మహా కాళేశ్వరం

ఇది ఓ అద్భుతం!
నభూతో నభవిష్యతి!!
బాహుబలి!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పలువురు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలివి.

రాష్ట్రంలో అందుబాటులో వున్న ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టుకొని తెలంగాణను కోటి ఎకరాల ఆకుపచ్చ మాగాణంగా మార్చాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పట్టుదలతో ముందడుగు వేస్తున్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలల్లో మన న్యాయమైన వాటాను సంపూర్ణంగా వినియోగించుకొనే క్రమంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జలవనరుల లభ్యతపై సర్వేలు నిర్వహించింది. కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తూ, అసంపూర్తిగా వున్న పాతప్రాజెక్టులను వాస్తవ పరిస్థితులకు, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా రీడిజైనింగ్‌ చేసి త్వరితగతిన పూర్తిచేసేందుకు అవిరళ కృషి చేస్తోంది. అందుకు అనుగుణంగా అనుమతులు సాధించడంతోపాటు, రాష్ట్ర బడ్జెట్లో ఏటా 25,000 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తోంది. ముఖ్యమంత్రి స్వయంగా ప్రాజెక్టుల నిర్మాణ ప్రదేశాలను తిలకించి, అధికారులకు మార్గనిర్దేశనం చేస్తూ, నిర్ణీత కాలంలోగా ప్రాజెక్టుల పూర్తికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీచేస్తున్నారు. ముఖ్యమంత్రి సంకల్ప బలం, సునిశిత పరిశీలనా శక్తికి ప్రముఖ ఇంజనీర్లు సయితం ఆశ్చర్యపోయిన సంఘటనలు కూడా మనం చూశాం.

వృధాగా సముద్రం పాలవుతున్న గోదావరి జలాలను బీడుభూములకు తరలించేందుకు గోదావరి నదిపై ప్రాజెక్టులను ప్రభుత్వం రీడిజైనింగ్‌ చేసి పూర్తిచేస్తోంది. ఇందులో ప్రధానమైనది, తెలంగాణ ప్రజల దీర్ఘకాలిక కలలను నిజంచేస్తున్నది కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు ఏ రకంగా చూసినా, అన్ని విధాలా ఎన్నో ప్రత్యేకతలను సొంతం చోసుకుంటోంది. ఈ ఒక్క ప్రాజెక్టుతో రాష్ట్రంలోని 13 జిల్లాలలో మొత్తం 37 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు లభిస్తుంది. ఇందులో 18,82,970 ఎకరాల స్థిరీకరణతోపాటు, మరో 18,25,700 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు సమకూరనుంది. దీనితోపాటు హైదరాబాద్‌ నగరంతో సహా దాదాపు 1400 గ్రామాలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటిని కేటాయించుకో గలుగుతాం.

ఈ ప్రాజెక్టు పనులలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఇందులో ఉపయోగిస్తున్న మోటారు పంపుల సామర్థ్యం కూడా అబ్బురపరుస్తోంది. ఆసియాలోనే ప్రప్రథమంగా 139 మెగావాట్ల సామర్థ్యం గల మోటార్ల ద్వారా 115 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయనున్నారు. ఇందుకు అవసరమైన విద్యుత్‌ కోసం ప్రత్యేకంగా సబ్‌ స్టేషన్‌ నిర్మిస్తున్నారు.

రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించి సంభ్రమాశ్చర్యాలను వ్యక్తం చేశారు.ఈ ప్రాజెక్టు విశేషాలను తెలుసుకున్న గవర్నర్‌ దేశ చరిత్రలోనే ఇదో అద్భుతమని, నభూతో నభవిష్యతి అని ప్రశంసించారు.

అతకు ముందు కేంద్ర జలసంఘం ప్రతినిధి బృందం రెండురోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించి కాళేశ్వరం ఓ అద్భుతమని కితాబునిచ్చారు. ఇది బహుళార్థసాధక ప్రాజెక్టు అని, పనుల్లో ఇంత వేగాన్ని ఎక్కడా చూడలేదని, దేశంలోనే ఇది ఓ గొప్ప ప్రాజెక్టు అని పేర్కొన్నారు. తాను దేశంలో ఎన్నో ప్రాజెక్టులను పరిశీలించినట్టు, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు వాటన్నిటికంటే భిన్నమైనది, విశిష్టమైనదని సి.డబ్యు,సి చీఫ్‌ఇంజనీరు సి.కె.ఎల్‌. దాస్‌ పేర్కొన్నారు.

అంతేకాదు.ఇంతమంది ప్రశంసలతోపాటు, ఈ ప్రాజెక్టు పనులలో భాగస్వాములవుతున్నందుకు వివిధ శాఖల సిబ్బంది కూడా గర్వపడుతున్నారంటేనే దీని ప్రత్యేకత ఏమిటో తెలిసిపోతోంది.

అన్ని అనుమతులు పొంది , శరవేగంగా , మూడు షిప్టుల్లో సాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుపనులు సత్వరం పూర్తిచేసి, రానున్న వర్షాకాలంలోనే గోదావరి జలాలను మళ్ళించాలనే సంకల్పంతో ప్రభుత్వం వుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 125 కిలోమీటర్ల మేర గోదావరి నదిలో 365 రోజులు నీరు నిల్వ వుంటుంది. జీవధారగా మారుతుంది.

దేశంలోనే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఓ నమూనాగా నిలవనుంది.