ప్రణమామి సదా శివలింగం

By:- సాగి కమలాకర శర్మ

సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగం ||
పరాత్పరం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివలింగం ||

లింగ స్వరూపుడైన శివుని ఆరాధన హైందవ సంస్కృతిలో అతి ముఖ్యమైనది. మంగళకరుడు, శుభకరుడైన శంకరుని పూజలో భారతీయులంతా పునీతులవుతుంటారు. శివరాత్రి అందరికీ ఆనందాన్ని, ఆధ్యాత్మికతను పంచే ఒక ప్రత్యేక ఉపవాస వ్రతం. అటువంటి దీక్షలో లింగోద్భవమూర్తిని దర్శించుకుంటూ, భజన కీర్తనలతో మమేకమవుతూ అర్చించుకునే ఉత్సవమే శివరాత్రి. ఈ శివరాత్రి విశేషాలను వైజ్ఞానికంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

శివం అంటే శుభం. శాంతిని కలిగించే వాడు శంకరుడు. ఐశ్వర్యాన్ని ఇచ్చే వాడు ఈశ్వరుడు. కాలానికి మూలమైన వాడు మహాకాలుడు. ఆరోగ్యాన్నిచ్చే వాడు వైద్యనాథుడు. ఈ విధంగా ఎన్ని పేర్లతో మనం పిలుచుకున్నా దానిలో ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. భారతీయమైన దేవతామూర్తుల రూపం వెనుక ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి మూర్తి కూడా ఏదో ఒక ప్రత్యేక భావాన్ని చెప్తూనే ఉంటుంది. అన్నింటికీ సంకేతార్థాలు ఉంటాయి. ఇదంతా వైజ్ఞానికం. దానినే పూర్వం ఆధ్యాత్మికం అని పిలిచారు. అన్ని దేవతామూర్తుల లాగే శివుని మూర్తికి కూడా ప్రత్యేకత ఉంది.

మన జీవనానికి ఆలంబనమయ్యే, మనని భరించే, మన ఇబ్బందిని సహించే భూమి శివలింగానికి సంకేతం. భూమి మొత్తం మనం దర్శించలేము కాబట్టి సంకేతంగా శివలింగానికి పూజ చేసే సంప్రదాయం మనకు ఏర్పడింది. భూమిపైన జలం ఉంటుంది కాబట్టి శివునికి గంగాధరుడు అని పేరు. భూమి ఆకాశంలో ఏ ఆధారం లేకుండా తిరుగుతుంది కాబట్టి శివునికి దిగంబరుడని పేరు. (దిక్కులే వస్త్రములుగా ధరించిన వాడు). భూమికి చంద్రుడు ఉపగ్రహమై చుట్టూ తిరుగుతూ ఉంటాడు కాబట్టి శివునికి చంద్రశేఖరుడు అని పేరు. భూమి చుట్టూ ఉండే విద్యుదయస్కాంత శక్తికి సంకేతంగా శివునికి సర్పహారుడని పేరు. భూమి వల్లనే మనకు రాత్రింబగళ్ళు, కాలం అనేవి ఏర్పడతాయి కాబట్టి ఈయనకు కాలుడని పేరు. వ్యక్తికి ఒక కాలం ఏర్పరచి, కాలం తీరిన తర్వాత తనలోనే ఈ భూమి కలుపుకుంటుంది కాబట్టి లయకారకుడు, మహా కాలుడు అని పేరు. భూమి తనచుట్టూ తాను తిరగడం (ఆత్మ భ్రమణం), సూర్యుని చుట్టూ తిరగడం (పరిభ్రమణం) తో పాటు విషు భ్రమణం అనే మూడు రకాలైన భ్రమణాలు ఉండడమే ‘త్రయంబకుడు’, ‘త్రిశూల ధారి’ అనడానికి మూలం. భూమి తిరుగుతూ ఉంటే ఏర్పడే నాదానికి సంకేతమే తన చేతిలోని డమరుకం. మూడు రకాలైన గమనాలకు మూలమైన నృత్య రూపమే నటరాజ తాండవం.

భూమి చుట్టూ ఉన్న ఓజోన్‌ పొరలోని పాంచభౌతిక శక్తికి సంకేతమే పార్వతి. భూమి మధ్యలోని గురుత్వాకర్షణ శక్తికి సంకేతమే గణపతి. భూమి చుట్టూ ఉండి సౌర తుఫానుల నుండి రక్షించడమే కాక, మన కమ్యూనికేషన్‌ వ్యవస్థలకు ప్రాణం పోస్తున్న విద్యుదయస్కాంత తరంగ శక్తి కుమారస్వామి. ఇది సదాశివ రూపం. పూర్ణమైన వైజ్ఞానికం.

అభిషేక ప్రియః శివ :` శివుడు అభిషేక ప్రియుడు. ఆకాశం నుండి పడిన కొద్ది వర్షానికే పరవశించి లోపల ఉన్న ఎన్నో గింజలకు ప్రాణం పోసి మొలకలను మనకు అందిస్తున్నదీ భూమి. ఆ విధంగా నిరంతరం భూమిమీద పడే జలం వల్ల మనలోని తాపాలు తీరడమే కాక ఆశలు, కోరికలు అనే మొలకలను చిగురెత్తిస్తుందీ భూమి కాబట్టి, భూమికి ప్రతీక అయిన శివునికి నిరంతరం జలాభిషేకం చేయడం, తద్వారా తమ భావాలకు రూపు తెచ్చుకోవడం భారతీయ సంప్రదాయం. అభిషేకం శుద్ధతకు సంకేతం. తమను తాము శుద్ధి చేసుకోవడం ద్వారా కైవల్య ప్రాప్తి కలుగుతుందనే భావనే అభిషేకం. శరీరశుద్ధి, మన:శుద్ధి ద్వారా విశ్వశక్తి తమ శక్తిగా మారుతూ ఉంటుంది. అప్పుడే మనం విశ్వనాథులమవుతాం. మన దేహం దేవాలయం అవుతుంది.

ప్రదక్షిణం శివునికి ప్రదక్షిణం కూడా ముఖ్యమే. భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల శక్తిని సంపాదించుకుంటుంది. తాము శక్తివంతులమైతే తమ చుట్టూ ప్రపంచం ఉంటుంది అనడానికి భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుడు సంకేతం అవుతాడు. ప్రదక్షిణాన్ని మనకు నేర్పించిన శివుని (భూమి) చుట్టూ మన శరీరాన్ని, మనసును తిప్పడం వల్ల మన మనస్సు శక్తివంతమై రోగాన్ని పొగొట్టుకుంటుంది. శక్తివంతమవుతుంది. దేని చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నామో దానిలాగే మనం మారుతాం. అందుకే ప్రదక్షిణం నేర్పించిన భూమి (శివుని) చుట్టూ మన మనస్సును, శరీరాన్ని తిప్పడం ద్వారా మనమూ శివ స్వరూపులం అవుతాం.

ఉపవాసం ` శివరాత్రి నాడు ఉపవాసం చేసే సంప్రదాయం అందరికీ ఉంది. అయితే ఉపవాస అర్థం ఈ రోజుల్లో పూర్తిగా మారిపోయింది. ఉప అంటే సమీపం అని అర్థం. వసతి అంటే ఉండడం. సమీపంలో ఉండడం అని అర్థం. భగవంతుడు లేదా శక్తికి సమీపంలో మన శరీరాన్ని, మనస్సును కేంద్రీకరించాలంటే ఆహారం కొంత అడ్డంకి అవుతుంది. ఆహార స్వీకరణ తర్వాత ఆలోచనలు మారుతాయి. నిద్రకు ఆస్కారం వస్తుంది. అందుకే ఆహార భావన వదిలి, ఇతర ఆలోచనలను కూడా దగ్గరికి రానీయకుండా భగవంతుని సమీపంలో రోజంతా కళ్ళుమూసుకుని మనసును కేంద్రీకరించి ఉండటమే ‘ఉపవాసం’ అవుతుంది. శక్తితో ఎక్కువసేపు మనస్సు కలిసి ఉంటే మనం కూడా శక్తివంతులమవుతాం. శక్తిని సముపార్జించుకునే ప్రక్రియ ‘ఉపవాసం’. కాలానుగుణంగా ఎవరైనా కొందరు బలహీనులకు పాలు, పళ్ళవంటి ఆహారాన్ని అంగీకరించారు. అక్కడినుండి మొదలైన ఈ స్థితి ఉపవాసం అంటే అన్నం కాకుండా ఇతర ఉపాహారాలు అనే అర్థాన్ని సంతరించుకుంది. శివరాత్రి వంటి ప్రత్యేకమైన రోజుల్లో మనస్సును పూర్తిగా శివమయం చేసి కూర్చోబెట్టడం ద్వారా విశేషమైన శక్తి కలుగుతుంది. కానీ ఈ ఉపాహార భావన వల్ల, ఆహారం మీద మనస్సును కేంద్రీకరించడం జరుగుతుంది. విజ్ఞులైన వారు దీనిని గమనించి తమను తాము మార్చుకుంటూ ఉపాసనను పెంచుకుంటూ, ఉపవాస దీక్షద్వారా చైతన్యవంతులుగా, శక్తి స్వరూపులుగా మారాల్సిన అవసరం ఉంది. ఆల్టర్నేటివ్‌ ఫుడ్‌ పైన మనస్సును కేంద్రీకరించడం ద్వారా ఎటువంటి శక్తి సంక్రమించదు, ఉన్న శక్తి కూడా నశించే అవకాశం ఉంటుంది.

బిల్వార్చన, తులసీ అర్చన ` భూమి చుట్టూ ఒక ఓజోన్‌ పొర ఉండడం వల్ల మనకు వాతావరణం ఏర్పడుతుంది. ఈ వాతావరణంలో కాలుష్యం ఎప్పటికీ ఏర్పడుతూ ఉంటుంది. దానిని ఎప్పటికప్పుడూ మనం తగ్గిస్తూనే ఉండాలి. అటువంటి వాతావరణాన్ని శుద్ధి చేయడానికి బిల్వ వృక్షాలు ఉపయోగపడతాయని వైదికంలోని శ్రీసూక్తం తెలియజేస్తుంది. (మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ:) అందువల్ల ఈ భూమి మీద మనం కాలుష్య నివారకాలైన బిల్వ, తులసీ వృక్ష జాతులను అత్యధికంగా పెంచాల్సి ఉంటుంది. దానికి ప్రతీకగా మనం శివుని మీద బిల్వ, తులసీ పత్రాలతో పూజ చేసే సంప్రదాయం ఏర్పడింది. ‘ఏకబిల్వం శివార్పణం’ అంటూ చేసే పూజలోని అంతరార్థం ఇదే. తులసీ అర్చనలోని విశేషం కూడా ఇదే.

విభూతి ` భూతి అంటే సంపద అని అర్థం. విశిష్టమైన భూతి విభూతి. ఈ భూమిలోనూ, భూమిపైన మట్టిలోనూ అనేక సంపదలున్నాయి. ఈ భూమి ఎంతో ఉత్పాదక శక్తి కలిగింది. పై పొరలోని మట్టి వల్లనే ఈ ఉత్పాదన మనకు కనిపిస్తుంది. ఈ మట్టిలో అనేక ధాతువులు, ఖనిజాలున్నాయి. ఇటువంటి విశిష్టమైన సారవంతమైన మట్టితో స్నానమే మృత్తికాస్నానం అనబడుతుంది. అటువంటి విశిష్టమైన మట్టిని ధరించే సంప్రదాయమే విభూతి (విబూది) ధారణ సంప్రదాయం. స్నానాలలో విభూతి స్నానం కూడా ప్రత్యేకం. అందుకే శివ భక్తులంతా ఈ భూమి మీది విశిష్టమైన మృత్తికను, భస్మం చేసిన మట్టిని నామధారణకోసం వినియోగిస్తూ ఉంటారు.

ఐశ్వర్యం ఈశ్వరాదిచ్ఛేత్‌ ` ఈశ్వరుడు అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు అని అర్థం. మనకు ప్రత్యక్షంగా కనిపించే ఐశ్వర్యం అంతా ఈ భూమిలోనే ఉంది. నీరు, బొగ్గు, బంగారం వంటి అనేక మూల ఖనిజాలు, సహజవాయువు, పెట్రోల్‌ ఉత్పత్పులు అన్నీ ఈ భూమిలోనే ఉన్నా యి. ఉత్పాదక శక్తి కలిగిన ఈ భూమి ఎన్నింటినో సృష్టిస్తుంది కూడా. అందుకే శివునికి ఈశ్వరుడు అని పేరు పెట్టడం జరిగింది. ఈ భావనతో చేసే శివపూజ వల్ల మన ఇంటినిండా ప్రత్యక్షమైన ఐశ్వర్యం లభించడమే కాకుండా, శరీరానికి, మనసుకు ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత, సంతృప్తి వంటి ఐశ్వర్యాలు లభిస్తూనే ఉంటాయి.

కాలుడు ` భూమి తనచుట్టూ తాను తిరగడాన్ని ఆత్మభ్రమణం అంటాం. దీని వల్లనే మనకు పగలు, రాత్రి అనేవి ఏర్పడుతున్నాయి. కాలం ఏర్పడేది శివుని (భూమి) వల్లనే. అందుకే శివుని కాలుడు అని వ్యవహరిస్తారు. కాలాన్ని తయారు చేయడానికి మూలమైన వాడు కాలుడు. కాలం తీరితే తనలో కలుపుకునే లయకారకుడు మహాకాలుడు. ఉజ్జయినీ నగరం పూర్వం భారతవర్షానికి మధ్యభాగంలో ఉంటూ కాలగణనకు కేంద్రం కావడం వల్లనే అక్కడి జ్యోతిర్లింగానికి మహాకాలుడని పేరు. శక్తిపీఠమై అమ్మవారికి మహాకాళి అనే పేరు. దీనిని బట్టి
భారతీయుల ఆలోచనల్లోని వైజ్ఞానికత మనకు కనిపిస్తుంది.

లింగోద్భవం ` మాఘబహుళ త్రయోదశి అనంతర చతుర్దశి ఉన్న రాత్రి నాడు ‘మహాశివరాత్రి’గా నిర్ణయిస్తుంది ధర్మశాస్త్రం. ప్రతి మాసంలోనూ వచ్చే ఇదే తిథిని మాస శివరాత్రిగా పూజలు చేసే సంప్రదాయం ఉంది. శివరాత్రి నాటి లింగోద్భవ కాలాన్ని భూమి పుట్టిన రోజుగా మనం గమనించాలి. ఈ భూమి పుట్టుకను పండుగగా జరుపుకుంటూ, ఈ భూమి సర్వశ్రేయంగా, అందరికీ వినియోగకరంగా, మరింత సంపన్నంగా ఉండాలని కోరుకునేవారు భారతీయులు. అందుకే ఈ శివరాత్రి రోజున ఉపవాస దీక్షలతో ఎన్నో విశిష్టమైన కార్యాలతో, నిరంతర అభిషేకాలు చేస్తూ ఆనందిస్తుంటారు. లింగోద్భవం అంటే సముద్రం అంతా ఒక పక్కకు పోయిన తర్వాత భూమి బయటకు రావడమే. మనం నివసించే, మనకు పంటలనిచ్చే భూమి రూపాన్ని పొందడమే. అందుకే మనకందరికీ ఆధారభూతమైన ఈ శివారాధన అందరం తప్పనిసరిగా నిర్వహించాలి. భూమికి ఉత్సవాన్ని చేస్తూనే ఉండాలి. భూమి ఉత్పాదన అర్థం చేసుకుని, మనని కాపాడే భూమిని మనం కాలుష్యం లేకుండా కాపాడుకుంటూ, భావి తరాల ప్రశాంత జీవనానికి అవకాశం ఇచ్చే పండుగగా ‘మహా శివరాత్రి’ని మనసారా జరుపుకుందాం.
ఓంకారాయ నమోనమః.