|

మహాత్మా గాంధీజి మార్గానువర్తకుడు – పి.వి.

– డాక్టర్‌. వి.వి.రామారావు
నలుబది కోట్ల తమ్ముల జీవితమ్ముల
కాయనమాట ‘వేదాక్షరంబు’
భీరులనే కర్మవీరులుం గావించు
ఆయన పిలుపు ‘శంఖారవంబు’
సత్యంబు శాంత్యహింసలకు స్వాగతమిచ్చె
ఆయన బ్రతుకు ‘మహా ప్రయాగ’
కొల్లాయితో పిచ్చి పుల్లాయి వలె నుండు
ఆయన దీక్ష లోకైక రక్ష
అతడొక పవిత్ర దేవాలయంబు
అతడొక విచిత్ర విశ్వవిద్యాలయంబు
ఆ మహాశక్తి అంతయింతంచు తుంచం
జాల, మతడొక పెద్ద హిమాలయంబు ॥ (కరుణశ్రీ)


గాంధీజి సమగ్ర వ్యక్తిత్వాన్ని సాక్షరచిత్రంగా ఆవిష్కరించిన పద్యమిది. 19వ శతాబ్దం చివరి నుండి 20వ శతాబ్దంలో దాదాపు మూడొంతులు, తన అసాధారణ వ్యక్తిత్వంతో యావత్‌ ప్రపంచాన్నే ప్రభావితం చేసిన మహోన్నత వ్యక్తి, గాంధీజి.

‘‘జీవితం నుంచి దూరమై పోవడం వల్ల కాకుండా జీవితాన్ని అవగతం చేసుకోవడం వల్లనే మనం
సత్యం దర్శించిన వారమవుతామ’న్న- ప్రసిద్ధ రష్యన్‌ రచయిత, సామాజిక తత్త్వవేత్త లియొ`టాల్‌స్టయ్‌, మాటలే గాంధీజిని సత్య శోధన దిశగా నడిపించడానికి హేతువుయ్యాయి. సత్యంతో ప్రయోగాలు చేసిన గాంధీజి సత్యాన్ని దర్శించారు. సత్యమే దేవుడని గ్రహించారు. సత్యాగ్రహమునే ఆయుధంగా చేసుకొని స్వాతంత్య్రోద్యమాన్ని నడిపారు. ఆయన సత్యదర్శనం ఒక సిద్ధాంతమై, ప్రపంచం నలుమూలలా పరివ్యాప్తి చెందింది.

గాంధీజి ఒక వ్యక్తి కాదు. పలు మతాలలోని, దివ్య బోధనతో మమేకమై భారతీయ జీవన విధానానికి అనువైన మార్గాన్ని నిర్మించిన ఆధ్యాత్మిక శక్తి. మానవ సమాజం, సుఖ సంతోషాలతో జీవించడానికి, మూలంగా ఏర్పరచుకొన్న సత్యం, అహింస, సహనం, త్యాగం, కరుణ ప్రేమ మొదలగు ధార్మిక విలువలను నవీన రీతులలో వ్యాఖ్యానించి సమసమాజ నిర్మాణానికి పునాది వేసిన మహాత్ముడు.

గాంధీజి స్వాతంత్య్రోద్యమంలో పద్దెనిమిది అంశాలతో కూడిన నిర్మాణాత్మక కార్యక్రమాలను ప్రతిపాదించాడు. స్వాతంత్య్రానంతరం యీ అంశాలపైనే, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని, పరిపాలించగలిగితే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని విశ్వసించారు. గాంధీజి, సామాజిక, ఆర్థిక సాంస్కృతిక రంగాలకు సంబంధించి వుద్దేశించిన యీ అంశాలే, గాంధీజి సిద్ధాంతాలుగా రూపొందినవి.

సామాజిక రంగానికి సంబంధించి, గాంధీజి (1) హిందూ-ముస్లిం సమైక్యతను (2) హరిజన అభ్యున్నతి (3) ఆదిమజాతి ఉద్ధరణ, (4) మహిళాభ్యున్నతి (5) మద్యపాన నిషేధం (6) కుష్ఠువ్యాధి నిర్మూలన (7) శ్రామిక సంక్షేమం (8) పంచాయత్‌ రాజ్‌ ను ప్రధానంగా పేర్కొన్నారు.

ఆర్థిక రంగంలో 1) ఖాదీ, 2) గ్రామీణ కుటీర పరిశ్రమలు 3) గో సంరక్షణ 4) స్వదేశి వస్తుత్పత్తిపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు.

సాంస్కృతిక రంగంలో, విద్యా విధానానికి సంబంధించి ‘నయీ తాలీమ్‌’ ను 1937 లో రూపొందించారు. ‘మెకాలే విద్యావిధానాన్ని తిరస్కరించాడు. ప్రతి విద్యార్థికి ప్రాథమిక స్థాయిలో 1 నుండి 7 తరగతు వరకు, మాతృభాషలో విద్యను అన్ని సబ్జెక్టులో బోధిస్తు, వృత్తి విద్యా నైపుణ్యాన్ని అలవర్చాలని దీనినే ‘నయీ తాలీమ్‌’ పేరుతో ప్రకటించారు.

మాతృభాషతో పాటు జాతీయ భాషగా హిందీని ప్రధానంగా బోధించాలని తత్ఫలితంగా, భారతీయులలో సంస్కృతీ వినిమయం సమైక్యతకు సాధ్యమవుతుందని అన్నారు. గాంధీజి పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చాడు. అందరికి ఆరోగ్యం సిద్ధించాలంటే పరిసర వాతావరణం పరిశుభ్రంగా ఉండాలని, తను స్వయంగా చీపురు పట్టి ఊడ్చి ఆదర్శంగా నిలిచాడు. ఆయుర్వేదం, హోమియో మొదలగు ప్రకృతి సహజసిద్ధమైన వైద్య విధానాన్ని అవలంభించాలని అన్నారు.

గాంధీజి తెలిపిన యీ ముఖ్య సూత్రాలను, పి.వి. హృదయంలో నిలుపుకొని ఆచరించారు.

గాంధీజి దేశీయోద్యమరంగం మీదికి వచ్చిన కాలం (1918) నాటికి, పి.వి. యింకా జన్మించలేదు. జలియన్‌ వాలాబాగ్‌ దురంతం (1919) తదుపరి, జరిగిన ‘చౌరీచౌర’ (1922) నాటికి యేడాది బాలుడు. ఉప్పు సత్యాగ్రహం (1930) నాటికి ప్రాథమిక విద్యార్థి. హైస్కులు విద్యార్థిగా ఉన్నప్పుడు (1936) నెహ్రుజీ ఆత్మకథను చదివి, ఒక ఆరాధనా భావాన్ని ఏర్పరచుకొన్నాడు. ‘‘ఎలాగైనా నెహ్రును చూడాలి’’ అని తపించాడు (Insidur, Page 429) 1938లో, వందే మాతర గీతాలాపన ‘నేరానికి’, కళాశాల నుంచి బహిష్కృతుడై, నాగపూర్‌ లో ఇంటర్‌ చదువుతున్న సమయంలో స్వాతంత్య్రోద్యమ తీవ్రతను గ్రహించాడు. హరిపుర(గుజరాత్‌) జాతీయ కాంగ్రేసు సభకు (1938), హాజరైనపుడు, తొలిసారిగా నెహ్రును, నేతాజిను దర్శించి, వారి ప్రసంగాలను విని ఉత్తేజితుడైనాడు. అప్పటికి కూడా, పి.వికి గాంధీజి గురించి లోతైన అవగాహన లేకుండేది. అయితే పూనాలో డిగ్రీ పూర్తి చేసుకొని తిరిగి, నాగపూర్‌లో ‘లా’ చదువుతున్న సమయంలో (1942) గాంధీజి నిర్వహించిన ‘క్విట్‌`ఇండియా’ ఉద్యమం పి.వి.ని బలంగా ఆకర్షించింది. బ్రిటిష్‌ వారిని దేశం వదలి పొమ్మన్నట్లే, నిజాం ప్రభువును గద్దె దించి, హైదరాబాద్‌ సంస్థానం వదలి పొమ్మనాలనే ఆలోచన పి.వి.లో బీజావాపం చేసింది.

1946లో గాంధీజి హైదరాబాద్‌ పర్యటించినప్పుడు, పి.వి. హజరై, ఆయన ప్రసంగాలు విన్నాడు. నెహ్రూ, నేతాజి ప్రసంగాలలో వ్యక్తమయ్యే ఉద్వేగము, గాంధీజి ప్రసంగాలలో ఉండేది కాదు. ఆయన శాంత స్థితిలో మాట్లాడే వారు . ప్రతి మాట, ఈటెలాగే ఉండేది. గాంధీజి లక్ష్యం నేరస్థుల మీద కాకుండా, నేర ప్రవృత్తి మీదే ఉండేది. కర్తవ్యోన్ముఖులను చేసే ఆయన ప్రసంగంలో ప్రేమ, కరుణ, అహింస మొదలగు అంశాలు ప్రధానంగా ప్రతిఫలించేవి.

పి.వి. క్రమంగా నెహ్రు ప్రభావం నుంచి బయటపడి గాంధీ మార్గంలోకి మారాడు. అలా మారడానికి మార్గదర్శనం చేసిన మరో మహనీయుడు, స్వామీ రామానంద తీర్థులు! ఆయన 1934 నుంచే నిజాం వ్యతిరేక పోరాటానికి గాంధీజి మద్దతును, ఆశీస్సులను పొందిన మరో మహత్ముడు! అలా, పి.వి జాతీయ స్థాయిలో, గాంధీజిని ఎంత ఆరాధించాడో, రాష్ట్రస్థాయిలో స్వామీజిని అంతకన్న ఎక్కువగానే అభిమానించి, అనుసరించాడు. అందివచ్చిన వకాలత్‌ వృత్తిని వదిలివేసి, నిజాం వ్యతిరేక పోరాటంలో దూకిన పి.వి. అనతి కాలంలోనే స్వామీజీకి సన్నిహితులయ్యారు. స్టేట్‌ కాంగ్రేసు పిలుపునందుకొని వేలాదిమందితో కలిసి సత్యాగ్రహం చేశారు. హింసాయుత పోరాటం తమ అభిమతం కానప్పటికీ, నిజాం ప్రభుత్వ పోలీసుల నుంచి, రజాకార్లనుంచి గ్రామీణ ప్రజలను రక్షించడానికి, చాందా శిబిరంలో పాల్గొని సాయుధ పోరాటం చేశారు. ఈ అనుభవాల నేపథ్యం నుంచి వెలువడినదే, ‘గొల్ల రామవ్వ’ కథ. ముక్కు మొగం తెలియని విప్లవవీరునికి అర్ధరాత్రి తన పూరిగుడిసెలో ఆశ్రయమిచ్చి, పోలీసుల నుంచి రక్షించి మానవతా దృక్పథంతో కాపాడిన రామవ్వ, గాంధీజి కారుణ్య భావానికి ప్రతీక !

1951లో, గాంధీజి ఆధ్యాత్మిక వారసుడైన ఆచార్య వినోబా భావే, నల్గొండలో భూదానోద్యమం నిర్వహించినప్పుడు, పి.వి. వారిని అనుసరించి, సుదీర్ఘ పాదయాత్ర చేశారు. వినోబా భావేను సమర్ధించిన స్వామీజి తెలంగాణాలో భూసంస్కరణ అమలుకు కృషి చేయాలని ప్రభుత్వానికి సూచిస్తూ బహిరంగంగా సభులు నిర్వహించారు. పి.వి. ఆ సభలో సైతం పాల్గొని, గాంధీజి గ్రామ స్వరాజ్యం, స్వామీజి భూసంస్కరణలు, వినోబా భూదానోద్యమం గురించి, పక్కా తెలంగాణ భాషలో ప్రసంగించడం విశేషం. 1952-56 మధ్యకాలంలో, పి.వి. భూదానోద్యమం, భూసంస్కరణకు సంబంధించిన సభలతోపాటు, వివిధ గాంధేయ నిర్మాణ సంస్థలో పాల్గొని క్రియాశీలక పాత్ర నిర్వహించారు.

స్వామీజి పట్టుదల, శాసించే వాక్కువలనే బూర్గు 1952లో జాగీర్దారీ విధానాన్ని రద్దు పరచారు. భూసంస్కరణ విషయాన్ని దాట వేశారు. అంతే కాదు, స్వామీజి అంతేవాసి పి.వి.ని తొలినాళ్లలో (1948 – 56) బూర్గుల తదుపరి (1957-62) నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలోకి తీసుకోకుండా, నామ మాత్రం ప్రాధాన్యమిచ్చారు. అలా పి.వి 14 సంవత్సరాలు (1948-62) పదవి కోసం ప్రాకులాడకుండ, ప్రజల కోసం రాజకీయ వన(జన)వాసం చేశారు. కాంగ్రెసు పార్టీలో భూస్వామ్య వర్గం స్వామీజి పై దుష్ప్రచారం చేయటంతో ఆయన మనస్తాపం చెంది 1963 లో రాజకీయా నుంచి తప్పుకున్నారు. అయితే మరో గాంధేయవాది, సంస్కరణశీలి, నూకల రామచంద్రారెడ్డి ఒత్తిడికి తలవొగ్గి, నీలం 1962లో పి.వి.ని సహాయ మంత్రిగా తీసుకోక తప్పలేదు.


గాంధీజి చైతన్యధార, స్వామీజి భావజాలం స్ఫూర్తిగా, సమగ్ర సమాజ వికాసం లక్ష్యంగా, పి.వి. కృషి చేయడానికి సంకల్పించారు. తన సాహితీ సృజనలో, రాజకీయ రంగంలో, సమాజసేవలో గాంధీజి సిద్ధాంతాలనే ప్రాతిపదికగ తీసుకొన్నారు. వ్యక్తిగత జీవితంలోనూ గాంధీజి బోధించిన విలువలను, సూత్రాలను అనువర్తింపజేసుకున్నారు.

గాంధీజికి మతం పట్ల గల అభిప్రాయం విశ్వజనీనమైనది. మనిషిలోని సంకుచిత్వాన్ని పారద్రోలి, మానవ జాతి పురోగమనానికి పాటుపడే ఏ పవిత్ర గ్రంథమైనా తనకు ఆరాధ్యనీయమైనదని, వివిధ మతాల ప్రవక్తలు చెప్పేది ఒకే మానవతాధర్మమని (హరిజన్‌ పత్రిక, 26జూన్‌ 1947 సంచిక)లో పేర్కొన్నాడు. స్వాతంత్య్రోద్యమాన్ని ‘ఖిలాఫత్‌’ ఉద్యమంతో ప్రారంభించిన గాంధీజి, మతం పట్ల, మతసామరస్యం పట్ల గల విశాదృక్పథం తెలియవస్తుంది.

దేశవిభజన అనంతరం లక్షలాది హిందూ కాందిశీకుల, లాహోర్‌, కరాచి, సింధు, రాష్ట్రాల నుంచి భారత్‌కు వలస వచ్చినపుడు, ఉత్తర భారతాన, బెంగాల్‌లో చెలరేగిన మతకల్లోలాతో, ఆయన తీవ్ర మనస్తాపానికి లోనైయ్యారు.

1948లో కాకతీయ వారపత్రికను స్థాపించిన, పి.వి. మతసామరస్యం గురించి, వ్యాసాలు రాశారు. మతకల్లోల నేపథ్యం, దృష్టిలో పెట్టుకొని ఆంగ్లంలో ‘బ్లూ సిల్క్‌ సారి’ కథను రాశారు. ‘మంచిని పంచేదే మతం. అదే గాంధీజి అభిమతం. అందరికీ సమ్మతం’ అని పివి. తన రచనలు, వ్యాసాల ద్వారా గాంధీజి భావాలను వెల్లడించారు.

సుస్థిర సమాజ సువ్యవస్థకు, మతంతో పాటు కులాల పట్టింపు కూడా అవరోధాలని, ముఖ్యంగా అస్పృశ్యత మహాపాపమని గాంధీజి, సమసమాజ స్థాపనకు అవి అడ్డుగోడలని ప్రబోధించారు. పి.వి. ముఖ్యమంత్రిగా వున్నపుడు తదుపరి ప్రధాని అయ్యాక, దళిత, బలహీన, వెనుకబడిన తరగతులకు, మైనారిటీ వారికి మంత్రివర్గంలో అగ్రతాంబూలమిచ్చిన తొలి వ్యక్తి అయ్యారు.

గాంధీజి హత్యానంతరం, దేశ రాజకీయాలలో, విలువలో మార్పులు వచ్చాయి. నెహ్రూ, పటేల్‌ మధ్య విబేదాలు వచ్చాయి. నెహ్రూ గాంధీ సిద్ధాంతాలకంటే, సామ్యవాదం పైనే దృష్టి కేంద్రీకరించారు. భారీ పరిశ్రమల స్థాపనవైపు మొగ్గు చూపారు. కానీ 1952 సాధారణ ఎన్నికలలో కాంగ్రేసు పార్టీలో అతిరథ మహారథులంతా ఓడిపోయారు. పార్టీ ఓటమికి కారణాల గురించి, రాబోవు కాలంలో అనుసరించాల్సిన వ్యూహం గురించి, హైదరాబాద్‌, నానల్‌నగర్‌లో జరిగిన సమావేశంలో పి.వి. ఆంగ్లంలో ఒక బ్రోచర్‌ రాశారు. అందులో గాంధీజి మౌలికంగా ప్రస్తావించే గ్రామస్వరాజ్యం, పంచాయతి రాజ్‌, భూ సంస్కరణలు, ఖాదీ పరిశ్రమల గురించి వివరించారు. ఎన్నికలలో కమ్యూనిష్టు విజృంభణను తట్టుకోవాలంటే భూసంస్కరణలే శరణ్యమని పేర్కొన్నారు. పి.వి. తెలిపిన అంశాలును స్వామీజి, బలపరచారు. నెహ్రు కూడా ఆమోదించారు. అయితే కాంగ్రేసు పార్టీలో అధికసంఖ్యలో భూస్వాములే ఉండటం వలన, భూసంస్కరణలను నీరు గార్చారు. పి.వి. గ్రహించి, వినోబాభావే నిర్వహించిన స్వచ్ఛంద భూదానోద్యమంలో పాల్గొన్నారు.

పి.పి. భూసంస్కరణకు మూలమైన గాంధీ గ్రామస్వరాజ్యం గురించి, స్పష్టమైన అవగాహన కలిగివున్నారు. 1956లో విశ్వనాధ వారి ‘వేయి పడగలు’ అనువాదానికి పూనుకొన్నప్పుడు, ఆ నవలలో కథంతా సుబ్బన్నపేట గ్రామం చుట్టూ తిరగడమే కాకుండా, అది గాంధీజి కలలుగన్న గ్రామీణ సామాజిక, ఆర్ధిక వ్యవస్థకు సంబంధించే కావడంతో ఎంతో మురిసిపోయినారు. గాంధీ భావజాలాన్ని హిందీలో అఖిల భారత స్థాయిలో అందించే సంకల్పంతో ‘సహస్ర ఫణ్‌’కు శ్రీకారం చుట్టారు.

గాంధీజి దృక్పథంలో గ్రామం, ఒక స్వతంత్ర గణతంత్ర రాజ్యం వంటిది. (భూమిని అందరూ సమానంగా అనుభవించాలని, భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం అందరిసొత్తు’ అని అన్నారు.) గ్రామ స్వరాజ్యం సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తు గ్రామాల్లోనే భారతదేశం జీవిస్తుందని పలు సందర్భాలలో పేర్కొన్నారు. ఆయన గ్రామ వ్యవస్థల గురించి తెలియజేస్తు “Independence must begin at the bottom. Thus every village will be a republic of Panchayat, having full power. It follows therefore that, every village has to be self-sustained & capable of managing itself against the whole world అని అభిప్రాయపడ్డారు. (The Collected works of M.K. Gandhi. P.451) గాంధీజి భావించిన ఆదర్శ గ్రామమే సుబ్బన్నపేటగా ‘సహస్ర ఫణ్‌’ అని (వేయిపడగలు)లో పి.వి. చిత్రించారు. ఈ గ్రామ స్వరాజ్యం, బ్రిటీష్‌ పాలన దుష్ప్రభావానికి గురై ఏ విధంగా నాశనమయిందో, విశ్వనాథ వారు చేసిన విశ్లేషణను పి.వి. సహస్ర ఫణ్‌ లో వివరించారు. గ్రామీణ పౌర జీవితాన్ని బ్రిటిష్‌ వారి పాలన ఎలా ఛిన్నాభిన్నం చేసిందో, ఒక చోట తార్కికంగా చర్చించారు.

‘‘విద్యుద్దీపము వచ్చినవి. ఇంజనీయర్‌ పంపు కొరకు, దీపము కొరకు, నెలకైదువందల జీతగాండ్రు, సాలుకు పన్నెండు మలు, సుబ్బన్న పేట నిమ్మనుచుండిరి. ఇదివరకు వీధి దీపములు వెలిగించు చాకలి వాండ్రు పాతికమంది తీసివేయబడిరి. వారికి నెలకు పది రూపాయల జీతము. పాతిక పదులు, రెండు వందల యేబది. ఇంజనీయర్లకు ఈయవలసిన జీతములో సగము సమకూర్చినట్లయినది.

తక్కువ జాతివారికి, పేదవారికి సున్ను చుట్టి, ఎక్కువ కులము వారికి ధనవంతులకే నుద్యోగము నిచ్చిరి….. విద్యుద్దీపము ధగధగ మెరిసినవి. పేద కడుపు భగ భగ మండినవి. పేదవారు తిండిలేక మల మల మాడుచుండిరి.’’ – ఇలా సాగిపోయింది.. ఇది సరిగ్గా గాంధీజి అభిప్రాయాలకు సరిపోవటం గమనించవచ్చు.

గాంధీజి పారిశ్రామికీకరణకు వ్యతిరేకి కాడనే విశ్వనాథ, పి. వి.ల ఉద్దేశం. గాంధీజి దోపిడిని వ్యతిరేకించాడు.
“what I object is craze for machinery, not machinery as much. The craze is for what they call labour saving machinery. Men go on saving labour till Thousands are without work and thrown on the open streets to die of starvation. I want to save time and labour not for fraction of mankind but for all. I want the concentration of wealth not in the hands concentration of a few but the hands of all. (The collected works of ML Gandhi) అని పలికిన గాంధీజి మాటల సారాంశమే సహస్ర ఫణ్‌లో ప్రతిబింబించింది.

గాంధీజి భూసంస్కరణల గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. కానీ వ్యావసాయిక ప్రధానమైన భారతదేశంలో ఎనభై శాతం గ్రామీణ ప్రాంతాలుండంటం, అందునా నూటికి 90శాతం భూమిని నమ్ముకొని బతికే పేదరైతాంగం ఉండటం, మూలాన గాంధీజీ నగరీకరణను వ్యతిరేకించారు. భూమిపై కొంతమంది జమీందార్లకే యాజమాన్య హక్కులుంటే, మిగతా వారంతా భుక్తి కోసం పట్టణాలకు వలస వెళ్లడం వల్ల పేదరికం పెరిగిపోతుందని అన్నారు. Urbanisation in India is slow.. but sure death for her village & villagers అని 1934లోనే (హరిజన్‌ పత్రిక పుట 48. సెప్టెంబర్‌ 7 – 1934) వ్యాఖ్యానించారు.

ఇంతెందుకు, రైతాంగ పోరాటాలు చేస్తు, భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు చేసిన కమ్యూనిస్టుల మూల సిద్ధాంతకర్త, మార్క్స్‌ & ఎంగెల్స్‌ కూడా బ్రిటిష్‌ వారి వలనే భారతదేశంలో సుస్థిరంగా ఉండిన గ్రామవ్యవస్థ నాశనమైందని (Karl Marx-Fedric. Engles-collected works. Vol.II.P. 128, 129) పేర్కొనడం గమనించదగ్గ అంశం.

వాస్తవంలో, కాంగ్రేసువాదియైనా, కమ్యూనిస్టయినా, భారతీయ గ్రామీణ వ్యవస్థ గురించి సానుకూల దృక్పథమున్న వారే! నగరీకరణను వ్యతిరేకించినవారే. ‘దున్నేవాడిదే భూమి’ అన్న నినాదం యీ సంఘర్షణలోంచి పుట్టిందే ! భూమిని అందరికీ సమానంగా పంపిణి చేస్తే సంఘర్షణ సమసిపోతుందని, సమాజంలో గాంధీజి అశించిన శాంతి నెకొని ఉంటుందని పి.వి. భావించారు. అమలు చేయడానికి తగిన సమయం కోసం చూశాడు.

1972 మార్చి 20వ తేదీన పి.వి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే, ఆకాశవాణిలో రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ గ్రామీణాభివృద్ధి గురించి ప్రత్యేకించి వివరించారు. తదుపరి మూడు నెలలకే భూసంస్కరణల శాసనాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి రెండు దశాబ్దాల క్రితం తాను కలగన్న గాంధీ సురాజ్య, సువ్యవస్థిత కోసం నడుం బిగించారు. భువనగిరిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతు, ‘‘గ్రామాలు, గ్రామీణ ప్రజలు సంపన్నంగా ఉంటేనే దేశం ఐశ్వర్యవంతమవుతుందని దారిద్య్రం మీద దండయాత్ర చేయటమే తన లక్ష్యమని’’ ఉద్ఘాటించారు. ‘‘వాస్తవానికి హైదరాబాద్‌ నుంచి రెండు మైళ్ళుపోతే చాలు దారిద్య్రం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితి మారాలి’’. అని అన్నారు.

భారత స్వాతంత్య్ర రజతోత్సవ సందర్భంలో ఆకాశవాణిలో ప్రసంగిస్తు తొలుత గాంధీజి సేవలను, ప్రస్తుతించారు. ‘‘ఈ రోజుకు సరిగా ఇరవై అయిదు సంవత్సరాల క్రితం భారతదేశం దాస్య శృంఖలాలను త్రెంచుకొని స్వతంత్రంగా ఆవిర్భవించింది. దేశానికి స్వాతంత్య్రం సముపార్జించి పెట్టిన మహాత్మ గాంధీ, స్వతంత్ర భారతదేశానికి కాకుండా సామ్రాజ్యవాదుల కబంధ హస్తాలలో కృంగి కృశించిన ఆసియా, ఆఫ్రికా ఖండాల దేశాలకే గొప్ప ప్రవక్త అయినాడు. ఆ మహనీయుడు మన మనస్సుల లోని భయాన్ని పటాపంచలం చేశాడు. రాజకీయ జీవితాన్ని, నైతిక, ఆధ్యాత్మిక స్థాయికి తీసుకొని వచ్చాడు. అసంఖ్యాక గ్రామీణ ప్రజానీకానికి ఈ భూలోకంలో అవతరించిన దేవుడాయన’’ అని పి.వి. గాంధీజి ప్రభావాన్ని తెలియజేశారు.

పి.వి. ముఖ్యమంత్రి పదవిలో ఐదు సంవత్సరాలు కొనసాగివుంటే, భూ సంస్కరణల చట్టాన్ని అమలుచేసి గాంధీజి అశించిన ఆదర్శ గ్రామీణ వ్యవస్థను నెలకొల్పి వుండేవాడేమో! తన అసంతృప్తిని ఆత్మకథ వంటి ‘ఇన్‌సైడర్‌’లో ఆనంద్‌ పాత్ర ద్వారా ప్రకటించారు.

గాంధీజి దర్శనంలో దేశానికి ఆత్మ గ్రామమైతే, పి.వి. దృక్పథంలో గ్రామంలోని రైతాంగానికి ప్రాణం భూమి! ‘‘లోపలి మనిషి’’లో భూసంస్కరణలే ప్రధాన వస్తువు. ఆత్మకథాత్మకమైన యీ నవలలో కథానాయకుడు ఆనంద్‌ను అడ్డం పెట్టుకొని, రచయితగా పి.వి. నాటి రాజకీయాలను వ్యాఖ్యానిస్తూ, తన వేదన నివేదించారు.

‘‘భూసంస్కరణను తక్షణం అమలు చేయాలని ప్రధాని నెహ్రూ ముఖ్యమంత్రులందరికి లేఖల ద్వారా ఆదేశిస్తాడు. అఫ్రో జాబాద్‌ ముఖ్యమంత్రి చౌదరి, నెహ్రూ సోషలిజాన్ని ఆకాశానికి ఎత్తినప్పటికి, లోలోపల కుతకుతలాడి, చివరికి ఆనంద్‌నే భూసంస్కరణల శాఖ మంత్రిగా నియమించి చేతులు దులుపుకుంటాడు.

భూసంస్కరణల అమలులో ఎంత రాజకీయం జరుగుతున్నదో, ఆనంద్‌ గ్రహిస్తుంటాడు. జమీందారీ విధానాన్ని ఒక్క కలం పోటుతో సాగనంపిన పార్టీకి, భూసంస్కరణలు అమలు చేయడం ఒక లెక్కకాదు. నిజానికి సంస్కరణ వల్ల భూమి అందరికీ అందు బాటులోకి వస్తుంది. భూస్వాములు సాగుచేయని భూమలు వృథాగా పడివుండక మిగలు భూలుముగా పేదలకు అందుతాయి. ఫలితంగా గ్రామాలు కళకళలాడతాయన్నది ఆనంద్‌ (పి.వి.) ఆలోచన.

భూసంస్కరణలను వ్యతిరేకించే ముఖ్యమంత్రి చౌదరిని, ఆనంద్‌ తన సుదీర్ఘ వాదనతో (insider – – 32 – 332) మెప్పించే ప్రయత్నం చేస్తాడు. కానీ చౌదరి కాలయాపన చేస్తూ ఢిల్లీ పర్యటనలు చేస్తాడు. ఈలోగ ప్రత్యర్థి మహేంద్రనాథ్‌ ఎత్తుగడ వల్ల చౌదరి ముఖ్యమంత్రి పదవినే కోల్పోగా, ఆనంద్‌ ముఖ్యమంత్రి అవుతాడు.

కానీ భూసంస్కరణల వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుందని, ఆనంద్‌ ప్రత్యర్థల మాటలు విని ఇందిరా గాంధి ఆనంద్‌ను వారిస్తుంది. కానీ ఆనంద్‌ తన నిశ్చయాన్ని తెలియజేస్తాడు.

“Anand said there could be real change in India without givign a new meaning to the ownership of Land. Land Ceilings would enlable the state to diversity, the economy and bring into its sweep a vast number of village artisans whom the landlords had always kept at subsistence level & Gradually a well balanced economy would emerge. (Insider P.735) అని భూసంస్కరణల గురించి సాధికారికంగా సప్రమాణంగా వ్యాఖ్యానించారు.

భారతీయ సామాజిక వ్యవస్థలో పూర్వకాలం నుంచి భూమికున్న ప్రాధాన్యం వివరిస్తూ బ్రిటిష్‌ పరిపాలకులు, గ్రామీణ వ్యవస్థను ఏ విధంగా చిన్నాభిన్నం చేశారో చెప్పారు. కులవృత్తల సంస్కృతిని నాశనం చేయడం వల్ల భారతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది. వ్యవసాయ కూలీలు, చిన్న రైతులు ఉపాధి కోసం పట్లణాలు వలసపోవలసి వచ్చింది. నగరీకరణ పెరిగింది. బ్రతుకు భారమైంది. బ్రిటిష్‌ వారు సృష్టించిన జమీందారీ వ్యవస్థ, గ్రామీణ వ్యవస్థకు శాపమై పోయింది. భారతదేశంలో ఆర్థిక సుస్థిరత, ప్రశాంతత నెలకొనాలంటే, ఘర్షణలు తొలగాలంటే భూసంస్కరణల వలనే సాధ్యమని, ఆనంద్‌ ద్వారా తన స్థిర నిశ్చయాన్ని వెల్లడించారు. అంతేకాదు, సైన్యంలో పనిచేసిన కె.ఎల్‌.ఎన్‌. రావు గారితో ‘‘చీకటిని తిట్టకు – దీపాన్ని వెలిగించు’’ అనే నాటకాన్ని కూడా రాయించి, తను నిజమైన ‘భూమి పుత్రుడనని, గాంధేయ వాదినని’ నిరూపించుకున్నారు.

గాంధీజి మహిళలను దేవతలతో సమానంగా భావించాలని పిలుపునిచ్చారు. స్వదేశీ ఉద్యమంలో భాగంగా, దాదాపు ప్రతి గ్రామం పర్యటించి, మహిళలు రాట్నంపై నూలు వడకడాన్ని ప్రోత్సహించారు. గాంధీజీ తన పర్యటనలో భాగంగా హైదరాబాద్‌ కూడా విచ్చేసి (6 ఏప్రిల్‌ 1929) వివేకవర్ధని మైదానంలో, మహళలనుద్దేశించి ప్రసంగిస్తూ రాట్నాన్ని కామధేనువుగా భావించాలని పిలుపునిచ్చారు. గాంధీజి పిలుపుకు సరోజిని నాయుడు, దువ్వూరి సుబ్బమ్మ, సంగెం లక్ష్మీబాయమ్మ, అరుణా అసఫ్‌ అలీ, మొదలగు మహిళామణులు స్పందించి, తమ జీవిత పర్యంతం గాంధీ మార్గంలోనే సాగిపోయారు.

గాంధీజి, కేవలం రాట్నం గురించే కాదు, స్త్రీ సమానత్వం, స్త్రీవిద్య, మొదలగు అంశాలపై స్పష్టమైన అభిప్రాయాలు ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో వెలిబుచ్చారు. పి.వి. మహిళాభ్యున్నతికి కృషి చేశారు. సాహిత్యం విషయానికి వస్తే, ‘గొల్ల రామవ్వ’ కథలో రామవ్వను దేశభక్తురాలిగా, త్యాగశీలిగా చిత్రించారు. హరినారాయణ్‌ ఆప్టె మరాఠిలో రచించిన ‘పణ్‌ లక్ష్యత్‌ కోణ్‌ ఘేతో’ నవలను ‘అబల జీవితం’ శీర్షికతో అనువదించారు. ఇందులో అత్త మామ హింస, భర్త నిర్లిప్త స్వభావం, ఆస్తిహక్కు, హిందూ సమాజంలో సంస్కరణలు మొదలైన అంశాల నేపథ్యంలో యమున అనే యువ వితంతువు గాథ చిత్రించారు.

పి.వి., ‘సెంటర్‌ ఫర్‌ పాలసి స్టడీస్‌’ వారి ఆహ్వానం మేరకు వైజాగ్‌ వెళ్ళి (9 అగస్ట్‌ 1999) ప్రొ. విజయలక్ష్మి, మీనారావు, పి.వి.ఎల్‌. రమణ రచించిన “Emancipation Before Empowerment: A study of Women Problems in Vishakhapatnam” అన్న గ్రంథాన్ని ఆవిష్కరించి, రచయితలను అభినందించారు. ఈ సందర్భంగా పి.వి. మహిళా చైతన్యం, సాధికారతతో పాటు స్వాతంత్య్రోద్యమంలో స్త్రీ పాత్ర గురించి స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. స్వాతంత్య్రం అనంతరం ఆస్తి హక్కు విషయంలో స్త్రీలకు అన్యాయం జరిగిందని, అయితే విద్యా, ఉద్యోగాది రంగాలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించబడినప్పటికి, మరిన్ని హక్కులను చట్టబద్ధంగా అందించాల్సిన అవసరముందని వక్కాణించారు.

‘మహిళాభ్యుదయం ద్వారానే దేశాభ్యుదయం’ అన్న ప్రసంగంలో మన దేశ ఆర్థికాభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న గ్రామీణ మహిళలకు చేయూతనివ్వాల్సిన అవసరముందని అన్నారు. చాలామంది మహిళలు గ్రామాలలో తమ ఇళ్లక పరిమితం కాకుండా, వ్యవసాయ కార్యక్రమాలలో పాలుపంచుకొనుచు కఠినమైన బాటలో జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి మహిళలకు అండ దండలుగా ఉండాలని, గాంధీజి పిలుపునిచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. 46వ స్వాతంత్య్రదిన వార్షికోత్సవం సందర్భంగా (అగస్టు 15, 1993) ఎర్రకోట నుండి పి.వి. హిందీలో చేసిన సుదీర్ఘ ప్రసంగంలో స్త్రీలకు అధికారాన్నిచ్చే దిశలో క్రొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు.

గాంధీజీ సిద్ధాంతాలలో ప్రధానమైనది, అహింస. ‘మన సమాజంలో హింసా ప్రవృత్తు’ అన్న శీర్షిక తో పి.వి. ఆంగ్లంలో రాసిన అముద్రిత వ్యాసంలో గాంధీజీ అహింసా సిద్ధాంతం విస్తృతిని విశదీకరించారు. ‘‘సాంఘిక కార్యాచరణలో అనుసరించే క్రమశిక్షణా పద్ధతే కాకుండ, ఆలోచనా విధానాన్ని క్రమబద్ధం చేసుకోవడం ద్వారా, జీవిత విధానాన్నే అహింసా సిద్ధాంతానికి అనుగుణంగా మలుచుకోవడం ఆయన సిద్ధాంతంలోని విశిష్టత’’ అని వివరించారు.

గాంధీజి, అహింస అనే సందేశాన్ని ప్రపంచానికే అందించాడు. అయితే దేశంలో పెరిగే హింసాయుత వాతావరణానికి పి.వి. ఎంతో వేదన చెందారు. న్యూఢిల్లీలో 29 సెప్టెంబర్‌ 1991 నాడు జరిగిన జైను మహాసభలో ప్రసంగిస్తూ అహింసాయుత విశ్వం కోసం అందరూ పాటుపడాలని కోరారు.
‘‘నిరాయుధీకరణ వల్ల మాత్రమే శాంతి సిద్ధిస్తుందని భావించరాదని, నిరాయుధీకరణతోపాటు మానవు హృదయాలలో మార్పు రావాలని అన్నారు. హింస, పగ, ప్రతీకారేచ్ఛ మనసుల్లో కదలాడినంత కాలం అహింసకు గౌరవం లభించదని, యుద్ధ భావన మనసు నుంచి, మనిషి నుంచి తొలగిపోవాలని, సహనము, క్షమ, ఓర్పు, శాంతి మొదలైన ద్రవ్యాలతో మన మనసుల్లో నిండిపోయిన నాడే అహింస మనజాలుతుందని, మహత్ముడి శాంతి ప్రపంచం గురించిన స్వప్నం సాకారమవుతుందని’’ పేర్కొన్నారు.

గాంధీజి బ్రిటిష్‌ రాచరికం పైనే కాదు, భారతదేశంలో వేళ్ళూనికొనిపోయిన పేదరికం పై కూడా విస్తృతంగా పోరాడాడు. తాను పేదలో ఒకడినేనన్న భావం కలిగించడానికి, ఆడంబరాలకు దూరంగా, నిరాడంబర జీవితం గడపడానికి గుడిసెలను పోలిన ఆశ్రమాన్ని నిర్మించుకొన్నారు. కేవలం పంచె మాత్రమే ధరించి, భారత పేదరికానికి ప్రతీకగా నిలుచున్నారు. ‘సహస్ర ఫణ్‌’లో విశ్వనాథ వారు మూలంలో, పేదరికం పై వెలుబుచ్చిన అంశాలను పి.వి. గాంధేయ దృక్పథంతోనే చర్చించారు.

భారతీయ విద్యాభవన్‌ న్యూఢల్లిలో (4అక్టోబర్‌ 1991) ప్రత్యేక స్నాతకోత్తర ప్రసంగంలో విద్యావిధానం గురించి ప్రసంగిస్తూ గాంధీజి సంభావించిన పేదవారి గురించి మాట్లాడారు. గాంధీజి పేదవాడిని ‘దరిద్ర నారాయణుడని’ భగవంతునితో సమానంగా భావించినాడని, ‘‘నీకు తెలిసిన, అత్యంత నిరుపేద వ్యక్తి ముఖచిత్రం గుర్తు తెచ్చుకో.. అతని జీవితాన్ని మార్చేందుకు ఏ విధమైన చొరవ చూపుతున్నావని నిన్ను నీవు ప్రశ్నించుకో, నీ జీవిత పరమార్ధం నీకు బోధపడుతుంది.’’ అన్న మహాత్ముని సందేశమే శిరోధార్యమని, పి.వి పిలుపునిచ్చారు.

గాంధీజి నిరాడంబర జీవన విధానం, పి.వి.పై ఎంత ప్రభావితం చేసిందంటే, ఆయన పాఠశాల విద్యార్థిగా వున్నప్పటినుంచే ఖద్దరు దుస్తులు ధరించడం మొదలు పెట్టారు. గాంధీజి సూచించిన నిర్మాణ కార్యక్రమాలలో ‘ఖాదీ’ అనే అంశం అత్యంత ప్రధానమైనదిగా వుండెడిది. ‘‘ప్రజానీకానికి వ్యవసాయానికి తోడుగా ఉండే సులభసాధ్యమైన మరొక పరిశ్రమ చాలా అవసరం. నూలు వడికే వృత్తి చిరకాలానుగతంగా వున్నటువంటి కుటీరపరిశ్రమ. ప్రజలందరి ఆకలి బాధతీరాలంటే, వారంతా తమ ఇండ్లలో చేతి రాట్నమును ప్రవేశ పెట్టుకోడానికి, మనమంతా సాయం చేయాలి.’’ – అని గాంధీజీ ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో రాశారు. 1929 లోనే మొట్టమొదటి సారిగా కరీంనగర్‌ జిల్లా, జమ్మికుంట (మం.) వావిలాల గ్రామంలో గాంధీజి అనుచరులు ద్వారకాలేలె, ఫ్రాంకికర్‌, ఖాది గ్రామోద్యోగ్‌ సంస్థను స్థాపించారు. స్వాతంత్య్రానంతరం, స్వామి రామానంద తీర్థు కృషి వల్ల 1948-50 మధ్యకాలంలో ఖాదీవస్త్రోత్పత్తి జరిగింది. స్వామిజి అనంతరం పి.వి. గారే వావిలాల, భాగ్యనగర్‌, మెట్‌పల్లి ఖాదీ గ్రామోద్యోగ సంస్థలకు గౌరవాధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సంస్థ నిర్వహణలో, పి.వి. గారికి, ఆయన బాల్యస్నేహితుడు, వియ్యంకుడు, ఇందుర్తి శాసనసభ నియోజకవర్గం మాజీ ఎం. ఎల్‌.ఎ. కీ.శే. బొప్పరాజు లక్ష్మీకాంతరావు ఎంతో తోడ్పడినారు. ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరే జాతీయ జెండా వస్త్రం, వావిలాల ఖాదీ వస్త్రోత్పత్తి సంస్థ నుంచే సరఫరా చేయబడటాన్ని బట్టి, దేశ వ్యాప్తంగా, వావిలాల ఖాదీకి గల నాణ్యత తెలియవస్తుంది. ఇలా పలు గాంధేయ నిర్మాణ సంస్థల వెనుక, పి.వి. నిశ్శబ్దంగా సాగించిన కృషి వెలలేనిది.

పి.వి. ప్రధానమంత్రి అయ్యాక, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖను స్వయంగా నిర్వహించడానికి కారణం గాంధీజి సిద్ధాంతాలే! 1995 జనవరి 4న కలకత్తాలో భారతీయ పరిశ్రమల సమాఖ్య శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రసంగిస్తు ‘బైపాస్‌ మోడల్‌, విధానాన్ని ప్రస్తావించారు. అభివృద్ధి రేటును పెంచుతూనే సమాంతరంగా గ్రామస్థాయిలోనే నిధులు లభించే పద్ధతే బైపాస్‌మోడల్‌. ఎనిమిదో ప్రణాళికలో ఏకంగా 30,000 కోట్ల నిధులను గ్రామీణాభివృద్ధికి కేటాయించి, గాంధీజి ఉద్దేశించిన సమగ్రగ్రామ పునర్వికాసాన్ని పి.వి. ఆచరణలో చూపించగలిగారు.

గాంధీజి సిద్ధాంతాలను, పి.వి. తన సాహిత్యంలో వాచ్యంగా చెప్పలేదు కానీ, ప్రతీకాత్మకంగా సూచించారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా కేంద్రమంత్రిగా, చివరకు ప్రధానమంత్రి పదవి చేపట్టాక కూడా దేశాభివృద్ధికి గాంధీ సిద్ధాంతాలనే భూమిక చేసుకొని సువ్యవస్థిత పాలన అందించారు. పలు సందర్భాలలో చేసిన ప్రసంగాలలో సైతం పి.వి. గాంధీజి సమగ్ర వ్యక్తిత్వాన్ని, సిద్ధాంతాన్ని విపులపరచి, మౌలికంగా తను గాంధీయ వాదినేనని ఎరుకపరచారు.

1968లో గాంధీ శతజయంతి సందర్భంగా, హైదరాబాద్‌ లో జూబిలీ హాలులో జరిగిన రాష్ట్ర సదస్సులో, గాంధీ సిద్ధాంతాల అనువర్తనీయత శీర్షికతో పి.వి. చేసిన ప్రసంగం, వారి నిశిత పరిశీలనను, లోతైన అవగాహనలే కాకుండా, వారి గాంధీ మార్గాన్నీ దార్శనికతను తెలియజేస్తుంది. నాటి ప్రసంగం, గాంధీ తాత్త్విక ధోరణిపై సమర్పించిన పరిశోధనా పత్రమని చెప్పవచ్చు.

‘‘జీవితాన్ని సమగ్రంగా దర్శించిన గాంధీజి, సత్యాన్వేషణలో సాగి, విశ్వమానవుడిగా ఎదిగాడని, ఆయన సమ్యక్‌దృష్టే ఆయనను మహత్ముడిని చేసిందని’’ తెలిపారు. గాంధీజి దృక్పథానికి మూలభూతమైన అంశం సాంఘిక పరివర్తన. ఈ సాంఘిక పరివర్తనకు బలప్రయోగమో, యుద్ధమో, కాకుండా, గాంధీజి అహింసా మార్గాన్ని ఎన్నుకొన్నారు. అహింసను ఒక ధర్మంగా కాకుండా, సమాజంలో మనుగడ సాగించుకోవడానికి, ఒక జీవన విధానంగా రుజువు చేశారని, ‘సత్యాగ్రహం’ అనే ఆచరణీయ సాధన ద్వారా అహింసా సిద్ధాంతానికి స్పష్టమైన స్వరూపమిచ్చారని పేర్కొన్నారు. సమాజంలో కుల వ్యవస్థకు సంబంధించి గాంధీజి బోధించిన సామాజిక సమానత్వం, సాధించడం ప్రతి మనిషి కనీసధర్మమని, దళితుల అభ్యున్నతికి పాటుపడి సాంఘిక వ్యవస్థకు గట్టి పునాదు ఏర్పరచాలన్న గాంధీజి దృక్పథాన్ని వివరించారు పి.వి.

1992లో అమెరికా పర్యటనలో భాగంగా, చికాగోలో ప్రసంగిస్తూ, గాంధీజి గొప్పతనాన్ని వివరించారు. ‘‘గాంధీజి లక్షలాది మంది ప్రజలను మంత్ర ముగ్ధుల్ని గావించేవారు. అతని వద్ద ధనం లేదు. అధికారం లేదు. కన్నీరు, చెమట తప్ప ఏమీలేదు. సత్యం వైపు, సమైక్యత వైపు సంఘటితపరచడమే అతను చేసిన మహత్తర కార్యం’’ అని వివరించారు.

1995లో యునెస్కో, గాంధీ 125వ జయంతి సందర్భంగా ప్యారిస్‌లో నిర్వహించిన సెమినార్‌ లో పి.వి. ప్రసంగిస్తూ గాంధీజిని ‘‘ఈ శతాబ్దపు మహోన్నత వ్యక్తి’’గా అభివర్ణించారు. తను అనుసరించే మధ్యేమార్గ విధానానికి మూలము గాంధీజి అక్కడక్కడ సూచించిన అంశాలేనని, మనం ఎదుర్కొనే ఆర్థిక, సామాజిక రాజకీయ, నైతిక సమస్యలన్నిటికీ గాంధీజి బోధనలు ఒక కొత్త ద్వారాన్ని చూపుతాయి’’ అని పి.వి. వివరించారు.

‘‘యుద్ధాలు మనసుల్లో పుడుతాయి. కాబట్టి శాంతి భావన కూడా మనసుల్లోనే అంకురించాలి.’’ అన్న గాంధీజి మాటలు ప్రపంచ శాంతికి మార్గం చూపించే ఆశాకిరణాలని పి.వి. తెలియజేశారు.

గాంధీజి వలె పి.వి. న్యాయశాస్త్రాన్ని చదివారు. గాంధీజి వలె న్యాయవాద వృత్తిని తన జాతి కోసం పరిత్యజించారు. స్థితప్రజ్ఞునిగా సుఖదుఃఖాలకు, రాగద్వేషాలకు అతీతంగా సత్యశోధనలో సాగిపోయారు. గ్రామ స్వరాజ్యం, ఖాదీ, స్త్రీ విద్య, మత సామరస్యము, దళిత, వెనుకబడిన తరగతుల అభ్యున్నతి, అణ్వస్త్ర నిరాయుధీకరణ, మొదలగు అంశాలను గాంధీజి దృక్పథంలోనే అనుసరించారు. కమ్యూనిజం, సోషలిజం, సెక్యులరిజం మొదలైనవాటికి అతీతంగా ‘హ్యూమనిజం’ ప్రధానంగా జీవించిన పి.వి. నిస్సందేహంగా, మరొక ‘బాపు జీ’యే!

వైష్ణవ జనతో తేనె కహియె
జే పీడ పరాయీ జాణే రే..
పర్‌ దుఃఖె ఉపకార్‌ కరే…
తో యే మన అభిమాన్‌ న ఆణే రే ॥

(అక్టోబర్‌ 2 గాంధీజి 151వ జయంతి సందర్భంగా)