారికములో ఉన్న అన్యదేశ్యాలూ   కనిపించి దీన్నొక సజీవ నిఘంటువును చేశాయి. వారు విన్నపంలో చెప్పుకున్నట్టు ఆదిలాబాదు జిల్లా వాసుల మాటలలొని ముత్యాల వంటి గ్రామీణ, జానపద, పురాతన, ఆద్యతన పదాలు ఎక్కడ మరుగుపడి తెలుగు పదాల వాడుకలో ప్రమాదమేర్పడుతుందోనన్న ఆరాటంతోనే నిర్మించిన ఈ పదకోశం ఆదిలాబాదు వ్యావహరిక భాషకు సంబంధించి ఇలాంటి పరిశోధనలు మరిన్ని జరగడానికి ఒక తోవ చూపిందనేది నిర్వివాదాంశం.

భద్రయ్య ఉపాధ్యాయుడిగా ఆదిలాబాదు జిల్లాలోని అనేక ప్రాంతాల్లోని పాఠశాలల్లో పనిచేశారు. దాదాపుగా తాము పని చేసిన ప్రతిచోటా ఒక సాహితీ సాంస్కృతిక సంస్థను నెలకొల్పారు. జన్నారంలో మిత్రకళాసమితిని (1978) నెలకొల్పి ఎన్నో నాటకాలను వేయించారు. లబ్ధ ప్రతిష్టులైన కవులూ, కళాకారులను రప్పించి కార్యక్రమాలను నిర్వహించారు. ఇచ్చోడలో పనిచేస్తున్నప్పుడు కలిసివచ్చే మిత్రుల సహకారంతో ప్రత్యూష అనే లిఖిత పత్రికను వెలువరించారు. ఇది ఆ తరువాత ముద్రిత పత్రికగా కూడా మారింది. ఈనాడు, ఆదిలాబాదు జిల్లాలో క్రియాశీలంగా ఉన్న రచయితల్లో చాలామంది ప్రత్యూష పాఠశాల నుండి వచ్చినవారే అంటే సత్యదూరం కాదు. అందుకే ‘‘యాది’’ సామల సదాశివ మాస్టారు లాంటి మహామహులు కూడా ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాకు తామెవరూ చేయని విధంగా భద్రయ్య సాహితీ సేవను చేస్తున్నారని ప్రశంసించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు సంబంధించి వానమామలై వరదాచార్యులు, సామల సదాశివతో కలిపి చెప్పుకొవాల్సిన సాహిత్యమూర్తి మడిపల్లి భద్రయ్య.

వీరు ఏనాడూ ఏమీ ఆశించక తమ పని తాము చేసుకుంటూ పోయినప్పటికీ  ఆదిలాబాద్‌ సాంస్కృతిక సమాఖ్య వారిచే విశిష్ట కళారత్న అవార్డు(1997), తెలుగు విశ్వవిద్యాలయం వారిచే నండూరి రామకృష్ణమాచార్య కీర్తి పురస్కారం (2011), శాతవాహన విశ్వ విద్యాలయం నుండి శ్రీ ముదిగంటి వెంకట నరసింహారెడ్డి సాహితీ పురస్కారం, తెలంగాణ రాష్ట్రం అవతరణ పిదప 2015లో  జిల్లా స్థాయిలో ఉత్తమ జిల్లా కవి పురస్కారం,ఇంకా ఎన్నెన్నో సన్మానాలు జరిగాయి

జీవితం-రచనలు

భద్రయ్య  నాడు 17/01/1945 నాడు పుణ్యమూర్తులైన మడిపల్లి వీరయ్య – గంగమ్మ (ఇంకా సజీవులు)  దంపతులకు జ్యేష్ట కుమారుడిగా జన్మించారు. వీరిది బాగా ఆచార వ్యవహారాలను పాటించే చెన్నమల్లికార్జున  పండితరాధ్యుల కుటుంబం. అరాధ్య గురు సంప్రదాయాల్ని అనుసరించేవారు. శిష్య సంచారమే ప్రధానమైన జీవనాధారం కావడం మూలాన భద్రయ్య నాన్నగారు ఎక్కువగా మహారాష్ట్రలో దేశసంచారం చేస్తూ ఉండేవారు. దీనివలన ఎదురైన అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కుంటూనే మొక్కవోని ధైర్యంతో భద్రయ్య నిర్మల్‌లో పదవ తరగతి ఉత్తీర్ణులై, ఆ తరువాత తమ ఇంటి ముందే ఉన్న బేెసిక్‌ ట్రేనింగ్‌ స్కూల్లో ఉపాధ్యయశిక్షణను పూర్తి చేసుకొని 1962లో లక్షెట్టిపేట ప్రభుత్వోన్నత పాఠశాలలో ప్రాథమిక ఉపాధ్యాయుడిగా చేరారు. ఆ తరువాత భైంసాలో పనిచేసి 1972లో తాము పనిచేస్తున్న దిలావర్‌పూర్‌ పాఠశాలలోనే ప్రధాన ఉపాధ్యాయుడిగా పదోన్నతిని పొంది, జన్నారం, గాజుల నర్సాపూర్‌, ఇచ్చోడ, ఆసిఫాబాదు, కుంటాలలో పనిచేసి 2001లో కుంటాలలోనే పదవీ విరమణ చేశారు. ఆసిఫాబాదులో పనిచేస్తున్నప్పుడే వీరు జాతీయస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని పొందారు.

మడిపల్లి వారిది పండిత కుటుంబం. వీరి ముత్తాత భద్రయ్య మంచి విద్వత్కవులు.బసవరాజీయం అనే వైద్య గ్రంథాన్ని, సంస్కృత భాషలో వ్యాకరణాన్ని, సారంగధర అనే యక్షగానాన్ని రచించారు. తండ్రి వీరయ్య శ్రీరాజరాజేశ్వర శతకం, శ్రీ కాశీ విశ్వనాయక శతకం మొదలైన రచనలు చేశారు. వీరి ప్రభావం బాల్యం నుండి భద్రయ్య మీద బలంగా పడిరది. పద్యాన్ని రాసి, రాగయుక్తంగా ఆలపించడంలోని మెలకువలను తండ్రి నుండే నేర్చుకున్నారు. పదవతరగతి చదువు తున్నప్పుడే గాంధీ మీద పద్యాలు రాశారంటే బాల్యం నుండే వారి ప్రతిభా పాటవాలు మనకు అర్థం అవుతున్నాయి.

భద్రయ్య మంచి గాయకులు. పాట అన్నా, పద్యాన్ని గొంతెత్తి పాడుకోవడమన్నా ప్రాణం. ఒకసారి పక్షవాతం వచ్చి ఆసుపత్రిలో ఉన్న తరువాత ఇక రాదు అనుకున్న గొంతు మళ్ళీ వచ్చినప్పుడు ‘‘పాడుకుంటా పాడుకుంటా నే పాడుకుంటా – భావ రాగాలనే బావమరదళ్లుగా పాడుకుంటా’’ అని పాడుకున్నారు.

భద్రయ్య సుకుమారమైన స్పందనా శీలి. ఏది చూసిన వెంటనే స్పందించి, దానిని వెంటనే అక్షరీకరించి,ప్రకటించే గుణం కలవారు. అలా వారు తమ జీవిత కాలంలో పునర్ముద్రణలు కాక మొత్తం 25 రచనలు ప్రకటించారు .  అవి ఈ  విధంగా ఉన్నాయి. 1) శ్రీ షిర్డీ సాయి త్రిశతి (1998), 2) శ్రీ జ్ఞాన సరస్వతీ స్తవం 2001,  3) శ్రీ షిర్డీ సాయి భజనావళి (2002),  4) శ్రీ మెహర్‌ భక్తి గీతావళి, 5) శ్రీసత్య సాయి స్తుతి,  6) నాలోని నాదాలు(2005), 6) శ్రీ శివ భక్త చరితం, 7) మనోవేదన 2001, 8) మన ఆదిలాబాదు (2007), 9) మన ఆదిలాబాదు(2008), 10) శ్రీహరి లీలలు (2010), 11) నిరసన గొంతులు (2011), 12) శ్రీప్రభాకర్‌ మహారాజ్‌ స్మృతిలో (2011), 13) శ్రీశివలీలలు (2012), 14) శ్రీ షిర్డీ సాయి చరితం-హరికథా రూపకం (2012), 15) కర్తవ్యం – కవన కదంబం (2013), 16) మనోవిలాసం- ద్విశతి పద్యకావ్యం (2013), 17) శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం (2016), 18) శ్రీసరస్వతీ స్తుతి – భక్త గీతాలు (2017), 19) వాస్తవాలు కాస్త (2017), 20) శ్రీ షిర్డీ సాయి స్తవన మంజరి -మరాఠీ అనువాదం(2018), 21) శ్రీ శ్రీనివాస శతకం 92018), 22) మన భాష -మన యాస (2019), 23) శ్రీవాసర జ్ఞాన సరస్వతీ స్తవం (2019), 24) శ్రీరామ చరితం – బాల కాండం, 25) బ్రతుకుబాట -ఆత్మీయశతకం(2019).

వీరి రచనలన్నిటినీ పరిశీలిస్తే మన ప్రాచీనులు చెప్పిన విశ్వశ్రేయం కావ్యం అన్న ఆర్యోక్తికి మంచి ఉదాహరణలుగా నిలుస్తాయి. వీటిలో శ్రీ శివభక్త చరితం, శ్రీ శివలీలలు శివ పారమ్య కావ్యాలు  కాగా శ్రీహరి లీలలు వీరి విష్ణుపారమ్యతను తెలిపే కావ్యం. రచన కూడా సరళ సుందర శైలిలో సామాన్యమైన పాఠకులకు కూడా చేరే విధంగా ఉంటుంది. ప్రౌఢంగా రాయగలిగి కూడా తమను తాము నిగ్రహించుకొని ఎక్కువగా తెలుగు దేశీయ ఛందస్సులనే వినియోగించుకోవడం వీరి ప్రత్యేకత. తెలుగుదనం పలుకుబళ్ళు, సామెతలూ కావలసినన్ని మనకు పలుకరిస్తాయి. వీరి ఆహ్లాదకరమైన వర్ణనలకు శ్రీశివభక్త చరితంలో పార్వతీపరమేశ్వరులు మాయాజం గమ రూపంలో వచ్చినపుడు

‘‘జగమేలు సామియే జంగమ దేవరై –

చన నెంచె కాంచికి జనని  తోడ

ముదుసలి రూపాన ముష్టెత్తు వారిగా – 

కదలిరి కైలాస సదనము వీడి

పున్కల పేరేమొ  పూసల పేరాయె-

జటలు  కన్పడకుండ పటక  జుట్టె

మెడలోని పామేమొ పొడుగాటి పంచాయె-

పులితోలు మారెను వలువ వోలె

చెలగి త్రిశూలమ్ము చేతి కర్రగ మారె-

మలగె బొట్టుగ తానె  వెలుగు కన్నె

తల మీద దాల్చిన తల్లి గంగయె  తాను –

చేరె  చేతను దాల్చు చెంబు నందు ..’’ 

(శ్రీ శివభక్త చరితం 149) అని సాగిన పద్యం మంచి ఉదాహరణ. భద్రయ్య పద్య కావ్యాలలో ‘నారాయణా ! వేద పారాయణా ! నీ లీల పాడగ నేనెంత వాడ స్వామీ ! జాలము సేయక -అగుపడ రావేమొ ! ఓ స్వామి’’

‘‘అగ్ని తత్వము నీవె -అనిల తత్వము నీవె -సలిలమీవె  స్వామి  -సలలట గుణుడీవె ‘‘వంటి అనేక కీర్తనలను కూడా ప్రవేశపెట్టి ఒక కొత్త సంప్రదాయానికి తెర లేపారు. 

భద్రయ్య స్వతసిధ్ధంగా శైవ సంప్రదాయానికి చెందినప్పటికీ భక్త ప్రహ్లాద చరిత్రను కూడా రాశి శివ కేశవాద్వైతాన్ని భజించారు. సరస్వతి, శ్రీనివాసుడు, యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి, శిరిడీ సాయిబాబా,  సత్య సాయీ బాబా, మెహర్‌ బాబా ఇలా ఎందరో  దేవీ దేవతలను, గురుస్వరూపాలను ఆరాధించారు. నామరూపాలతో సంబంధం లేకుండా భద్రయ్య తాము ఆరాధించే రూపం ఏదైనా సమాజం మారాలన్నది మాత్రమే చిత్త శుద్ధిగా ఆకాంక్షించారు. సగుణోపాసన భక్తి మార్గం ద్వారా ఆధ్యాత్మిక ఉన్నతి, తద్వారా సామాజిక పరివర్తన వారు ఆశించినట్లుగా వీరి రచనలను బట్టి తెలుస్తున్నది. వ్యక్తిగత సుఖాల కన్నా ఆత్మ సంయమనానికి వీరు ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కడా తమకు ధనకనకవస్తు వాహనాలు కావాలని కోరుకోలేదు. నిర్మల భక్తిని మాత్రమే ఇమ్మని అర్థించారు.

అరిషడ్వర్గమునణచగ లేక -గురితప్పెను నా మది తడబడుచుండె -వేళ్ళూనిన  నా వ్యాధిని తొలగించి -తొలకరి జల్లుగ కరుణే  కురిపించి (శ్రీవాసర జ్ఞాన సరస్వతీ స్తవం) అని తమలోని అరిషడ్వర్గాలను దూరం చేయుమని సాత్వికంగా కోరుకుంటారు 

కరము కష్ట మయ్యె కాపాడు టెట్టులో -కనులు మూయువరకు కనను శాంతి -డబ్బు వలన డస్సె నా హృదయమ్ము ‘అని డబ్బు వలన జబ్బు చేసింది అంటారు.. ఇదేవిధంగా భద్రయ్య తమ రచనలలో లోకరీతికి పెద్ద  పీట వేశారు. ‘‘మానవత్వ వేమొ మరి నల్ల పూసాయె – దానవత్వ మెంతొ  ధరణి చెరుగ – భూనభోతరాళ కానము శాంతిని ‘అని నల్ల పూసగా మారిన మానవత్వాన్ని గూర్చి వ్యథ చెందుతారు.’ భక్తి లేక రక్తి యుక్తులు బెరగిన -ముక్తి బొందనేమొ  ముజ్జగాన-ఎన్ని జన్మలైన ఖిన్నతే మిగులును ‘అని భక్తి లేకుండా ముక్తిని పొందలేమని చెపుతారు. ‘మొసలి యేడ్పు లేడ్చి  మసలుట ఈ రోజు – పాటి యయ్యె నేడు పలువురకును’ అని చెప్పి కసవు మనిషి మేయు కాలము వచ్చెనా?’’ అంటారు.

‘ధర్మ మేల  మరతు దనుజత్వమున నీవు -ధర్మ మర్మములను ధరణి నున్న -మతము లెల్ల జెప్పు సతతము హితవులే  శరణు శిరిడీ సాయి శరణు శరణు’ అంటూ అధిక్షేపిస్తారు. తమ భక్తి రచనలన్నిటిలోనూ సామాజిక సంబంధం స్పష్టంగా కనిపిస్తుంది. ఏ గురుదైవ రూపమైనా అది కేవలం నిమిత్త మాత్రంగా తమ రచనల ద్వారా సమాజంలో మార్పు రావాలని ఆకాంక్షించారు. తప్పక వస్తుందని విశ్వసించారు.

భద్రయ్య కేవలం రచనలు చేసి ఊరుకునే వ్యక్తి కాదు.తాము రచనలలో చెప్పిన ఆదర్శాలన్నీటినీ నిజ జీవితం లోనూ స్వయంగా పాటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వారు ‘‘నిరసన గొంతుకలు’’ అనే పుస్తకాన్ని  వెలువరించారు.

‘‘అమ్మా! తెలగాణమ్మా! కొమ్మా! మా వందనాలు, కోరిన వరముల్‌ 

ఇమ్మా నీ  బిడ్డలపై -కమ్మిన చీకట్ల బాపి కావగరమ్మా!’’ అని తెలంగాణ తల్లిని ప్రార్థించడమే కాకుండా 

‘తెలంగాణ రాష్ట్రమ్ము తేలాలి ఇపుడే – తేలేతందుకు మనం పేలాలి ఇప్పుడే

మర ఫిరంగుల వోలె చర చర చరని యంటు -పల్లె పల్లెలోన కల్లోలమే బుట్ట – గల్లుగల్లున గజ్జ కట్టాలి ఇప్పుడే ‘అని ప్రబోధించడమే కాకుండా  సుమారు 68 సంవత్సరాల వయస్సులో కూడా నిర్మల్‌  ఆర్‌.డి.వో. ఆఫీసు ముందు మూడు రోజుల నిరాహార దీక్ష చేసి ప్రజలను ఉత్తేజ పరిచిన ధీశాలి.

భద్రయ్య మానవత్వాన్ని నమ్మి ఆచరించిన మనిషి. తమ వ్యక్తిగత జీవితంలోనూ ఏనాడూ కులమత భేదాలను పాటించే వారు కారు.

అంటు ముట్టు డంటు అవనికి దూరమై – బతుకు టేల  బండ బతుక దవును 

మనిషిమనిషి నంట మంటేల తంటేల -కంటగింపు గాదె యొంటి బతుకు’’ అంటూ మనుషులందరూ ఎలాంటి భేద్యభావాలు లేకుండా కలిసిమెలసి జీవించాలని కోరుకున్నారు 

‘‘శాంతి కన్న మిన్న సత్క్రతు  వది  యేది? – కాంతి మీఋ దీన భ్రాంతి తొలగు – కాంతు వెల నీవు కాపాడు శాంతిని – వంత లవియె అణగి   వసుధ పండు’’

‘‘మతము లెన్ని యున్న మార్గ మొక్కటి కాన – మాటవేరైనను బాట వేరె

కాదు కానె  కాదు కావని ఎంచెడు -ప్రేమ భావమున్న పెరుగు చెలిమి’’ (మనోవిలాసం) ‘‘అన్నది భద్రయ్య భద్రంగా మనకు అందించిన సందేశం. దాన్ని పాటిస్తే ప్రపంచమంతా శాంతి, సామరస్యాలతో సుఖంగా ఉంటుంది’’ అన్నది నిర్వివాదాంశం

భద్రయ్య  యావజ్జీవితం ఒక కవి, కళాకారుడు గర్వించే రీతిగా, ప్రతీక్షణాన్ని కవితామయం చేసుకుంటూ గడిపారు. పద్యాలలో తమ ఆత్మ కథను రాసుకుంటూ ఉన్న తరుణంలో అనుకోని విధంగా 18/09/2021 నాడు హృద్రోగంతో శివైక్యం చెందారు. కానీ ఇక కేవలం కొన్ని గంటల్లో ఈ ప్రపంచాన్ని విడిచిపోతారనగా,ఒక వైపు వేదన పడుతున్నప్పటికీ  కూడా  ఎంతో గుండె నిబ్బరంతో అందమైన దస్తూరితో, చక్కటి పదాలతో  

‘‘ఆత్మీయుడు శ్రీ  మారేపల్లి వర్ధనునకు  ఆ శారదా దేవి కృపాకటాక్షములు ఎల్లప్పుడు లభించుగాక’’ అని తమ సంతకంతో  ఈ  వ్యాసకర్తను ఆశీర్వదించారు.  ఇది నిజంగా ఒక మరిచిపోలేని అనుభూతి.  వారి పవిత్ర స్మృతికి శ్రద్ధాంజలి.

‘నాస్తి తేషాం యశః కాయే. జరామరణజం  భయం’