మనిషిని శివునిగా మార్చే పర్వదినం మహాశివరాత్రి

SHIVARATRI

తెలంగాణం అంటే త్రిలింగాల భూమి. మూడు లింగాలు సృష్టి, స్థితి, ప్రళయాలకు కారణాలు. మూడు సంఖ్య త్రిమూర్తులనూ, త్రిలోకాలనూ, త్రిగుణాలనూ, త్రికాలాలనూ, త్రిలింగాలనూ చెబుతుంది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులు లోకానికి తెలియనివి కావు. బ్రహ్మ సృజనశక్తి, విష్ణువు పాలన శక్తి, మహేశ్వరుని విలయశక్తి జగత్‌కల్యాణకారకాలే. స్వర్గలోకంలోని దివ్యశక్తీ, మధ్యలోకం అయిన మానవలోకంలోని కర్మశక్తీ, పాతాళలోకంలోని రాకూజుస శక్తీ పరమేశ్వరుని అనుగ్రహాలే. శుద్ధ శాంత గుణంతో అలరారే సాత్విక శక్తి, జగత్తును పాలించగలిగే ధీరత్వాన్ని ప్రసాదించే రాజసశక్తి, మాయామోహంతో లోకాన్ని కప్పి వేస్తున్న తామసశక్తి ఆయా సందర్బాలను అనుసరించే అవసరలే ఉదయం, మద్యాహ్న, సాయంకాలాల రూపంలో ఉన్న సమయ శక్తి ఎంత గొప్ప దో అందరికి తెలిసిందే. సృష్టిలో సహజాలైన పురుష శక్తి, స్త్రీ శక్తి, జడ (నపుంసక) శక్తి అనే మూడు లింగాలూ లోకానికి ఆవశ్యకాలే. ఇలా మూడు సంఖ్యతో పెనవేసుకొన్న లింగ (శివరూప) శక్తి ఈ ప్రపంచాన్ని కాపాడుతోంది.

ప్రతి యేడాదీ మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్ధశి నాడు సంబవించే మహా శివరాత్రి పర్వదినం మానవాళికి ఎంతో శ్రేయస్సును అందించే పండుగగా ప్రసిద్ధి. తెలంగాణ జనపదాలలో ఈ పర్వదినానికి గల ప్రాధాన్యత వర్ణించరానిది. ఈ మహాపర్వదినాన పల్లెలూ, పట్టణాలూ, గిరులూ, పురాలూ అనే తేడా లేకుండా అడుగడుగున శివనామస్మరణతో గుడులన్నీ మారుమ్రోగుతాయి. భక్తులను ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతాయి. తెలంగాణలో శైవక్షేత్రాలకు కొదువలేదు. స్వయంభువులై వెలసిన శివలింగా లకు తెలంగాణం నెలవు. అందు ప్రాచీనులు త్రిలింగానాం భూమిః తెలంగాణమ్ (త్రిలింగాలకు నెలవైన నేల ఈ తెలంగాణం) అని కొనియాడారు. శివుడు నిరాడంబరుడు . ఆయనకు ఈ ప్రపంచం అంతా భోగ్యవస్తువే అయినా దేనినీ కోరని స్వభావం శివుని విశిష్టత. అణువు మొదలు బ్రహ్మాండం దాకా అంతటా వ్యాపించి ఉన్నది అతడే. అయినా ఏ సంపదనూ ఆశించక, వేలం భక్తితో అర్పించే జలాలనూ, పత్రాలనూ, పూలనూ, పండ్లనూ మాత్రమే కోరుకుంటాడు. శివునిలోని ఈ మనస్తత్వం తెలంగాణ వాసులలో కూడా కనబడుతుంది.

శివుడు భక్తపరాధీనుడు. అందుకే తనను భక్తితో అర్చిస్తే చాలు వెంటనే ప్రత్యక్షమై, అసాధ్యాలైన కోరికలను సైతం అడిగిన వెంటనే ప్రసాదించడం శివుని నైజం. భక్తులపాలిటి పెన్నిధి అయిన ఈ దయామూర్తి తాను ఇచ్చే వరాలు తనకే కీడు కలిగించాలని చూసినా, దానిని పట్టించుకోని దివ్యగుణం ఆయన సొంతం. భస్మాసు – రుని కథ ఇందుకు ఉదాహరణ. జగత్తును కాపాడే సత్త్వగుణానికీ, జగత్తును పాలించే రాజసప్రవృత్తికీ, దుష్టశిక్షణ సమయంలో ప్రయోగించే రౌద్రప్రవృత్తికీ శివుడు ఉదాహరణగా నిలుస్తాడు. క్షీర సాగరమధన సమయంలో లోకాలన్నీ భస్మమైపోయేంతటి కాలకూట విషం పుట్టింది. ఆ విషాన్ని తొలగించకపోతే, లోకాలకే ముప్పు వాటిల్లుతుందనే ఆపద సమయంలో ఆ భయంకర కాలకూట విషాన్ని మింగివేసి, కంఠంలో దాచిన వాడు పరమశివుడే కదా! ఇందులో ఆయన సత్వగుణం సకలలోకారాధ్యమే. ఈ స్వభావం మానవులతో ఏర్పడాలని ఈ వృత్తాంతం చెబుతోంది. లోకానికి ఆపద వచ్చినప్పుడు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కార్యరంగంలోకి దూకాలనీ, కాలకూట విషం వంటి కరడుగట్టిన పరిస్థితులను సైతం ఎదుర్కొని నిలవాలనీ శివునిలోని సత్వగుణం లోకానికి సందేశం ఇస్తోంది. జగత్తును చక్కగా పరిపాలించాలంటే రాజసగుణం కావాలి. రాజసగుణంలో ధర్మానికి కట్టుబడే స్వభావం, అధర్మానికి ఎదురునిలిచి పోరాడే ప్రవృత్తి సహజంగానే కనబడుతాయి. దీనినే దుష్టశిక్షణ, శిష్టరక్షణ అంటారు. ఇది పరిపాలకులకు అత్యవసరం. దుష్టులను శిక్షించకపోతే లోకంలో ఎక్కడ చూచినా అధర్మమే తాండవిస్తుంది. శిష్టులను (మంచివారిని రక్షించకపోతే లోకంలో మంచి అనేదే ఉండదు. కనుక మంచివారిని రక్షించుకోవాలి. సంఘ విద్రోహులైన తామసులపట్ల నిరంతరం జాగరూకతతో ఉండాలంటే మాయోపాయాలతోనే అలాంటి ద్రోహులను ఎదుర్కోవాలని శివునిలోని రౌద్రం తెలుపుతోంది. అంటే మానవునికి శివునిలోని ప్రవృత్తులన్నీ ప్రతినిత్యం ఉపయోగపడే జీవన సత్యాలనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే శివరూపం పుణ్యదాయకం. శివనామం పాపహారకం. శివార్చన శ్రేయోదాయకం. శివలింగానికి మొదలు ఏదో, తుది ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నించి బ్రహ్మ విష్ణువులే విఫలం చెందారని పురాణగాధలు చెబుతున్నాయి. సృష్ట్యాదిలో అణువంత ఆవిర్భవించిన శివలింగం అనుక్షణం పెరుగుతూ, పై లోకాలనూ, కిందిలోకాలనూ కూడా లెక్క చేయక చొచ్చుకొని పోతుంటే బ్రహ్మదేవుడు హంస రూపంలో పై లోకాలకూ, విష్ణువు వరాహరూపంలో నేలను త్రవ్వుతూ కింది లోకాలకూ వెళ్లిపోయి, శివలింగం మూలాలను వెదకడానికి యత్నించారట. ఎన్నేళ్లు వెదికినా శివలింగం ఆద్యంతాలు తెలుసుకోలేక, తిరిగి వచ్చి ఆ పరమశివుణ్ణి ప్రార్థించారట. అప్పుడు శివుడు అనుగ్రహించి, తన నిజస్వరూపాన్ని దర్శింపజేసి, బ్రహ్మవిష్ణువులను ఆనందింపజేశాడట. ఇది శివమహిమ! అందుకే శివుడు అనాది. శివుడు అనంతుడు. కనుక అతని పుట్టుకను గూర్చి తెలుసుకోవడం అసాధ్యం. మహాశివరాత్రి నాడు చేయవలసిన నియమాలు ఎన్నో ఉన్నాయి. శివుడు అభిషేక ప్రియుడు. అమూల్యంగా దొరికే నీళ్ళే ఆయనకు ప్రీతికారకాలు. అందుకే నమక చమక మంత్రాలతో, మహాన్యాసంతో ఇళ్లలోనూ, దేవాలయాలలోనూ భక్తులు అభిషేకాలు చేస్తూ తరిస్తారు. శివునికి మారేడు దళాలు ప్రీతిని కలిగిస్తాయి. అందుకే అర్చనలో తప్పకుండా పత్రి ఉంటుంది. ఏ అలంకారాలూ కోరని శివునికి స్మశానంలోని బూడి ద అలంకారం. అందుకే భస్మంతో శివలింగాన్ని అలంకరిస్తారు. నైవేద్యంగా ఏ పండునైనా ఇష్టపడే శివుడు ఏ భేషజాలూ లేని పరమదైవం. కన్నప్పవంటి పరమభక్తుడు తనకు భక్తితో ఏది సమర్పించినా స్వీకరించి, అనుగ్రహించిన పరమ దయామూర్తి శివుడే! మహాశివరాత్రికి కీలకం నిశిపూజ. అంటే అర్ధరాత్రివేళ చేసే అర్చన. శివలింగం ఉద్భవించిన పవిత్రదినం మామకృష్ణ. చతుర్దశి. సమయం అర్ధరాత్రి వేళ. అందుకే ఈ వేళకు లింగో దృవ కాలం అని పవిత్రమైన పేరు వచ్చింది. ఈ పుణ్యసమ యంలో తెలంగాణలోని ప్రతి శైవక్షేత్రంలోనూ దివ్యంగా అర్చనలు, అభిషేకాలూ జరుగుతాయి. వేములవాడ, కాళేశ్వరం, కీసరగుట్ట, బిక్కనూరు, వరంగల్లు మొదలైన శైవక్షేత్రాలలో అహోరాత్రులూ శివునికి పూజలు కొనసాగుతూ, భక్తులకు కోరిన కోరికలు తీరుస్తాయి. తెలంగాణలోని పది జిల్లాలలో వ్యాపించి ఉన్న శివక్షేత్రాలు అసంఖ్యాకాలు. ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క దివ్య చరిత్ర. భిన్నత్వంలో ఏకత్వంలా శివతత్త్వం అనేక విధా లుగా ఉన్నా అందరి హృదయాలను కలుపుతూ, మానవులను దేవతలుగా మారుస్తోంది. అందుకే మనిషిని శివునిగా మార్చే మహా పర్వదినం మహాశివరాత్రి! సర్వం శివమయం జగత్! అనే మాట నిత్యసత్యం!!

మనసు నిండా ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కోసమే ఆరోజు పిడికిలి ఎత్తి జై తెలంగాణ ఉద్యమ నినాదం అందుకుంది. అప్పటి మా ఆలోచనలు ఇప్పడు వాస్తవ రూపు సంతరించుకుంటుంటే అమితానందం కలుగుతోంది. మేము ఆశించింది ఇదే..” ఫిబ్రవరి 16న ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ‘భక్తరామదాసు ఎత్తిపోతల పథకం’ శంకుసాశీవపన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రసంగ ప్రారంభంలో చేసిన వ్యాఖ్యలివి.

శ్రీ డా|| నటేశ్వరశర్మ